13_004 సాక్షాత్కారము 07

 

తే. గీ.     రాతిరి కబుర్లతోడ కాలమ్ము గడువ

            మనసున అ దొక్కలా గయి మగనితోడ

            మేతకై పోవనేరక మేను డస్సి

            ఒంటిగ కపోతి గూటిలో నుండిపోయె !

 

            ఒక మహాశివభక్తు డౌఋషి

            ఒక బలీయం బైనవెనుకటి

            కర్మశేషము ననుభవించుట

            కై కిరాతుడుగా జనించెను !

 

కం.        “ శివ ! ” అని ఆఘ్రాణించును

            “ శివ ! ” అని భాషించు నంటు “ శివ ! ” అని మెసవున్

            “ శివ ! శివ ! ” అని వేటాడును

            శివభక్తుడు కర్మవశముచే నిటు లయ్యెన్ !

 

తే. గీ.     అడవి కొంటరిగా మేత కరుగుదెంచి

            దక్కినది బొక్కి గూటికి తరలివచ్చు

            వేళ ధాన్యపుగింజలు రాలి యున్న

            నేలకున్ దిగి – ఉచ్చులన్ జిక్కువడుచు

            నిట్టటున్ కొట్టుకొని పైకి ఎగురలేక

            వా విడిచి యేడ్చినది మగపావురమ్ము ;

 

“ ఉచ్చులు చూచుకోక ఎవరో యిట ౘల్లినవడ్లగింౙలన్

మ్రుచ్చిలిపోవ నెంచి అటు పోయెడువాఁడ నధోముఖమ్ముగా

ఇౘ్చట వచ్చి వ్రాలితిని : ఈవలలో పడి గింజు లాడెదన్ ;

నెచ్చెలి గూట నొంటరిగ నెవ్వగ నాకయి యెంత యెద్చునో !

 

తే. గీ.     అబలయును నేను కలసెడునాశ లేదు !

            చావు తప్పించుకొనెడుఆశయును లేదు !

            బ్రతుకుపై ఆశ యింక అవంత లేదు !

            ఈజగమె మిథ్య – జీవిత మెల్ల మిథ్య !

 

తే. గీ.     అకట ! కష్టార్జితము కానియట్టితిండి

            కాశపడువారిగతి యెప్పుడైన నింతె !

            గింౙలనె చూచితిని కాని – ఖేద మొదవ

            నన్ను బంధించునుచ్చులన్ గాంచినానె ?

 

తే. గీ.   తనకు బలవంతపుంజావు తప్ప దనుచు

            ముందె తెలిసినఆప్రాణి పొందుబాధ

            వర్ణనాతీత మది నేను బడయుచుంటి ;

            సహజమరణముకన్న దుస్సహమె అద్ది !

 

            తే. గీ.   పంచప్రాణాలమూలమున్ పట్టి లాగు

                        మరణవేదన మిగుల దుర్భరము కాన

                        తమ కనాయాసమరణమున్ దైన్యరహిత

                        జీవనము యోగులైనను దేవు నడుగు

                        చుందు రట ! యీస్థితిన్ కుందుచుండి అకట !

                        యెవరి నేమని కోరెద నింక నేను ? ”

 

*********

            గొలుగొలున నేడ్చుపక్షుల

               జాలి లేనికిరాతకుడు తన

               బుట్టలోనికి గెంటి యింటికి

               పోవనెంచెడునంతలో

 

               పరమశివుడు కల్పించినపరీక్షగా హఠాత్తుగా

               కారడవిని వేసవిలో గాలివాన వచ్చిపడెను !

               ప్రళయభీకరమహార్భటులతో చెలరేగి

               కాఱుమబ్బులగములు గగనాల కెగబ్రాకే !

 

                           ప్రాణప్రయాణవేళన్ భయంకరుడుగా

                           కన్పట్టుయము డనగ కటికచీకటి తోచె !

 

               తన కెట్టిఅపకృతిన్ తలపోయనిఅమాయ

               కపుపిట్టలకు యముడుగా తోచుఆబోయ

 

                           కాలు కాలినపిల్లి కరణి స్థైర్యము లేక

                           ప్రాణభయమున నటవి పరువు లెత్తగసాగె !

