_____________________________________________________
అప్పుడప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది, మీకు చేతులెత్తి నమస్కారం చెయ్యాలని!
“పుణ్యం కొద్దీ పురుషుడని” ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో, మీలాంటి వ్యక్తి నాకు భర్తగా…
ఏమిటీ..ఏమైనా కాస్త పుచ్చుకున్నావా అంటున్నారా!?
లేదండి! నిజంగానే అంటున్నాను. ఆ రోజుల్లో మీరు అమెరికా వెళ్తుంటే, ఆవు వెంబడి లేగదూడ లాగా మీ వెంట వచ్చాను. కొత్త దేశమైనా, కొత్త మనుష్యులైనా మీరు, మీకున్న చదువు కారణంగా కొండంత విశ్వాసంతో ఉంటే, నేను మాత్రం భయం భయంగా బిక్కుబిక్కుమంటూ నా జీవితం మొదలు పెట్టాను. నా వాళ్ళ దగ్గర నుంచి నన్ను దూరం చేసి ఈ “అమెరికా అడవిలో” పడేసారని విసుక్కునేదాన్ని.
అప్పట్లో మీమీద ఉండే భయంతోనో..భక్తితోనో పైకి ఏమి అనేదాన్ని కాదు. కానీ..మిడిమిడి చదువులతో, మిడిల్ క్లాస్ అమ్మాయిగా పెరిగిన నన్ను, ఇలాంటి హై క్లాస్ సొసైటీలో పడేసినందుకు లోలోపల తిట్టుకునేదాన్ని! కొన్నాళ్ళైన తర్వాత గాని తెలిసిరాలేదండి, నన్ను అమెరికా తెచ్చి నాకు ఎంత మేలు చేసారో!
మీలాంటి మగాళ్ళ ధర్మమా అని నాలాంటి అమ్మాయిలెందరో ఎక్కడోపడి ఉండాల్సిన వాళ్ళం, ఎక్కడికో వెళ్ళాం. ఆ రోజుల్లో మీరు ధైర్యంగా ఇలా రాబట్టే నాలాంటి ఆడవాళ్ళు ఇంత ముందుకు వెళ్ళగలిగారు.
మీరు మగాళ్ళు, మీకు తెలీదు….
ఆ రోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలకు మధ్య తరగతి ఆలోచన్లు, మధ్యతరగతి కోరికలే ఉండేవి. చేసుకున్నవాడు తిండీ, బట్టా ఇచ్చి పుట్టింటికి తరిమేయకుండా, కాస్తంత ప్రేమగా చూసుకుంటే అదే మహాభాగ్యం అనుకునే రోజులవి. అసలు మా రాతల ప్రకారం ఏ బళ్ళో టీచరుకో, ఏ తాలుకా ఆఫీసులో గుమాస్తాకో, మహా అయితే బ్యాంకులో ఏ క్లర్కు కో పెళ్ళాలై అత్తెసరు బతుకులు బతకాల్సిన వాళ్ళం! అలాంటిది నాలాంటి ఎంతోమంది ఇల్లాళ్లకు పెద్ద పెద్ద డాక్టర్లు, గొప్పగొప్ప ఇంజనీర్లు, పేరున్న సైంటిస్టులు భర్తలుగా వచ్చారంటే అది అదృష్టం కాక మరేమిటీ?!
మెళ్ళో మూడు ముళ్ళు పడగానే మనసులోని ఆశలను-ఆశయాలను అణచి వేసుకోవాలి కాబోలు అని అనుకునే నాలాంటి ఆడపిల్లలకు, మీలాంటి మగవాళ్ళు ఊపిరి పోసారు. ఇక్కడి సంఘంలో నిలదొక్కుకోడానికి మాచేత ఏబిసీడీ లు దిద్దించి మా భవిష్యత్తుకు పునాది రాళ్ళు వేసారు. మీ బాధ్యతల బరువులో మాకూ స్థానమిచ్చి మమ్మల్ని గౌరవించారు. నూతిలో కప్పలుగా పెరిగిన ఆడవాళ్ళకు, అమెరికా పేరుతో అందమైన సువిశాల ప్రపంచాన్ని చూపించారు.
నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత పట్నంలో చూసిన ఒకటీ అరా సినిమాలు, మా ఊళ్ళో వేసే వీధి నాటకాలు, స్కూలు పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం ఎరగనిదాన్ని. అలాంటి నేను ఎన్ని కచేరీలు విన్నాను..ఎన్ని అద్భుతమైన నాట్యాలు చూసాను..ఎంతమంది గొప్ప రచయితలను కలుసుకున్నాను…ఎన్ని చక్కని ఉపన్యాసాలు విన్నాను! తలుచుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది!!
ఇండియాలో ఎక్కడో మారుమూల ఊళ్ళో పుట్టిన నేను, ఇక్కడకు వచ్చి ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గానకచేరీ విన్నప్పుడు నా జన్మ ధన్యమైందనుకున్నాను. వెంపటి వారి కూచిపూడి నృత్యాలు చూసినప్పుడు నా ఒళ్ళు పులకరించి పోయింది. ఘంటసాల వారి గాన మాధుర్యాన్ని విని నన్ను నేనే మరిచిపోయాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో…
నాతో పుట్టిపెరిగిన ఆడపిల్లలకు మల్లే నేను కూడా, “వారింట్లో లేరు. వారొచ్చాక అడిగిచెప్తాను” అంటూ బతకాల్సిన నేను ఈ సమాజంలో ఇంత చక్కటి గుర్తింపుతో, ఇంతమంది స్నేహితుల మధ్య ఇంత ఆనందంగా జీవిస్తున్నాను అంటే దీనికంతటికీ కారణం మీరే కదండీ?!
చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగిన నా మేనత్త కూతురు, దాని మనవరాల్ని చూట్టానికి ఈ దేశం వచ్చి మనింటికి కూడా వచ్చింది. మీకు అదే టైములో కాన్ఫరెన్స్ ఉండటంతో మీరు ఊరెళ్ళారు. అది ఉన్న నాలుగు రోజులు ఇద్దరం తిండితిప్పలు మర్చిపోయి కరువుతీరా కబుర్లు చెప్పుకున్నాం. దాన్ని నేను మన ఊరంతా తిప్పి చూపించాను. అది వద్దంటున్నా షాపింగుకు తీసికెళ్ళి దానికి అన్నీ కొనిపెట్టాను. ఒకరోజు మన ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి దాన్ని పరిచయం చేసాను. అది వెళ్ళే ముందు ఏమందో తెలుసా? “ఒసే పారూ! మనలో ఎవ్వరికీ దొరకని అవకాశం నీకు దక్కింది, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందే!” అంది.
అందుకే నాకు మీరంటే ఎంతో ఇష్టం!
అమెరికా తీసుకొచ్చి నాలాంటి ఆడవాళ్ళకు ఆత్మవిశ్వాసంతో పాటు సరికొత్త జీవితాన్ని ఇచ్చిన మీ మగవాళ్ళంటే నాకు మహా గౌరవం. అప్పట్లో మధ్య తరగతి కుటుంబాలన్నీ పేదరికం అనే బురదలో కూరుకుపోయిన శకటాలే. అటువంటి సంసారాల్ని బయటకు లాగి, రోడ్డు మీదకు మళ్లించిన సంస్కారవంతులు మీరందరు. ఆరోజుల్లో వచ్చిన మీలాంటి మగవాళ్ళందరూ నిజంగా “క్రీమ్ ఆఫ్ ద క్రాప్”!!
ఏమిటీ..ఇవ్వాళ నేను కొత్త కొత్తగా…వింత వింతగా మాట్లాడుతున్నానా?!
నేపధ్యం
నేను “పూర్ మగాళ్ళు” రాసినప్పుడు నావంక కాస్త కోపంగా చూసిన మగవాళ్ళు, తర్వాత ప్రచురింపబడిన “క్రీమ్ ఆఫ్ ద క్రాప్” ముచ్చట చదివి నావంక మెచ్చుకోలుగా చూసారు! నిజానికి నేను రాసినది వాస్తవం.
అందరం కలుసుకున్నప్పుడు సహజంగా మొగవాళ్ళ కన్నా ఆడవాళ్లే అన్ని విషయాల గురించి మాట్లాడుకోడం, అభిప్రాయాలు పంచుకోడం జరుగుతూ ఉంటుంది. నేను తరచూ ప్రస్తావించినట్టు ఆడవాళ్ళు ఆ రోజుల్లో ఇలా దేశం వదిలి ఇక్కడికి రావడం వల్ల, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పుకున్నట్టే, ఇక్కడికి రావడం వల్ల వారి జీవితాలు ఎంతగా మారిపోయాయో కూడా మాటల్లో వ్యక్తం అయ్యేవి. ఒకసారి ఓ గెట్ టు గెదర్ లో ఉద్యోగ పరంగా మంచి పొజిషన్ లో ఉన్న ఒకావిడ “మోహన్ గారు వాళ్ళు ఒక అమ్మాయిని చూడ్డానికి వచ్చి ఏ కారణంగానో వాళ్ళు ఇంట్లో లేక పోవడంతో, అదే వీధిలో ఉంటున్న మా ఇంటికి వచ్చి నన్ను చూసి ఇష్టపడటం..మా పెళ్ళి జరగడం… ఇలా నేను అమెరికారావడం.. నన్ను చదువుకోమని తను ప్రోత్సహించటం..నాకు ఇంత అందమైన జీవితం రాసిపెట్టి ఉందని కలలో కూడా ఊహించలేదు!” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే అప్పట్లో ఇండియాలో వాళ్ళ అక్కయ్యలు.. వాళ్ళ స్నేహితురాళ్ళు, తోటి ఆడవాళ్ళు ఎంతోమంది, చాలీచాలని సంపాదనలతో ఇరుకు గదుల్లో ఉంటూ, ఆర్ధికంగాను, ఆరోగ్యపరంగాను వాళ్ళు పడే ఇబ్బందులగురించి మాట్లాడుతూ, తాము అంటువంటి స్థితిని తప్పించుకున్నందుకు “థాంక్ గాడ్..వుయి ఆర్ లక్కీ!” అనుకోవడం ఎన్నో సార్లు విన్నాను. అందుకే మొగవారికి దక్కవలసిన ఈ క్రెడిట్ ని వారి ఖాతాలో వెయ్యాలని, మనస్పూర్తిగా మనసుతో రాసిన ముచ్చట ఇది! ఎందుకంటే ఆ “లక్కీగర్ల్స్ లో నేనూ ఒక దాన్ని కనుక!!
*************************