10_003 ద్విభాషితాలు – అధ్యాపకుని గది కిటికీ

ఊరికి దూరంగా…

పంటచేనుకు దగ్గరగా..

నా కళాశాల!

కళ్ళలో నింపుకోవడానికి …

ఓ వెండి తెరలా…

నా తరగతి గది కిటికీ!

కుర్చీలో కూర్చొని…

ఊచలగుండా…

బయటకు చూస్తే…

పైరుకు …కిటికీ మధ్య…

ధ్యానంలో యోగినిలా…

తోట!

శీతల ఉషోదయాగమనంలో….

చెట్లకొమ్మల మధ్య నుంచి ….

ఖండికలుగా ఆకాశం.

ప్రగాఢ ప్రేమికుల పరిష్వంగంలా…

ఆకులమధ్యనుంచి చొచ్చుకొచ్చే…

కాంతిపుంజాలతో కలిసిన… పొగమంచు!

మధ్యాహ్నవిశ్రాంతికి…

ఆలంబనగా…

కిటికీ అందించే వెచ్చదనం!

మానుమీదుగా …కొమ్మపైకి…

ఒకదాని వెనుక  ఒకటి వెంటపడుతూ…

సరస సల్లాపాలలో…

రెండు ఉడుతలు!

సంధ్యవేళ…కిటికీ బయట దృశ్యం …

సుందర సజీవ ఛాయాచిత్రం!

విహారవిన్యాసాలు ముగించుకుని..

కొమ్మలపైకి చేరి….

పాడుకొనే పక్షులు.

పడమటి నీరెండలో..

గడ్డివాము ప్రక్కన…

అర్థనిమీలత నేత్రాలతో…

దీర్ఘాలోచనలో ములిగిన..

ఒక ఆవు.

తల్లి పొదుగు చేరే లేగదూడ.

ఆ వెనుకే…

చిన్న ఇత్తడి బిందెలోకి జారే …

క్షీర ధారలు!

నిత్య నయనానందానుభవం …

నా తరగతి గది కిటికీ!

నా సృజనకు జీవం పోస్తుంది.

నా భాషాశాస్త్రవాక్ప్రవాహాన్ని…

పరుగులుపెట్టిస్తుంది.

నా ముందు కూర్చొన్న…

రేపటి దేశానికి…

సౌందర్యస్వప్నమార్గమవుతుంది!

****************