11_008 – ఆనందవిహారి

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం – విహంగ వీక్షణం

 

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై వారు ప్రతి మాసం నిర్వహించే ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో భాగంగా “ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం – విహంగ వీక్షణం” పేరిట ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారమైంది ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య డి.  మునిరత్నం నాయుడు ప్రసంగించారు.

 

తెలుగు భాషా బోధన, పరిశోధనలలో ముప్పైమూడు సంవత్సరాల నాణ్యమైన అనుభవం కలిగిన మునిరత్నం నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని, మాతృభాషా సేవా పురస్కారాన్ని అందుకోవడంలో ఆశ్చర్యం లేదని వక్తను పరిచయం చేసిన వాడ్రేవు సుందరరావు వెల్లడించారు.

 

అనంతరం మునిరత్నం నాయుడు మాట్లాడుతూ… ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మైసూరులో 2018లో ఏర్పాటైన వైనాన్ని, ఆ సంస్థ ఉద్దేశ్యాలను వివరించారు. ప్రారంభమైన తొలినాళ్ళలోనే పండితులు, నిపుణులతో ఒక మార్గ నిర్దేశక గోష్ఠిని నిర్వహించి సంస్థ చేపట్టాల్సిన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అనేక విభిన్న కార్యక్రమాలలో హైదరాబాద్, తిరుపతి, మైసూరులలో ఏర్పాటు చేసిన తాళపత్ర గ్రంథాలను అర్థం చేసుకొని పరిష్కరించే కార్యశాల ఒకటి అని చెప్పారు. ఆ రంగంలో నానాటికీ తగ్గుతున్న నిష్ణాతుల సంఖ్యను పెంచడమే ఈ కార్యశాల ఉద్దేశ్యమని వివరించారు. కేంద్రాన్ని నెల్లూరుకి మార్చిన తరువాత అక్కడి వెంకటాచలంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో దీన్ దయాల్ అంత్యోదయ భవనంలో ఉచితంగా లభించిన స్థలంలో కార్యక్రమాలు జరుపుతున్నామని వెల్లడించారు. 120 మంది భాషావేత్తలు, పండితులతో కార్యగోష్ఠి వీటిలో భాగమేనన్నారు.  “తెలుగు సిరి” పేరిట 6 నెలలకు ఒకసారి పరిశోధనాత్మక పత్రికను వెలువరిస్తున్నామని, ఇప్పటికే ఒక పత్రిక విడుదలైందని చెప్పారు. నిష్ణాతులకు జాతీయ, అంతర్జాతీయ విశిష్ట పురస్కారాలు అందజేస్తున్నామని కూడా అన్నారు. భారత రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని ఇప్పటివరకు ఆచార్య శలాక రఘునాథ శర్మ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలకు, అంతర్జాతీయ పురస్కారాన్ని ఫ్రాన్స్ కు చెందిన డా. డానియల్ నాజర్స్ కు, మహర్షి బాదరాయణ వ్యాస్ పురస్కారాన్ని డా. సి హెచ్ లక్ష్మణ చక్రవర్తికి సంస్థ అందజేసిందని పేర్కొన్నారు. భారతీయ భాషా సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఉపన్యాస ధారావాహికకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగు ప్రాచీనతపై 5 వారాల అంతర్జాతీయ సదస్సు, బాల సాహిత్యంపై సదస్సు అంతర్జాలంలో నిర్వహించామన్నారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా భాషా సంగ్రహాలయం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

 

కార్యక్రమం ప్రారంభంలో ఇటీవల అమరులైన భారత ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ రోశయ్యలకు సంస్థ అశ్రు నివాళులు అర్పించింది. ఈ నెల అమరజీవిపొట్టి శ్రీరాములు వర్ధంతి, ఆయన పేరిట స్మారక భవనం నిర్మింపజేసిన వై ఎస్ శాస్త్రి, బాపుల జయంతి రావడంతో వారిని స్మరించుకుంది.

