10_021 పాలంగి కథలు – నాటి సుధాప్రాయపు రోజులు

.

చుట్టూ పచ్చని చేలమధ్య ఊరికి కాస్త దూరంగా శివాలయం. శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగే ఉంటుంది. గర్భగుడి చిన్నగా ఉండి ఎప్పుడూ నీళ్లలో ఉంటుంది. పక్కనే చక్కని కోనేరు. ఆ నీరే తూముల ద్వారా  గుళ్లో లింగాన్ని మునిగి ఉండేలా చేస్తుంది. ఆ కోనేటిలో నీరు పూర్తిగా ఎండిపోవడం అంటూ జరగదట. ఆ లింగం రావణబ్రహ్మను చంపిన పాపం పోగొట్టుకోడానికి రాములవారు ప్రతిష్టించినదట. పెద నాయనమ్మ ఆ కథలన్నీ చెబుతూ ఉండేది. పట్టె మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చి మనసు గతంలోకి వెళ్లిపోయింది.

……

వేసవి సెలవులు వస్తే చాలు…ఎంత సందడిగా ఉండేదో. విశాఖపట్నం నుంచి పెదతాతగారి మనవలు కిషోరూ, రామూ, శైలూ, మధూలు వచ్చేవారు. ముంగండ నుంచి బాబీ, సూరి, సుభద్ర… మద్రాసు నుంచి రమణ, విజ్జీ వాళ్లు…విశాఖ నుంచి ఇందిర, పూర్ణ వాళ్లు…ఇహ మా ఇంటి జనాభా…చెప్పాలీ! ఓహ్‌… భలే సరదాగా ఉండేది. అందరం ఇంచుమించు ఓ పాతికమందికి తక్కువ కాకుండా చేరేవాళ్లం. పట్నాలనుంచి వచ్చినవాళ్లందరికీ పొలాల్లో తిరగడమంటే బోలెడు సరదా. అందరినీ మా ఇంటికీ గుడికీ మధ్యలో ఉన్న మా పొలం తీసుకెళ్లే వాళ్లం. ముంజికాయలు, కొబ్బరిబొండాలు పాలేరును చెట్టెక్కి దింపమంటే, వాడు గోల–‘ అబ్బాయి గారు మీ నాన్నమ్మగారికి తెలిస్తే నన్ను చంపేత్తారండి బాబూ. ఏకంగా గెలలకి గెలలు ఇలా దింపించేత్తారు మీరు ’ అంటూ. ‘ ఏం కాదులేరా, ఫర్వాలేదు ’ అంటూ ‘ ఎవరూ పొలంలో విషయాలు ఇంటి దగ్గర మాట్లాడకూడదు ’ అంటూ ఒట్లు వేయించేది అందరిచేతా అక్క. గప్‌చిప్‌! చెప్పొద్దూ, మా తాతగారు పొలంలో మా కోతి మూక చేసే అల్లరి చూసినా చూడనట్లు వెళ్లిపోయేవారు. బహుశా ‘ సంవత్సరానికోసారి సెలవుల్లోనే కదా పాపం పిల్లలకి ఈ ఆటవిడుపు ’ అని కాబోలు. ముంజికాయలు బొటన వేలితో గుచ్చి ఎలా తినాలో(ఎలా జుర్రాలో) నేర్పేవాడు బాబీ అందరికీ. చాలా తమాషాగా ఉండేది వాళ్లందరికీ.

.

జామచెట్టెక్కి చకచకా నేనూ, సూరి, బాబీ కాయలు కోసి కిందకు విసురుతుంటే పట్నం నుంచి వచ్చిన మా కిషోరూ, రమణా వాళ్లూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్లు. చెప్పొద్దూ, మాకు చాలా గర్వంగా ఉండేది.

.

