11_018 తో. లే. పి. – వంగూరి చిట్టెన్ రాజు

 

రాజు గారు–

అనగానే మనకు వెంటనే స్ఫురించేది ఆయన పరాక్రమం కంటే ఆయన దానశీలత – ఔదార్యము. ఈ సందర్భంగా, నాకు మా చిన్నతనం లో జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తోంది. అప్పట్లో, తూర్పు గోదావరి జిల్లా సోమవరం అనే గ్రామం లో మా అమ్మగారి అన్నగారు – అంటే మా మామయ్య గారు గ్రామకరణం గా ఉండేవారు. ఆయనకి అక్కడ గొప్ప పరపతి ఉండేది. ఆ రోజుల్లో గ్రామ కరణం – అంటేనే అంత కదా ! మామయ్య గారి ఇంటికి దగ్గర గానే రాజు గారని ఒకరి ఇల్లు ఉండేది. ఒకసారి మా మామయ్య గారన్నారు- ” ఒరేయ్ – సుబ్బూ- మనం అందరం కలిసి రాజు గారింటికి వెడుతున్నాం… తొందరగా తయారవు ” అంటూ. నేనేదో నాలో ముందుగానే ఊహించేసుకుంటూ మా వాళ్లందరితో కలిసి వారింటికి వెళ్ళాను. అప్పటికి వారిదేదో – రాజభవనమని – రాజు గారంటే కిరీటం, నగలు గట్రా తో మెరిసిపోతూ ఉంటారని అనుకున్నాను వెర్రి మొహాన్ని ! తీరా వెళ్లి చూస్తే ఓ బుర్ర మీసాలాయన ముందు హాలులో పడక కుర్చీ లో దర్జాగా జార్లబడి, చుట్ట కాల్చుకుంటూ కనబడ్డారు. ఆయనే రాజు గారని ఆ తరవాత గానీ నాకు తెలిసింది కాదు. అయితేనేమి, ఆయన మాటలలో ఎంతటి ప్రేమ, వాత్సల్యం ?!! అప్పుడు నాకు బోధపడింది… రాజు గారంటే మంచిమనసు, మంచి మాట వెరసి – మంచితనం మూర్తీభవించిన మూర్తి  అని..

 

సరే – ఈ కథలను కట్టిపెట్టి అసలు విషయానికి వస్తాను. 

ఇక్కడ బాపు – రమణల గారి మాటలనే అప్పచెప్పాలంటే  

” అనగా అనగా ఒక వంగూరి చిట్టెన్ రాజు. 

వూరి పేరు వంగూరయినా కోకనాడ లో పుట్టేన్ రాజు 

జోకుల్తో గూబలు వాయగొట్టేన్ రాజు 

హ్యూమ రైటింగును వరించినా   

ఇంజినీరింగును ధరించి

డాలర్స్- లాండు ను మెట్టెన్ రాజు 

హ్యూస్టన్ లో కాలు పెట్టెన్ రాజు…. “

ఈ చిరు కవితా ప్రసాదం ఎంత పవిత్రమో ! దీనికి ఎన్నెన్ని రుచులో !! సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే, ఆయన భక్తులయిన బాపు – రమణ ల ద్వారా ఈ ప్రసాదాన్ని మనకి అందించారనుకుంటే అది ఒక గొప్ప విషయం !

 

చిట్టెన్ రాజు గారు – ఇకముందు ఆయనని రాజు గారు అనే పిలుస్తాను. నా మనసు లో మాట ఏమిటంటే – రాజు గారు మా రాజు గారు – మహారాజు గారు – ఇదేదో పొగడ్త కోసం కాదు సుమండీ – రాజు గారితో నాకున్న స్నేహ బాంధవ్యం ( – ఈ పదం కరెక్టేనా ? ) నా మనసు చేత అలా పలికించిన మాటలన్నమాట !

 

రాజు గారు అమెరికాకి వచ్చేసి దాదాపు ఐదు దశాబ్దాలయినా సరే – కాకినాడ పైన మమకారాన్ని వదలని మనిషి. ఆ వూరన్నా- అక్కడ తాను గతంలో చదువుకున్న ( పి. ఆర్. కాలేజి ) అన్నా వల్లమాలిన ప్రీతి – అలాగే గాంధీనగరం పార్క్ అన్నా- రామారావుపేట లో ఈశ్వర పుస్తక భాండాగారం, శివాలయం అన్నా కూడా అంతే ! నిజం చెప్పాలంటే ఈ ప్రదేశాలతో నాకూ గట్టి అనుబంధం ఉంది. కారణం 1958 – 63 మధ్య కాలం లో రామారావు పేట, కొండయ్యపాలెం రైల్వే గేటు దగ్గర మా మామయ్య ఇంట్లో ఉండి ఐదేళ్లపాటు నా ఇంజినీరింగ్ చదువును వెలిగించాను. మేమిద్దరం బేసిగ్గా మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులమే.  మరో విషయం – పార్కు, గుడి, గుడి లాంటి గ్రంధాలయం అంటే నాకూ మక్కువ ఎక్కువే మరి !

