.
కర్ణాటక సంగీతంలో తరంగాల గురించి తెలియని వారు లేరు. చాలా మంది తెలుగు వాగ్గేయకారులలాగే రామతీర్థ నారాయణస్వామి కూడా తమిళనాడులో వెళ్లి స్థిరపడటం గమనార్హం. తమిళనాడులో అలా ఏమి ఉంది, వీరంతా తెలుగునాటిని వదిలి అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు అనే ప్రశ్న మనస్సులో ఉదయించక మానదు. అప్పటికీ, ఇప్పటికీ తెలుగువారికి కర్ణాటక సంగీతం మీద మమతానురాగాలు తక్కువగా ఉండటమా, లేక తమిళనాడులో మరింత ఎక్కువ ఆదరణ లభించటమా అనే అంశాన్ని, మన అంతరాత్మను ఒకసారి కలియబెట్టి, ఆలోచించుకుని, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందనిపిస్తుంది.
తెలుగు స్మార్త బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గంగాధరం, తల్లి పర్వతమ్మగార్ల సుపుత్రుడు శ్రీ తీర్థనారాయణుడు. జయదేవుని గీత గోవిందం తో ప్రేరణను పొంది, వీరు ” శ్రీ కృష్ణ లీలాతరంగిణి ” అనే సంస్కృత గేయనాటికను రచించారు. వీరు గుంటూరు జిల్లాలోని కాజ గ్రామంలో నివసించేవారట. వీరి అసలు పేరు తల్లావర్ఝుల గోవింద శాస్త్రులు. తరువాత కాలంలో తంజావూరుకు తరలిపోయినట్లు తెలుస్తోంది. ఈ తరానికి చెందిన అందరు వాగ్గేయకారుల వలెనే వీరి జన్మ, జీవిత సమయాల గురించి కొంత చర్చ ఉంది. తీవ్ర పరిశోధనల అనంతరం, ” సరస్వతి మహల్ లైబ్రరీ వారు వీరి జన్మ, జీవితకాలం క్రీ.శ. 1650 – క్రీ.శ 1745 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు.
అతి చిన్న వయసులోనే పురాణాదులు, భాగవత పఠనం కూలంకషంగా గావించారు. జయదేవుని అష్టపదులు వీరు పదేపదే పాడుతూ ఉండేవారట. సంగీతంలోనూ, సంస్కృతంలోనూ మరియు భరతశాస్త్రములోనూ కూడా మంచి కోవిదులు. వీరికి ఉపదేశం ఇచ్చిన శివరామానంద తీర్థులను గురించి, వీరి కృష్ణ లీలా తరంగిణిలోని మొదటి తరంగం లోనే గురువుగారికి నమస్సులందిస్తారు. అపార శ్రీకృష్ణ భక్తి గల వీరు కృష్ణా జిల్లాలో ఉండే సమయంలో అక్కడ గల సంగీత విద్వాంసులకు తాము రచించిన తరంగాలను పాడటం నేర్పారట. కృష్ణ లీలా తరంగిణి భాగవతంలోని దశమ స్కంధం యొక్క సారాంశం అనవచ్చు. చిన్న వయసులోనే భక్తిమార్గాన్ని స్వీకరించి, పరివారాదులను త్యజించి కాశీకి తరలిపోయారట. అతి పిన్న వయసులోనే సంగీతాన్న, నాట్యాన్ని చక్కగా అభ్యసించారు. కాశీలో తన భక్తిమార్గాన్ని అందరికీ బోధిస్తూ ఉండేవారు.
