13_004 దివ్వెల పండుగ

 

హిందూ పండుగలు చాలా విశిష్టమైనవి. అందులో తెలుగువారి పండుగలు మరింత విశిష్టమైనవి. వాటి ప్రాశస్త్యాన్ని, మన జీవనంలో అవి ఎలా మమేకం అయ్యాయో వివరిస్తూ ప్రముఖ రచయిత కీ. శే. రావూరు వెంకట సత్యనారాయణరావు గారు వ్రాసిన వ్యాస పరంపర ‘ తెలుగు పండుగలు ’ నుంచి…..

ఈ వ్యాసాలు అంతర్జాతీయ తెలుగు సంస్థ తమ పత్రిక ‘ తెలుగువాణి ’ లో 1976 లో ప్రచురించింది.

***************

దసరా అందించిన ఆనందాన్ని నెమరు వేసుకొంటుండగా దర్శనమిస్తుంది దీపావళి. నరకాసుర వధను పురస్కరించుకొని ఏర్పడిన చతుర్దశి, ఆ మరునాడు దివ్వెల వెలుగు రవ్వల పండుగ, అలుముకొన్న చీకట్లను అసుర సంహారంతో పటాపంచలు చెయ్యడం, తిరిగి వెలుగు తొంగి చూడటం, లోక కల్యాణ ప్రదమైన ఆ శుభ సమయంలో ఆనందాతిరేకంతో అందరూ ఆ విశ్వ పురుషునికి నివాళులందించడం ఈ పండుగలోని ప్రత్యేకత.

 

మానవుడు వెలుగును – ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందినది – సంతరించుకోవడం కోసం ప్రాకులాడుతూ వుంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతుల నుంచి తప్పించుకొని, తపస్సిద్ధ్హి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వుంటాడు. అలాటి స్థితికి ప్రతీక దీపావళి. దివ్వెను చూస్తే మనస్సులో ఏదో మువ్వల మ్రోత వినిపిస్తుంది. అది అద్భుతమైన స్పందన. అలాటి వెలుగును కనులారా దర్శించి, మనస్సులో వెలుగులో కలబోయడం కోసమే దీపావళి. అది ఆత్మలో ఆనందంతో అందించే నివాళి. అనతికాలంలో ప్రకృతి అందించబోయే సంపద అందుకోవడానికి ప్రజలు దీపావళి శోభను వెంటపెట్టుకొని వెళ్లడంలో ఎంత పండుగ వుంది ?

 

*************************

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page