10_006 ఆనందసిద్ధి

————————-                   

కావ్య కంఠ గణపతి ముని ఒక తెలుగు మహాత్ముడు అప్పట్లో తిరువణ్ణామలై కి దగ్గరలో పని చేస్తూ, చాలా గుళ్ళల్లో కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. అయన వేద శాస్త్రాన్ని క్షుణ్ణం గ చదివిన వ్యక్తి. మంత్ర శాస్త్రంలో దశ మహావిద్యలని వశం లోకి తెచ్చుకున్న వ్యక్తి. ఆయనకీ ఆంధ్రదేశమంతటా చాలమంది శిష్యులు ఉండేవారు. ఆయనని ఒక సందేహం వేధిస్తోంది అప్పట్లో. దానికి బ్రాహ్మణ స్వామే శరణ్యమని ఒకనాడు కొండ మీద విరూపాక్ష గుళ్ళో ఉన్న ఆ బ్రాహ్మణ స్వామి దగ్గరకి వెళ్లారు 

వెంకటరామన్ గుహ బయట ఒక రాతి మీద కూర్చుని ఉన్నారు. ఆయనకి సాష్టాంగపడి ” వేద శాస్త్రాలన్నీ చదివాను, చాలా జపం చేశాను. కానీ తపస్సు అంటే ఏమిటో సరి అయిన అవగాహన కలగలేదు. దయచేసి వివరించండి ” అని ప్రార్థించాడు 

బ్రాహ్మణ స్వామి అతని కళ్ళలోకి ఒక పది నిమిషాలు చూసి మెల్లిగ కంఠం సవరించుకుని ” నేను” ‘ నేను’ అంటున్నారు కదా ! అది నీలో ఎక్కడ నుంచి ఉదయిస్తోందో గమనిస్తే, మనసు అక్కడ లయిస్తుంది. అదే తపస్సు.  

” ఒక మంత్రం జపించినప్పుడు ఆ మంత్ర శబ్దం ఎక్కడ ఉదయిస్తోందో దానిని గమనిస్తే మనసు అక్కడ లయిస్తుంది. అదే తపస్సు ” 

అది విన్న గణపతి ముని మనసు ఆనందం తో నిండిపోయింది. అక్కడే కొన్ని గంటలు ఉండి, బ్రాహ్మణ స్వామి అసలు పేరు వెంకటరామన్ అని తెలుసుకుని ఆశువు గ ఐదు చరణాల స్తుతి చేశాడు. అందులో ఆయన బ్రాహ్మణ స్వామి పేరుని ‘ రమణ ‘ గ కుదించి చెప్పాడు. అయన శిష్యులందరికీ ఉత్తరాలు రాస్తూ, బ్రాహ్మణ స్వామి, అనుభవంతో పుస్తకాల లో లేని రహస్యం వివరించిన కారణం గా ఆయనను మహర్షి అని సంబోధించాలని ఆదేశించాడు. అప్పటినుంచీ బ్రాహ్మణ స్వామి భగవాన్ రమణ మహర్షి గ ప్రసిద్ధి చెందారు 

రమణ మహర్షి అన్న పేరు వాడుక లోకి రాక ముందే శివప్రకాశం పిళ్లే అన్న శిష్యుడు వేసిన ప్రశ్నలకి బ్రాహ్మణ స్వామి ఇచ్చిన జవాబులు. ” నేను ఎవరు ? ” అని ప్రాముఖ్యం చెందింది. మహర్షి బోధ అంతా క్లుప్తంగా ఇదే అని చెప్పవచ్చు అని గ్రంథ కర్త అభిప్రాయం చదివాడు ఆనంద్.  

శ్రీ పి ( శివప్రకాశం పిళ్లే) : అసలు నేను ఎవరు ? నాకు ముక్తి ఎలా లభిస్తుంది ?

బ్రా. స్వా. ( బ్రాహ్మణ స్వామి ) : నీలో నువ్వు “ నేను ఎవరు ? ” అని విచారణ చేసుకుంటే నీ స్వరూపం గుర్తించడం జరిగి నీకు ముక్తి లభిస్తుంది. 

శి. పి : అసలు నేను ఎవరో ఎలా తెలుసుకోవడం ?

బ్రా. స్వా. :  అసలు ‘ నేను ‘, లేదా ఆత్మ అనేది నీ పంచేంద్రియాలు కానీ, కర్మలు చేసే శరీర భాగాలు కానీ, నీప్రాణం  కానీ, నీ మనసు కానీ, ఆఖరికి గాఢనిద్రలో ఉన్న నువ్వు కానీ, ఇవేవీ కాదు.  

శి. పి. : అవేవీ నేను కాకపోతే మరి నేను ఎవరు ? 

బ్రా స్వా. : వాటన్నిటినీ, నేను కాదు, నేను కాదు అని తొలగించుకుంటూ ఏ చైతన్యం  మిగులుతుందో అదే నువ్వు. 

శి. పి. : ఆ చైతన్యం యొక్క ప్రకృతి ( NATURE ) ఏమిటి ? 

బ్రా. స్వా. : అది ‘ నేను ‘ అనే ఆలోచన లేశమైనా లేని సత్ చిత్ మయమయిన ఆనంద స్వరూపం. అది నిశ్శబ్దమయిన ఆత్మ. ఎల్లప్పుడూ అదే ఉంటుంది తప్ప వేరే ఇక ఏమీ లేదు. నువ్వు, ప్రపంచం, దేముడు ముగ్గురూ కూడా ఎండమావులలో నీళ్లు లాగా మిధ్య ఆత్మ స్వరూపంగా ఆ మూడు ఒకటే.

