11_006 హాస్యగుళికలు – తానొకటి తలిస్తే…

                                              సామెతలతో కథ

 

అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఉంది వర్ధనమ్మ. “ఏ చెట్టూ లేని చోట ఆముదపుచెట్టే మహావృక్షం” అన్నట్లుగా ఆ పల్లెటూర్లో ఆవిడే కాస్త ఉన్నవాళ్ళ కింద లెక్క. ఉన్న ఎకరం మాగాణి చూసుకొని ‘నా అంత ధనవంతులు లేరు’ అని మురిసిపోతూ ఉంటుంది.

 

          ఇక ఆవిడ భర్త పరంధామయ్య గారు. వారి జంట కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. వర్ధనమ్మని పెళ్ళి చేసుకున్న కొద్ది రోజులలోనే ఆయన సంసార సారాన్ని గ్రహించాడు. “వినదగు నెవ్వరు చెప్పిన” సామెతను “వినదగు భార్య చెప్పిన” సామెతగా తనకు తాను మార్చుకుని ఆమె మాట వింటూ హాయిగా ఉంటున్నాడు.

 

       ఇక వర్ధనమ్మ కూతురు శోభ. “లేడికి లేచిందే ప్రయాణం” అని దానికెప్పుడూ హడావుడే! “ఇంటికన్న గుడి పదిలం” అన్నట్లు ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుంది. “తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు” అన్నట్లుగా ఇతరుల ఇళ్ళలో “మా తాతలు నేతులు త్రాగారు” రేంజ్ లో గొప్పలు చెపుతూంటుంది అందరితో. “ఇల్లు చూసి ఇల్లాలిని చూడు” అన్నారు కానీ వర్ధనమ్మ ఇల్లు చూసి కూడా ఆవిడ గారి ఇంటికి వెళ్ళే సాహసం ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు, ఒక్క పక్కింటి పార్వతమ్మకు తప్ప! పార్వతమ్మకి ఒక్కగానొక్క కొడుకు. బుద్ధిమంతుడు. చదువుకుని చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.

 

     కూతురికి పెళ్ళీడు రాగానే వరాన్వేషణ ఆరంభించింది వర్ధనమ్మ. ఆవిడ “ఆశకి అంతులేదు!” “గంతకు తగ్గ బొంత” సంబంధాలకి “నో” చెప్పేసింది. “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్లు” హై క్లాస్ సంబంధాలకని వెళ్ళి భంగపడింది. స్వయానా తన ఆడపడుచే సంబంధం కలుపుకుందామని వస్తే “నక్కకీ నాగలోకానికీ పొత్తేమిటి?” అని పంపేసింది. వచ్చిన సంబంధాలకి వంకలు పెట్టడంతోటే సరిపోతుంది ఆవిడకి!

 

     రోజులు గడిచిపోతున్నాయి. ఓరోజు వర్ధనమ్మ “అత్త లేని కోడలుత్తమురాలు” టీవీ సీరియల్ శ్రద్ధగా చూస్తోంది. తన కూతురికి కూడా అత్త లేని సంబంధం వస్తే బాగుంటుందని మనసులో అనుకుంది. ఇంతలో ఎదురింటి మీనాక్షమ్మ వచ్చి, “అరే వర్ధనమ్మా! నువ్విక్కడ తీరిగ్గా సీరియల్ చూస్తున్నావా అవతల గుళ్ళో నీ కూతురి పెళ్ళి అయిపోతుంటే!?” అంది. “ఉరుములు లేని వర్షం”లా ఈ వార్తేమిటి? “వాన రాకడ ప్రాణం పోకడ తెలియదం”టారే…. ఈ కాలం పెళ్ళిళ్ళు కూడా ఇంతేనా?” అని గాభరాగా లేచి భర్తతో సహా గుడికి వెళ్ళి ఆ కళ్యాణ ఘట్టాన్ని కళ్ళారా వీక్షించింది. తన కూతురి మెడలో పక్కింటి పార్వతమ్మ కొడుకు మాంగల్యం కడుతున్నారు! మరి ఊరికే అన్నారా పెద్దలు “పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతా”యనీ, “కళ్యాణమొచ్చినా …… అని!?

 

          అక్కడున్న వారందరినీ దుమ్మెత్తి పోసింది వర్ధనమ్మ. కానీ వాళ్ళంతా ఏకమై, “వర్ధనమ్మా! పిల్లవాడు మంచివాడు. గుణమే ప్రధానం.” అని నచ్చజెప్పడంతో కాస్త శాంతించింది. “పరుగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మేలు” అనుకుంది. పిల్లల్ని కనగలం గానీ వాళ్ళ రాతల్ని కనలేం”గా.. అనుకుంది. తన పెద్దరికం నిలబెట్టుకుని మర్యాదగా వధూవరులని దీవించడం తప్ప తనకిప్పుడు వేరే దారి లేదని తలచింది. అందుకే “అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు?” అని “తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు” అన్న సామెత గుర్తుకు వచ్చి దైవ నిర్ణయానికి తలవంచి నూతన వధూవరులను ఆశీర్వదించారు వర్ధనమ్మ, పరంధామయ్య గార్లు.