—
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి చిహ్నం, మానవత్వానికి ప్రతిరూపం, సత్యాగ్రహానికి పరిపూర్ణమైన నిర్వచనం అని వాడ్రేవు సుందరరావు అభివర్ణించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి, అమరజీవి అనుచరులు… ఆయన స్మృతిని శాశ్వతం చేసిన వై ఎస్ శాస్త్రి జయంతి, వెండితెరపై చెరిగిపోని సంతకాన్ని చేసిన దర్శకులు, చిత్రకారులు బాపు జయంతి సందర్భంగా ప్రత్యేక వార్షిక కార్యక్రమం యూట్యూబ్ లో ప్రసారమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఈ ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమాన్ని ‘అమరజీవి – అనుయాయి – ఆర్టిస్ట్’ పేరిట సమర్పించింది.
పదవీవిరమణ చేసిన అధ్యాపకులు, నాటక రచయిత, కళాకారులు, ఉపన్యాసకులు, పలు కార్యక్రమాల నిర్వాహకులు అయిన వాడ్రేవు సుందరరావు ( పాలంగి, పశ్చిమగోదావరి జిల్లా) పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను వివరించారు. ఆయన చదువుకున్న వీధిబడి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఆయన త్యాగమయ జీవితానికి పునాదులు వేశాయని వెల్లడించారు. శ్రీరాములు త్యాగానికి శాశ్వతమైన స్మృతి భవనాన్ని నిర్మింపజేసి, ఆయన గురించి పుస్తకాలను రచించిన వై ఎస్ శాస్త్రి సేవలు మరువలేనివని కొనియాడారు. ఆ పుస్తకాలను వీక్షకులకు చూపించారు.
అనంతరం, తను ముందు చిత్రకారుడినని, తరువాతే దర్శకుడినని బాపు చెప్పేవారని, తమ పాఠశాల రిపోర్ట్ కార్డులో ‘తండ్రి వృత్తి’ అన్నచోట చిత్రకారుడనే రాసేవారని ఆయన కుమార్తె భానుమతి తెలిపారు. ఆయన ‘చిగురు’ అనే పత్రికలో తను బొమ్మలేలా వేసేవారనే విషయం మీద రాసిన వ్యాసంలోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. చివరిగా ప్రముఖ కార్టూనిస్టు నర్శిం బాపు గురించి మాట్లాడుతూ.. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఆయన గీసిన బొమ్మ కనిపిస్తూనే ఉంటాయని, ఆయనొక మహాను’బాపు’డని ప్రశంసించారు. ఆయనది ఎప్పటికీ చెరిగిపోని సంతకమని వ్యాఖ్యానించారు.
సంస్థ సంయుక్త కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య కార్యక్రమానికి స్వాగతం పలికి, వక్తలను పరిచయం చేసి, ఆద్యంతం ఆసక్తి గొలిపేలా నిర్వహించారు.
చెన్నైకి చెందిన ముళ్ళపూడి ప్రసాద్, విజయవాడ వాస్తవ్యులు శిష్లా రామచంద్రరావు, ఆయన కుమారుడు ఉదయ్ సాంకేతిక సహకారాన్ని అందించారు.
—