ఈత ఎప్పుడు మొదలుపెట్టి నేర్చుకున్నానో నాకే గుర్తులేదు. ఊరి చెర్లో కామేషూ, రామూ వాళ్లందరికీ మేం నేర్పడం ఎంత బావుండేదో. ఎండవేళ మొగ పిల్లలం చెర్లో దిగి ఈత కొడుతుంటే, ఆడ పిల్లలు పల్లకీ తయారు చేసి, బూరాలు కట్టి, బొమ్మల పెళ్లిళ్లు చేసేవారు చెరువు పక్క మామిడి తోపులో. సరిగ్గా పెళ్లివారంతా ఊరేగింపుకి బయల్దేరగానే మేమంతా కూడా చెర్లోంచి బయటికొచ్చి, తడి బట్టలతోనే వాళ్ల వెనక కేరింతలు కొడుతూ నడుస్తుంటే, వాళ్లంతా మమ్మల్ని తడి బట్టలు మార్చుకు రమ్మని తరిమేవారు. కాసేపు అల్లరి చేశాక మేం పొడిబట్టలు కట్టుకు రావడానికి పెరటి తలుపుగుండా చప్పుడు చెయ్యకుండా జాగ్రత్తగా ఇంట్లోకి చొరబడేవాళ్లం.

.

అన్నంత తిని ఓ కునుకు తీసి లేచిన నాయనమ్మ ఆ కాస్త అలికిడి కూడా విననే వింది. ఇంకేముంది, జడివానలా తిట్లు మొదలు. ‘ బొత్తిగా పిల్ల వెధవలకి భయం లేకుండా పోయింది. ఎండ ఫెళఫెళలాడిపోతుంటే ఆ చెర్లో ఈతలేమిటి…నడ్డిమీద నాలుగు వాయించేవాళ్లు లేక కానీ. అయినా వాళ్లమ్మలననాలి. ఎక్కడున్నారర్రా కమలా, విజయా! మీ మగవెధవలకి బుద్ధేమైనా ఉందా? ఆ పొరుగూళ్లనుంచి వచ్చినవారందరినీ కూడా వెంటబెట్టుకుని మరీ అలా పరుగులు పెడుతుంటే మీకు చీమ కుట్టినట్లైనా ఉందా? ఎప్పుడో ఏ వెధవో ఆ చెర్లో గల్లంతయ్యేదాకా ఇలాగే ఉంటారు. ముందు మీకు భయం ఉండి ఏడిస్తేనా?’ అంటూంటే– అమ్మ మొహంలోకి చూస్తుంటే జాలేసింది.

.

‘ మా మూలానే కదా అమ్మ మాటలు పడుతూంది’ అనిపించి బాధేసింది. గదిలోకి రాగానే ‘ఎందుకురా రవీ ఇలాంటి పనులు చేసి నాకు చివాట్లు తెప్పిస్తావు?’

.

‘నేనేనా ఏమిటమ్మా, ఇంట్లో అందరం వెళ్లాంగా?’ అయినా ఈ నాయనమ్మ ఒకతి. మమ్మల్ని అన్నది చాలదూ. ఎప్పుడూ అమ్మనెందుకు అంటుందో అన్నిటికీ. ఈలోగా పెదతాతగారు, పెద నాయనమ్మ పెరటివైపు నుంచి రావడం చూసిన వాళ్ల మనవలు వీధివైపు నుంచి పరుగు వాళ్లింటికి.

.

‘ఏరీ, మా సన్నాసులు…ఎక్కడ చచ్చారర్రా. పట్నంలో ఎండ కన్నెరగకుండా చూసుకుంటారు వాళ్ల అమ్మా నాన్న. సెలవులకని వస్తే, ఇక్కడ ఇదిగో…ఈ అల్లరి వెధవలతో చేరి, ఆగమ్మ కాకుల్లా తయారవుతున్నారు. ఏరా రవీ, వాళ్లందరినీ చెర్లోకి ఎందుకు తీసుకెళ్లారు? మీరైతే 24 గంటలూ అందులోనే పడుంటారు. మీకు అలవాటు. అలవాటు లేనివాళ్లకు ఏదైనా అయితే ఎవరు జవాబుదారీ, ఊ?? ’

.