 

               కార్మొయిళ్ళు ధణేల్ ధణేల్ మని

               ఉఱుము లుఱుముచు పిడుగు లొఱయగ

 

                           గౙగజాగౙ వణకిపోవుచు

                           ధణధణాధణ గుండె లదరగ

 

               కాఱుచీకటిగముల కనగానె మృత్యుదే

               వతను చూచినయట్లు వణకెను కిరాతకుడు !

 

                           శంపాలతలు వెల్గుసమయాన వేగముగ

                           పరువులెత్తుచు ఇరులు భయదమౌనపు డాగి

 

               పిట్ట లుండినబుట్ట గట్టిగా పట్టుకొని

               కట్టిడికిరాతకుడు చెట్టుక్రిందికి చేరె !

 

                           కిరాతకునివలలో పడి

                           బుట్టలోన కలపక్షుల

                           కెడదనిండ వైరాగ్యమె

                           ఇక భీతికి తా వెక్కడ ?

 

               చావు ముంచుకొని వచ్చిన

               జీవుల కిక భయ మెక్కడ ?

               నిరాశ నిండినదీనుల

               నిట్టూర్పుల కం తెక్కడ ?

 

               అంతలో వాన ఒక్కింత వెలసిన టయ్యె !

               ఇంతలో చిఱువెలుగు లంతటను ప్రసరించె !

 

  తే. గీ.    పక్షులను పెట్టుబుట్టతో వచ్చినట్టి

               క్రూరునిన్ జూచి ఆచటిశకుంతగణము

               లలబలము లేక తరులందు నణగిమణగి

               యుండ గొం తెత్తి యేడ్చిన దొకకపోతి !

 

   ఉ.         “ ఒంటరిదాన నై యిౘట నుంటిని ; రాతిరి ప్రొద్దుపోయె ; నీ

               ౙ౦టను నాకు ద వ్వయి నిశాసమయమ్మున దారి తప్పితో

               కంటికి కూర్కురా – దొక యుగమ్ముగ తోచు క్షణమ్ము నా కిటన్

               ఇంటను నావలెన్ – బయట నీవును నెంతగ కుందు చుంటివో ?               

           

తే. గీ.   జీవితేశ్వర : వయసు వచ్చినదిమొదలు

            ఒక్కప్రొద్దు నేకాకి నై యుండలేదు –

            నీసుధామధురోక్తులన్ నీవు చెప్పు

            కతల నీకూర్మి తేలియాడితిని గాని !

 

తే. గీ.   దెయ్యముం బోలుచీకటి తీవరి ప

            వెడగుచలిగాలి వణకించువేళలోన

                        నీప్రగాఢపరిష్వంగనియతి దొరగి

                        ఇంతచలిబాధ కొంటిమై నెట్టు లోర్తు ?

 

                                    ఈయొంటరిబ్రతుకు దైన్య

                                    మెవరికి చెప్పుకొనేదీ ?

                                    నీవు తోడు లేకుండగ

                                    నే నెలాగు బ్రతికేదీ ?

 

            తే. గీ.   నల్ల నౌబూచి యెదో వచ్చి నన్ను నిన్ను

                        వే ఱొనర్చినయ ట్లొకపీడకలను

                        కాంచి నిన్నటిరే యెల్ల కలత జెంది

                        గోలుగోలున నేడ్చితిన్ గుర్తు లేదె ?

 

            తే. గీ.   అపుడు నను ఱెక్కలం గప్పి అదిమిపట్టి

                        “ శీతకాలపుకలలకు చింత వలదు ;

                        ప్రేయసీ ! నన్ను నీకౌగలింతనుండి

                        ద వ్వొనర్చుట దేవునితరము కాదు !

                        చింతలకు ” మని ధైర్యము చెప్పినావు !

 

            తే. గీ.  “ ప్రణయనీ ! చావునందును బ్రతుకునందు

                        మనము వే ఱౌట జరగనిమాట ” అనుచు

                        నీవు ధైర్యము చెప్పి కన్నీరు తుడిచి

                        ముద్దుపై ముద్దు – ముద్దుపై ముద్దు లిడితి !

 

తరువాయి వచ్చే సంచికలో….

***************************

 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page