12_006 ఘనవృత్తమ్

( కావ్య కథా పరిచయం )

 

          శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు (1816 – 1897) రచించిన గ్రంథాలలో ‘ఘనవృత్తమ్’ అనే సంస్కృత కావ్యం సుప్రసిద్ధమైనది. అందుకు కారణం, ఈ కావ్యం కాళిదాస కృత మేఘసందేశ కావ్యానికి ఉత్తర కథా భాగ రూపం కావడం. కాళిదాసు కేవలం ‘విరహోత్కంఠిత యైన యక్షిణి తన సందేశాన్ని యక్షునికి మేఘుని ద్వారా నివేదించడం’ అనే విషయాన్ని కావ్య కథా వస్తువు గా ఎంపిక చేయటం వలన, ఆకావ్య నామం “మేఘదూతమ్” అయితే…. యక్ష సందేశం విన్న తరువాత  మేఘుని వృత్తాంతం గురించి తెలిపేది కనుక దీనికి “ఘనవృత్తమ్” అనే పేరు వచ్చింది. కాళిదాసు మేఘ సందేశాన్ని శ్రీరామచంద్రుడు సీతామాతకు హనుమంతుని ద్వారా పంపిన సందేశాన్ని మనసులో ఉంచుకుని రచించగా, శాస్త్రిగారు కూడా దానిని అనుసరించే ఈ ఘనవృత్తం రచించారు.

           కాళిదాసు మేఘసందేశం లో మొదటి సర్గలో అలకా పట్టణ మార్గాన్ని, రెండవ సర్గలో అలకా పట్టణ రమణీయతను, యక్షాంగనా విరహావస్థనూ, దూత మేఘుని ద్వారా పంపబడిన సందేశ కథనాన్ని వర్ణించి, కావ్యాన్ని హఠాత్తుగా ముగింపు చేసాడు. కనుక పాఠకులకు తర్వాతి కథ ఏమిటనే కుతూహలం కలుగడం సహజం. అందుచేత రామచంద్ర కవి లిఖితమైన ఈ ఘనవృత్త కావ్యం యొక్క ముఖ్యోద్దేశం ఆ అసంపూర్ణ కథను పూర్తి చేసి, యక్షయక్షాంగనా సమాగమ వృత్తాంతం తెలిపి పాఠకుల ఉత్కంఠను శమింప జేయడమే.

             ఘనవృత్తం ప్రథమ సర్గలోని ఇతివృత్తం ఈవిధంగా సాగుతుంది. మేఘుడు యక్షుని సందేశం విన్న అనంతరం యక్షుడు చెప్పిన మార్గంలో అలకాపురి చేరుతాడు. తద్వారా చెప్పిన గుర్తుల సహాయం తో యక్షుని గృహమేదో తెలిసికొని, ప్రాంగణం లో ప్రవేశించి, దేవీ పూజా ధ్యానమగ్నయై యున్న ఒక యక్షాంగనను గవాక్షం నుండి గమనిస్తాడు. ఆమె శోక తప్తయై అశోక వృక్షం కింద విచారంలో మునిగియున్న సీతాదేవి వలె గోచరిస్తుంది. ఆమే తాను వెదకుతున్న స్త్రీ గా గుర్తించి, మేఘుడు గృహంలోనికి ప్రవేశించి, వాయుపుత్రుడు సీతాదేవికి రామ వృత్తాంతం తెలియ జేసినట్లే, యక్షాంగనకు యక్ష వృత్తాంతం తెలియజేస్తాడు. ఇది కలయేమో అని శంకిస్తున్న యక్షాంగనకు సందేహ నివృత్తి చేయాలని, మేఘుడు కామరూపుడైన కారణాన, సుందరాకారుడై ఆమె ఎదుట నిలుస్తాడు. యక్షాంగన, తన భర్త సందేశం తో ఆతని మిత్రుడు తన వద్దకువచ్చి శుభ సమాచారం అందీయడం తాను కావిస్తున్న దేవీ పూజా ఫలంగా భావిస్తుంది. మేఘుని కి సముచితాతిథ్యమిచ్చి, మేఘుని పుట్టుపూర్వోత్తరాలు, యక్షునికి అతనికి గల స్నేహం, యక్షుని ప్రస్తుత స్థితి తెలుసుకోవడం సంభవిస్తుంది.

