13_002 వివాహబంధం

“అమ్మా! నేను మా సీనియర్ చైతన్య  ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము… ”

    “నీ కన్నా ముందు పుట్టిన అక్కలు ఇద్దరు ఉన్నారు. వాళ్లకు ఇంకా పెళ్లి కాలేదు. నీవు పెళ్లి చేసుకోవడం ఏమిటి లతా? నీకు పిచ్చి గాని పట్టిందా?… ”

    “చైతన్యకు నేనంటే చెప్పలేనంత ప్రేమ. అభిమానం. మేము ఇద్దరం కథలు వ్రాస్తాం. కవితలు వ్రాస్తాము. చక్కగా పాడతాము. మా ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలిశాయి. చైతన్య నన్ను పెళ్లి చేసుకుందామని తొందర పెడుతున్నాడు. వాళ్ళింట్లో మా పెళ్లికి  ఒప్పుకున్నారు. నేను చైతన్య ను వదులు కోలేనమ్మా!… ”

  “ మీ అభిప్రాయాలు కలిస్తే కూడా…మీ ఇద్దరికీ మంచి ఉద్యోగాలు లేవు. అతను పిహెచ్.డి, చేస్తూ ఇంటినుండి డబ్బు తెచ్చుకుని ఖర్చు పెడుతున్నాడు. నీవు ఎమ్.ఏ. చదివినా ఇంకా ఉద్యోగం రాలేదు. మీరు పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతారు? మంచి ఉద్యోగాలు వచ్చేవరకు ఆగండి. జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి. అప్పటికి అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు అయితే, మీ పెళ్లి మేము ఘనంగా జరిపిస్తాం. ”

    “ మీరు అక్కలకు ఎంతో కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీకు ఏవి నచ్చడం లేదు. అక్కల కోసం నేను చైతన్యను వదులుకోలేను. చైతన్యను పెళ్లి చేసుకుంటాను”.

   ” నీ అక్కలకు పెళ్లి చేయకుండా, మేము నీ పెళ్లి ఎలా చేస్తాం ? సమాజంలో మాకు ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా?… నిన్ను చిన్నతనంలో పెంచిన పెద్దమ్మ పెద్ద నాన్నలను అడుగు. వాళ్ళు నీకు పెళ్లి చేస్తారు. మీ పెళ్లికి మేము రాలేము…నీ పెళ్లికి ముందు నీవు కనపడితే, నీ కోసం చేయించిన నగలు… చీరలు కొని ఇస్తాను”.

     అలా కన్న తల్లి దండ్రుల, తోబుట్టువుల ఆశీస్సులు లేకుండా… పెద్దమ్మ, పెద్ద నాన్నల, స్నేహితుల సమక్షంలో తాను చైతన్యను పెళ్లి చేసుకున్నాను.

* .   *.   *.   *

     నేను ఒక పత్రిక ఆఫీసులో ఉద్యోగంలో చేరాను. చైతన్య పత్రికలకు వార్తలు, వ్యాసాలు వ్రాసేవాడు. అలా జీవితం కొంత కాలం సంతోషంగా గడిచింది.మా కలల పంటగా “ఆకాష్” పుట్టాడు.

     ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతుంటే … నాకు అమ్మ ఇచ్చిన నగలు బ్యాంకులో కుదువ పెట్టి డబ్బు తెచ్చుకుని, వాడుకునేవాళ్ళం.

     అక్కలకు గొప్ప ఇంటి సంబంధాలు వచ్చాయి. అక్కలిద్దరూ, వాళ్ళ భర్తలు పెద్ద పెద్ద ఉద్యోగాలతో జీవితంలో బాగా స్థిరపడ్డారు.

     అమ్మ గొప్ప జీవిత సత్యాన్ని చెప్పింది.”ముందు ఉద్యోగాలు సంపాదించి, తర్వాత పెళ్లి        చేసుకోమంది”. అమ్మ మాట పెడ చెవిన పెట్టినందుకు అనుభవిస్తున్నాను.