శి. పి. : ఆ ఆత్మ స్వరూ పాన్ని ఎలా గుర్తించడం ?

బ్రా స్వా. : బయట వస్తువులు ఎప్పుడు కనపడకుండా పోతాయో అప్పుడు వాటిని చూసే వాటి అసలు ప్రకృతి సంపూర్ణంగా గుర్తించడం జరుగుతుంది. 

శి. పి: బయటి వస్తువులని చూస్తూ కూడా స్వరూపాన్ని గుర్తించలేమా ?

బ్రా స్వా. : కుదరదు. ఎందుకంటే చూసేవాడు, తాడుని పాము అనుకుని చూస్తున్నాడు. అది పాము కాదు తాడే అని గుర్తించేదాకా జరగదు.   

శి. పి. : బయటి వస్తువులు ఎప్పుడు కనిపించకుండా పోతాయి ?

బ్రా స్వా. : వాటికీ కారణమయిన మనసు ఎప్పుడు అదృశ్యమవుతుందో అప్పుడు అది జరుగుతుంది. 

శి. పి: మనసు యొక్క ప్రకృతి (nature) ఏమిటి ?

బ్రా స్వా. : మనసు అంటే ఆలోచనలే. అది ఒక రకమయిన శక్తి. అదే వస్తువులుగా ప్రకటితమవుతుంది. మనసు ఆత్మ లో లయమయితే స్వరూపం తెలుస్తుంది

శి. పి : మనసు ఎలా అదృశ్యమవుతుంది ? 

బ్రా స్వా. : నేను ఎవరిని అనే విచారణ ద్వారానే అది సాధ్యమవుతుంది. నేను ఎవరిని అని చేసే విచారణ కూడా ఒక ఆలోచన కాబట్టి అది కూడా ఒక ఆలోచనే. కానీ అది మిగతా మనసు వాసనలన్నీ క్షయం చేసి చివరికి అదే మిగులుతుంది. శవాన్ని కాల్చడానికి వాడే కర్రని పనియైన తరువాత దానిని కూడా చితిలో పడేసిట్టు, స్వరూపమే మిగులుతుంది. 

శి. పి. : అలా ఎంతకాలం చేయాలి ?

బ్రా స్వా. : మనసులో పేరుకున్న ఆలోచనల ( వాసనలు ) ప్రభావం అంతా పోయే దాకా జరగాలి.


*******

అతను కొన్న పుస్తకాలలో, రమణ మహర్షి అరుణాచలం వచ్చిన 54 సంవత్సరాలు, ఎక్కడికి వెళ్లకుండా ఎలా గడిపారో వివరణ ఉంది. ఆయన దగ్గరకి వచ్చిన భక్తులకు, అయన వారి వారి స్థాయి బట్టి ఇచ్చే ఆధాత్మిక సలహాలు, జంతువుల పట్ల, ఆఖరికి వృక్షముల పట్ల అయన చూపే అపార కరుణకి సంబంధించిన  అనేక సంఘటనలు వివరించారు.  

పుస్తకాలు చదివిన తరువాత మరుసటి ఆదివారం, నారాయణ తో సత్సంగానికి వెళ్ళాడు ఆనంద్. .

మిగతా అన్నింటికంటే ఏ మనిషయినా తాను ఎవరో తెలుసుకోవడం ముఖ్యమని బోధించడం అందుకు ‘ నేను ఎవరు ‘ అనే విచారణ మార్గం తప్ప వేరే మార్గం లేదని చెప్పడం, మహర్షి బోధ అనుకున్నాడు ఆనంద్.

మహర్షి జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తకాలు చదివిన తరువాత అతను కొంత గ్రహించినా, అతని చాలా సందేహాలు తీరలేదు.  

అతనికి గతంలో వచ్చిన సందేహాలే మళ్ళీ, మళ్ళీ రావడం జరుగుతోంది. ఇక్కడ సత్సంగం లో కూడా, మహర్షిని స్తోత్రించడం అయన చెప్పిన ఉపదేశ సారం అనే శ్లోకాలని వల్లించడం, అయన జీవించి ఉన్నప్పుడు  జరిగిన అనేక సంఘటనలు, ఇలాంటివి తప్ప, అయన బోధించిన సతాన్వేషణ ఎలా చేయాలన్న విషయం మీద ఎవరూ మాట్లాడక పోవడం అతన్ని అయోమయం లో పడేసింది. 

సత్సంగం అయిన తరవాత నారాయణ తో అన్నాడు ” నాకు రెండు విషయాలలో సమాధానాలు కావాలి. ఒకటి ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించడం ఎలాగా ? రెండోది, అసలు భగవంతుదు ఉన్నాడా ? ఉంటే ఎలా ఉంటాడు ? నమ్మకం మీద ఆధారపడకుండా నేను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. వీటికి జవాబులు మీ పరాశర స్వామి జవాబు చెప్పగలడా ? ” 

” నా ఉద్దేశ్యం లో నీకు ఆయన సరి అయిన సమాధానాలు ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. నేను ఒకటి గమనించాను, ప్రపంచక విషయాలు ఆయన ఎక్కువ మాట్లాడడం చూడలేదు, కానీ ఆధ్యాత్మిక సంబంధమయిన సందేహాలు ఎవరయినా అడిగితే చాలా ఓపికగా వివరించడం చూశాను. అందుచేత అయన ఇంటి దగ్గర కలుద్దాము ” అన్నాడు నారాయణ. 

*********