10_010 కథావీధి – రావిశాస్త్రి రచనలు

అది ఆ సంవత్సరానికి ఆఖరి పెళ్ళి ముహూర్తాల సమయం అవడం చేత అన్ని రైళ్ళూ తొడతొక్కిడిగా ఉంటాయి. అలాంటి సమయం లో స్టేషన్ కి చేరిన బంగారి గాణ్ణి ” ఎక్కడికెడుతున్నావురా అల్లుడోడా ” అని పలకరిస్తూ దూది పులి వస్తాడు. దూదిపులి రైల్వే కూలీ. పొట్టిగా దిట్టం గా ఉంటాడు. వళ్ళొంతా తెల్లటి రోమాలు. మద్య మాంసాలమీద పెరిగిన మనిషి. దూది పులికి పాప పుణ్యాలంటేటో తెలీదు. సామాన్లు మోస్తూ ఆటిల్లో పనికొచ్చేటియుంటే ఆ ఇసయం కేటు గాళ్ళకుప్పందించి అందులోవాటా వుచ్చుకుంతాడు. దొంగలోట్ల సంచిలూ, స్మగ్లింగ్ పెట్టెలూ, పోలీసోళ్ళకి జెల్ల కొట్టి బండ్లో సీట్ల కిందెడతాడు. గూడ్సు బండి పెట్లు లూటీ సేస్తడు. ప్లాట్ఫామ్మీదొంటరిగున్న అమ్మాయిల్నెత్తుకెల్లి కంపినీల కమ్మీస్తడు.  

తిరుపతికి వెడుతున్నాననీ, ఈ పన్లన్నీ మానేద్దామనుకుంటున్నాననీ, బంగారిగాడు చెప్పగా, దూది పులవన్నీ కొట్టి పడేసి, కొంచెం దూరం గా ప్లాట్ఫాం మీద కూర్చున్న ఒక గుంపుని చూపించి ఆళ్ళందరూ తిరుపతి బండెక్కే పెళ్ళోరనీ, ఆళ్ళ మెడల మీదా, సేతుల మీదా సారల్ని గమనిస్తే ఒక్కక్కళ్ళొంటిమీదా వొంద కాసులకి తక్కువగా బంగారం వుండదనీ, పెళ్ళికెడుతున్నారు కనక తప్పకుండా బంగారం తీసుకునెడతారనీ, తాను మోసిన వాళ్ళ సంచీలలో బంగారం ఎందులో వుందో ఆనమాలు పట్టలేక పోయాననీ, బంగారి గాడు తిరుపతి వరకూ వెడుతున్నాడు కనక ప్రయత్నం చేయమనీ దొరికితే తనకో వాటా పారీయ్యమని కోరగా, బంగారిగాడు తను అలాంటి పనులు మానేస్తున్నాని చెప్పగా దూదిపులి నమ్మడు. అయిస్టంగా ” నియ్యిస్టం, నీనిసయం సెప్పాను. నువ్వు దొంగవైతే దోసుకున్న సొమ్ములో నాకో కురాకు పడెయి, దొరవైతే మొత్తం నువ్వే తినెయ్యి ” అంటూ వేరే పని మీద వెళ్ళిపోతాడు. 