వీరి రచనలను 34 లోకప్రియ రాగాలలో త్రిపుట, ఆది, రూపక, చాపు, ఝంపు, మఠ్య, విలంబ, ఇక మరియు అట తాళాలను వాడి గావించారు. వీరి రచనలన్నీ కూడా చక్కని పద, లయ, రాగ నిర్మితితో నృత్యానికి ఎంతో అనువుగా ఉంటాయి. సరళమైన సంస్కృత భాష వినియోగం తో వీరి గద్య, పద్యాల అందం వర్ణనాతీతం. అనుష్టప, ఆర్య, ఇంద్రవజ్ర, భుజంగప్రయదం, శార్దూలం, విక్రీడితం, వసంత తిలకం, ప్రిథ్వి వంటి 17 విభిన్న రకాల ఛందస్సు వీరి రచనల్లో కానవస్తుంది. తంజావూరు జిల్లాలోని వరగూరు లో గల ముక్తిస్థలం లో వీరికి దివ్యాశీర్వాదం లభించిందట. వరాహుర్ లో నివసించినప్పటికీ, 1745 లో దగ్గరలోనే కుడమూరుత్తి నదీతీరంలో గల పురుందుర్తి అనే గ్రామంలో ఒక మామిడి చెట్టుక్రింద గురువారం, శుక్ల అష్టమి, కృత్తికా నక్షత్ర సమయంలో “సజీవ సమాధి” పొందారట. వీరు దాదాపు డెబ్బై ఏళ్ళు జీవించి ఉండవచ్చు. భారతదేశపు సుప్రసిద్ధ శ్రీకృష్ణ భక్తాగ్రేశ్వరులలో ఈయన ఒకడు. ” బిల్వమంగళ వృత్తాంతం ” వివరించే ఒక మహా గ్రంథంలో ” బిల్వమంగళులు ” అని ఎన్నిక గన్న కృష్ణ భక్తుల ప్రసక్తి ఉంది. వారిలో కొందరు తమిళనాడులో, కొందరు కాశీలో, మరికొందరు ఒడిశాలో ఉన్నారని పేర్కొనబడింది. వీరంతా వైష్ణవులే. కాశీలో జన్మించినది పూర్వజన్మలో ” మాధవానలుడని అతడే బిల్హణుడుగా, లీలాశుకుడుగా, భక్త జయదేవునిగా, చిట్టచివరకు నారాయణ తీర్థునిగా ఉదయించి ముక్తిచెందెను ” అని వివరించబడి ఉంది. ఈ ఇతిహాసం నాటి నుంచి నేటివరకూ ప్రచారంలో ఉంది.
నారాయణ తీర్థులవారి పేరిట కావేరీ తీరంలోని పురుందుర్తి లో ఒక చిన్న స్మారక ఆలయం నిర్మించబడింది.
వీరు రచించిన పదిహేను పుస్తకాల్లో పారిజాతాపహరణం, హరిభక్తి సుధార్ణవం సంగీత నాటకాలు కూడా ఉన్నాయి. వీరి రచనలన్నీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో లభిస్తున్నాయి. కేవలం పారిజాతాపహరణం మాత్రం తంజావూర్ లోని సరస్వతి మహల్ లో దొరుకుతోంది.
ఇకపొతే కృష్ణ లీలాతరంగిణికి తెలుగు నాట ప్రత్యేక ఆదరణ ఉందనే చెప్పాలి. తరంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఇందులోని పాటలు అనేకం విజయవాడ రేడియో భక్తిరంజనిలో కీ.శే. పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పద్మశ్రీ శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు తదితరుల మధుర గాత్రాల్లో అందరికీ చిరపరిచితమే. ముఖ్యంగా ” కలయ యశోదే తవ బాలం” ఇంకా ” యేహి ముదం దేహి “, ” కృష్ణం కలయ సఖి ” పేర్కొనదగ్గవి. భానుమతి గారి ” శరణం భవ ” ఇంకా ఎన్నెన్నో.
ఇక్కడ ఒకవిషయం ప్రస్తావించటం అప్రస్తుతం కాదనుకుంటాను. 1966 లో ఆకాశవాణి అఖిలభారత సంగీత పోటీల్లో రాష్ట్రపతి అవార్డును గెలుచుకోడానికి నేను పాడిన మూడు పాటల్లో ” కృష్ణం కలయ సఖి ” ఒకటి కావటం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది.