     ఒక రోజు చైతన్య…” లతా! మనం జీవితంలో డబ్బు పేరు ప్రతిష్ఠలు సంపాదించాలంటే, సినిమా ప్రపంచంలో అడుగు పెట్టాలి”. నీవు టి.వి. సీరియల్స్ వ్రాస్తున్నావు గదా! సినిమాల్లో వ్రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది…

     సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరిగాం. ఒక సినిమాకు సంభాషణలు వ్రాసే అవకాశం వచ్చింది. నేను వ్రాస్తే, చైతన్య దానికి మెరుగులు దిద్దే వాడు. ఆ సినిమా విజయవంతమైంది. తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలలో మాటలు అంటూ నా పేరు వేసేవారు. సినిమాల్లో నాకు అవకాశాలు వస్తున్నాయి.

     చైతన్య సినిమా డైరెక్టర్ కావాలని ఆశ పడేవాడు. ఎంత ప్రయత్నించినా … చైతన్యకు ఎలాంటి అవకాశం రాలేదు.

      చైతన్య డబ్బు ఖర్చు పెడుతుంటే…”వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు పెడితే ఎలా”? ఏమైనా ఆస్తులు కొంటే మంచిది గదా! ” అన్నాను.

     “నేను  డబ్బు సంపాదించకుండా.. నీవు సంపాదించినది ఖర్చు పెడు తున్నానంటున్నావా ? “ …

    “ ఎందుకు ? అలా మాట్లాడుతున్నారు? ” మీరు నేను అనే భేదం ఏమిటి ?… అంతా మనదే. కాకపోతే పొదుపు చేద్దామన్నాను… ” అన్నాను.  

     నేను ఎంత వినయంగా చెప్పినా, అతను రెచ్చిపోతున్నాడు. ఇది చైతన్యలో మరో రూపం.

*. *.  *.   *

   ఇల్లాలిగా ఉంటూ… భర్త బిడ్డలకు సేవ చేస్తూ, ఇంట్లో పడి ఉండే గృహిణి జీవితం వేరు. బయటి ప్రపంచంలో అందునా ” సినిమా ” ప్రపంచంలో అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటేనే సినిమాలలో అవకాశాలు వస్తాయి.

   ఈ మధ్య సినిమా నటుడు ఒకరు మా ఇంటికి వస్తూ, నాతో చనువుగా మాట్లాడుతున్నాడు. చైతన్యకు ఇంత కాలం లేని కొత్తగా ‘అనుమానపు జబ్బు’ మొదలైంది.

   ” వంటిని అతుక్కున్నట్లు ఉన్న ఆ డ్రెస్సు ఏమిటి ? ఇప్పుడు ఈ డ్రెస్సు వేసుకుని, వాడిని కలిసి ఖుషీ చేయడానికి వెలుతున్నావా ?  ” అంటూ చైతన్య నా చెంప చెళ్లుమనిపించితే …

ఆ దెబ్బకు దిమ్మ దిరిగి, మారు మాట్లాడకుండా లోపలకు వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకుని బయటకు నడిచాను. ఎక్కడికి వెళుతున్నావంటూ చైతన్య అరుస్తున్నా పట్టించుకోలేదు.

   చైతన్య కొట్టిన దెబ్బకు చెంప వాచి బాధ పెడుతోంది.అలాంటి మనిషి మాటను నమ్మి, నేను వేసిన తప్పటడుగును తలుచుకుని మనసు కుమిలిపోతోంది. రగిలిపోతోంది. తనివితీరా ఏడవడానికి కూడా లేకుండా రోడ్డున పడ్డాను. ధైర్యం తెచ్చుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లాను.

   “ఏమిటీ ఈ అవతారం ?… నీ మొహం ఆలా ఉందేమిటి ? లతా!…ముందు బాత్ రూముకి వెళ్లి మొహం కడుక్కుని రా…  నేను కాఫీ చేసుకు వస్తాను… ” అని కాఫీతో వచ్చి….

   “ ఇప్పుడు చెప్పు. ఏదో జరిగింది. దాయకుండా నిజం చెప్పు. దానికి పరిష్కారం ఆలోచిద్దాం ”.

   “ఆలోచించ వలసినది ఏమీ లేదు. నా భర్తతో కలిసి ఉండడం అసంభవం. విడాకులు తీసుకోవడమే నాకు మిగిలిన మంచి మార్గం. ”

  “ అబ్బ! ఏం జరిగిందో చెప్పు లతా! ” అంది శోభ నా చేయి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ…

* .   *.    *.     *

    “ జరిగినది విన్నావుగా…పన్నెండు సంవత్సరాలు వయసున్న కొడుకు ఆకాష్ ఉండగా, ప్రేమించి పెళ్లాడిన చైతన్య ఉండగా…నేను పరాయి మగవాడి వలలో ఎందుకు పడతాను?… చైతన్య అవేవీ ఆలోచించకుండా నన్ను అనుమానించి కొడితే, నేను భరించ లేక పోతున్నాను. ఆ మాటలను నేను మరిచిపోలేను. శోభా! నీవు వెళ్లి చైతన్యతో మాట్లాడి ఆకాష్ ను తీసుకు వచ్చి నాకు అప్పగించావంటే … నీ మేలు ఈ జన్మలో మరువను. ” అన్నాను.