కాలు పెట్టడానికి సందు లేని తిరుపతి బండి పరుపుల పెట్టెలో దూరిన బంగారిగాడు అదేపెట్టెలో ఎక్కిన పెళ్ళి వారి బృందాన్ని గమనిస్తాడు. సామాన్లు మోసుకొచ్చిన దూదిపులి ఇంకోసారి బంగారిగాణ్ణి కళ్ళతో హెచ్చరించి, బండి కదల్డం తో దిగిపోతాడు. పెళ్ళోరిలో ” కుసింత సల్లారిపోయిన పెసరట్టు ” లాంటి ఒక నల్లటి సన్నటి నడివయసు విధవరాలికి బంగారిగాడి మీద అట్రాక్సనవుతాది. జనాన్ని నెమ్మదిగా తోసుకుంటూ బంగారిగాడి దగ్గరగా చేరి ఆనుకుని నిలబడి మాటలు కలిపి, తమ చెల్లెలి గారి కూతురి పెళ్ళికి తిరుపతి వెడుతున్నామనీ, అక్కడ నాల్రోజులుంటామనీ తెలియజేసి బంగారిగాడు కూడా తిరప్తే ఒస్తున్నాడనీ తెలుసుకుని, బంగారిగాడికింకా పెళ్ళి కాలేదని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసి కొన్ని శృంగార చేష్టలు చేస్తుంది. సీటు పైన వున్న దిట్టమైన, బరువైన సజ్జ లోనుంచి ఒక సున్నుండ తీసి బంగారిగాడికిస్తుంది. అప్పటికే కనుచీకటి పడుతూ వుండడం, బండిలోని తొడతొక్కిడి, లైట్లు ఇంకా వెలగకపోవడం, రైలూ అందులో జనం చేసే శబ్దాలూ, ఎవరి హడావుడిలో వారుండడం ఇవన్నీ ఆవిడకి కలసి వస్తాయి.  

తన పాత జీవితానికి స్వస్తి చెప్పి నీతిగా బతికే దారి చూపమని అడగడానికి, దేవుడి దగ్గర కెడుతుంటే, దేవుడీ లంపటం ఎందుకు తగిలించాడో అని బంగారిగాడు ఆలోచిస్తూ వుండగా బండి బెజవాడ చేరుకుంటుంది. వరద గోదార్లా వున్న బెజోడ టేసన్లో కరెంటు లేక ప్లాట్ఫాం మీద దీపాలుండవు. జనం తోసుకుంటూ, తొక్కుకుంటూ బండెక్కుతూ వుంటారు. ఒక రాజకీయ నాయకుడు రైలెక్కుతూ వుండడం తో స్టేషన్ జిందాబాద్ డవున్ డవున్ లతో మారుమోగిపోయి రణరంగం అవుతుంది. ఆ చీకటినీ, గొడవల్నీ చూసి కంగారుపడ్డ పెళ్ళివారిలోని ఒక తింగరి ఆవిడ ” సజ్జ జేగర్తే ” అని హెచ్చరిక చేస్తుంది. ” సకెను గంటైతే అందలొక సకెన్ లో ” వైడియ తట్టిన బంగారిగోడు ఉత్తర క్షణం లో విధవరాల్ని వదిలించుకుని సున్నుండల సజ్జ చేత్తో పట్టుకుని బండి దిగి చీకట్లో కలిసిపోతాడు.  

సున్నుండలు తింటూ తన చిన్ననాటి సన్నజాజుల, కలువ పువ్వుల జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలనే ఆలోచనతో బయట పడ్డ బంగారిగాడు, సజ్జ బరువు తనను పక్కకు విసిరేస్తుండడం గమనించి ” సున్నుండల సజ్జేటి ? ఇంతబరూగుందేటిసెప్మా? ” అనాచ్చర్యపోతూ, అనుమానం వచ్చి పక్కనున్న లాడ్జీ లో గది తీసుకుని తలుపులు జాగ్రత్త గా మూసి, సజ్జ తెరిచి నిర్ఘాంతపోతాడు. సజ్జ నిండా బంగారం రకరకాల ఆభరణాల రూపం లో ఉంటుంది. ” సున్నుండల సజ్జలో బంగారం ఎడితే ఎవరికీ అనుమానం రాదనీ, ఎవరూ ముట్టుకోరనీ పెళ్ళొరి వైడియా. సున్నుండల మీద రోకున్న బంగారి గాడిలొంటాళ్ళుంటారని ఆళ్ళకి తట్నేదు. ఇక్కడుంటే పెమాదం ” అనుకున్న బంగారిగాడు నెమ్మదిగా గది ఖాళీ చేసి సజ్జతో సొంతూరికి బయల్దేరతాడు. 

