.
పసితనం వీడని రోజుల్లోనే మా అమ్మ
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టీ …చేత…
సందిటతాయెత్తు సిరిమువ్వగజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు …చేత…
అంటూ చిన్ని కృష్ణుని రూపాన్ని అందించింది. రూపాన్ని అందించటంతోపాటు కన్నయ్యపై ఆధారపడటానికి అనువుగా–––
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
అంటూ కృష్ణశతకంలో పద్యం నేర్పింది. నిజం చెప్పొద్దూ…జీవితాంతం ఈ పద్యంలో కృష్ణయ్య నాకు తోడు. కొంచెం పెద్దవుతుంటే నాన్న
‘కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం….’
అంటూ ముక్కుకి సత్తు పెట్టుకున్న గోపయ్యను పరిచయం చేశారు.
మరికాస్త పెద్దయ్యాక కృష్ణ కర్ణామృత శ్లోకాలకి పరవశం చెందిన అన్నయ్య
‘హస్తాంఘ్రి నిక్వణ కంకణ కింకిణీకం
మధ్యే నితంబ మవలంబిత హేమసూత్రం
ముక్తా కలాప ముకుళీకృత కాకపక్షం
వందామహే వ్రజచరం వసుదేవ భాగ్యం’
ఈ శ్లోకాన్ని నాకు నేర్పి మరీ ఆనందించాడు.
ఉదయం లేవగానే నాన్నగారితో సాగే ప్రార్థనలో
శ్లో. భక్తాపాయ భుజంగ గారుడమణిః త్రైలోక్య రక్షా మణిః
గోపీలోచన చాతకాంబుదమణిః సౌందర్య ముద్రామణిః
యఃకాంతామణి రుక్మిణీ ఘన కుచ ద్వంద్వైక భూషామణిః
శ్రేయోదేవ శిఖామణిర్ది శతునో గోపాల చూడామణిః
అంటూ మనకు శ్రేయస్సునందించే గోపాల చూడామణి గురించి తప్పక ప్రస్తావన ఉండేది.
సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాక, అన్నమయ్య పాటలను విశ్లేషిస్తూ, నాకు కృష్ణుడంటే ఇష్టమని, నాన్నగారు ఓ కాగితమ్మీద రాసి ఇచ్చారు. ఈ పాటా అప్పట్లో కేవలం చదివాను. బాగా పాడటం నేర్చాక…
ప. ముద్దుల మోమున ముంచగనూ నిద్దపు కూరిమి మించినీ
చ. మొల చిరుగంటలు మువ్వలు గజ్జెలు గలగలమనగా కదలగనూ, …ముద్దుల…
ఎలనవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచీనీ
చ. అచ్చపు గుచ్చు ముత్యాలహారములు పచ్చల చంద్రాభరణము
త్రచ్చిన చేతుల తానె దైవమని అచ్చట నిచ్చట నాడినీ …ముద్దుల…
చ. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడూ నేలకు నింగికి నెరిపొడవై
చాల వెంకటా చలపతి తానై మేలిమి చేతల మించినీ …ముద్దుల..
ఈ పాట ఎన్నిసార్లు పాడుకున్నా ప్రతిసారీ మనసు ముందు కన్నయ్య చేతులు చాస్తున్నట్లే అనిపిస్తుంది. హిందోళంలో రాగయుక్తంగా పాడుకుంటుంటే మరింత సమ్మోహనం కృష్ణరూపం…!!
తిరుపతిలో అన్నమయ్య సంకీర్తనా భాండాగారం తెరిచాక ఎన్ని సంకీర్తనలో!! శ్రీ రాళ్లపల్లి వారూ, నాన్నగారూ వాటి గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వాటిలో కొన్నిటిని కాగితంమ్మీద రాసి తెచ్చి నాకిచ్చేవారు నాన్న! అందులో కొన్ని:
జోవచ్యుతానంద జోజో ముకుందా! రావె పరమానంద రామగోవిందా …జోజో…
నందునింటను జేరి నయము మీరంగాచంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల నాడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా …జోజో…
‘ కొలని దోపరికి గొబ్బిళ్లో యదుకుల స్వామికిని గొబ్బిళ్లో ’ అంటూ మా స్నేహితులం అందరం పాడుతూ గొబ్బితట్టేవాళ్లం!