    “ లతా! ఆగు… తొందరపడి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. హిందూ దేశంలో మగవాడి ఆధిపత్యం ఎక్కువ. స్త్రీ ఎంత చదువుకున్నా, ఎంత ధన వంతురాలైనా ఎప్పుడూ అణిగి మణిగి ఉంటుంది. నీవు, నీ భర్త విడిపోతే ఆకాష్ జీవితం ప్రశాంతంగా గడవదు. కుటుంబంలో మీ ముగ్గురూ మానసిక బాధలకు గురవుతారు. భర్తకు విడాకులు ఇస్తాను అనే నీ నిర్ణయం మార్చుకో! ప్రశాంతంగా ఉండు. నేను వెళ్లి నీ భర్తతో మాట్లాడి, ఆకాష్ ను తీసుకు వస్తాను… ” అంది శోభ.

    అమ్మ నుండి ఫోను… “ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అతనికి,నీకు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా, కష్టమైనా భరించి ఉండు. చైతన్య జీవితంలో తాను కోరుకున్నట్లుగా ఏమీ సాధించలేక పోయాడు. అతను మానసికంగా ఎంత బాధ పడుతున్నాడో ? ఎవరికెరుక ? అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. విడాకులు అనే ఆలోచన మనసులో రానీకు. ఆకాష్ ను మనసులో పెట్టుకుని, కొన్ని బాధలను భరించక తప్పదు. జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయి…

    “ లతా ! నేనూ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. నేను మాకాలంలో బి.ఏ.,బి.ఇడి., చదివి టీచరుగా ఉద్యోగం చేశాను. నన్ను మా అత్తా,ఆడబిడ్డలు ఎన్నో ఆరళ్ళు పెట్టారు. మీ నాన్న చూస్తూ ఉండేవాడు. వాళ్ళను ఏమీ అనేవాడు కాదు. నేను నా ముగ్గురి ఆడపిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆగడాలన్నీ భరించాను. తరతరాలు గా ఆడవాళ్ళకు తీరని వ్యధలెన్నో ?… నీవు ఓర్పుతో నీ సమస్యను పరిష్కరించుకో! ” అంది అమ్మ…

   అక్కలు… “ నీవు నీ భర్త కు విడాకులు ఇస్తే, నీ చెల్లెలు అలాంటిదట గదా?…  మీరు ఏం చేస్తారో? అంటూ మా అత్త వారింట్లో మమ్మల్ని హీనాతిహీనంగా చూస్తారు…నిదానంగా ఇంకో మారు ఆలోచించు లతా! ” అన్నారు.

   హిందూ దేశంలో ఆడదాని మనసుకి, బ్రతుకుకి విలువ లేదా? ఆమె ఒంటరిగా తనకు నచ్చిన విధంగా జీవించకూడదా? అనుకుంటూ ఆలోచనలో మునిగాను.

    కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఎదురుగా చైతన్య. నా చేతిని గట్టిగా పట్టుకుని… “ నన్ను ఆకాష్ ను వదిలి వచ్చి, నీ స్నేహితురాలి ఇంటిలో కూర్చున్నావా?… ” అన్నాడు.

    “ ఈ వారం రోజుల నుండి ప్రతి క్షణం నీ గురించే ఆలోచించాను. ఆత్మ విమర్శ చేసుకున్నాను. నేను నీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. జీవితంలో ఇక మీద ఎన్నడూ నీ పట్ల దురుసుగా ప్రవర్తించను. నా మాట నమ్ము. ” అంటూ  ఆర్తిగా నన్ను గుండెలకు అదుముకున్నాడు.  ఆనందంతో, రెండు తనువులు, రెండు మనసులు, రెండు ఆత్మలు ఒక్కటిగా మమేకమైనాయి.

    ఇదే భారత దేశపు వివాహ బంధం యొక్క ఔన్నత్యం.

**************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page