‘నేనేం రమ్మనలేదు. వాళ్లే వచ్చారు’.

.

‘అదుగో పెద్దా చిన్నా లేదు. ఎదురు జవాబు కూడాను’.

.

‘అందరూ మగవెధవలే కనబడుతున్నారు. ఆడపిల్లలు ఏమైపోయారు?’ పెద నాయనమ్మ ఆరా. ‘అవును కదూ, ఒక్కళ్లూ కనబడడం లేదు. ఆడపిల్లల్ని అలా ఎండలో వెళ్లనివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను…తలంటు పోసుకున్న జుట్లూ వాళ్లూ…ఏ దెయ్యమో లంకించుకుందంటే! అమ్మబాబోయ్, నావల్ల కాదమ్మా వీళ్లతో అరవడం. అయినా వాళ్లమ్మలు కిమ్మనకుండా చోద్యం చూస్తుంటే నాకేనా పట్టింది?’ నాయనమ్మ అందుకుంది మళ్లీ.

.

‘ఎప్పుడు వెళ్లారో చూడలేదత్తయ్యా, గదిలో ఉతికిన బట్టలు మడత పెడుతున్నాను’.

.

‘అవున్లే, ఆ రేడియో పాటలతో మునిగిపోతావయిరి. చుట్టూ జరిగేది తెలిసేడిస్తేనా? ఇల్లింత నిద్దరోతోందేమిటా అన్న ఆలోచనైనా వచ్చింది? అబ్బే, నీకెందుకొస్తుంది. పెద్ద ముండాదాన్ని నేనొకత్తిని ఉన్నానుగా అన్నిటికీ’.

.

‘రవీ వాళ్లందరినీ పిలుచుకు రా నాయనా ఎక్కడున్నారో?’

.

‘అలాగేనమ్మా’ అని వీధివైపుకి వెళ్లబోతుంటే అదిగో, కొబ్బరాకు బూరాలు, పళ్లేల మీద మోగించే బాజాలు, పెళ్లివారి ఊరేగింపు రానేవచ్చింది పల్లకీతో సహా.

.

హడావుడిగా నానమ్మలు, పిన్నీ అందరూ వీధిగుమ్మంకేసి నడిచారు.

.

‘అమ్మో, అచ్చం నిజం పెళ్లివారిలాగే చేస్తున్నారర్రా. ఒసే భానూ, పల్లకీ ఎవరు చేశారే? చాలా బాగుంది సుమా. అయినా, ఇంత ఎండలో పెళ్లి ఊరేగింపులేమిటర్రా’ నానమ్మలిద్దరూ ఒకపక్క ముచ్చట పడుతూనే మరోపక్క ఏదో ఒకటి అనాలని! అయినా నానమ్మకి ఆడపిల్లల అల్లరి కనబడదు. ఎంతసేపూ మమ్మల్ని ఆడిపోసుకోవడమే. నానమ్మ కాస్త మెత్తబడటంతో మెల్లగా ఊరేగింపు వెనకాలే చేరాం. మిగతావాళ్లూ వచ్చి చేరారు. పెళ్లివారు గుమ్మంలోకి రాగానే అక్క కుంకమ కలిపిన నీళ్లు దిగదుడిచి పోసింది పెళ్లికూతురుకి, పెళ్లికొడుక్కి. వాళ్లందరూ లోపలికొచ్చి పెరట్లో ఉన్న పెద్ద సపోటా చెట్టు కింద పరిచిన గడ్డి మీద ఉంచారు పల్లకీ. అందరికీ పెళ్లి భోజనాలు సిద్ధం. అంతకుముందే అవధాని మేస్టారు వాళ్లావిడ పెళ్లి విందుకి అన్ని ఏర్పాట్లూ తానే చేస్తానందట. నిజానికి ఈ పెళ్లికి వారంరోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజూ రాత్రులు పెరట్లో తులసికోట దగ్గర సమావేశమై చర్చలు చేస్తున్నారు. మాస్టారి భార్యకు పిల్లలు లేకపోవడంతో, మా అందరినీ ఎంతో ఆపేక్షగా చూస్తుంది. మా అల్లరిని సరదాగా ప్రోత్సహించి ఆనందిస్తుంది కూడా. నిజానికి అమ్మ కూడా మా అల్లర్లకి పెద్దగా కోప్పడదు. మేం మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు ఆవిడకి. కానీ, నానమ్మకే ఏమాత్రం నచ్చదు. పెద్దత్తకీ, పెదనాన్నకీ కూడా నచ్చదు.