‘ కొండ గొడుగుగా గోవులకాచిన కొండిక శిశువుకు గొబ్బిళ్లో…
‘ ఏహి ముదందేహి శ్రీకృష్ణా కృష్ణా! మాంపాహి గోపాల బాలకృష్ణా
నారదాది ముని గేయకృష్ణా కృష్ణా శివనారాయణ తీర్థ వరద కృష్ణా ’ …కృష్ణా…
ఇది తరంగం అని చిన్నప్పడు నాకు తెలీదు. కోనసీమ వెళ్లినప్పుడు తాతయ్య పాడేవాడు. కొంచెం పెద్దయ్యాక ఒదిన దగ్గర బాలగోపాల ముగ్ధరా కృష్ణా అంటూ పెద్ద తరంగం నేర్చుకుని ‘ముంగండ’ (కోనసీమ) లో తాతయ్య దగ్గర పాడినప్పుడు ఆయన ఆనందం వర్ణనాతీతం. అప్పుడాయనిది పాడి, ‘‘ ఇది కూడా నేర్చుకోవే పిల్లా… నువ్వు పాడుతుంటే కిన్నెర్లు మీటినట్లుంది సుమా! ’’ అని అందర్లో మెచ్చుకుంటుంటే సిగ్గేసింది కూడా. ఇంతకీ అప్పుడు తెలిసింది అది నారాయణ తీర్థులవారి తరంగమని. ఎంత అదృష్టం… నారాయణ తీర్థులు పరవశంతో పాడుతుంటే చిన్ని కృష్ణుడు ఎదుట నర్తించేవాడట !!
పురందర దాసుల వారు కన్నడంలో అంటారూ…
‘ పరుగుపరుగున రావయ్యా చిన్ని కృష్ణా! నిన్ను తనివిదీరా చూసి, మాటాడి ముద్దాడి సంతోషంతో పరవశించాలని ఉందయ్యా! కెందామరలను మించే చిన్ని పాదాల గజ్జెలు ధిమిధిమియని శబ్దం చేస్తుంటే, బుడి బుడి అడుగులతో నా వద్దకు వచ్చే నీ మోహన రూపాన్ని కళ్లారా చూడాలనీ, వేణువూదే నీ ఎర్రని పెదవుల చిరునవ్వు వెన్నెలలలో నా హృదయతాపం తీరాలని కాంక్షించే నా మనసుదీరా నావద్దకు– ’
ఓడి బారయ్యా వైకుంఠపతి నిన్న నోడు వే మనదరియా… అంటూ పరవశంతో పాడారు.
అంత పరవశంలోనూ తమిళంలో ఊత్తుక్కొడు వెంకటసుబ్బయ్య చిన్ని కృష్ణుడు రేపల్లె వీధుల్లో నాట్య భంగిమలో పరుగులు పెడుతూ నర్తించిన తీరు వర్ణిస్తూ తోడి రాగంలో…
చరణం. కాలిలిల్ శిలంబు కొంజ కైవళ్లై కులుంగ ముత్తు మాలైగళశైయ్య
తెరువాసలిల్ వందాన్
బానోగరెళ్లాం మగిళ, మానిగ రెల్లాం పుగళ నీల వర్ష కణ్ణన్ తెరివిల్ నర్తనమాడినారడి…
పల్లవి. తాయే యశోద అంటూ పాడారు.
వీక్షేకదా దేవ దేవం గోపాలమూర్తిం …
సాక్షాన్మదన కోటి సౌందర్యభావ్యం …
తథిమిధిమికి ధిమికి తాండలిలోలం
నిరతనాయ తీర్థ నిర్మల మనోహంసం …
అంటూ ఆనంద సుందర తాండవం చేసే బాల కృష్ణుని అందాల్ని, విభూతుల్ని సంభ్రమంగా చెప్పుకునే గోప కాంతల సంభాషణని ఎంత సుందరంగా పాడి, రాగతరంగాలలో ఓలలాడిస్తారో నారాయణ తీర్థులవారు తన కృష్ణ లీలా తరంగణిలో!!