             మేఘుడు యక్షాంగన తో సంభాషణా పూర్వకంగా, యక్షుడు ఆమె విరహంతో ఉన్మాది అయిన రీతిని, ఆతని వియోగావస్థను తెలియజేస్తాడు. అతని తపోనిష్ఠ, ఇంద్రియనిగ్రహం, ఏక పత్నీవ్రతం మున్నగు సద్గుణాలను ప్రకటించే ఒకానొక సందర్భాన్ని ఈ విధంగా వర్ణిస్తాడు.

                యక్షుడు తన అధికార అప్రమత్తత కారణంగా పత్నీ వియోగం సంభవించిందనే పశ్చాత్తాపంతో రామగిర్యాశ్రమంలో తపస్సు చేస్తుండగా, దేవేంద్రుడు ఆతని తపస్సుకు భయపడి, విఘ్నం కలిగింపుమని సురూప అను వేశ్యను పంపుతాడు. ఆమె ఆ యక్షుని లోబరచు కొనడానికి బహు యుక్తులు పన్నుతుంది. ఆతడు వాటిని గుర్తించి,

“లోకే నానాజన కృత పరిష్వంగం సందూహషితానాం సంగం సంతః ఖలు సమగ దంస్తం రసాభాస మూలం”

(లోకంలో బహు పురుషుల ఆలింగనంతో దూషితులైన వార వనితల సంగమం రసాభాస కారణమని పెద్దలు చెప్పెదరు కదా) అను నీతి వాక్యాలతో ఖండించి, ఆ వేశ్య ప్రయత్న పూర్వకంగా చేసే విలాసాలు తన ధర్మపత్ని సహజ విలాసాలకు ఎంత మాత్రం సరికావని చెబుతాడు. తరువాత 

” స్వర్గంగాయాః పయసి విహరద్రాజహంసస్య కుల్యా సిత్వం యాహి ద్రుతతర మితో యాహి కుంజాంతరం తత్”

(నా భార్య ఆకాశగంగ వంటిది. నీవొక కాలువ వంటి దానివి. ఆకాశంలో విహరించే హంస కాలువ లో విహరిస్తుందా? కనుక నీవు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో) అని గట్టిగా మందలిస్తాడు. ఆ మందలింపుకు ఆమె సిగ్గుపడి వెళ్లిపోతుంది. అక్కడి మునులందరూ యక్షుని ఇంద్రియ నిగ్రహానికి ఆశ్చర్య చకితులౌతారు.

              తన భర్త ఏకపత్నీవ్రతానికి, ఇంద్రియ నిగ్రహానికి యక్షాంగన సంభ్రమాశ్ఛర్యాలను పొంది, ఆనంద పరవశంతో స్పృహ కోల్పోతుంది. ప్రథమ సర్గ ఇంతటి తో సమాప్తం అవుతుంది.

                రెండవ సర్గ లో యక్షుని సందేశం విని ఆనందోద్రేకానికి లోనై స్మృతి తప్పిన యక్షాంగనకు ఆమె చెలి శైత్యోపచారం కావిస్తూ, మేఘునికి అక్కడ జరిగిన విషయాలను, ప్రియా వియోగ సమయంలో ఆమె పొందిన వ్యథను వివరిస్తుంది. కుబేరుని దర్బారు లో, పరిస్థితుల ప్రభావం చేత విచలితుడై, అన్య మనస్కుడైన యక్షుడు కర్తవ్య పరిపాలనలో గతి తప్పడం సంభవిస్తుంది. అందుచేత యక్షుడు యజమాని  క్రోధానికి వశుడై శాపగ్రస్తుడు అవుతాడు. శాపం పొంది, పదభ్రష్ఠుడైన యక్షుడు ఖిన్నుడై, ఇంటికి రావడం విషాద కారణమని భావించి ఎక్కడికో వెళ్లి పోతాడు. ఈ వార్త తెలిసినంతనే ఉద్రిక్తత తో యక్షాంగన మూర్ఛపోయింది.

