10_021 తో. లే. పి. – ఆర్. ఎస్. కున్నయ్య

.

1955-60 ప్రాంతాల్లో మద్రాసు ( నేటి చెన్నై ) నగరంలో Madras Film Fans Association అనే పేరుతో ఒక  ప్రముఖ సంస్ధ ఉండేది. ఆ రోజుల్లో ప్రత్యేకించి, మద్రాసు నగరం దక్షిణాది భాషల చలనచిత్రాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చును. నటీనటులతోనూ, రచన, సంగీతము, సినీ నిర్మాణానికి సంబంధించిన తదితర శాఖలకు చెందిన వివిధ కళాకారులతోనూ నగరమంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఎంతో శోభాయమానంగా ఉండేది. సినీ ప్రేక్షకులకూ, నటీనటులు తదితర కళాకారులకూ మధ్య ఎంతో సయోధ్య ఉండేది. దీని వెనుక ముఖ్య పాత్ర Film Fans Association ది అన్నమాట! సినీ పరిశ్రమకు చెందిన వారి వివరాలు – ఉదాహరణకు వారి పూర్తి చిరునామా వగైరా వివరాలను కోరిన అభిమానులకు ఉత్తరాల ద్వారా పంపుతూ ఉండేవారు. ఈ వివరాలు వారికి అనేకానేకరకాలుగా ఉపకరించేవి. సినిమాలను చూసిన ప్రేక్షకులు తమ స్పందనను తమ అభిమాన నటీనటులు మొదలగు వారికి తెలియజేయాలన్నా, మద్రాసు వెళ్ళిన సందర్భాల్లో వారిని కలవాలనుకున్నా కూడా ఇవి అందుకు దోహదపడేవి.

.

నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదువుకున్న కాలం 1958-63. అప్పట్లో B&W సినిమాలైనా ఆనందదాయకంగా ఉండేవి. సినిమాహాలు వీధిలో ఈ చివరి నుండి ఆ చివరివరకూ రోడ్డుకిరువైపులా సినిమా హాళ్ళే !

.

మరో ఆకర్షణ.. ఏమంటే సినిమా విడుదలై విజయాన్ని సాధించిన సందర్భంగా జరిగే శతదినోత్సవ వేడుకలు.. దీనిలో సినిమా లోని హీరో హీరోయిన్లు, గాయనీగాయకులు తదితర సినీప్రముఖులతో సభా వేదిక నిండుగా కళకళలాడుతూ ఉండేది. ఇక జన సందోహం గురించి వేరే చెప్పక్కరలేదు. అలా, నేను కాకినాడ లో హాజరైన సినీవేడుక ‘చెంచులక్ష్మి’ చిత్ర శతదినోత్సవం!.అప్పటి ఆ ఆనందం ఈనాటికీ ఇంచుకైనా తగ్గలేదు !

.

అదే 1960 ప్రాంతంలో కొందరు సినీ నటులు, కళాకారుల వివరాలను నేను అడిగీ, అడగ్గానే Madras Film Fans Association కార్యదర్శి శ్రీ ఆర్. ఎస్. కున్నయ్య గారు ఆ వివరాలను పంపుతూ నాకు సవివరంగా ఉత్తరం వ్రాసారు. 1960 లో ఆయన వ్రాసిన కార్డు ( అప్పట్లో దాని విలువ కేవలం ఐదంటే ఐదు నయాపైసలు మాత్రమే ). ఇప్పుడు 61 సంవత్సరాల వయసున్న ఆ పోస్టుకార్డు వయస్సు తక్కువేమీ కాదండి!….. ఒకమారు దాని తళతళలను, మిలమిలలను మీరు గమనించండి !

.

ఆ కార్డు లో ఇచ్చిన వివరాలు, మరికొంత అదనపు సమాచారం ఆధారంగా నేను తొలిసారిగా 1961 లో మద్రాసులో ముగ్గురు ప్రముఖులను ప్రత్యక్షంగా  కలుసుకోగలిగాను..

.

వారెవరంటే,

* ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల మాస్టారు.

** ప్రముఖ గాయని శ్రీమతి పి. సుశీలమ్మ గారు.

*** ప్రముఖ చిత్ర, వ్యంగ్య చిత్రకారుడు శ్రీ బాపు గారు ( ఆయన అప్పటికి ఇంకా సినీరంగ ప్రవేశం చేయలేదు ).

.

వీటన్నింటికీ ఆధారం Madras Film Fans Association వారు ఆనాడు నాకు అందించిన సహకారం.

.

అది అంతా, ఇంతా  అని మాటల్లో చెప్పలేను. అందుకుగాను, వారికి నేను సదా కృతజ్ఞుడిని !

.

.

***<><><> ధన్యవాదాలు- నమస్కారములు<><><>***