భక్తీ, భావుకతా ఉన్న ప్రతి ఒక్కరూ భావించుకుని, పరవశంతో మైమరచే రూపగుణ సంపద శ్రీకృష్ణునిది. అందమే ఆనందం కదా! పాంచ భౌతికమైన అందమే ఆనందానికి హేతువై మనసును మైమరపింప చేస్తుంటే…మరి ఆ అలౌకికమైన, దైవికమైన అందపు ఆనందం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి పరమానందాన్ని అందించడంలో ఆశ్చర్యమేముంది?!
‘కృష్ణా’ అన్న పేరులోనే ఉంది నిత్య నిరవధిక ఆనందం! మన సంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ప్రతివారినీ ఏదో ఒక విధంగా భగవంతుని భావించుకుంటూ ఉండేలా చేస్తుంది మన సంప్రదాయం అనుక్షణం ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ఏదో రోజులో కాసేపో, వారంలో ఒక రోజో దేవుణ్ణి విధిగా కాసేపు పూజించడమే భక్తి అని కాక, ప్రతి విషయాన్ని భగవంతునితో ముడిపెట్టుకుని అర్ధవంతంగా పరమాత్ముని భావించి, అందుకునే ప్రయత్నానికి ఒక ఒరవడి పెద్దలు మనకు ఏర్పరిచారు. అందులో భాగాలే మన పండుగలూ, నోములూ, వ్రతాలూ, సప్తాహాలూ, ఏకాహాలూ. ఇవన్నీ భగవంతుని భావించుకుంటూండడానికి అవకాశాలు. అంతేకాదు… నిత్య జీవితంలో కూడా ప్రతి తల్లీ తననొక యశోదగానూ, కౌసల్యగానూ భావించుకుంటూ, తన చంటివాణ్ణి కృష్ణునిగా, రామునిగా అనుకుంటూ బతుకు బృందావనంలో భగవత్తత్వాన్ని పండించుకుంటుంది. ఈ భావన నుండే జోలపాటలూ, గుమ్మడి పాటలూ, దశావతార పాటలూ జాలువారాయి. తల్లులందరూ ఈ పాటలు పాడుకుంటూ తమ పసివారిని మద్దుచేయడం చూస్తాం.
తెల్లవారుజామున ( చల్లచిలుకుతూ ) కృష్ణలీలలూ, మేలుకొలుపులూ, గోవిందనామాలూ తల్లులు పాడుతుంటే, అక్కడే పారాడే పసివారు ఈ పాటలు వింటుండగా పెరుగు చిలికే శబ్దంలో కలిసి సాగే ఇల్లాలి పాటలు. నిజంగా అలౌకిక ఆనందాన్నివ్వడంలో ఆశ్చర్యం లేదు. ఉగ్గుపాలనాడే భగవంతుని పరిచయం చేస్తుంది తల్లి. అలా తల్లులు పసితనంలో అందించిన దైవ స్ఫూర్తితోనే అన్నమయ్య త్యాగరాజాదులు పరమ భాగవతులై అద్భుత సంకీర్తనలతో వాగ్గేయకారులైంది!
అమ్మ పక్కలో పడుకుని, కృష్ణుని కథలు వింటూంటే…ఎంత పరవశమో! ‘అష్టమి రోహిణి ప్రొద్దున, అష్టమ గర్భమున పుట్టీపుట్టగానే తన పరమ పురుష రూపం కన్నవాళ్లకు ప్రత్యక్షం చేశాడు! నేను కాస్త పెద్దయాక విన్న భాగవత ఘట్టం నాన్నగారు చదివినది గుర్తుకొస్తూ…
‘మహా పురుష లక్షణుండును, విలక్షణుండును, సుకుమారుండును నైన కుమారుని గని, దేవకీ వసుదేవులు తమకు కలిగిన పుత్రుండు విశ్వమంతయు లీల ద్రిప్పెడు పరాత్పరునిగా గుర్తించి–
మత్తకోకిల. ‘ ఒంటి నిల్చి పురాణ యోగులు యోగమార్గ నిరూఢులై
కంటి మందురుగాని నిక్కము కానరీ భవదాకృతిన్
గంటి భద్రము గంటి మాంసపు కన్నులంగన బోలదీ
లొంటిరూపు దొలంగ బెట్టుము తోయజేక్షణ మ్రొక్కెదన్’
అంటూ మ్రొక్కిందట దేవకి. ఆ తల్లికి ఇంకా ఆశ్చర్యమే. అన్నమయ్యకీనూ!!! అందుకే ఆయనంటారు…
ప. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడూ
చ. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలూ
ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ
అట్టే కిరీటమూ ఆభరణాలు ధరించి
ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడూ
అంటూ అబ్బురపడ్డాడు! అంతటి స్వామిని ‘‘వందేహం జగద్వల్లభం దుర్లభం’’ అంటూ శ్లాఘిస్తే ఆ పురుటింటి విద్యుద్దీపమై వెలిగిన తండ్రిని
‘శరణం భవ కరుణామయి కురుదీనదయాళో
మధుసూదన మధుసూదన హరమామక దురితం’ అంటూ వేడుకున్నారు నారాయణ తీర్థులవారు.