                అప్పుడు దుష్ట శిక్షకుడు, ఆశ్రిత వత్సలుడు అయిన కుబేరుడు పంపగా, అతని భార్య యక్షుని ఇంటికి వచ్చి, దుఃఖితురాలైన యక్షాంగనను ఓదార్చి,

“కేవాన స్యుః పరిభవ పదం కర్మణా స్వార్జితేన”

(తాము చేసుకున్న కర్మతో ఎవరికి మాత్రం అవమానం కలుగదు?) అని అంటూ, చేసిన కర్మ అనుభవింపక తప్పదు, లోకోద్ధారకులైన మహాపురుషులు, అవతారపురుషులు కూడా కర్మ బద్ధులవుతుండగా, మన బోటి వాళ్ళొక లెక్కా?” అని ఊరడించి, తన భర్త నుండి తాను ఉపదేశం పొందిన అంబికా మంత్రం ఆమెకు ఉపదేశించి,” ఈ మంత్ర పునశ్చరణ వలన నీకు మనశ్శాంతి కలగడమే కాక, జన్మసాఫల్యమూ కలుగ గలదు” అని చెప్పి వెళ్తుంది.

             పిదప  ఆ యక్షాంగన నిష్ఠాగరిష్ఠయై పరాశక్తిని ప్రార్ధిస్తుంది. కొన్నాళ్ల తర్వాత పరాశక్తి ఆమె పూజకు మెచ్చి సాక్షాత్కరించి, ఈ విధంగా చెప్తుంది. ” నీకు త్వరలోనే శుభం కలుగుతుంది. కుబేరుడు నా ప్రియ భక్తుడు. కానీ అతని శాపాన్ని నేనూ మరల్చలేను. నీ భర్త కారణవశాన శాపానికి గురి యైనాడు. పూర్వజన్మ లో వయసులో ఉన్న అతని కూతురు, అల్లుడు కలుసుకొన ప్రయత్నించగా, వారిని కలువ నీయక  అడ్డు పడినాడు. నీవు కూడా తమ పతులపై ఆసక్తలైన నీ చెలికత్తెలను నిరంతరం నీ సేవ యందే మగ్నులుగ జేసి, వారిని వారి భర్తలతో కలవనీయకుండా చేసిన కారణాన నీకును భర్తృ వియోగం సంభవించింది. కనుక, ‘విహితం కర్మ భోక్తవ్య మేవ.’ కర్మను అనుభవించుటయే మేలగు కర్తవ్యం. చింత పడకు. త్వరలో నీకు శుభం కలుగగలదు” అని ఆశీర్వదించి  అంతర్ధానం పొందుతుంది. అప్పటి నుండి యక్షాంగన పరదేవతోపాసనతోను, తత్కథాశ్రవణం తోనూ కాలం గడుపుతూ, తన భర్త రాకకై ఎదురు చూస్తున్నది – అని చెలికత్తె చెప్పింది.

            అదే సమయంలో యక్షాంగన మరల స్పృహను పొంది, తన భర్త కు సంబంధించిన కొన్ని రహస్య వృత్తాంతములను మేఘునికి చెప్పి, తన ప్రియసఖుని ఎడబాసినందుకు చింత వ్యక్తం చేస్తూ, నమస్కార పూర్వకంగా యక్షునికి ఆతని ద్వారా సందేశం పంపింది. మేఘుడు  వర్షాకాలంతో కూడి, ఇష్టార్ధాలు పొందాలని శుభాశంసన చేసి, ఆతనిని అనేక రత్న కానుకలతో సత్కరించి వీడ్కోలు పలికింది.

               మేఘుడు మరల చిత్రకూటానికి పోయి, మిక్కిలి కృశించిన యక్షుని జూచి స్తనిత వచనాలతో

 “….. భవ్యపాత్రం వధూటీ భావత్కేతి స్ఫుటమకథయద్రామమే నాంజనేయః- 

నీ ప్రియురాలు జీవించి యుంది త్వరలో శుభాలు పొందగలవు” – అని రామునికి ఆంజనేయుడు సీతాదేవి యోగక్షేమం తెలిపిన విధాన తెలిపి వెళ్లి పోయాడు.

                వర్షాకాలానంతరం శరదృతువు వచ్చింది.

 “ఉన్నిద్రోభూత్సపది కమలా కాముక శ్శేష తల్పాత్.” 

ఉత్థానైకాదశి నాడు విష్ణువు శేషతల్పం నుంచి మేల్కొన్నాడు. వెంటనే యక్షునికి శాప విమోచన కలిగింది. ఆతడు సంపూర్ణ తేజస్సు తో తన నగరం చేరుకున్నాడు.