చిట్టెన్ రాజు గారి మాట ఆత్రేయపురం పాలకోవా అంత, కాకినాడ కోటయ్య కాజా అంత మధురాతిమధురం – మేము ప్రత్యక్షం గా ఒకరినొకరం ఈనాటికీ కలుసుకోకపోయినా ‘మాట’ ఉంది చూసారూ.. అది మా ఇద్దరినీ కలిపి మా మనసులను మరింత దగ్గర చేసింది. మేము అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకున్నా, ఒకరికొకరం గాలిలో ( మేఘ ) సందేశాలను పంపుకున్నా – ఆ ఆనందం అనుభవైకవేద్యం.. మాటలలో ఇమడనిది – అక్షరాలకు అందనిది !!

 

మరి రాజుగారి బయో డేటా, రచనా వ్యాసంగం గురించి నేను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడానికి ముచ్చట గా మూడే కారణాలు స్థలాభావం – సమయాభావం (ఈ  వివరాలు) సర్వవిదితం  

అయినా – క్లుప్తం గా రెండు ముక్కలు.. 

 

రచనలకు నామకరణం ( బారసాల ) చేయడం లో వీరి శైలి లో తనదంటూ ఒక ప్రత్యేకత. ఉదాహరణ కు : 

అమెరికామెడీ కథలు ( ఇందులో ) అమెరికామెడీ కథలు, అమెరికాలక్షేపం, అమెరికామెడీ కబుర్లు, అమెరికాకమ్మ కథలు, అమెరికలగూరగంప కథలు.. ఇలా…ఇలా… 

మరి ఈయన కథలలో చోటుచేసుకున్న ప్రముఖ వ్యక్తి విక్టోరియా రాణి… వీరి అర్ధాంగి… ఈయన రాజు గారు కనుక ఆవిడ రాణి అవడం / అనడం సముచితం.. సమర్ధనీయం కదా ?! ఆవిడ మారు పేరు ఇది అయినా అసలు పేరు లక్ష్మి గిరిజా కుమారి. రాజు గారు తాను రచించి వెలువరించిన ” వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూట పదహారు అమెరికామెడీ కథలు ” పుస్తకాన్ని రాణి గారికి అంకితమిచ్చారు. వంగూరి ఫౌండేషన్ వెలువరించిన అనేకానేక ప్రచురణలలో ఒక ప్రధానమయిన, డిక్షనరీ అంత ఉపయుక్తకరమయిన పుస్తకం ” 20 వ శతాబ్దం లో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా సాహితీవేత్తల పరిచయ గ్రంధం “. ఇది తెలుగు కథ శత వార్షికోత్సవాల సందర్భం గా ఫిబ్రవరి 2009 లో సంస్థ యొక్క 39 వ ప్రచురణ గా విడుదల చేయబడింది. 

 

రాజు గారు వృత్తి రీత్యా హ్యూస్టన్ లో సిస్టమ్స్ ఇంజినీరింగ్ కంపెనీ కి అధినేత. 

ప్రవృత్తి రీత్యా వీరివి రచన, ప్రచురణ వ్యాసంగాలు. అమెరికా లో తెలుగు సాహిత్య వ్యాప్తి కి, రచయితలకు ప్రోత్సాహపరిచే దిశగా 1994 లో అమెరికా లో వంగూరి ఫౌండేషన్ ను స్థాపించి, 2006 లో ఇండియా లో దీనికి అనుబంధ సంస్థ ను హైదరాబాద్ లో స్థాపించి వీటి ద్వారా ఈ రంగం లో అనేకానేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండడం అత్యంత అభినందనీయం – ఆనందదాయకం. 

 

సాహితీ సరస్వతీ ముద్దు బిడ్డడు మన రాజు గారికి, వారి కుటుంబానికీ నా శుభాకాంక్షలను అందజేస్తూ మున్ముందు కూడా ఈ కృషి ని నిర్విరామంగా కొనసాగించడం లో భగవంతుడు వీరికి ఆయిరారోగ్యాలను ప్రసాదిస్తూ… ఆశీర్వదిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

 

నేను అడిగి అడగగానే నా కోరికను కాదనకుండా తాను పలు వ్యాపకాలలో మునిగి ఉన్నప్పటికీ, తన మనసు విప్పి నాతో ఆ మాటలను ఉత్తర రూపేణా పంచుకున్న నాకు ఆప్తుడు, తమ్ముడు అయిన చిరంజీవి రాజు కి నా కృతజ్ఞతలను తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలనూ, నమస్కారములను అందిస్తూ ప్రస్తుతానికి మీ వద్ద నుండి శెలవు తీసుకుంటున్నాను.    

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