ఇన్నా ళ్ళీగూటిలోన
ఉన్నా మొక్కటిగ కలసి;
న న్నొంటిగ విడిచి యెటకు
ౘన్నా వోయీ? ప్రియతమ!
నిద్దురలో మెలకువలో
నీవే నాకన్నులలో!
ఎదుట నున్న – ఎట నున్నా
నీవే నాతలపులలో !
కలలలోన నీ వెన్నో
చిలిపిపనులు చేశా వని
నీకు చెప్పుటకు సి గ్గై
నేను తెలుపనైతి సఖా!
“చెలీ!” అనుచు తమకముతో
చిలిపిపనులు చేసినా
కలతలోన నను తేర్పగ
గిలిగింతలు పెట్టినా
అక్కున నీయక్కు చేర్చి
ముక్కు ముక్కు కలిపినా
ఎదనొగులును చెప్పుకొనుట
కీవు నేను కలసినా
నావాడవు నీ వొకడవు
నా కున్నా వనుకొన్నా!
ఎదవేదన తీర్చుటకై
నీ వున్నా వనుకొన్నా!
నీవు లేనిగూటిలోన
నే నుండుట యెట్లు సఖా!
నీవు లేనిస్వర్గమైన
నే కోరను ప్రాణప్రియా !
తే.గీ. తెల్లవారెడువఱ కద్వితీయ మైన
ప్రేమవార్నిధి మునిగి తేలితిమి మనము!
ఇంతలో నెంతయాపద యెదురుపడియె!
మనము విధిచేతి కీలుబొమ్మలముసుమ్ము!
తే.గీ. గతభవమ్ముల నేమి చేసితినొ కాని
ఎఱిగి యీజన్మ కేపాప మెఱుగ నేను!
ఆలుమగలను విడదీసి అంతపాప
మేల చేయునొ ఆదేవు డెఱుగరాదు!
తే.గీ. అనుచు దుఃఖించుసతిగొంతు నానవాలు
కట్టి ఆబోయబుట్టలో కట్టువడిన
పావురము గుండె బ్రద్ద లౌబాధ యెల్ల
మనసులో దాచుకొని ఆలి కనియె నిట్లు :
తే.గీ. బోయ యొక్కడు నను పట్టి బుట్టలోన
పెట్టి యుంచెనె సకియ! యీచెట్టుక్రింద;
చెలియ! యే మందు? కాలము చెల్లె నాకు;
వనిత! యెం తేడ్చినను ప్రయోజనము లేదు!
తే.గీ. పుట్టినది మొదల్ మృత్యువు పొంచియుండు
నఖిలజీపుల కడతేర్చునదనుకొఱకు;
పడతి! ‘జాతస్య మరణమ్ ధ్రువ’ మ్మనియెడు
నార్యవాక్యము నీకును అవగతమ్మె!
ఆ.వె. గాలి నీరు మట్టి గగనభాగమ్మును
తేజ మింత కలసి దేహ మయ్యె!
ప్రాణ మింత పోవ పంచభూతమ్మల
పట్టు సడలి కడకు మట్టి మిగులు!
తే.గీ. ఎన్నటికినై పోయెడునీశరీర
మిది రజాగ్రస్త మై రాలు టేమి గొప్ప?
ఆకలిం గొన్నబోయ కాహార మగుట
కన్న ధన్యత కలదె యీ కాయమునకు?
తే.గీ. ఇట్టి తనువులు పూర్వ మెన్నెన్ని పొంది
విడిచి వచ్చితిమోకదే పడితిమిన్న!
బూడి దయినట్టి ఆ దేహములను తలచి
నాతి! అస లిప్పు డేడ్చుచున్నామె మనము?
తే.గీ. ఆలుమగలసంయోగమునందు ఎన్నొ
శుక్లబిందువుల్ జాఱిన సుఖము నందు
జీవు డొక్కడేహాకృతిన్ చెందుశుక్ల
బిందువు గతింప – ఏడ్చుట వింత కాదె?