                 అక్కడ యక్షాంగన దేవీపూజకై పెద్దలను రావించి, పూజకు సంసిద్ధురాలై యున్నది. అదే సమయాన అరుదెంచిన యక్షుని జూచి, సంభ్రమాశ్ఛర్యాలతో ఘన స్వాగతమిచ్చి, మాల్యాంబరాదులతో గౌరవించి, రత్న ఖచితమైన తులసి మంటపాన పరాశక్తిని భక్తితో పూజించి, పెద్దలను ఉచిత రీతిని సత్కరించి, భర్త తో సరససల్లాపాలు చేస్తుంది.

                   మరునాడు కుబేరుడు శాపవిముక్తుడైన యక్షుని పరామర్శించడానికి వారి వద్దకు వస్తాడు. యక్షుని తపోనిష్ఠను, ఇంద్రియ నిగ్రహాన్ని మెచ్చుకుంటాడు. యక్షుని భార్య పరమశివాయత్త చిత్త అయినందుకు ఆమెను ప్రశంసిస్తాడు. అప్పుడు యక్షుడు వినయంతో తనకు మరల తన సేవాధికారం అనుగ్రహింపమని కుబేరుని అభ్యర్ధిస్తాడు. అది విని కుబేరుడు “యక్షా! నీవు సేవా వృత్తి నుంచి విముక్తుడవయ్యావు. నా ఇంటి నుంచి నీవు కావలసినంత ధనం తీసుకుని ధర్మార్ధకామాలు అనుభవించు.” అని అనుగ్రహిస్తాడు. తరువాత యక్ష దంపతులు అప్రమత్తులై నిత్య కర్మలు నెరవేరుస్తూ, ధర్మార్ధకామాల యెడల సమాన దృష్టి కలిగి, పరదేవతోపాసనాయత్త చిత్తులై ధన్య జీవులుగ కాలం గడుపుతారు.

                     రామచంద్ర శాస్త్రి గారు ఘనవృత్తమ్ లో ప్రతిపాదించిన ముఖ్యాంశాలివి. ప్రతి మానవుడు పూర్వజన్మ లో తాను చేసిన కర్మకు బద్ధుడు. ఆ కర్మకు మరొకరు కారకులు గాని, పరిహారకులు గాని కాదు. ఆకర్మ అనుభవించి తీరవలసినదే, వేరొక విధంగా నశించదు. కనుక ఈ జన్మలో తాను ఏకార్యాచరణకై నియుక్తుడయ్యాడో, ఆ కార్యాలను శక్తి వంచన లేకుండ, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. ప్రతి వ్యక్తి ఇంద్రియనిగ్రహం అలవరచుకోవాలి. అది ముఖ్య కర్తవ్యం. పిదప సమాధిని సమకూర్చు కొనడానికి బ్రహ్మాదుల ఉనికికి కూడా మూల కారణమైనట్టి పరాశక్తిని ఉపాసించి, కర్మబంధం అతిక్రమిస్తే గానీ మోక్షం సిద్ధించదు.

 ఆ పరాశక్తి  –

న స్త్రీ నా నో తదుభయ వపుః
నా ప్యనిర్వాచ్య రూపా
బ్రహ్మాదీనా మపి చ జననీ
లోక రక్షా ప్రసంగాత్,
నానా రూపా విరచత కృతిః
పూజితా చక్రిముఖ్యైః
నిస్త్రై గుణ్యే మహసి కుసుమే
సౌరభ శ్రీ రివాస్తే.

స్త్రీ పురుష రూపంకానిది, తదుభయ రూపం కానిది, నానా రూపమైనది, బ్రహ్మాదులచే పూజింపబడునది, జగన్మాతగ పేర్కొన దగినది, లోక రక్షణమే ముఖ్య కర్తవ్యమై వెలయునట్టి ఆ పరాశక్తి  పుష్పములలో ఘ్రాణేంద్రియ మాత్ర గోచరమౌ పరిమళము వోలె, త్రిగుణ రహితమైన తేజో కుసుమము నందు శ్రీ సౌరభము వలె విరాజిల్లుచున్నది!!!

************

విషయ సేకరణ  –  ‘సాహితీ నీరాజనం’ (బ్రహ్మశ్రీ  కోరాడ రామకృష్ణయ్య గారి శత జయంతి పత్రిక నుంచి)
సంకలనం –  శ్రీకాంత  గుమ్ములూరి. 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

—— ( 0 ) ——-

 

Please visit this page