ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్రము యొక్క పరిచయము.
ఈ గ్రంథ రచయిత శ్రీ బాలాంత్రపు వేంకటరమణ. వృత్తి రీత్యా రచయిత కాదు. కానీ ప్రవృత్తి రీత్యా చేయి తిరిగిన రచయిత. ప్రత్యేకించి ప్రాచీన తెలుగు సాహిత్యం అంటే వేంకటరమణ కి వల్లమాలిన ప్రేమ. ఇంతకు ముందు అంటే 2013 లో తెలుగు అకాడెమీ వారు బాలాంత్రపు వెంకటరమణ రచించిన ” తెలుగు పద్య మధురిమలు ” అనే మహత్తర గ్రంధాన్ని ప్రచురించారు. తెలుగు పద్య విశిష్టతను ఈ గ్రంథం చక్కగా విశ్లేషించింది. ఈ గ్రంథం లోని పద్యమధురిమలు గతంలో ‘ శిరాకదంబం ’ ద్వారా పాఠకులు ఆస్వాదించారు.
ఇక ప్రస్తుతం ‘ మనుచరిత్రము – పరిచయము ‘ అన్న చక్కటి తులనాత్మక పరిశీలనా గ్రంథం రమణ కలం నుండి జాలువారింది.
పెద్దనామాత్యుని రచనలలో అగ్రతాంబూలం మనుచరిత్రకే అన్న విషయం జగద్విదితం. అటువంటి క్లిష్టతరమైన పద్య కావ్యాన్ని విశ్లేషించడం సామాన్యమయిన విషయం కాదు. ఆ పనిని తన భుజస్కంధాలపై వేసుకుని, సమర్ధవంతం గా ఆ పని నిర్వహించాడు మన రమణ.
ఇక ఈ పుస్తకానికి తొలిపలుకు గా ‘ సరససార సంగ్రహం – అన్న పేరుతో వ్రాసిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు గొప్ప సాహితీవేత్త. రమణ వ్యక్తిత్వాన్ని, సాహితీ విన్యాసవైఖరి ని చక్కగా విశ్లేషించారు దానికి కాస్త చిరు హాస్యాన్ని కూడా జోడించి.
మనుచరిత్ర వరూధిని, ప్రవరాఖ్యుల కలయిక తో అంకురార్పణ గావించుకుని క్రమేపీ స్వారోచిషమనుసంభవం గా రూపాంతరం చెందుతుంది. వరూధిని, ప్రవరాఖ్యుల సమాగమం లో శృంగారరస ప్రస్తావనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అవి రక్తికి – అనురక్తి కి ఆలంబనలు కదా !
అల్లసాని పెద్దనామాత్యుడు ఆంధ్ర కవితాపితామహునిగా వాసికెక్కాడు. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో భువనవిజయ మహామండపాన్ని అలంకరించిన అష్టదిగ్గజాలలో అగ్రతాంబూలం పెద్దనామాత్యుల వారిదే. అటువంటి పెద్దన గారి మనుచరిత్రమునకు పరిచయం వ్రాయడం ఒక సాహస కార్యమనే చెప్పాలి. ఆ సాహస కార్యాన్ని విజయవంతం గా నిర్వహించిన రమణ అభినందనీయుడు.
152 పేజీల ఈ గ్రందానికి అందమైన ముఖ చిత్ర రచన చేసిన కళాకారుడు, శ్రీ బ్నిం కూడా అభినందనీయుడు.
ఈ పుస్తకానికి సంబంధించిన కొన్ని వివరాలు :
ప్రచురణ : డిసెంబర్ 2019.
పేజీలు : 152.
ధర : 150 రూపాయలు.
ప్రాప్తి స్థానం : అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
*** ధన్యవాదాలు ***