తే.గీ. పుట్టుటయు ౘచ్చుటయు దేహముల కెకాని
ఆత్మ నామృత్యుదేవత అంటలేదు!
“ఆత్మయే నే ననెడుజ్ఞాన మబ్బునేని
దేహ మేమైన జీవి చింతింప దనలు!
తే.గీ. ఎన్ని తాపత్రయాలు మేల్కొన్నయపుడు!
కంటినిండుగ నిద్దుర క్రమ్మువేళ
నేది యెటైనకాని పట్టించుకొనము;
నిద్ర ఒక చిన్న చావువంటిదియె సుమ్ము!
తే.గీ. దినదినము ౘచ్చి బ్రతి కెడుతనువుగూర్చి
యేడుచుటకన్న నజ్ఞాన మేమి కలదు?
వీర్యకణ మొండు దేహ మై విస్తరిల్లె:
సముపరతివేళ వీర్యవిసర్జనమున
హాయి నందెడుజీవుల కార్తి యేల
తను వనెడువీర్యకణ మొండు ధరణి రాల?
కం. ఈపుట్టువు లీ చావులు
ఈపొంగుట తెల్ల మాయయేసుమి చెలియా.
ఈపాటిదానికోసము
తాపము చెందంగ నేల? తత్త్వ మెఱుగుమా !
తే.గీ. కడలి నెగిరెడు కెరటాలు పడియెతీరు:
ప్రతిపూవు భువి రాలిపోవు – నటులె
పుట్టువుం గన్న ప్రతిజీవి గిట్టితీరు !
తాప మందకు మిది సృష్టిధర్మ మబల !
తే.గీ. ఈచరాచర సృష్టిలో నింతవఱకు
పుట్టి గిట్టని జీవి యీపుడమి లేదు!
అవని పుట్టిన ఆదేవుడైనకాని
లీల నవతారములను చాలింపలేదె?
తే.గీ. జనన మందెడుప్రతిజీవి జాతకమున
వానిఆయుఃఃప్రమాణము వ్రాసియుండు!
ఘనులు జ్యోతిష్కు లాజాతకమును ౘదివి
జీవి యెన్నాళ్లు బ్రతుకునో చెప్పగలరు !
తే.గీ. పుట్టుకం గన్న ప్రాణులు గిట్టకుండ
ఉట్టి కట్టు కూ రేగుట వట్టిమాట!
చచ్చుట కాదె పుట్టుట? చచ్చి మరల
జన్మ మందుట – చర్వితచర్వణమ్ము!
తే.గీ. తానె తను వన్నభ్రాంతిలో తగులుకొన్న
జీవు డొక్కింతప్రగతిని చెందలేడు!
దృష్టి దైవము పై కాక – యిష్టబంధు
లం దతడు నిల్పు ప్రాణప్రయాణ వేళ!
ఏడుపుతోనే మొదలౌజీవిత
మేడుపుతోనే ముగియాలా?
ఎందుకు జన్మించా? మని యెఱుగుచు
అందుకు జీవులు కృషి చెయ్యొద్దా?
పరోపకారము కన్నను బ్రతుకుకు
పరమార్ధం మఱి ఉంటుందా?
అందఱిలో మన మున్న ట్లెఱిగిన –
హాని యితరులకు చేస్తామా?
అందఱిలో పరమేశుడు కల డని
అరయుటె కాదా ప్రజ్ఞానం?
“ప్రజ్ఞానం బ్రహ్మ” అనే పండిత
వాక్యము విననేలేదా?
“ఆనందో బ్రహ్మ” “అహం బ్రహ్మాస్మి”
అనుమాటలఅర్ధం మఱచావా?
ఆనందమె కద జీవలక్షణం?
ఆవిషయము మఱి మఱువవచ్చునా?
తరువాయి వచ్చే సంచికలో….
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page