శ్రీకృష్ణ లీలాతరంగిణి
నారాయణ తీర్థుల వారు కృష్ణ లీలాతరంగిణిని ఏవూరిలో వ్రాయటం ప్రారంభించారో, ఎక్కడ ముగించారో అనే అంశాలపై ఎటువంటి నిర్దిష్ట సమాచారం లభించటం లేదు. కానీ నాల్గవ తరంగంలో ” శ్రీ వరాహపురా వేంకటేశ ” అని ప్రస్తావించటం వలన ఇది కావేరీ తీరంలోనిదని అనుకుందామన్నా, తిరుపతి క్షేత్రానికి కూడా వరాహపురం అనే పేరుండటం వలన ఏది సరైనదో నిర్ణయించటం కష్టం.
ముందు పేర్కొన్నట్టు శ్రీ కృష్ణ లీలాతరంగిణి సంస్కృతంలో వ్రాయబడిన సంగీతరూప కావ్యం. దీనిని గానం చేసి, విని ఆనందించని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీనిలోని కవితాశైలి, పదలాలిత్యం, దరువులు, శ్లోకాలు, గద్యాలు, కీర్తనలు చూస్తే ఇది యక్షగాన వర్గంలో చేరినదని తెలుస్తుంది. శుద్ధమైన ఉచ్ఛశ్రేణి సంస్కృత భాషా పాండిత్యం లేకపోయినా తెలుగు భాష తెలిసిన వారికీ ఈ కావ్యంలోని భావాభివ్యక్తి తేలికగా బోధపడినందువలన ఇది అత్యంత ప్రాచుర్యం పొందినదనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుని లీలలను తరంగాల ద్వారా పాడటం చేత దీనికీ పేరు చక్కగా సరిపోయింది. భాగవతంలో పన్నెండు సర్గలున్నట్టే ఇందులో కూడా ఉన్నాయి. మొత్తం 153 పాటలను పన్నెండు తరంగాలు / అధ్యాయాల రూపంలో రచించారు.
అధ్యాయాలు
- కృష్ణ ప్రాదుర్భావము
- బాల లీలలు
- గోవత్స పాలనము
- కృష్ణ గోపాల వర్ణనము
- గోవర్ధనోద్ధరణము
- కృష్ణగోపీ సంగమము
- రాసక్రీడ
- రాసక్రీడ
- మధురా ప్రవేశము
- కంస నిర్హహరణము
- ద్వారకా ప్రవేశము
- రుక్మిణీ కృష్ణుల మహోత్సవం
ఒక్క విషయం ఇక్కడ తప్పక చెప్పాలి. నారాయణ తీర్థుల వారు తమ అధ్యాయాలను తరంగాలని పేర్కొన్నా, వారి గీతాలనే మనం తరంగాలుగా పేర్కొంటూ ఉండటం ఆనవాయితీ అయిపోయింది. అందుచేత ఇక ముందు తరంగం అని పేర్కొన్నప్పుడల్లా అది అధ్యాయం కాదని గమనించి ప్రార్థన. బాల లీలల సందర్భాన్ని, రాసక్రీడా విషయాల రచనలు తేలికగా, నాట్యానికి అనువుగా ఉంటాయి. ప్రతి తరంగానికీ ముందు ఒక దరువు ఉంటుంది. ఆయా తరంగాలను ఏ రాగం మరియు తాళంలో పాడాలో పేర్కొనబడింది. దీనివలన వారి సంగీత పాండిత్య పటిమ తెలియవస్తుంది. శ్రీ కృష్ణుని కేవలం పరమాత్మ స్వరూపంగా చిత్రీకరించటం వలన ఈ కావ్యంలో ఎక్కడా కాముకమైన శృంగార రసం కానరాదు. గోపికల విషయమంతా కూడా ఆత్మ పరమాత్మ సంగమం గానే వర్ణించబడినది.