అన్నలవాట్లూ మానుకుని మంచిదారి చూపించమని దేవుణ్ణి ప్రార్దిస్తే ఈ దారి ఎందుకు చూపించాడా? అని బంగారిగాడు కొంచెం ఆలోచనలో పడతాడు. దొరికిన బంగారం ఎన్నికిలోలుంటదో బంగారిగాడు అంచనా కట్టలేకపోతాడు. మొత్తంగా ఎప్పుడూ తూకం వేయించడం అతనికి కుదరలేదు.

బంగారయ్య గారి కథ –

కడవలూరి వీర వేంకట సత్యనారాయణ గారు విశాఖపట్నాన్ని నిలబెట్టే రాజకీయ, రాజకీయేతర, వ్యాపార స్తంభాలలో ఒక ముఖ్యమైన స్తంభం. నగరం అనే రంగులరాట్నానికి వారు ఒక ముఖ్యమైన ఇరుసు. ఐతే వారు ప్రత్యక్షం గా ఈ వ్యవస్థలలో పాలు పంచుకోరు, పరోక్షంగా శాసిస్తారు. వారి పేరు కడవలూరి వీర వేంకట సత్యనారాయణ అయినప్పటికీ అది ప్రభుత్వం వారి దస్త్రాలకే పరిమితం అయ్యింది. జన సముద్రానికి వారు బంగారయ్య గారు గానే పరిచయం, ఇంత సమర్ధులైన బంగారయ్య గారికి వారి మాతృభాష అయిన తెలుగు వ్యవహారికం మాట్లాడడం, అల, వల, తల వరకూ రాయడం, అలాగే అవసరానికి తగు విధంగా మాటలాడడానికి మాత్రం సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో పరిచయం వుంది. ఈ భాషలు వారు రాయలేరు. చదవలేరు. ఏ రకమైన బలహీనతలకీ లొంగని బంగారయ్య గారు తమ నడి వయసులో ఒక స్త్రీని ప్రేమించి ఆమె మరణిస్తున్న సమయం లో తాను ఆవిడకిచ్చిన మాట ప్రకారం తన సంపదనంతా ప్రభుత్వం వారి పరం చేసి, తన నేరాలను, స్వచ్చందం గా అంగీకరించి, అవసాన కాలాన్ని కారాగారం లో గడుపుతూ, తన జీవిత కథను తనకి తెలిసిన వారి ద్వారా రాయింపించి మనకి తెలియజేస్తున్నారు. 

ఒక సామాన్య ప్లీడర్ గుమస్తా గారి కొడుకైన బంగారయ్య గారి జీవితం అనేక మలుపులు తిరిగి ఒక తిరుపతి యాత్ర తో స్థిరపడుతుంది. ఆ తరవాత విశాఖపట్నం లో రూటు బస్సులు నడిపే వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయనకి, ఆ వ్యాపారం లో వచ్చే ఆదాయం లాభాలలో తనకు తక్కువ వాటా రాగా, ఖర్చులూ నష్ఠాలలో తనకే ఎక్కువ వాటా రావడాన్ని గ్రహింపుకి వచ్చి అందులోనుంచి బయటపడే అవకాశం కోసం చూస్తూ వుంటారు. ఆ తరుణం లో, మహాత్మాగాంధీ గారి శతజయంతి ని పురస్కరించుకుని, ప్రభుత్వం వారు మద్యం వ్యాపారం పైన నిషేధం ఎత్తివేయడం జరుగుతుంది. అది బంగారయ్య గారికి ఒక కలసి వచ్చిన అదృష్టం అవుతుంది. 

