13_001 పుష్కర శిరాయాత్ర

ప్రస్తావన

పుష్కర శిరాయాత్ర – వందనం

‘ శిరాకదంబం ‘ పత్రిక ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ పన్నెండు సంవత్సరాలలో అంతర్జాల సాంకేతికతలో ఎన్ని మార్పులు సంభవించాయో అవన్నీ ‘ శిరాకదంబం ‘ కి అనుభవంలోకి వచ్చాయి. ముద్రణా రూపం నుంచి డిజిటల్ రూపం సంతరించుకుంటున్న తరుణంలో పత్రికా రంగం కూడా ఆయా సాంకేతికతలను అందుకుంటూ క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేసుకుంటూ వచ్చింది. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ, ఆర్థిక వనరుల లేమి కారణంగా పూర్తి స్థాయి వెబ్సైట్ రూపొందించే అవకాశం లేని పరిస్థితుల్లో గూగుల్ ఉచితంగా ప్రారంభించిన సైట్స్ ఉపయోగపడ్డాయి. ఇలా ప్రారంభించడానికి ప్రధాన కారణం మనకి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని, సమాచారాన్ని రకరకాల ప్రక్రియల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందించడమే !

ఈ పత్రిక ప్రారంభానికి ముందు అంతర్జాలంలో ప్రవాస భారతీయులు నిర్వహిస్తున్న పత్రికలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాటిలో లబ్ధ ప్రతిష్టులైన రచయితల రచనలతో బాటు ప్రవాస రచయితల రచనలు ప్రధానంగా ఉండేవి. అంతగా ప్రసిద్ధి కాని వారు, అప్పుడప్పుడే రచనా రంగంలో అడుగుపెట్టిన వారికి ఒక వేదిక ఉండాలని, వారి ప్రతిభ ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో లాభాపేక్ష రహితంగా ఈ పత్రిక ప్రారంభించడం జరిగింది. ఎన్నో ప్రయోగాలు చెయ్యడం జరిగింది. ఆడియో రూపంలో కవిసమ్మేళనాలు, పిల్లల కోసం కథల పోటీలు, పిల్లల ప్రతిభా పాటవాలు వెలికి తీసే ‘ బాలకదంబం ’, ఆడియో, వీడియో ప్రక్రియలలో ఆయా రంగాలలో ప్రసిద్ధులైన కొందరి అంతరంగ కథనాలు, ముఖాముఖీలు…. వంటివి ఎన్నో ఈ పన్నెండు సంవత్సరాలలో నిర్వహించడం జరిగింది.

ఈ విధంగా పత్రిక ప్రారంభించాలనే ఆలోచనను మొదటి నుంచీ ప్రోత్సహించి, ఉత్సాహపరచిన వారిలో ఓలేటి వెంకట సుబ్బారావు గారు, డా. శారదాపూర్ణ డా. శ్రీరామ్ శొంఠి దంపతులు, తటవర్తి జ్ఞానప్రసూన గారు, శ్రీదేవి మురళీధర్ గారు, జయ పీసపాటి గారు, సోదరి దుర్గ డింగరి ముఖ్యులు. ఆది నుంచి ఈ  పుష్కర యాత్రలో కూడా ఉంటూ, అన్ని కార్యక్రమాల లోనూ తన సహకారాన్ని అందిస్తున్న మా అమ్మాయి మాధురీకృష్ణ, తన చిత్రాలతో శిరాకదంబం పత్రికను అలంకరిస్తున్న బాల్య మిత్రుడు, చిత్రకారుడు కూచి వంటి వారు ఎందరో  క్రమం తప్పకుండా తమ రచనలతో, ఇతర ప్రక్రియలతో పత్రికను సుసంపన్నం చేస్తూ ఉండగా… కాళీపట్నం సీతావసంతలక్ష్మి గారు, ఎర్రమిల్లి శారద, నీరజ విష్ణుభట్ల, పద్మజ శొంఠి, శ్రీదేవి జోశ్యుల, వేణు నరసింహదేవర, ద్విభాష్యం నగేష్ బాబు, అచ్యుత మానస …. ఇంకా ఎందరో…. ఎందరెందరో ఈ పత్రికను సర్వాంగ సుందరంగా అలంకరించడంలో తోడ్పడ్డారు…. తోడ్పడుతున్నారు. 

ఈ సందర్భంగా తలుచుకోవలసిన ముఖ్యులు… తన ఆథ్యాత్మిక ప్రసంగాలతో ఎంతో విలువైన సమాచార సంపదను అందించి… ఈ ప్రపంచంలో తన యాత్రను ముగించుకుని వెళ్ళిపోయిన డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు, ప్రతి సంచిక ఆమూలాగ్రం చదివి…. విశ్లేషించి మంచి చెడ్డలను నిర్మొహమాటంగా చెప్పి, పత్రిక సరైన పంథా లో నడవడానికి తన వంతు సహకారాన్ని అందించి, తన పని అయిపోయిందనుకుని హఠాత్తుగా ఈ లోకం నుంచి నిష్క్రమించిన నాకు చదువులో సహాధ్యాయి, ప్రాణ మిత్రుడు అయిన జి. బి. వి. శాస్త్రి …… ఇద్దరికీ నివాళులు అర్పిస్తున్నాను. 

ఇంకా ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు, రచయితలు తమ సహకారాన్ని, ప్రోత్సాహన్నీ అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్రికను, ఇందులోని అంశాలను పుష్కర కాలం గా ఆదరిస్తూ వస్తున్న పాఠక మహాశయులకు…. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ…. భవిష్యత్తులో కూడా ఇదే ప్రోత్సాహం, సహకారం కొనసాగిస్తారని ఆశిస్తూ…..     

మీ

శి. రా. రావు 

👉🏾 ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న ‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page