—
వచ్చిం దమ్మా ! సంక్రాంతి !
తెచ్చిం దమ్మా ! నవకాంతి !
—
అక్కా బావా వచ్చారు !
ఆనందమునే తెచ్చారు !
పాలబుగ్గలఅక్కకూతురు
ఫక్కున నవ్వింది !
ముద్దబంతిపువ్వులాగ
ముద్దుగ నవ్వింది !
—
త లంటి పోసుకు కొత్తబట్టలు
తమ్ముడు నేనూ కట్టాము !
భోగిపిడకలు దండలు గ్రుచ్చి
ౘలిమంటలలో వేశాము !
—
బంతులు నవ్వాయి !
చేమంతులు నవ్వాయి !
రంగురంగులరంగవల్లులు
ముంగిట నవ్వాయి !
—
కొత్తపెళ్లికూతుళ్ళు !
కొత్తకొత్తఅల్లుళ్లు !
కొత్తబావని అల్లరి చేసే
కొంటెచేష్టలమరదళ్లు !
—
ఎక్కడ చూసిన నవ్వులే !
ౘక్కగ పూసినపువ్వులే !
రంగుబొంతలు సింగారించిన
గంగిరెద్దు తల ఊచింది !
—
‘ అయ్యవారికీ దణ్ణం పెట్టూ !
అమ్మగారికీ దణ్ణం పెట్టూ ! ‘
—
గంగిరెద్దులబంగారయ్యకు
జంగిడితోటీ ధాన్యం పోసి
పాటలు పాడేసాతానయ్యకు
పాతబియ్యమును పోశాము !
—
అయ్యవారికీ గుమ్మడికాయలు
అప్పలమ్మకీ పప్పు అన్నం
అడిగినవాళ్ళకి లే దనకుండా
అంతో ఇంతో యిచ్చాము !
—
బావకి బొబ్బట్లూ !
అక్కకి పెసరట్లూ !
బుజ్జిగాడికీ పరమాన్నం !
నాన్నా నేనూ అన్నీ తిన్నాం !
—
పచ్చిమిరపకాయ వేసి
బావకి కిళ్ళీ యిచ్చాము !
ఉక్కిరి బిక్కిరి అయ్యేబావకు
గుక్కెడు పానక మిచ్చాము !
—
గాదెలనిండా తరగనిధాన్యం !
వీధులలో నా కోళ్ళపందెం !
బసవడిమొగమున పసుపూ కుంకం
పండుగ అంతా మాసొంతం !
—
కొత్తగిత్తను బండికి కట్టాం !
హుషారుగా మేం షికారు వెళ్ళాం !
గిత్తలమెడలో గంటలగణగణ
గతుకులలో మాగుండె ధణధణ !
—
గుమ్మంముందర పిల్ల లందఱూ
కమ్మగ సందడి చేశారు !
—
‘ ఎప్పు డెప్పుడు పండు గోయ్ !
ఏడాదీ పండు గోయ్ ?
కూతు రెందుకు వచ్చిందోయ్ !
కుడుములు తినేందు కొచ్చిందోయ్ !
—
అల్లు డెందుకు వొచ్చా డోయ్ !
అట్లు తినటాని కొచ్చాడోయ్ !
బావా బావా పన్నీరు !
బావని పట్టుకు తన్నారు !
—
నులకామంచం వేశారు !
నూఱు గుద్దులు గుద్దేరు !
—
పట్టి మంౘ౦ వేశారు !
పాతిక గుద్దులు గుద్దేరు !
—
బావని పట్టుకు అల్లరి చేసి
బారెడు గుద్దులు గుద్దేము !
అక్కకి కోపం వొస్తుందింకఅని
అంటితోటీ ఆగాము !
—
హాయిగ గడిపాము ! పండుగ
తీయగ గడిపాము !
—
ఆవుపేడ గొబ్బెమ్మలు చేసి
బంతిపువ్వులను పై నుంచాము !
పసుపు కుంకుమా చేమంతులతో
గొబ్బెమ్మల పూజించామూ !
—
సుబ్బీ గొబ్బెమ్మా !
సుబ్బ ణ్ణిస్తావా ?
మొగలీపువ్వంటీ
మొగుణ్ణి ఇస్తావా ?
—
గొబ్బీయళ్ళో సకియా వినరే !
చిన్నీకృష్ణునిచరితము వినరే !
కృష్ణునిచరితము పాడరే !
—
బుజబుజరేకులపి ల్లుంది
బుజ్జారేకులపి ల్లుంది !
స్వామీ దణ్ణం పి ల్లుంది !
స్వరాజ్య మిచ్చిన పి ల్లుంది !
—
ఆటలు ఆడీ పాటలు పాడీ
అలసిపోయాము !
అటుకులు బెల్లం కొబ్బరికోరూ
అందఱి కిచ్చామూ !
—
ఆటలతోనూ పాటలతోనూ
హాయిగ గడిపాము !
అక్కా బావా వచ్చేపండుగ
హాయిగ గడిపాము !
—
****************