ఇక రెండో ఆలోచన లేకుండా బంగారయ్య గారు సారా రెంటర్ అవతారం ఎత్తుతారు, ఒక విజయవంతమైన సారా రెంటర్ కి కావలసిన అర్హతలన్నీ ఆయనలో పుష్కలం గా వుండడం చేత ఆయనకి వ్యాపారం లో ఎదురులేకపోయింది. ఆయన చిన్నతనం నుంచీ మద్యం, మగువలను దూరంగా ఉంచడం వలన ఒంటరి జీవితానికే పరిమితం అయ్యారు. మంచితనం వలన నష్టపోయిన మేనమామను మాత్రం చేరదీసారు. 

ఒకరోజు ఉదయం మేనమామ కి గుండెల్లో నొప్పిగా ఉండడం తో అతన్ని తీసుకుని ఆసుపత్రి కి వెళ్ళిన ఆయనకు అక్కడ నర్సు తనతో ప్రవర్తించిన తీరు కొంచెం వింతగా అనిపిస్తుంది. తనెవరో తెలుసుకుని కూడా తన స్థాయినీ, తన ధనాన్నీ ఆవిడ లెక్కచేయకపోవడం, తాను బల్ల మీద వొంద రూపాయల నోట్ల కట్ట పెడుతునప్పుడు దానికి కట్టిన దారం తెగిపోవడం చూసి కూడా ఆమె ఫాన్ ఆన్ చెయ్యడం, గాలి కి ఎగిరిన నోట్లను అక్కడ ప్యూన్ జాగ్రత్తగా ఎత్తి తనకిస్తున్నప్పుడు, వాటిని అతన్నే వుంచుకోమని తాను చెప్పగా ఆమె ప్యూన్ ని వారించి తిరిగి ఆ నోట్లని తనకి ఇప్పించేయడం, తరవాత అక్కడకి వచ్చిన తన స్నేహితుడైన పెద్ద కోతల వైటార్సు డాక్టర్ బంగారయ్య గారొచ్చినట్టు తనకెందుకు చెప్పలేదని ఆమెను మందలించగా ఆమె అతనికి ఇచ్చిన జవాబూ ఇవన్నీ ఆయనకి ఆమె పట్ల ఆకర్షణని కలగజేస్తాయి. 

మేనమామ కి ప్రమాదం ఏమీ లేదని తెలుసుకున్న ఆయన కాఫీ తాగడానికి బయటకి వచ్చిన సందర్భం లో, ఆయన గురించి బాగా తెలిసిన ప్యూన్ బయటకు వచ్చి, తనకి ఆయన గురించీ,ఆ నర్సు ఇయత్నాం ఇమలమ్మ గురించీ బాగా తెలుసుననీ, ఆమెకింకా పెళ్లి కాలేదనీ, నర్సమ్మ రోగం తో వొచ్చినాళ్ళకి సేవలు చేస్తదనీ, లంచం ఇచ్చినోడి మెడ కొరికేస్తదనీ…. ఆమె పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడని తాను గ్రహించాననీ, ఆమె ప్రేమను పొందాలంటే ఏమి చెయ్యాలో, ఎలా వుండాలో, ఉపదేశించి, తనకి ఇద్దరు పెళ్ళాలనీ, తాను బయట మాత్రమే హీరోననీ, ఇంట్లో పెళ్ళాలలో పెద్దావిడకి ఎంటీ వోడూ, చిన్నావిడకి అక్కినేనోడూ హీరోలనీ తెలియజేసి, అడగనిదే అమ్మయినా పెట్టదు కదా ! అన్నప్పుడు బంగారయ్యగారు అవునని అంటారు. ఇంక అడగకపోతే పేషెంట్ లంచం ఇవ్వడు కనక అడగడం తప్పుకాదు కదా! ఏతంతరు ? అని అడగ్గా తప్పు కాదేమో అని బంగారయ్యగారు అనగానే తప్పుకానిది రైటే కదా అని చెప్పి లంచం అడిగి తీసుకోవడంలో తప్పు లేదని ఆయన చేత ఒప్పించి అడిగి మరీ లంచం తీసుకుంటాడు. 