.

సపోటా చెట్టుకింద విస్తళ్లేశారు. అంతకుముందే అమ్మ పాలేరుతో చెప్పి పొలాన్నుంచి అరిటాకులు తెప్పించి చెట్టుకింద పెట్టించింది. ‘ఏమిటర్రా, చాలా పెద్దయెత్తునే చేస్తున్నట్టున్నారు బొమ్మల పెళ్లి. చెప్పరైతిరి? ఎప్పుడు చేశారేమిటి ఈ ఏర్పాట్లన్నీ?’ అంటూ నానమ్మలిద్దరూ వచ్చారు. ఈ తతంగమంతా చూసిన పెద తాతగారు తను కేకలేయడానికి తగిన సీను కనబడక మెల్లగా వచ్చిన గుమ్మం గుండా వెనక్కి వెళ్లిపోయారు.

.

అక్కలిద్దరూ అందరినీ సర్ది కూర్చోబెట్టారు. పెద్దవాళ్లంతా ఎండకాలం కోసం వేసిన పందిరి కింద మంచాలమీద కూర్చున్నారు. ఎండగానే ఉన్నా గాలి వేస్తోంది.

.

మాస్టారు భార్య భ్రమరాంబగారు హడావుడి పడుతూ వడ్డన మొదలెట్టి, ‘కమలొదినా, రమక్కా ఇళ్లల్లోంచి రారేం? వడ్డనలు ఆలస్యమవుతుంటే’ అంటూనే ‘ముందుగా పెద్దవారు, మీరొచ్చి అక్షింతలేయండి పిన్నిగారూ. రండి మరి’ అని వేగిర పెడుతుంటే, ‘ఇంతకీ సూత్రధారివి నువ్వా భ్రమరాంబ తల్లీ! ఎన్నేళ్లొచ్చినా ఏం ముచ్చట్లే మామ్మా?! సరేకానీ, ఇంతకీ మాకేం పెడుతున్నావు తిండానికి?’ అంటుంటే ఇహ మాకు గ్రీన్‌సిగ్నల్‌ దొరికినట్టే. భోజనాలు మొదలెట్టాం. పులిహార, పాకుండలు, బూందీ మిఠాయి, పనసతొనలూ, జామకాయ ముక్కలూ, మామిడిపండు ముక్కలూ…ఆహా! ఓహో! పెళ్లి భోజనాలు పూర్తవుతుంటే తాతగారు పొలం నుంచి వస్తూ మామిడి పిందెలు భుజం మీది తుండుగుడ్డలో పోసుకొచ్చి కటకటాల్లో దిగబోశారు. ‘ఏమిటోయ్‌ మరిదీ, పొలం నుంచి ఏం తెచ్చావేమిటి? అన్నట్లు పొలంలో పుల్లగోంగూర ఉందా? మా పెద్దాడికి గోంగూర పచ్చడంటే చాలా ఇష్టమోయ్‌’.

.

‘ఉంది వదినా. ఆనక పిల్లల్ని పొలం పంపించు పాలేరు పీకిస్తాడు. బచ్చలేమైనా కావాలా అది కూడా తెప్పించుకో.’

.

మా తాతగారు వ్యవసాయదారు. పెదతాతగారు ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టారు.

.

