12_003 ఉన్మత్త రాఘవం 02

 

( కావ్య నాటిక )

( ముగింపు భాగం)

(లక్ష్మణునితో) వత్సా! ఈ మామిడి వృక్షమున సీత కొరకై వెదకుము. చిగురాకులలో నుండి వెల్వడు మధుర నాదము దుఃఖితుడ నైన నా మనసునకు శుభ సంకేతముగా తోచుచున్నది.
లక్ష్మ – (మనంబున) నిజముగా నార్యుడు కోకిలా లాపము విని భ్రాంతి నొందుచున్నాడు.
రామ – ఓయీ! నా ప్రేయసి ప్రియాలాపము వలె నున్నది కావున అడిగితిని.
జీవమునకు మూలాధార ఔషధివి.
కనులకు అమృత తుల్యమౌ అంజనవి.
తలచిన వెంటనే తాపము హరింప జేయు చల్లని రసాయనము వంటి సఖీ! ఎదుట ప్రత్యక్షము కమ్ము. (నిముష మూరకుండి)
ఓ జానకీ! ఎందుల కూరక యున్నావు?
త్వరితముగ నా చెంతకు వచ్చి యద్భుతమగు నీ కనక బాహు వల్లరితో నా మెడను బిగువుగా నల్లు కొనుము.
లేదా నా వెనుక నేతెంచి నీ కరములతో నా కన్నులను మూయుము.
( అని కన్నులు మూసుకొనును )
లక్ష్మ – హా! ఎంత కష్టము. జరుగని పని. ఏమి చేయవలె?
రామ – ఓ ప్రేయసీ! ఎందుకు జంకు చున్నావు? ఈ రెండింట నీ కేది యభిమతమో దానిని చేయుము.
లక్ష్మ – ఓ ఆర్యా! ఈ వినబడునది కోకిలారావము కదా. ఇచట జానకీ మాత పలుకదు.
రామ – (కండ్లరమోడ్చి, చెవి యొగ్గి వినుచు) ఓ వత్సా! అవును. నీవు నిజము పల్కితివి. వీణా నాదమువలె వినిపించిన యా ధ్వని ఇపుడు కర్ణ కఠోర మగుచున్నది.
లక్ష్మ – (అన్య ప్రదేశములను చూపించును.)
రామ – (ఆశ్చర్యముగా చూచుచు) ఓయీ వత్సా! చూడుము.
కొందరు తస్కరులు ప్రేయసి యాభరణము లెల్ల దొంగిలించి, శిరమున దాల్చి, భుజములను పైకెత్తి నాతో యుద్ధ మొనరింప నిర్భయముగా నిల్చున్నారు. కొందరు సీత హారములను, ఇంకొందరు పద్మరాగములతో కూడిన కోమల సరములను, మరి కొందరు నా ప్రాణ ప్రియ సుందరాభరణములను
దాల్చి యానందించు చున్నారు.
లక్ష్మ – అహో! ఎంత కష్టము. మరల ఆర్యునకు మతి భ్రమణము కల్గుచున్నది.
రామ – ఓ చోరులారా! ఆగండి. నా యెదట నుండి ఎచటకు వెళ్ళ గలరు? నేను వింటిని చాపమును సంధించి మిమ్మందరను కూలద్రోయుదును.
(అని శీఘ్రముగా బాణమును వింట సంధించును.)
లక్ష్మ – ఆర్యా! ఆర్భాటము వలదు బాణ మెక్కు పెట్ట వలదు.
రామ – వత్సా! విడుము. కోపగించెద. ఈ చోరులెల్ల నిర్భయముగా నిక్కడ కదలక నిల్చున్నారు.
లక్ష్మ – సంధించిన బాణము పరుల ప్రాణమును  హరింప గలదు కానీ చెట్టు మోడుపై వేయుట వ్యర్ధము కదా. కావున ఆర్యా! బాణము వేయుట నాపి యాలోచించుము. తస్కరు లచట లేరు.