 

 

            మట్టిలో పుట్టిన కథలు, అనుభవించి రాసిన కథలు

 

 

“తడి ఆరని బ్రతుకులు” కథా సంపుటి ఆవిష్కరణ సభలో భువనచంద్ర వ్యాఖ్య

 

తల్లి పేగు పిల్లలని ఎప్పుడూ లాగినట్టు శంకరరావుని ఎప్పుడూ పల్లె వేరు లాగుతుందని, అందువల్లే ఆయన అనుభవించి మరీ సహజత్వం ఉట్టిపడే కథలను రాయగలిగారని ప్రముఖ సినీ గీత రచయిత భువనచంద్ర ప్రశంసించారు. “తడి ఆరని బ్రతుకులు” పేరిట మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డా. విస్తాలి శంకరరావు రచించిన కథల సంపుటాన్ని ఆయన ఆవిష్కరించారు. డిసెంబర్ 9 ఉదయం విశ్వవిద్యాలయం మెరీనా ఆవరణలోని రజతోత్సవ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా, ఇవి మట్టిలో పుట్టిన కథలు, ఒక మట్టి మనిషి రాసిన కథలు అని భువనచంద్ర వ్యాఖ్యానించారు. ఈ కథల్లో విస్తాలి ఎక్కడా పేదరికాన్ని వివరించలేదని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తారని వివరించారు. కథ అనేది అత్యంత క్లిష్టమైన సాహిత్య ప్రక్రియ అని అన్నారు.  “ద్రావిడ దేశం” అధ్యక్షులు వి. కృష్ణారావు తొలిప్రతిని స్వీకరించారు. తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు మాడభూషి సంపత్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు. శంకరరావుకు సాహిత్యంలోని అన్ని అంశాలపై పట్టు ఉందని, ఆయన మంచి నటుడు కూడా అన్న విషయం స్థానిక తెలుగువారికి తెలిసిన విషయమేనని కొనియాడారు. ఆకాశవాణి చెన్నై కేంద్రం సహాయ సంచాలకులు డా. గోడా లలిత పుస్తక సమీక్ష చేసి సభను కట్టిపడేశారు. ఈరోజు తమ సంస్థకు పండుగరోజని ఈ కథా సంపుటి పుస్తకరూపంలో వెలువరించేందుకు ఆర్థిక సౌజన్యాన్ని అందించిన “తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం” అధ్యక్షులు తమ్మినేని బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. “జనని” వ్యవస్థాపక కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య అభినందనలు తెలుపుతూ, అంబేద్కర్ వర్ధంతి నాడు సామాజిక ప్రాముఖ్యత ఉన్న విలువైన కథల పుస్తకాన్ని ఆవిష్కరించడం సమంజసం అన్నారు. 

 

చివరిగా విస్తాలి స్పందిస్తూ… ముఖ్య అతిథులకి, ఆహూతులకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తోడ్పాటుతో ముద్రణకు నోచుకున్న ఈ కథా సంపుటిలోని ప్రతి కథా తన హృదయం నుంచి వచ్చినదేనని తెలిపారు. చెన్నైలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తెలుగువారు తనని ఒక కార్యక్రమానికి ఆహ్వానించారని, వాళ్ళ జీవితాలు తనను కదిలించగా రాసిన కథ “తడి ఆరని బ్రతుకులు” అని వెల్లడించారు. 

 

మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఏర్పాటు చేసిన ఎన్నో కార్యక్రమాలకి ఎంతో ఆదరంగా హాజరైన పేరొందిన సినీ గీత రచయిత, కవి వెన్నెలకంటిని వక్తలు, ప్రేక్షకులు ఆత్మీయంగా తలచుకున్నారు. తమిళనాడు గవర్నర్ గా ఉండగా తెలుగువారికి ఆత్మీయత పంచిన, ఇటీవలే కన్నుమూసిన రోశయ్యకు, గత ఏడాది తెలుగువారందరినీ శోక సముద్రంలో ముంచుతూ దివికేగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, కొన్ని మాసాల క్రితం కన్నుమూసిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వధ్యక్షులు ఆచార్య జి వి ఎస్ ఆర్ కృష్ణమూర్తి, వెన్నెలకంటిలకు నివాళిగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

 

 

                                 **********************************

 

సాహిత్యం అర్థం చేసుకోవాలంటే రసహృదయం ఉండాలి

— ఆచార్య ఎల్బీ శంకరరావు

 

 

మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు రచించిన “తడి ఆరని బ్రతుకులు” కథా సంపుటి ఆవిష్కరణ జరిగిన రోజున (డిసెంబర్ 9, 2021) “నన్నె చోడుని కుమార సంభవం” అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటైంది. ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, విశ్రాంత ఆచార్యులు ఎల్బీ శంకరరావు ఉపన్యసించారు. 

