10_016 తెలుగు ఉగాది వెలుగు

.

*మన తెలుగు మన భాష

మన ఆశ మన శ్వాస*

అచ్చతెలుగూ భాష ముచ్చటైనా యాస

పద్యగద్యాలల్లొ పరిమళించిన భాష

.

ఉగ్గుపాలల్లోన మొగ్గతొడిగిన భాష

జోలపాటలతోటి ఊయలూపిన భాష

తీపి తేనెల భాష ప్రేమ పంచిన భాష

ఊపిరై మన వెంట నడిచి వచ్చే భాష

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస !!2!!

.

వెన్న మీగడలంత కమ్మనిది ఈ భాష

గడ్డపెరుగుల వోలె రుచిరమైనా భాష

మిన్నుమన్నుల్లోన మెరయునీ భాష          

మిన్నయవు మన భాష మమతలకు బాస

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

ఆటపాటల్లోన అలరారు పలుకుల్లొ

కూనిరాగాలల్లో కునికిపాట్లల్లో

అలుకల్లో కినుకల్లో గిల్లికజ్జాలల్లొ

కిలకిలా నవ్వుల్లో గిలిగింత మన భాష

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

శతక పద్యమలతోడ మకుటమైనా భాష

కూచిపూడి నాట్య కానుకే మన భాష

జాన తెనుగూ భాష జాతి రత్నపు భాష

కళలకాణాచిగ వాసికెక్కిన భాష

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

నన్నయ్య తిక్కన్న ఎఱ్ఱన్న తెలుగు

పోతన్న వేమన్న బద్దెనల వెలుగు

త్యాగయ్య వరదయ్య అన్నమయ్యలతో

పదకవిత పలికించు రాగాలు తెలుగు

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

ముంగిళ్ల ముగ్గులా మురిపాలు తెలుగు

ఆడపడుచులు ఆడు గొబ్బిళ్ల తెలుగు

సంక్రాంతి పండుగల సంబరాలా తెలుగు

ఆరురుచులతొ ఊరించు యుగాది తెలుగు

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

కుడుములుండ్రాలల్లో గారెబూరెల్లో

లడ్డూలు అరిసెల్లో పంచభక్ష్యాలల్లో

పంచకట్టుల్లోను పట్టుబట్టల్లోను

తరతరాలా సాగు సంప్రదాయాలల్లో

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

వజ్రంపు తళుకుల ధగధగల తెలుగు

పాపాయి అడుగుల పసిడి కాంతుల జిలుగు

రుద్రమ్మ శౌర్యము, పలనాటి రాజ్యము

రాయలా వైభవము వర్ణింప ఎన్నెన్నో

మన తెలుగు మన భాష మన ఆశ మన శ్వాస  !!2!!

.

**************************************************

.

— G. Padmakala

.

__________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

__________________________________________________