రామ – (ఆలోచించి) నా మతి భ్రమించినది. ఇది నిజమే.
ఎఱ్ఱని అశోక వృక్షపు నవ పల్లవములే గాని పద్మ రాగ భరిత హారములు కావు. కోమలములగు చిరు మొగ్గల వరుసలె గాని శ్వేత మౌక్తిక మాలలు కావు.
వివిధ వర్ణములతో నొప్పు పుష్ప గుచ్ఛములే కాని నవ మణి సహిత భూషణములు కావు.
నిజముగా నివి నవ వికసిత చంపక పుష్ప సమూహములు గాని వింజామరములు కావు.
ఇవి విస్తరించి వంగిన శాఖలతో గూడి, యాకసము నంటు వృక్షములే గాని తస్కరించిన యాభరణా లంకృతులు, కరము చాపి దండెత్తు తస్కరులు కారు.
లక్ష్మ – ఇట నుండి వెడలి యా మనోజ్ఞమగు లతా నికుంజములందు వెదకుదము.
రామ – అట్లనే (కొన్ని అడుగులు వెళ్ళి, నిలిచి, పరికించి చూచుచు అత్యానందముతో)
వత్సా! మైథిలి నా కన్నులకు గోచర మగుచున్నది.
వంగిన వక్షోజములతో, వినమ్రయై, గోరోజ వర్ణముతో ప్రకాశించుచు
తన కరములతో నన్ను పిలచుచు, అమృత తుల్యమౌ పలుకులతో
నా మనసునకు హాయిని కల్గించుచున్నది.
లక్ష్మ – రాఘవున కిప్పటికిని చిత్త భ్రమణము తొలగ లేదు.
రామ – ఓ జానకీ! నీ వింత వరకెక్కడ యుంటివి? (చెవి యొగ్గి) ఏమనుచున్నావు? “ఆర్య పుత్రుని ఓర్మిని పరీక్షింప యొకానొక కొలనున దాగితి” ననియా?
లక్ష్మ – ఆర్యా ! దేవి  యెచట గలదు?
రామ – (ప్రయత్నమును తోసి పుచ్చి)
నీ మాటల తీరు వీనుల విందుగ అమృత ధారల వలె తృప్తి కల్గించును.
నీ శరీర స్పర్శ సుగంధ చందన లేపనము వోలె హాయిని కల్గించును.
నీ ముద్దుల మోము నా కన్నులకు శరచ్చంద్రుని వెన్నెల వలె మనోజ్ఞము.
నీ వాల్చూపులు నా కన్నుల కొసగు కర్పూర కళిక దర్శన సుఖము.
నీ బంగారు పట్టెడ ఒక్క జిలుగులు నా కనులకు
సాత్వికమగు వసంత ఋతు వెన్నెల వలె గోచరించును.
నా మనసు, ప్రాణము నగు ఓ ధరణీ సుత! నీవు కనబడ కున్న నే నెట్లుందును?
లక్ష్మ – ఓ ఆర్యా! జానకీదేవి ఎచట నున్నది?
రామ – ఓ వత్సా! ఇదిగో జానకి ఎదటనే యున్నది.
(అని ఎదర పరికించి చూసి)
విరివిగా పూసిన పుష్ప గుచ్ఛముల భారముచే నేలకు వంగి,
ఇంపైన చిగురాకులతో, మధు రస సేవనకై గుమి గూడిన
భ్రమరముల ఝుంకార ధ్వనితో కల కల లాడు వల్లిక ఇది. జానకి కానేరదు.
(మళ్ళీ పరికించి చూచి) జానకి ఈ వల్లిక నుండే కుసుమములు త్రుంచె నని తలచుచున్నాను. సీత ఈ తీవ పువ్వుల సేకరించుట నిజమె. ఏలనన క్రొత్త చివుళ్ళతో గూడిన ప్రతి శాఖ యందు తొడిమలు ఖండితములై యున్నవి.
లక్ష్మ – నిజమే. దేవి పద చరణ ముద్రలును ఈ తీగను చేరినవి