మామిడి పిందెలు పట్టుకెళ్లి పచ్చడిబద్దలు వేస్తావేమిటక్కయ్యా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగో పట్టుకెళ్లు. ఒరే పిల్లలూ, మీరు ఆనక పొలం వెళ్లి మామిడి చెట్టుకింద పిందెలేమైనా రాలాయేమో చూసి పట్టుకురండి. ఇవెటూ చాలవ్‌. తరిగి బద్దలేస్తే, రెండోనాటికి హుష్‌కాకి చేసేస్తారు. ఏకంగా మరికాసిని తరిగి వేస్తాంగానీ.’

.

మామిడి పిందెలు కావలసివస్తే మాత్రం మేం పొలం వెళ్లాలి. పాయింటు దగ్గర నీళ్లోసుకునేందుకు మాత్రం ధూం ధాంలు!’ ఏమైతేనేం, సాయంత్రం పొలం వెళ్లడానికి మాత్రం పర్మిషను వచ్చినట్లే.

.

‘ఏమర్రోయ్, వెళ్లమన్నాను కదా అని ఆ పాయింటు కింద స్నానాలంటూ నీళ్లలో నానుతూ కూర్చోకండి. పిందెలు ఏరుకురమ్మన్నానని చెట్లెక్కి కాయలు కొయ్యకండి. చీకటి పడకుండా వచ్చేయండి’ నాయనమ్మ మాటలు వినబడుతూనే ఉన్నాయి. పుంతదాటి పరుగులు ఒకరి వెంట ఒకరం.

.

దారిలో గుడి, చెర్లో ఈదులాడాలని నిర్ణయం. పొలం దాటగానే దేవాలయం. ప్రాంగణంలో పెద్ద పొగడ చెట్లున్నాయి. ఆడపిల్లలందరూ పొగడ చెట్లకింద పూలేరుకుని అరటి నారలతో దండలు గుచ్చుకుంటుంటే, మేమంతా గుడి చిన్నగోపురం మీదికెక్కి చెర్లోకి దూకి ఈదులాడటం మొదలుపెట్టాం. పౌర్ణమి రోజేమో, అప్పుడే వెన్నెల వచ్చేసింది. నీళ్లు తళతళా మెరుస్తున్నాయి.

.

మద్రాసు నుంచి వచ్చిన రమణకి ఈత రాదు. నేర్చుకోవాలన్నా భయం. పైగా వాళ్లమ్మ బోలెడు జాగ్రత్తలు చెప్పి పంపించిందట. అందుకే మెట్లమీద కూర్చుని మాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

.

‘పర్వాలేదురా, మేమంతా ఈదడం లేదూ, భయం లేదులే’ అంటూ రాము, సూరివాళ్లూ అంటుంటే సరదా పుట్టినట్లుంది.

.

‘రవీ, నేనూ వస్తానురా. నువ్వు నా దగ్గరే ఉండి నేర్పిస్తావా మరి. ప్లీజ్‌ రవి’ అంటూ నీళ్లల్లోకి దిగాడు. నేనా చివరి నుంచి వచ్చేలోగా కళ్లు తేలేశాడు భయంతో. అంతే, అరుస్తూ నీళ్లల్లో పడిపోయాడు. ఓ…అంటూ అన్నివైపుల నుంచీ అందరం వచ్చి వాణ్ణి లేవదీశాం. కానీ భయంతో వెర్రి చూపులు చూస్తున్నాడు. మా అందరి గుండెలూ దడదడలాడుతున్నాయి. వాడు నీళ్లేమీ తాగలేదు. హమ్మయ్యా అనుకుంటూ వాణ్ణి కూర్చోబెట్టి, ‘భయం లేదు రమణా. నీకేం కాలేదు. అయినా నువ్వు మెట్ల మీదే ఉన్నావు. నీళ్లల్లోకి పూర్తిగా రాలేదు కదా? ప్లీజ్‌ భయపడకురా బాబూ’ అంటూ అందరం ధైర్యం చెప్పాక కాస్త తేరుకున్నాడు.

