13_006 సాక్షాత్కారము 09

 

మాయకు లోబడి – చా వనగానే

మన మేడువదగునా?

బ్రహ్మపదార్థము మృతికి లొంగునా?

బ్రతు కొకకల అని యెఱిగిన పిమ్మట

ప్రతిదానికి మన మేడ్వవచ్చునా?

 

ప్రవాహమ్ములో పుట్టినబుడగలు

ఏక్షణమైనా టప్ మనిపోవా?’

రబ్బరుబుడిగలు పేలిపోయె నని

ప్రజ్ఞానులు శోకిస్తాఠా?

 

పూచినపూవులు రాలుచున్నవని.

చూచినవా ళ్లేడుస్తున్నారా?

లేనిది ఉన్నటు చూపించడమే

ఆపరమేశునిమ హేంద్రజాలం!

 

మాయకు లోబడి తనువే తా నని

భ్రాంతి నందుటే జీవలక్షణం!

మలమూ మూత్రము చీమూ నెత్తురు

కలిగినదేహం తోలుతిత్తి కద!

 

గాలి పోవగనె కంపుకొట్టుఈ

తోలుతితి పై మోహ మెందులకు?

మృత్యువుస్పర్శకై రాలిపోవుఈ

కుళ్లుశరీరంపై మో జెందుకు?

 

ఎన్నో బెజ్జము లున్న తనువులో

గాలి నిలుచుటే ఆశ్చర్యం!

గాలిబ్రతుకు లివి రాలిపోవడం.

కానేకా దిది ఆశ్చర్యం!!

 

బోయకు నైచ్ఛికమ్ముగనె భుక్తి గ దేహము నప్పగించెదన్

హాయిగ చావుపుట్టుకల కవ్వలితీరము చేరగాంచెదన్

డాయదు మృత్యుభీతి యిక; నాకు సపర్యల నింతకాలమున్

చేయగనోపు ప్రేయసివి; శ్రేయము నాయువు నీకు కల్గుతన్”

 

 

తే. గీ.     అనుచు కడసారిమాటలు నాడినట్టి

            మగనిదుస్థితి కెంతయు వగవు చెంది

            అతనిజ్ఞానము వైరాగ్య మరసి యెడద

            పొంగు లెత్తుకృతజ్ఞతకుం గలంగి

తే. గీ.      క్రుంగిపోవుకపోతి భూరుహమునుండి

            క్రిందికిన్ దిగి వచ్చి – అక్రందనముల

            కడవి మంచుకన్నీటితో సానుభూతి

            తెలుప నాత్మేశ్వరునితోడ పలికె నిట్లు:-

 

                                    “నీకు ద వ్వయి పోవుదానికి

                                    నాకు శ్రేయ మ్మనగ నేమి?

                                    ప్రాణమున ప్రాణమవు నీ వెడ

                                    బాయగా నా కాయు వెందుకు?

 

నీవు కృపామృతవృష్టిని

నాపై కురిపించినా

నాయెడారి బ్రతుకున అది

యింకిపోవు దయమయా!

 

                                    నీవు చేయు త్యాగమునే

                                    నేనును చేయుదును స్వామి!

                                    నీకన్నను ముందుగనే

                                    నే చేరెద పరలోకము!

 

 

నీకోసమై యెదురుచూచి

నిలుతు నౘట ప్రాణసఖా!”

 

                                    అని దుఃఖించెను సతితో

                                    అన్నది మగపావురమ్ము

                                    కలత పడినతనమనసును

                                    చెలికి తెలియనీయకుండ:-

 

“మన ముండుచెట్టుక్రిం

దనె యుండి యీబోయ

ౘలికి గడగడ వడకి

చలియించుచున్నాడు!

 

                                    అతిథిగా మనదరికి

                                    అరుదెంచునీతనికి

                                    ౘలిమంట వేసి నీ

                                    చేతనైనంతలో

 

ఆదరము చూపించి

ఆదుకొనవే సతీ!”

అన్న దాబుట్టలో

నున్న మగపావురము!

 

                                    అధిపునడుగుంజాడ

                                    ననుగమించుకపోతి

                                    పతిమాట తల దాల్చి

                                    ధృతి నంది లేచినది !

 

టెక్క లల్లార్చి నల్

దిక్కులకు చూచినది;

ఆయంధకారాన

అటుశ్మశానమ్ములో

 

                                    చండప్రచండముగ

                                    మండుచితిమంటలను

                                    గమనించి అటువైపు

                                    గా పోయి నిలిచినది!

 

తనవార లనుకొన్న

జను లెల్ల నొంటరిగ

తనకు మంట రగిల్చి

వెనుదిరిగి పోవగా

 

                                    చిట పెటధ్వనులతో

                                    చితి పైన దహన మౌ

                                    ఒక శరీరము గాంచి

                                    ఉస్సురని నిలిచినది!

                                    ఒకమాఱు తన పతిని

                                    ఉల్లమున నిలిపినది!

 

పెనుతుపానున కలత

పడుకడలిలో లేచు

కెరటాలవలె పక్షి

మనసులో నెన్నెన్నొ

భావాలు రేగినవి:

తాపాలు మూగినవి!

ఎడగ దుఃఖమును రె

ట్టింపుగా చేసినవి:

 

తే.గీ.      ‘చితిపయిన కాలి బొబ్బలై చితికి తనువు

            మంటలన్ చిటపెటలాడి మాడిపోయి

            కమురువాసన కొట్టి రూపమును బాసి

            యెఱ్ఱ నౌమంటగా మారు టెంతరోఁత!

 

తే.గీ.     కంటి కిన్నాళ్లు నింపుగా కానబడిన

            తనువు కాలి బూడిద యైనతరుణమందు

            మిగులునది యేమి తన పేరుమీద కడకు

            వికల మౌరుద్రభూమి నస్తికలుతప్ప?

 

తే.గీ.      “ఆలు నాది – సంతతి నాది- ఆస్తి నాది-

            పదవి నా” దని జీవులు భ్రాంతినంది

            మురిసిపోదురు తా మున్న మూడునాళ్లు!

            తమ దని భ్రమించుతనువైన తమది కాదు!

 

                                    అయ్యయ్యో! ఇంతేకద

                                    అందఱి బ్రతుకులు ఎప్పటి కైనా!

                                    ప్రభువైనా సేవకుడైనా

                                    ఇక్కడ అందఱు ఒకటే కాదా?

 

శ్రీమంతుడు బిచ్చగాడు

కాటికి రావలసిందే!

శ్రీమంతుడు ధీమంతుడు

చితిని మండిపోవలసిందే!

 

                                    కులమతాల భేదం లేదు!

                                    ఆడా మగ తేడా లేదు!

                                    ప్రాణ ముండినప్పు డున్న

                                    అంతస్తులతేడా లేదు!

 

తరువాయి వచ్చే సంచికలో….

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page