రామ – ఓయీ ! ఇటుపై నే దిక్కునకు వెడలెనో చూడుము.
లక్ష్మ – అటులనే. (అని లత చుట్టూ పరికించుచు దొరికిన మణిమయ కంకణమును జూచి మనమున ఇది దేవి కరము నుండి తొలగినదే. ఆర్యునకు సరియగు సమయమున చూపింతు నని తలచి చేలాంచలము కప్పి, సమీపించి, (ప్రకాశముగా) ఆర్యా! ఈ పైన దేవి పద పదవి కనబడుట లేదు. కాని ఈ కాననల సంచరించు ఒకానొక మృగ పద ముద్రలు కన్పట్టు చున్నవి.
రామ – అయ్యో! నిరాశుల మైతిమి కదా. ఇంకేమున్నది?
ఓ ప్రేయసీ! జానకీ! ఇంపైన వాలు కన్నులతో,
గాఢమైన అనురాగమును, రూప యౌవన మదమును
బింబాధర ములతో నణచి పెట్టి, జితేంద్రియ యౌ నొప్పు
నీ మోము గాంచుట ఎప్పటికో!
(అంతటా అవలోకించి)
నా ప్రాణ సఖి జానకి వస్తు వేదయిన కనబడ లేదు కదా!
లక్ష్మ – ఇదిగో దేవి హస్తము నలంకరించు మణి వలయము. గ్రహింపుడు. (ఒసగును)
రామ – (చేకొని సహర్షముగా) నా జీవన ప్రియ పాణి నలంకరించు యీ వలయము ఎలాగుననో నా కధీన మైనది. ఇది నా మనస్సును దీర్ఘ కాలమునకు తీవ్ర వేదనకు గురి చేయుచున్నది. (అక్కున చేర్చి)
ప్రియమిది. నాడు మనసు అనురాగ భరితమై…
ప్రేయసిని యాలింగనము చేయు వేళ… ఆమె కంఠము నుండి వెల్వడిన
నిర్దయ పూర్వకములగు పదములు విని, మోహావేశమున
వేగమే యామె యధరముల గ్రోల, చేయి విదలించి నపుడు
మనోజ్ఞమగు ధ్వని యొనరించిన కంకణము లివియే!!
(నిట్టూర్చుచు)
ఓయీ వత్సా! జానకి నెచట గాంతుము? ఏ యే నికుంజముల నన్వేషింతుము? అకటా ! అన్ని విధముల నిరాశుల మైతిమి.
నా కన్నుల కమృత తుల్యమై యలరు జానకి గోచరింప కుండుట చే
యకటా! నలు దెసలు అసుర పురముల దగ్ధ మొనరింప
హరుని కన్నుల నుండి వెల్వడిన మంటలు విస్తృత మైన రీతి కన్పట్టు చున్నవి.
లక్ష్మ – అయ్యో! ఆర్యునకెట్టి దురవస్థ సంభవించె!
రామ – ఇచట యెందు కుండుట? గృహమున కరుగుదము.
లక్ష్మ – గృహం బెక్కడ?
రామ – ఏమి యట్లంటివి?
లక్ష్మ – అరణ్యము నందుంటిమి కదా!
రామ – వత్సా! ఎందు కిట్టి వన సీమ కెతెంచితిమి?
లక్ష్మ – ఆర్యా! గురువానతి గుర్తు తెచ్చుకొనుడు.
రామ – గురు వెవ్వరు? స్పష్టముగ తెల్పుము.
లక్ష్మ – పిత్రుదేవులు దశర ధేశ్వరుడు.
రామ – ఎందరు వనమున కేతెంచిరో?
లక్ష్మ – మువ్వురు.
రామ – అట్టి వా రెవరోయి?
లక్ష్మ – ఆర్యుడు, నేను, ఆర్యుని యర్ధాంగి జనక సుత సీతయు.
రామ – సీత నా యాత్మ. జీవనాడి. నన్నెట్లు వీడి యుండును?
లక్ష్మ – విధి వైపరీత్యము.
రామ – అయ్యో! అటులైన నేను నా యాత్మ నెట్లు కలిగి యుందును?