ఈ ప్యూనూ, వైటార్సు డాక్టర్ల పాత్రలు ఈ కథలో చిన్నవే అయినా రావిశాస్త్రి గారు సృష్టించిన విధానం ఆ పాత్రలని చిరకాలం పాఠకులకు జ్ఞాపకం వుండేలా చేస్తుంది. ప్యూను పాత్ర బంగారయ్యంతటి వాణ్ణి పట్టుకుని ” సిటం కింద అవుననొప్పుకుని మళ్ళిప్పుడు కాదంతవేటి? ఇందక తప్పుకాదన్నవు, అదుప్పుడు రైటు కాదేమో అంటవేటి ? తప్పుకానిది రైటే అవుతుందని నీకు తెల్డేటి ? బుర్రల మేక్కొట్టించుకున్నవేటి ? ” అంటూ జెల్లలు కొట్టడం, అలాగే వైటార్సు డాక్టరి saints are more tiresome than sinners,,,, అన్న డైలాగులూ.  

విమలమ్మ ఇల్లు వున్న ప్రాంతపు వార్డ్ కౌన్సిలర్ సీత్రాం ఒకప్పడు బంగారయ్య గారి అనుచరుడు. అప్పట్లో సత్తరకాయి గా చెలామణీ అయిన అతను అనంతరం సారా ట్యూబ్లూ, చిలకల వ్యాపారాలూ చేసి ఆస్తులూ, ప్రాపకాలూ సంపాదించి ఆ తరవాత చిలకల లాడ్జీ ని మర్యాద లాడ్జీ గా మార్చేసి కులం బలం తో వార్డ్ కవున్సిలర్ అవతారం ఎత్తి నగరాన్ని నిలబెట్టే స్తంభాలలో ఒక చిన్న స్థంభం గా మారాడు. విమల గురించి అతన్ని బంగారయ్య గారు విచారించినప్పుడు అతను విమలమ్మ ” గవర్మెటాసపత్రిలో నర్సు పని చేస్తదనీ, రోగాల్తో వచ్చిలోల్లకి రాత్రీ పగలూ సేవలు చెస్తదనీ, లంచవడిగినోడి మెడ కొరికేస్తదనీ… గొల్లీధిలో ఒంటరిగుంటుందనీ మూగి పిల్లను పెంచుకుంటుందనీ, పెళ్ళి చేసుకోడానికొచ్చిన ఆడంగోడి మెళ్ళో తాళి కట్టిందనీ, ఆమె మంచిసెడ్డలు కనుక్కోడానికి కనకారాజనే పోస్ట్‌మానున్నాడనీ ” వివరించి ” ఎందుకడినావేటి ” ? అని అడిగి విషయం తెలుసుకుని అన్యాయపు సంపాదనాపరులని ఆమె పెంటమీదీగల్ని సూసినట్టు సూస్దనీ, బంగారయ్య అక్రమ సంపాదనాపరుడైనా అతని రుదయం మంచిదనీ అతను పాత హిందీ కిస్మత్ సినిమాలో అసోక్కుమార్ లాంటోడనీ తెలియజేసి ” అయ్యమ్మికేమీ హానీ అపకారం సెయ్యనని బంగారయ్య ఒప్పుకుంటే తాను సాయం చెస్తానని కండిషన్ పెట్టి అలా మాటుచ్చుకుని అతను సాయం చేస్తాడు. కనకరాజు పోస్ట్‌మాన్ కి వున్న ఇబ్బందులని బంగారయ్య పరిష్కరించి అతని అభిమానాన్ని చూరగొని, విమలమ్మని చేరడానికి అతను అడ్డుపడకుండానూ, పైగా సహాయపడేలానూ చేసుకుంటాడు. 

************************