11_012 చేతికొచ్చిన పుస్తకం

చేతికొచ్చిన పుస్తకం-1:

    ఆదూరి సత్యవతీ దేవి  (1948-2008) కవిత్వాన్ని 1997 ప్రాంతంలో ‘ఆహ్వానం’ పత్రిక కోసం సమీక్ష చేశాను. తర్వాత విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో పనిచేసే కాలంలో ఆ దంపతులను మా ఆఫీసులోనే సాహిత్యకారణాలతో పలుసార్లు కలిశాను.

      సత్యవతి దేవి గారి కవితల ఆంగ్ల అనువాదాన్ని సాహిత్య అకాడమీ ఈ సంవత్సరమే ప్రచురించింది. 1982 నుంచి ఆమె రాసిన ఓ యాభై కవితలను కె. దామోదర రావు ఆంగ్లంలోకి  అనువాదించడమే కాక, ఈ సంపుటికి సంపాదకత్వం కూడా వహించారు!

     ఆదూరి సీతారామమూర్తికి ఆనందం కలిగించే సత్కార్యమిది!! అందంగా, స్లీక్ గా కనబడే ఈ 92 పుటల పుస్తకం వెల 125 రూ.

 

చేతికొచ్చిన పుస్తకం-2:

చాలా కాలం క్రితం ఫేస్బుక్ లో పరిచయమైన శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారిని ఇటీవలే హైదరాబాద్లో కలిశాం.

        సరళంగా కనిపించే జీవితాల్లోని సంక్లిష్టతలను హాయిగా, ఆలోచనాత్మకంగా సాగిన 17 కథల సంపుటి ‘సంగమం‘. 2021 జూన్ లో అమరావతి పబ్లికేషన్స్ వెలువరించిన 128 పేజీల పుస్తకానికి పి సత్యవతి, వాడ్రేవు వీరలక్ష్మి ముందుమాటలు రాశారు.

         పరిశీలన తో రచయిత్రి లలిత గోటేటి అలవోకగా రాసింది సోషియాలజీ, సైకాలజీ వెరసి జీవనవేదాంతం!!

 

చేతికొచ్చిన పుస్తకం-3:

   తెలుగులో అసలైన కవి ( తిలక్ అనబడే ) దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921 ఆగస్టు 1- 1966 జూన్ 30) శతజయంతి సంవత్సరం ముగింపు వేళ వెలువడిన విలువైన మూడు వందల పైచిలుకు పుటల గ్రంథం ‘ రసగంగాధర తిలకం‘!

          తెలుగులో వీరగాథల పరిశోధకుడిగా ఎంతోకాలంగానూ, వ్యక్తిగతంగా రెండు దశాబ్దాలకు పైబడి నాకు తెలిసిన బెంగళూరు నివాసి, సాహితీ సహవాసి అయిన డా తంగిరాల వెంకట సుబ్బారావు,  తిలక్ తో తనకున్న ఆరున్నర దశాబ్దాల అనుబంధపు పరిమళంతో వెలువరించిన ఈ సంపుటి అనే డాక్యుమెంట్ లో ‘అభిరుచులు- అలవాట్లు’ అనే 80 పేజీల వ్యాసం కడు విలువైంది. నలభై పేజీల రంగుల ఫోటోలు సారస్వత ప్రియులకు ఘనమైన విందు.

        మూడు వందల రూపాయల విలువ గల ఈ నివాళి గ్రంథం తిలక్ మీద వచ్చిన కొన్ని విలువైన గ్రంథాలలో రసతిలకమే! ఈ గ్రంథం అన్ని ప్రధాన పుస్తకాల షాపుల్లో దొరుకుతున్నది. 

      ఎక్కువ మాటలు వద్దు, కానీ విషయసూచికకు ఇచ్చిన శీర్షిక ( వెన్నెల-కన్నెలు-నెమలి కన్నులు) చాలు డా తంగిరాల వారు ఏస్థాయిలో, ఎంత అర్థవంతంగా కృషి చేశారో తెలుసుకోవడానికి!

 

చేతికొచ్చిన పుస్తకం-4:

              ఫేస్ బుక్ ద్వారా ఏడెనిమిదేళ్ళ క్రితం పరిచయం అయిన కొమ్ము రజిత ఏమి రాస్తారో, ఎలా రాస్తారో జాగ్రత్త గా గమనించాను కనుక ‘దళిత్ డైరీస్‘  బుక్ రావడం ఆనందాన్ని కలిగిస్తున్నది.

                ఈ వ్యాసాలన్నీ దాదాపుగా చదినవే అయినా సంకలనంగా వస్తే రెఫరెన్స్ పరంగా వాటి విలువ ఇంకొంత పెరుగుతుంది. చంద్రభాను ప్రసాద్ వ్యాసాలు అనువాదమై ‘వార్త’ దినపత్రికలో దశాబ్దం క్రితం ప్రచురణ అయినప్పుడు కలిగిన సంచలనం ఎంతో మనకు తెలుసు.

                పాతికమంది విజేతల గాథలు సంక్షిప్తంగా – కొండను చూపే అద్దంలా – స్ఫూర్తి కల్గిస్తాయి. అన్వీక్షికి పబ్లిషర్స్ 2021లో వెలువరించిన 112 అందమైన పుస్తకం రజితకు మంచి పేరు తేవడమే కాకుండా దీనిని మరింత విస్తృత పరుస్తూనే ముందు ముందు మరింత శ్రమించేలా పురిగొలుఫుతుంది!

                 ఇటీవలే హైదరాబాద్ బుక్ ఫేర్ లో నవోదయ బుక్ హౌస్ స్టాల్ లో ఈ పుస్తకం కొన్నాను. తెలుగు రచనల బేస్ ను విస్తృత పరిచే ఇలాంటి రచనలు మరిన్ని రావాలి!

 

చేతికొచ్చిన పుస్తకం – 5:

  ‘జగమునేలిన తెలుగు‘ అనే పేరును ఓ సీరియల్ నవలకు ‘అమ్మనుడి’ మాసపత్రికలో కొంత కాలం క్రితం తొలిసారి చూసినప్పుడు, నిజం చెప్పాలంటే పులకలొచ్చాయి. రచయిత్రి డి. పి. అనూరాధ ఎవరని ఆనందంతో కూడిన ఆసక్తి కలిగింది.

      గోదావరి నుంచి జావా దాకా… చరిత్ర లోకి అన్వేషణ చేసే నవల ఉజ్వలంగా సాగి ఇటీవలే ముగిసింది, పిమ్మట ఈ అక్టోబర్ లో తెలుగు జాతి ట్రస్టు పుస్తకం రూపంలో ప్రచురించింది. వెల: 200 రూపాయలు.

          రచయిత్రి అనూరాధ ఫోటోను చూస్తే, తర్వాత వివరాల్లోకి వెడితే తాను పూర్వాశ్రమంలో న్యూస్ టెలివిజన్ జర్నలిస్టు అని బోధపడింది. ఇప్పుడు తాజాగా తాపీ ధర్మారావు జనమాధ్యమాల అవార్డు గ్రహీతగా 2021 డిసెంబర్ లో మారింది. ఈ (తొలి) అవార్డు  నాకు 2009లో లభించింది.

             నవలావిజయాన్ని అనుభవిస్తున్న చెల్లాయి రచయిత్రికి అభినందనలు. ముందు ముందు వివరంగా చదివి విశ్లేషణ రాయాలి. ఇవి కేవలం ముందస్తు మాటలు మాత్రమే.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