10_018 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-మన ‘వరాలు’

.

మా అమ్మాయి పెళ్ళి అయినప్పటి నుంచీ  దంపతులిద్దరూ నెలకోసారి “ఇదిగో వస్తున్నాం“ అంటూ ట్రాఫిక్ నెపంతో ఆలస్యంగా వచ్చి, ఇలా మొహాలు చూపించి అలా వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎప్పుడైనా “ ఏమిటో వచ్చారన్న మాటే కాని వాళ్లతో మాట్లాడినట్లే లేదు ” అని అనగానే మావారు వెంటనే “ అసలంటూ వస్తున్నారు. దానికి సంతోషించు! ” అంటూ జీవిత సత్యాన్ని గుర్తుచేస్తూ ఉంటారు ! సరేలే అని వాళ్ళ విషయంలో అడ్జస్ట్ అయిపోయాను కానీ అమ్మమ్మని అయ్యాక అడ్జస్ట్ అవటం కష్టంగా వుంది. దానికి తోడు ఎక్కడికెళ్ళినా అందరూ “ మీ మనవరాలు ఎలా ఉంది….. ఏం చేస్తోంది…… ఎవరి పోలికా ” అంటూ బోలెడు ప్రశ్నలు ! అందుకే ఎలాగైనా దాన్ని ఓ నాలుగు రోజులు మా దగ్గిర ఉంచుకునే అవకాశం కోసం ఎదురు చూడ్డం మొదలు పెట్టా.

మా అమ్మాయి కిండర్ గార్డెన్ లో ఉన్నప్పుడు ప్రతివారం దానికి చాలా ఇష్టమైన “ షో అండ్ టెల్  ” కోసం  ఇంట్లో కనిపించిన వస్తువులు అన్నీ పట్టుకెళ్తూ వుండేది!  ఓ సారి డ్రెస్సర్ మీద ఉన్న నా పెళ్ళినాటి గోల్డ్  నెక్లెస్ ని గుట్టుచప్పుడు కాకుండా బ్యాగులో వేసుకుని వెళ్ళింది! అది చేసినట్టే నేను కూడా ఈ “ బంగారాన్ని” తెచ్చేసుకుని వాళ్ళ అమ్మకు చెప్పకుండా “ షో అండ్ టెల్ “ కి తీసుకు వెళ్ళాలని నా ఉబలాటం !

ఓ మంచిరోజు చూసుకుని ఆశగా అడిగా “ పాపని నాలుగు రోజులు నాదగ్గర వదిలేయవే “ అని. మా అమ్మాయి వెంటనే ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు చూసి “ షి ఈజ్ జస్ట్ ఎ బేబీ మామ్…..షి నీడ్స్ మి “ అంటూ కళ్ళెర్ర చేసింది. కొద్ది నెలల తర్వాత మళ్ళీ అడిగితే అప్పుడు “ దాన్ని చూసుకోవడం నీకు కష్టమవుతుంది. బిసైడ్స్ యూ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఎ బేబీ “ అంటూ కేసు కొట్టిపారేసింది! చూస్తుండగానే దానికి పది నెలలు రావడం దాన్ని డే కేర్ లో జాయిన్ చెయ్యడం కూడా అయిపొయింది. ఇదే మంచి సమయం అనుకుని ఈసారి ధైర్యంగా అడిగా. మా అమ్మాయి వెంటనే తెలివిగా “ పగలు బానే ఉంటుంది కానీ, రాత్రిపూట నేను కనిపించకపోతే ఏడుస్తుంది “ అంటూ….’ అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ’ అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది! ట్రై అండ్ ట్రై…..అని ఇలా అడగ్గా అడగ్గా చివరికి ఓ రోజున “ ఓకే మామ్ యూ కెన్ హేవ్ హర్ ” అంటూ పచ్చజెండా వూపింది !

పసిపిల్ల వస్తోందని మావారు వాక్యుం క్లీనర్ తో….నేను డస్ట్ క్లాత్ తో…..ఇల్లు పైనుంచి కిందదాకా క్లీన్ చేసాం.

మా అమ్మాయి – అల్లుడు ఆజ్ఞానుసారం దానికి ఏమేం కావాలో అన్నీ కొని సిద్ధం చేసాం.

మా మనవరాలు మా దగ్గిర ఉన్న వారంరోజులు మా ఇల్లు దాని నవ్వులతో…..కేరింతలతో….అల్లరితో… దాని భాషలో అది పాడిన పాటలతో……సందడి సందడిగా గడిచిపోయింది! మధ్యమధ్యలో మా వారికీ మా మనవరాలికి పోట్లాటలు….యుద్ధాలు కూడా జరిగాయి! అది రోజు వెళ్ళే ‘ లిండా ’ ఇంట్లో బోలెడు విలువైన వస్తువులు అందుబాటులో ఉన్నా’ నీనా ’ ముట్టుకోదని మా అమ్మాయి చెప్పినప్పటి నుంచీ, ఇక్కడ కూడా దాన్ని డిసిప్లిన్ లో పెట్టాలని మావారు కంకణం కట్టుకున్నారు. “ ఆఫ్ట్రాల్ లిండా చెయ్యగా లేంది నేను చెయ్యలేనా? ” అంటూ నేను వస్తువులు జాగ్రత్త చేయబోతుంటే అడ్డుపడ్డారు. దానికి మా ఇంటికి రాగానే తెలిసిపోయింది ఇక్కడ తనదే రాజ్యం అని తనే మహారాణి అని! ఈయన ప్రతిసారి కళ్ళు పెద్దవి చేసి….. ముక్కు మీద వేలు పెట్టి….బుర్ర అటుఇటూ ఊపుతూ….నో… నో…నో . . . అంటూ క్లాసు తీసుకోవటం, అది వెంటనే నాతో పెట్టుకోకు అంటూ గబ్బర్ సింగ్ లో లాగా “ కెవ్వు కేక ” పెట్టి . . . . దాని పని అది చేసేసేది !

ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళ తాతగారిని బద్ధ శత్రువుని చూసినట్టు చూసేది.

కానీ దానికి వాళ్ళ తాత గారంటే బోలెడంత ఇష్టం ! తనకోసం శెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నారని హాస్పిటల్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ అదే హాండిల్ చేసింది. తనకు చెప్పకుండా ఎక్కడ ఆఫీసుకు తుర్రు మంటారో అని తెలివిగా తాతగారి బ్యాడ్జ్….బీపరు… వగైరా ఎక్కడో దాచేసింది. ఆ దాచేయడంలో పనిలో పని ఎందుకైనా మంచిదన్నట్టు నా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ దాచేసింది. దాని కోసం నేను వెతకని చోటులేదు.

ఉన్న వారం రోజులు అది బాస్ గా చెలామణి అవుతుంటే మేము పిల్లలం అయిపోయాం. మా అమ్మాయి ఓ రోజు పొద్దున్నే లేపి “ ఎన్నింటికి వస్తారు? తొందరగా బయలుదేరండి ….వుయి కాంట్  వైట్ టు సీ హర్.” అన్నప్పుడు గాని రియాలిటి హిట్ అవలేదు.

మా “ నీనా మాధురి “ వెళ్ళిపోగానే మా ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా అయిపొయింది. దేవాలయానికి….దసరా బొమ్మల కొలువు పేరంటాలకు……అది వేసుకున్న బుజ్జి పరికిణీలు వెనక్కి పెడుతున్నప్పుడు… మాల్ లో  మారాం చేసి కొనిపించుకుని ఇక్కడే వదిలేసిన దాని టాయి టెలిఫోన్ ని జాగ్రత్త చేస్తున్నప్పుడు…. కాబినెట్ లు తెరవగానే చిందరవందరగా ఉన్న గిన్నెలు…. వాటిల్లో ఉన్న దాని ఆట వస్తువులు చూసి, మనస్సు నా ప్రమేయం లేకుండా ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మనల్ని చుట్టుకుని . . . .  మనల్నే  అంటిపెట్టుకుని. . . మన చెయ్యి గట్టిగా పట్టుకుని . . . . మన భుజాల మీద అమాయకంగా పడుకున్న ఆ పసిడి మొహాల కోసం . . . ఆ మధుర స్మృతుల కోసం మనస్సు అప్పుడప్పుడు… ఎక్కడో ఉన్న జ్ఞాపకాల దొంతరను కదిలిస్తూ ఉంటుంది.

ఈ గడ్డమీద పుట్టి, ఏ అనుభవం లేని మన పెంపకంతో, రెండు విభిన్న సంస్కృతుల మధ్య చిక్కుకుని ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటూ పెరిగి పెద్దైన మన పిల్లలకు కలిగిన పిల్లల్ని ఎప్పుడు చూసినా, నా కనిపిస్తుంది వీళ్ళు నిజంగా మన “వరాలే” అని!!!

చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత బడికి వెళ్ళే పిల్లవాడిలాగా, పాపం మర్నాడు ఆఫీసుకు బయలుదేరిన మావారిని చూస్తే జాలేసింది! దిగాలు మొహంతో షూస్ వేసుకుంటున్న మావారు ఉన్నట్టుండి ఒక్కసారి గట్టిగా నవ్వటంతో ఏమిటా అని దగ్గరకెళ్తే “ఇదిగోనోయి నీ సెల్ ఫోన్ “ అంటూ షూ లోంచి తీసి నా చేతిలో పెట్టారు !!

– తెలుగుజ్యోతి ప్రచురణ 2012

.

మనవరాలు – నేపథ్యం

.

ఇండియాలో మన జీవన విధానంలో, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోడం, వాళ్ళకు కలిగిన పిల్లల్ని చూసుకుని మురిసిపోవడం సర్వసాధారణమైన విషయం. దీన్నే మనం ఇంగ్లీషులో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అంటూ ఉంటాం. అయితే దేశం వదిలి పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన మొదటి తరం ప్రవాసాంధ్రులకు అదే పెద్ద గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే చాలా అపురూపమైన విషయం అయిపోయింది! ఆ దేశాలు వెళ్ళి ఎంత ఆనందం అనుభవించినా, ఎన్ని విజయాలు సాధించినా అమ్మమ్మలు, నానమ్మలు తాతయ్యలు అయినప్పుడు కలిగే సంతోషం, సంతృప్తి ముందు అవన్నీ దిగదుడుపే అని అందరం, అలాగే నేనూ అనుభవం మీద తెలుసుకున్నాం! అక్కడే పుట్టి పెరిగిన పిల్లల పిల్లలను చూసినప్పుడల్లా చెప్పలేని ఆనందంతో పాటు దాని వెనకాల వాళ్ళు  ఎదుర్కొన్న సమస్యలు… పడిన ఇబ్బందులు, మేము చేసిన అవకతవకలు మనసులో మెదులుతూ ఉంటాయి! అలా వచ్చిందే ఈ “మన వరాలు” ముచ్చట!

.

*************************************************