.

వాడి చెల్లెలైతే భోరుమని ఏడ్చేసింది ‘ అన్నయ్యా మన ఊరు వెళ్లిపోదాం రా ’ అంటూ.

.

‘తల్లీ వెళ్లిపోదురుగాని…ఏడవకు ప్లీజ్‌. ఎవరైనా వింటే గొడవ. అన్నయ్యకేమీ కాలేదులే’ అంటూ అందరం కలిసి వాడి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటి బాట పట్టాం. చీకటి పడిపోయింది. ఇక పొలం వెళ్లే టైం లేదు. చిన్నాడిని ఇంటికి పంపి వాతావరణం ఎలా ఉందో చూసి రమ్మన్నాం. వాడు వెళ్లి వెనక్కి వచ్చి ‘ఇల్లంతా హడావుడిగా ఉంది. నానమ్మ వాళ్ల తమ్ముడు, తాతగారూ, వాళ్లావిడా, కొడుకూ, కోడలు వచ్చారు. అందరూ సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మ పెరట్లో వెన్నెల్లో కంచాలు పెట్టి ఉంచింది’ అన్నాడు. ‘ హమ్మయ్యా బతికాం బాబూ ’ అనుకుంటూ పక్క సందుగుండా వెళ్లి ‘పురిగది’ (ఒకప్పుడు ధాన్యం పోసుకునేవారట ఆ గదిలో ) లో బట్టలు మార్చుకుని కంచాల దగ్గర కూలబడ్డాం. పెదతాతగారి పిల్లలు వాళ్లింటికెళ్లిపోయారు. మధ్యాహ్నమూ, సాయంత్రమూ కూడా తడిపి పడేసిన బట్టల గుట్ట చూసి అమ్మ, పిన్నీ మొహమొహాలు చూసుకుని నిట్టూరుస్తుంటే అత్త కోపంగా ఏదో అనబోయింది. అది చూసి అమ్మ–‘బాబ్బాబు గిరిజా ఇప్పుడింకేం అనకు. అన్నయ్య ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేళయింది. రాగానే కోపం తెప్పించడం ఎందుకు తల్లీ ప్లీజ్‌ వదిలేద్దూ’ అంటుంటే, మమ్మల్ని మింగేలా చూస్తూ నేతిగిన్నె అందుకుని వడ్డన మొదలెట్టింది గిరిజత్త.

.

(ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే నాన్నగారు చీకటి పడితేనేగానీ రారు. వచ్చాక కూడా అలసిపోయి ఉంటారు. అందుకే నాన్న వచ్చేసరికి వాతావరణాన్ని చేతనయినంత వరకూ కూల్‌గా ఉంచాలని ప్రయత్నిస్తుంది అమ్మ)

.

అన్నం తిని ఆరుబయట పక్కలపై వాలి అలా ఆకాశంకేసి చూస్తూ వెన్నెలా, నక్షత్రాలు, చల్లగాలీ, కబుర్లు, కథలూ చెప్పుకుంటూ మర్నాడు ఏమేం చేయాలో ప్లానేసుకుంటూ…ఎవరెప్పుడు నిద్దరోయామో కూడా ఎవరికీ తెలిసేది కాదు.

…..

‘సాయం సంధ్య అసుర సంధ్య అంటారు. ఏమిటీ నిద్ర, లేవండీ’ శ్రీమతి పలకరింపుతో ఈలోకంలోకి వచ్చాను.

.

మనసంతా ఏదో తియ్యని అనుభూతి, కొత్త ఉత్సాహం.

.

‘చిన్ననాటి జ్ఞాపకాలు సుధాప్రాయపు రోజులు భగవంతుడు మనిషికిచ్చిన అపురూప వరం కాదూ…’అనుకుంటూ పైకి లేచాను.

.

(ఈనాడు, 12 జూన్‌ 2011)

.

—-(0)—–