 

ఎల్బీ శంకరరావు మాట్లాడుతూ… సాహిత్యం అర్థం చేసుకోవాలంటే రసహృదయం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. “కుమార సంభవం” అంత పెద్ద ప్రబంధం తెలుగులో ఇంకొకటి లేదని ఆయన తెలిపారు. దీనిని నన్నె చోడుడు శ్రీకారంతో మొదలుపెట్టి శ్రీకారంతో ముగించారని వెల్లడించారు. అందులోని విశేషాలను వివరిస్తూ… కవి పార్వతీ దేవిని 31 వరుస కంద పద్యాలలో వర్ణించాడని వెల్లడించారు. వాటిలోని, మరికొన్ని పద్యాలలోని రచనా చమత్కృతిని వివరించారు. గురువు గురించి ఆయన చెప్పిన పద్యంలో… సముద్రంలో నుంచి మేఘాలు నీళ్ళు గ్రహించి తిరిగి వర్షం ద్వారా విడిచినట్టు అంటూ నాలుగు ఉపమానాలు చెప్పి, శిష్యులు గురువు నుంచి గ్రహించినది గురువుకే అర్పిస్తారని వివరించారు. ఏ కవి అయినా ఒక పద్యంలో ఒకటే భ్రాంతి అలంకారం  చెప్తారని, కానీ నన్నె చోడుడు రెండు భ్రాంతులు చెప్పారంటూ ‘హరి వికచాంబలాంబుజ సహస్రము పూఞ్చి ‘ అన్న పద్యాన్ని వినిపించారు. తాను ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సాళ్వ కృష్ణమూర్తి (ప్రస్తుతం ఆయనకి 91 ఏళ్ళు) అడిగిన అనేక ప్రశ్నలకి సమాధానం ఇచ్చినప్పటికీ, ఈ పద్యం చెప్పి తాత్పర్యం వివరించేసరికి తనకి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఒక తమాషా పద్యం రాశాడంటూ… ‘నేలయు నింగియు’ అనే పద్యం చదివారు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టమని, తిక్కన సహా తరువాతి తరాల కవులు ఆయనని అనుసరించారని వివరించారు. కాళిదాసు రచించిన శ్లోకాలను కూడా అద్భుతంగా అనువాదించాడని చెప్పారు. 

 

రాజ కవిత్రయం అంటే నన్నె చోడుడు, శ్రీకృష్ణ దేవరాయలు, రఘునాథ రాయలు, కవి అంటే నీటి కాకి అని కూడా అర్థం ఉందని ఆచార్య ఎల్బీ ప్రసంగవశాత్తూ చెప్పారు. ఆచార్య సాళ్వ కృష్ణమూర్తిని, ఆచార్య దేవళ్ళ చిన్నికృష్ణయ్యని, తనని కలిపి వెనకటికి తమ శిష్యులు “వజ్ర త్రయం”  పేరు పెట్టారని  అపురూపంగా గుర్తు చేసుకున్నారు. 

 

కార్యక్రమం ప్రారంభంలో వక్తను, ఆహూతులకు స్వాగతం పలికిన తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు… పదవీ విరమణ తరువాత ఆచార్యుల ప్రసంగాలు మరింత పాండితీ ప్రతిభతో అలరారుతాయని వ్యాఖ్యానించారు. సిలబస్ ప్రకారం చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో, తమ అనుభవాన్ని రంగరించి తెలుసుకున్న అనేక విషయాలతో ప్రేక్షకులకు సాహితీ మేజువాణిని వడ్డిస్తారని అన్నారు. చదవడం కంటే వినడం వల్ల విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారని, అందువల్ల వారిలో అనేక విషయాలపట్ల అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను తలపెట్టానని వెల్లడించారు. తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు మాడభూషి సంపత్ కుమార్, శంకరరావు ఎల్బీ శంకరరావుని సత్కరించారు.

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