.
రోగిష్ఠి సంబంధం (హాస్య నాటిక)
.
రోగిష్ఠి వారింట్లో సీన్
భార్య : ఏమండీ ! మనమ్మాయిని చూస్తున్నారా? థర్మామీటర్ లో టెంపరేచర్ లాగా పెరిగిపోతోంది! దానికి పెళ్ళి చేసే ఐడియా ఏమన్నా ఉందా లేదా మీకు!?
భర్త : లేకేం? ఉంది కానీ మంచి సంబంధం రావద్దూ?
భార్య : వెతికితే వస్తుందా? వెతక్కండానే వస్తుందా? అదేదో పెళ్లిళ్లు చేసే సంస్థలు గట్రా ఉన్నాయిగా. వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగి తెలుసుకోండి. లేకపోతే ఆ సంబంధాల సోమనాథాన్ని పిలవండి. అసలే మనమ్మాయి మెర్క్యూరీకి ముక్కుమీదే కోపం! ఏ సంబంధం ఎస్ అంటుందో ఏమో!
( ఇంతలో సంబంధాల సోమనాధం రానేవచ్చాడు.)
ఇద్దరూ : రండి రండి! నమస్కారం. నూరేళ్ళు మీకు! నమస్కారం!
స.సో : ఆఁ… ఈ కరోనా టైమ్ లో నూరేళ్ళెందుకులే అమ్మా! మంచి రోగిష్ఠి సంబంధాలు తెచ్చాను. చూపించమంటారా!
భా.భ : ఆ, ఆఁ! చూపించండి!
స.సో : ఈ పిల్లవాడి ఫోటో చూడండి. ఇంటిపేరు దోమలవారు. ఎలా ఉన్నాడు పిల్లాడు?
భా.భ : చూస్తేనే లో బీపీ ఫేస్ వాడునూ! ఏం బాగా లేడు Next..
స.సో : ఈ ఫోటో చూడండి. ఇంటి పేరు Dengue. ఒక కొడుకు, ఒక కూతురు! పిల్లాడికి కూడా ఇంటి పేరు పెట్టారు!
భా.భ : అదేమిటీ ! ఎందుకు పెట్టారు ఆ పేరు! వింటేనే బెంగగా ఉంది!
స.సో : ఆఁ, మరేం లేదు. వరుసగా పిల్లలు పుట్టి పోతుంటే వీడైనా బ్రతకాలని Dengue వ్రతం చేసి వాడికి ఆ పేరే పెట్టారు!
భార్య : పిల్లవాడు ఫోటోలోనే ఇంత anemic గా ఉంటే ఇంక తర్వాత tonic లకే సరిపోతుంది సంపాదనంతా! వద్దు లేండి.
స.సో : అయితే ఈ Jaundice వారి సంబంధం చూడండి. అందగాడు. ఆస్తిపరుడు! అమ్మాయి సుఖపడుతుంది! కానీ….
భార్య : కానీ ఏమిటండీ!
స.సో : పిల్లవాడికి వేపకాయంత వెఱ్ఱి అనుమానముందట. అన్నిటికీ అనుమానాలూ, సందేహాలట.
భార్య : చాలా మంచి పని చేశారు! ముందే చెప్పి రేపు మా అమ్మాయి సరదాగా నీలి రంగు చీర కట్టినా “నీలి రంగు చీర కట్టావ్ ఎవరి కోసము” అని రాచి రంపాన పెడతాడు!
స.సో : అయితే ఈ సంబంధం చూడండి. మలేరియా వారు. వారికి ఒక్కడే కొడుకు. ఇంటి నిండా దోమలు. అవి ఇప్పటికే 10,000 మందిని పొట్టన పెట్టుకున్నాయని, ఇంకో 5,000 మంది రెడీగా ఉన్నారనీ ఇరుగు – పొరుగు వాళ్ళు చెప్పగా విన్నాను!
భార్య : అయ్యా! మా అమ్మాయికి ఏ Mr.India నో, Mr. Worldనో తేవాలి గానీ ఇలాంటి సంబంధం ఏమిటండీ బాబూ!
స.సో : ఏంభయంలేదమ్మా, వాళ్ళు దోమల్ని పెంచుకుంటున్నారు. ఆ దోమలు బయట వాళ్లనే గానీ, ఇంట్లో వాళ్లని కుట్టవు ! నాదీ గ్యారెంటీ. లేకపోతే పిల్లాడు ఇంకా ఎట్లా ఇప్పటి దాకా బ్రతికున్నాడు? వాళ్లకి, కట్నాలు వద్దట. Hit, Musquito bats కట్నం క్రింద ఇస్తే చాలట!
భార్య : ఏడిసినట్టే ఉంది? అదేమైనా Badminton బ్యాటా.. style గా పట్టుకుని ఇంట్లో తిరగడానికి! Bat దోమకి బదులు తలకి తగుల్తూ రోజూ ఎందుకొచ్చిన గోల!
భర్త : అబ్బా! పంతులుగారూ ఈ Nonveg సంబంధాలు ఆపి మంచి Veg సంబంధం చెప్పండి.
స.సో : సరే అయితే! ఈ carrot వారి అబ్బాయిని చూడండి! ఎంత బాగున్నాడో నిగనిగలాడుతూ.
భార్య : తెచ్చావులేవయ్య మా గొప్ప సంబంధం! మా అమ్మాయికి carrot అంటేనే అలర్జీ.
స.సో : సరే అయితే ఈ beet root వారి అబ్బాయిని ఖాయం చెయ్యండి!
భార్య : అసలు మా అమ్మాయి రూటే వేరండీ! ఆ రంగు చూస్తేనే దానికి నచ్చదు! పైగా “సాంబార్ సరుకా” అని తీసిపారేస్తుంది!
స.సో : అమ్మా ఇక మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వెదకడం నా వల్ల కాదు! ఒక్క పని చెయ్యండి! ఈ ఊర్లో ఎవరో “కరోనా” వారట మీ వీధిలోనే దిగారు! వెళ్ళి చూసుకోండి. వారికి ఒకబ్బాయి, ఒక అమ్మాయి. అందరు ఆ సంబంధం కోసం క్యూలో నిల్చుంటున్నారట. మీరు కూడా ట్రై చేస్కోండి. మీ అంతట మీరే! వెళ్లొస్తానండి! బ్రతికుంటే మళ్లీ కలుస్తాను!
.
***********************