వారు నాడు కావేరీ నదీతీరంలో ఏదో ఉదర సమస్యతో బాధపడుతూ తిరుపతికి ఎలాగో అలాగ వెళ్లిపోగల శక్తిని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించారట. అప్పుడు ఒక వరాహం వెంట వారిని నేటి వరాహుర్ గా మరీనా భూపతిరాజపురానికి వెళ్ళమని ఒక ఆకాశవాణి ఆదేశించిందట. అప్పటికే ఆ ఊరి ప్రజలు అక్కడికి ఒక మహాపురుషుడు రానున్నాడని ఎరుకలో ఉన్నారట. వారి సహాయంతో శ్రీ లక్ష్మీనారాయణ మరియు వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించి, కుడుమురుత్తి నదీతీరం లోనే స్థిరపడిపోయారట. ఆ విధంగా కృష్ణ లీలాతరంగిణి రచన జరిగిందని కథనం.
ఈ సంగీత రూపక కావ్యానికి నృత్యనాటికగా భారతీయ నృత్యకళాకారులు, ముఖ్యంగా కూచిపూడి కళాకారులు గత రెండు దశాబ్దాలలో చాలా ప్రాచుర్యాన్ని కలిగించారు. ఇందులో 153 తరంగాలు, 302 శ్లోకాలు మరియు 31 చూర్ణికలు ఉన్నాయి. వేదవ్యాస విరచిత భాగవత పురాణంలోని 10వ స్కందాన్ని పూర్తిగా ఇందులో వర్ణించినట్లు తోస్తుంది. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు వారు 1967 లో ప్రచురించిన ” శ్రీ కృష్ణ లీలాతరంగిణి – ఆంధ్ర తాత్పర్య సహితము ” లో ఈ 153 తో బాటు అత్యంత లోకప్రియత గాంచిన మరొక నాలుగు తరంగాలు కూడా ” ప్రక్షిప్త తరంగాలు ” గా ఈయబడ్డాయి.
- బ్రూహి ముకుందేతి
- జయ జయ వైష్ణవి దుర్గే
- మదన గోపాలతే మంగళం
- శివ శివ భవభవ శరణం
వీటిలో ” బ్రూహి ముకుందేతి ” లో ఆఖరు చరణం అయిన ” అచ్యుత కృష్ణ హరే రామేతి హరి నారాయణ తీర్థ పరేతి ” అని ఉన్నా, కీ.శే. శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తదితరులు సదాశివ బ్రహ్మేంద్ర కృతి గా పేర్కొని పాడటం గమనార్హం. దీనిని గురించి ఎవరైనా మరింత తెలియచెప్పి, సందేహ నివృత్తి చేయగలరు.
ఇతర రచనలు :
- సుబోధిని – బ్రహ్మ సూత్ర శంకర భాష్యంపై సంస్కృత గ్రంథం
- వివరణ దీపిక – సురేశ్వరాచార్యులవారి పంచీకరణ వర్తిక పై తెలుగు గ్రంథం
- పారిజాతాపహరణం – సుపరిచిత యక్షగానం తెలుగు గ్రంథం
- హరిభక్తి సుధార్ణవం
- శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్యానం
శ్రీ నారాయణ తీర్థ ట్రస్ట్, కాజ ద్వారా ఏటా ఆరాధనోత్సవాలు జరుపుతారు. గురుపూజ, ఉదయ పూజ, సహస్రనామాలు, వేద పారాయణం, తరంగాల గానం నిర్వహించబడతాయి. రాష్ట్రం లోని విభిన్న భజన బృందాలవారు ఈ తరంగాలను శ్రద్ధా భక్తిపూర్వకంగా ఆలపిస్తారు. ఈ ఉత్సవాలు ఏటా జనవరి 25 & 26 తేదీలలో నిర్వహించబడతాయి.
.
- బ్రూహి ముకుందేతి – ఎం. ఎస్. సుబ్బులక్ష్మి
2. కృష్ణం కలయసఖి – మంగళంపల్లి బాలమురళీకృష్ణ
.
3. బ్రూహి ముకుందేతి – కాళీపట్నం సీతా వసంతలక్ష్మి
మహాగాయకుల చెంత నా పాటను వేయటాన్ని పాఠకులు మన్నించాలి.