11_020 తో. లే. పి. – భానుమతి సింగ్

 

నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో — 1965 ప్రాంతాలలో —  ఛీఫ్ ఇంజినీర్ ఆఫీస్, శ్రీశైలం ప్రాజెక్ట్ లో జూనియర్ ఇంజినీర్ గా పనిచేసిన రోజులలో కావలసినంత తీరుబడి ఉండేది. అప్పటికి బ్రహ్మచారిని. పెళ్లి కాకపోవడం తో సంసార బాధ్యతలు ఇంకా నెత్తిన పడలేదు. హాయిగా ఇంట్లో నాకు తోచిన రీతిలో చక చకా వంట వండేసుకోవడం, ఖాళీ దొరికినప్పుడల్లా న్యూస్ పేపర్, పుస్తకాలూ చదువుకోడం, కొత్తగా మిత్రులను సంపాదించుకుని – పెన్ ఫ్రెండ్స్ అన్న మాట – వారితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుకోవడం ఇవీ కాలక్షేపం కోసం చేసే పనులు – లేఖా విన్యాసం తొలి ప్రయత్నమే అయినా – అది ఫలించడం తో ఉత్తరాలు వ్రాసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఈ మార్గం లో స్వదేశంలోనే కాకుండా విదేశీయులతో కూడా స్నేహ బంధనాన్ని ఏర్పరుచుకోవడం జరిగింది. శ్రీలంక, నేపాల్, గ్రీస్, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ఫిజి, ఆస్ట్రేలియా లలో కూడా కొత్తగా మిత్రులు ఏర్పడ్డారు. ఉత్తరాలు అన్నా- వాటిని అందించే పోస్టుమాన్ అన్నా చెప్పలేనంత అభిమానం. పోస్ట్ మాన్ అంటే నా దృష్టి లో సాక్షాత్తూ దేవుడే !

ఇదే పంధాలో ఫిజి దీవులలో ఉన్న అంబికా పి. సింగ్ తో ఉత్తరం ద్వారా పరిచయం ఏర్పడి, అనతి కాలం లో ఆ పరిచయం స్నేహం గా మరి ఆ బంధం కొనసాగుతూ వస్తూనే ఉంది. అంబికా సింగ్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రవాసులు. కాగా దశాబ్దాల క్రితమే వారు ఆస్ట్రేలియా కు సమీపాన ఉన్న ఫిజి దీవులకు వలస వెళ్లారు. అక్కడ చెరుకు పొలాలలో పని చేసుకుంటూ జీవనాన్ని సాగించే వారు. అంబికా సింగ్ ఫిజి దీవుల రాజధాని లబాసా నగరం లో తన శ్రీమతి భానుమతి సింగ్ థోమ్ కలిసి మౌనిదేవో ఇండియన్ స్కూల్ ని స్థాపించి నిర్వహిస్తూ వచ్చారు. భారతీయ సంస్కృతి ని అక్కడకు ఆ రకంగా వ్యాప్తి  చేసారు. అంతే కాదు ! అంబికా అక్కడి International Scouts & Guides సంస్థ కార్యకలాపాలలో కూడా ప్రముఖ పాత్ర వహించేవారు.  

సింగ్ తరచుగా ఉత్తరాలు వ్రాస్తూ అక్కడి  విశేషాలను ఎప్పటికప్పుడు  తెలియజేస్తూ ఉండేవారు. ఆయన భార్య భానుమతి కూడా ఆయన విధులలో ఆయనకు చేదోడు వాదోడు గా ఉంటూ తనవంతు సేవలను అందించేవారు. ఆ దంపతులకు సంతానం ఇద్దరు పుత్రులు, ఒక కుమార్తె. పుత్రులు ధర్మజీత్, రంజీత్, కుమార్తె కుసుమ్ లత. చాలా సంస్కారవంతమైన కుటుంబం వారిది. 

1968 అక్టోబర్ 11 న కొవ్వూరు లో జరిగిన మా వివాహానికి రావలసినది గా ఆహ్వానం పంపగా దానికి వెంటనే స్పందిస్తూ మాకు పెళ్లి కానుక గా ఒక డిసైన్డ్ శిల్క్ ఆపరేల్ ను పోస్ట్ లో పంపారు సింగ్ దంపతులు. అటు పిమ్మట మా ఉత్తరాలలో వివిధ సందర్భాలలో తీసుకున్న ఫ్యామిలీ ఫోటోలు చేతులు మారుతూ ఉండేవి. వాళ్ళ అమ్మాయి కుసుమ్ లత వివాహానికి రమ్మని కోరుతూ అంబికా దంపతుల నుండి ఉత్తరం, పెళ్లి శుభలేఖ మాకు అందాయి. అటు తరువాత వివాహాలు జరిగి, తమ తమ కొత్త సంసారాలతో ధరమ్ జీత్ ( పెద్ద అబ్బాయి ) కెనడా లోనూ, రంజిత్ ( చిన్న అబ్బాయి) న్యూజిలాండ్ లోనూ, కుసుమ్ లతా లబాస లోనూ స్థిరపడ్డారు.. అంబికా తరచుగా ఉత్తరాలు వ్రాస్తూనే ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తూ స్వల్ప అనారోగ్యం తో కాలం చేయడం చాలా విషాదకరమైన పరిణామం. ఆ సంఘటన కు నేను చాలా చలించిపోయి, ఉత్తరం ద్వారా నా సానుభూతిని భానుమతి గారికి, కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. తాను కష్ట సమయంలో ఉన్నా, భానుమతి గారు నా ఉత్తరానికి స్పందిస్తూ సమాధానం వ్రాయడం వారి సౌజన్యానికి సంకేతం. తరువాత ఇటీవలి కాలం లో ఫోన్ సౌకర్యం అభివృద్ధి చెందడం తో అప్పుడప్పుడు మేము ఫోనులో పలకరించుకోవడం కొనసాగుతూ వస్తోంది. అలాగే, ఫేస్ బుక్ వచ్చాక ఈ పలకరింపులు పరిపాటి అయిపోయాయి. 

ధరమ్ జీత్, రంజిత్ కూడా అడపా దడపా కాంటాక్ట్ లోనే ఉంటూ ఉంటారు. మరొక విషాదమేమంటే, ఆమధ్య కుసుమ్ లత కుమారుడు పినతండ్రి ఇంటికి న్యూజిలాండ్ వెళ్లి, అక్కడ ప్రమాదానికి లోనై మరణించడం.. పాతికేళ్ల వయసులో ఆ అబ్బాయి ఆలా కన్ను మూయడం నిజంగా దారుణమైన సంఘటన  గా చెప్పుకోవాలి. 

ప్రస్తుత విషయానికి వస్తే, నేటి తోక లేని పిట్ట అంబికా పి సింగ్ భార్య భానుమతి సింగ్ గారి పంపకం. వారికి కృతజ్ఞతలను తెలుపుకుంటూ, ఆ తోలేపి ని మీ ముందు ఉంచుతున్నాను. 

                                 <><><>***ధన్యవాదాలు.. నమస్కారములు***<><><> 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