                                          (నేపధ్యమున)
ఓయీ వత్సా! భయ పడకుము. భయ పడకుము.
లక్ష్మ – (చెవులు రిక్కించి, ఆమోదముగా జూచి)
ఓ ఆర్యా! జటాజూట ధారుడు, భగవత్ సమానుడు నగు ముని శిఖామణి మధుకరిక వెంట రాగా, జానకిని యూర డించుచు ఇటు దెసకే ఎతెంచు చున్నాడు.

 (ప్రవేశము కుంభ సంభవుడు అగస్యుడు మున్నగువారు)

అగస్త్య – ఓ వత్స జానకీ! బెంగ పడ వలదు. రామ భద్రుడు లక్ష్మణ సమేతుడై నిన్నిచటనే యన్వేషించుచున్నాడు.
సీత – (సిగ్గుతో మనమున) నా కొరకు వీరన్ని దిశల యందును వెదకుచున్నారు. ఆహా! ఎంత భాగ్యము!
రామ – (సమీపించి) భగవన్ మునీంద్ర! నమస్కృతులు!
అగస్త్య- ఓ వత్స! చిరంజీవివి కమ్ము!
సీత – ఆర్యపుత్రునకు జయము!
మధు – మహారాజు విజయము నొందు గాక!
రామ- (సీతను గని ముదమున) వత్స సౌమిత్రీ! జానకిని గాంచి మనసున కత్యానందము కల్గుచున్నది.
లక్ష్మ – ఆర్యా! అది సహజమే కదా!
రామ – (అగస్త్య ముని తో) ఓ మునివర్యా! ఈ లతా మంటపమున కొంత తడవు ఆశీనులు కండు.
(అందరూ ప్రవేశింతురు)
లక్ష్మ – ఓ భగవంతా! జానకి ఎచట యగుపించె?
అగస్త్య – వినుడు.
రామ – జాగరూకులమై యుంటిమి.
అగస్త్య – పూర్వము ఈ వనమున తాపస కులోత్తముడగు దూర్వాసుడు కొన్ని సంవత్సరములు తప మొనరించె.
మధు – సులభ క్రోధుడు కదా ఈ తాపసి?
రామ – తరువాత?
అగస్త్య – ఆ సమయమున ఆ యాశ్రమము నందలి తీవ్ర తపమునకు భయపడి బలభేదనుడు, దూర్వాసుని తపో భంగమునకై దేవ కాంతలను పంప, ఆ సుందరాంగులలో నొకతె యగు హరిణి తపోవనమున కేగి పూవులు త్రెంప సాగె.
రామ – అయ్యయ్యో! గొప్ప పొరపాటు. పిమ్మట?
అగస్త్య – అనంతరమీ దూర్వాసుడు స్నానార్ధియై వెడలుచు దానిని గని “ఓసీ! హరిణీ! దేవతారాధనకై వినియోగింప బడిన కుసుమముల నన్య కార్యములకు కోసితివి కనుక యడవి మృగాకారము  పొందుమని శపించెను. పిదప ఈ వనమును త్యజించి యంతర్ధాన మయ్యెను.
మధు – ఆహా! శాప పరిణామ మెంత నిష్టురము.
లక్ష్మ – దానికా శాప విమోచన మెట్లాయె?
అగస్త్య – ఆ సుర కన్యలందరూ హరిణి రూపమున నున్న యా హరిణిని తీసుకుని నా పర్ణ శాలకు వచ్చి కరుణా పూర్వకముగ నాక్రందిన్చుచు నన్ను ప్రార్ధింప, నేను కరుణామయ హృదయుడనై దూర్వాస శాపము నభి మంత్రించి శాప విముక్తి జేయ, ఆమె నిజ స్వరూపమును పొందినది.
రామ – ఎల్ల జగములకును చెలిమితో సౌఖ్యము కల్గించు మేఘుడు
కార్చిచ్చులు చెలరేగి సర్వము దగ్ధమైన కాననములకు
తాపము తీర్చి మేలు చేయు రీతి,
యాలోచించి చూడగ నిదియు సాధ్యమే.
అగస్త్య – ఆ శాపమే ఇప్పటికిని నుండుటయు, అజ్ఞానమున యా వనమున కుసుమములు గోయ దేవి జానకి ప్రవేశించి శాప గ్రస్థ యైనది.
రామ – (ఆశ్చర్యముగ) ప్రేయసి యింతవరకు హరిణియై యుండెనా?
మధు – మా యజాగ్రత్త వల్ల రామభద్రున కెంత మనోవేదన సంభవించెనో కదా!
అగస్త్య – ఆ యాశ్రమమున నసహాయయై, దేవి యటు నిటు తిరుగుచుండగా, అదృష్ట పూర్వ యగు ఆ  హరిణిని సమాధి దృష్టిని గాంచి, జానకిగా నిశ్చయించి, శాపమును తొలగించి యీ ప్రదేశమునకు తెచ్చితిని.
రామ- ఓ మునీంద్రా! కరుణ, దాక్షిణ్యము, పరుల దుఃఖమును తొలగించుట, పరోపకారము చేయుట మున్నగు శుభ ప్రదమగు యాలోచనలను కల్గి యుండుట మీవంటి మహనీయులకు సహజ గుణములే కదా. ఆచార్యా! మమ్మనుగ్ర హింపుడు.
అగస్త్య – ఓ వత్స! శ్రీరామ చంద్రా! జానకితోడ, సౌమిత్రితోడను గూడి చిరకాలము సకల సౌఖ్యముల ననుభవించుచు, సదాచార సంపన్నుడవై, దైవ సమానుడవై, సకల లోకముల నేలుచు ఆ చంద్రార్కము వర్ధిల్లుము!!!!

(శ్రీ రామ జయం)

*****

                        
సంస్కృత మూలం – భాస్కర కవి.

ఆంధ్రీకరణ – కోరాడ రామచంద్ర కవి.

సరళ భాషానువాదం – శ్రీకాంత గుమ్ములూరి.

విషయ సేకరణ – సాహితీ నీరాజనం ( బ్రహ్మశ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి శత జయంతి పత్రిక నుంచి ) 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