12_009 శోభకృత్ ఉగాది

ప్రస్తావన

‘ ఉగాది ’, ‘ సంవత్సరాది ’ అని పిలుచుకునే పండుగ వచ్చేసింది. మన ప్రతి పండుగా సందడే. క్రొత్త సంవత్సరంలో మొదటి పండుగ ఉగాది. ఆ సంవత్సరంలో మనకనుభవమయ్యే అన్ని అనుభూతుల్నీ ముందే పరిచయం చేసే షడ్రుచుల సమ్మేళనం ‘ ఉగాది పచ్చడి ’.

అసలు పండుగ అంటేనే ఉత్సాహం. కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా బంధుమిత్రులతో కలిపి జరుపుకునే సంబరం. ఇరుగు పొరుగుతో కలసి చేసుకునే సందడి. ఊరంతా కలసి కట్టుగా జరుపుకునే ఉత్సవం. పండుగ అంటేనే ఆనందంగా జరుపుకునేది. మన ప్రతి పండుగ వెనుక ఆథ్యాత్మికత మాత్రమే కాకుండా సామాజికమైన ప్రయోజనాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. ప్రజలందరిని సంఘటితం చేసే ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుతుంది. సంఘంలో మన తోటి వ్యక్తుల అవసరాలను కనిపెట్టి తీర్చడం, వారు కూడా సంతోషంగా ఉండేటట్లు చూడటం మనందరి కర్తవ్యం అనే సూచన కనబడుతుంది. ఉగాదినే తీసుకుంటే చలికాలం వెళ్ళిపోతూ, వేసవి కాలానికి స్వాగతం పలికే సమయంలో, అప్పుడప్పుడే పూర్తి రూపం సంతరించుకునే మామిడి కాయలు, చెఱుకు గెడలతో బాటు కోకిల కుహు కుహు లతో ఆహ్లాదకరమైన శోభను సంతరించుకునే సమయంలో వస్తుంది. చలి ఉన్నా వణికించదు. ఎండ పెరిగినట్లు కనబడినా ఎక్కువ వేడి తగలదు. ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడి తిని, ఆ ప్రత్యేకమైన రుచిని ఆస్వాదిస్తూ గుడిలో జరిగే పంచాంగ శ్రవణానికి హాజరయి ఆ సంవత్సరంలో దేశానికి, మన ఊరికి జరిగబోయే మంచి చెడుల విశేషాలను తెలుసుకోవడం… తన, తన కుటుంబ సభ్యుల రాశి ఫలాలు తెలుసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సామాన్య ప్రజానీకానికి ఈ విశేషాలు తెలుసుకునే సౌకర్యం అందుబాటులో లేని రోజుల్లో రాశుల గమనాన్ని గణించే పండితుని నోట ఆ విశేషాలను వినడం ప్రారంభమయి, ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా చిటికెలో తెలుసుకోగలిగే సాంకేతికత అందుబాటులో ఉన్న ఈరోజుల్లో కూడా ఒక పండితుని నోటి ద్వారా తెలుసుకోవడం అనేది అదో తృప్తి. ఇప్పటికీ ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరుగుతుండడం, ప్రజలు హాజరవుతుండడమే దీనికి నిదర్శనం. సంఘంలోని అన్ని రకాల వ్యక్తులు ఒకచోట కలుసుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం ఈ కార్యక్రమాల వెనుక పరమార్థం గా కనిపిస్తుంది. ఇలాంటి వాటి వల్ల సహృదయత, సౌభ్రాతృత్వం మనలో పెరుగుతాయి.

ఉగాది అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మరో కార్యక్రమం ‘ కవి సమ్మేళనం ’. ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలయిందో తెలియదు గాని ఉగాది రోజున సాహిత్యకారులు, సాహితీప్రియులు ఒకే వేదిక మీదకు వచ్చే సందర్భమే ఈ కవి సమ్మేళనం. విభిన్న భావాలు గల కవులు తమ రచనలను వినిపిస్తే ఆహుతులైన వారందరూ షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించినట్లు విభిన్న భావాల సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు. పచ్చడి జీర్ణం చేసుకున్నట్లే అన్ని రకాల భావాలను తమలో జీర్ణించుకుంటారు. సాహిత్య చర్చలు జరుగుతాయి. వాటి ఫలితంగా ఆ సంవత్సరం మరింత నాణ్యమైన సాహిత్యం వచ్చే అవకాశం ఉంది. మంచి సాహిత్యం యొక్క ప్రభావం సమాజం మీద తప్పకుండా ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనాలు సాహిత్య, సాంస్కృతిక సంస్థలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.

ఇవి కాకుండా ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ కూడా ఈ రోజున జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా నగరాలు, పట్టణాలలో జరుగుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో కూడా పండుగ రోజున గ్రామదేవత జాతరలు, తిరునాళ్ళు వంటి సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటివలన ఆ ఊరి లేదా ఆ ప్రాంత ప్రజలందరూ ఒకచోట చేరుతూ ఉంటారు. పండుగ అంటే దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోతాయి. అక్కడ కూడా పూజలతో బాటు, పురాణ ప్రవచనాలు వంటి సామాజిక సమ్మేళనాలు జరగడం సర్వ సాధారణం. ఈ రకంగా పండుగ అంటే ఆథ్యాత్మికత తో బాటు సామాజిక ప్రయోజనం కూడా.

గతంలో ఇలాంటి సామాజిక సమ్మేళనాలలో ఆయా ప్రాంతాలకు చెందిన, మన సంస్కృతికి ప్రతీకలైన అన్ని రకాల కళలు… ముఖ్యంగా జానపద కళలు, యుద్ధకళలు, మనవైన క్రీడలకు చాలా ఆదరణ ఉండేది. మారిపోతున్న కాలంలో సామాజిక సమ్మేళనాలు కూడా ఆధునికత సంతరించుకున్నాయి. అందులో కూడా వ్యాపార ధోరణి పెరిగిపోతోంది. నిజమైన సంప్రదాయ కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. కొన్ని సంప్రదాయ కళల, క్రీడల మాటున జూద క్రీడలు వంటి వికృత పోకడలు పెరిగాయి. ఇవి ప్రజలలో, ముఖ్యంగా యువతలో బలహీనతలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండవలసినది, ఈ వికృత పోకడలను రూపుమాపవలసినది ప్రజలే.

క్రొత్త సంవత్సరం ‘ శోభకృత్ ’ నామ సంవత్సరం. పాఠకులకు, మిత్రులకు, అందరికీ ఈ సంవత్సరమంతా శోభాయమానంగా ఉండాలని కోరుకుంటూ…..

 

గమనిక : ఇప్పటివరకు పక్ష పత్రికగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ’ వచ్చే నెల నుంచి మాసపత్రిక గా అనివార్య పరిస్థితుల్లో మార్చవలసి వస్తోంది. ప్రస్తుతం ‘ అక్షర రూప సంచిక ’, ‘ దృశ్య శ్రవణ సంచిక ’ లుగా నెలకి రెండు సంచికలు వెలువడుతున్నాయి. ఇకపైన రెండూ కలిపి ఒకే సంచికగా వెలువడుతుందని గమనించ ప్రార్ధన.

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.