పొత్తిళ్లల్లో బాలుని యమున దాటించి, యశోద చెంత చేర్చి ఆమె కన్న ఆడశిశువును దేవకికివ్వడం కంసుడా శిశువును చంపబోవగా, దేవకి ‘పుత్రులకు వోమనేనియు పుత్రీదానంబు సేసి పుణ్యముగనవే’ అంటూ ఎంత వేడినా వినక ఆ పాపను నేలకేసి కొట్టి చంపాలనుకుంటే, కిందపడలేదు. సరికదా…కంసుణ్ణి హెచ్చరించి మరీ మింటికెగసి పోయింది దేవీస్వరూపమై!!
ఇహ రేపల్లెలో– ‘మన యశోద చిన్ని మగవాని గనెనట చూచి వత్తమమ్మ సుదతులార!’ అంటూ ‘ఒండొరులుం లేపికొనుచు’ గోపికలంతా వచ్చి పసిబాలుని–
బాలునకు నూనె తలయంటి
పసుపు పూసి, బోరుకాడించి
హరిరక్ష బొమ్మటంచు జలము
లొకకొన్ని చుట్టి రాజిల్లి తొట్ల నునిచి
దీవించి పాడిరయ్యువిదలెల్ల…
పోతనగారి భాగవంతంలో ఈ ఘట్టం చదువుతున్నప్పుడంతా గోపికనై కన్నయ్యకి అతి సమీపమున ఉన్న భావన!! పసివారిని ఎవరిని చూసినా హృదయం పరవశిస్తుంది కదా! అలాంటిది నిత్య నిరవధిక ఆనంద స్వరూపుడైన కృష్ణయ్య సామీప్య భావన!! ఆహా! ఎంత పరవశం!!
‘జోజో కమల దళేక్షణ జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవ పదకర జోజో పూర్ణేందు వదన జోజో యనుచున్
అంటూ గోపికలు పాడితే…
జోవచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా…జోజో
అని అన్నమయ్య పాడారు. పాల రాసిలో పవళించిన బాలకృష్ణుని లీలాశుకుడు
‘‘కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశ యానం బాలం ముకుందం మనసాస్మరామి’’
అంటారు. చెయ్యి అనే తామరపువ్వుతో పట్టుకున్న పాదం ఆ తామరపువ్వును ముఖం అనే తామర పూవుపై చేర్చి వటపత్రపు దొప్పలో పండుకొన్న బాలముకుందుణ్ణి మనసా స్మరించాడంటే అంతరంగంలో దర్శించాడన్నమాటేగా!! ఈతని సహజ సరళ కవితా సరస్వతి చదువరికీ, శ్రోతలకు కూడా శబ్దశబ్దమునా బాలకృష్ణునిపై వాత్సల్యమూ, కరుణామూర్తిౖయెన పరమాత్మపై భక్తీ కలిగించకమానవ్!
‘ కొదదీరా మరీ నందగోపునకు యశోదకు
ఇదిగో తాబిడ్డడాయె ఈ కృష్ణుడూ!! ’
ఇంతకీ యశోదాదేవిది అదృష్టమంటే!
శ్లో. పరం పరస్మాదపి ప్రాఙ్తకర్మ
క్రమేణ వేద్యం కరణైర వేద్యం
నిజేచ్ఛయా ప్రాప్త మనుష్య వేషం
సుతం యశోదా సుఖమాప దృష్ట్వా
ఏ జన్మలో ఏ సుకృతం చేసుకుంటారో, ఫలితం అన్నది ఎప్పుడొస్తుందో తెలీదుగానీ, వాటి వాటి కాలం వచ్చినప్పుడు అవి ఫలప్రదం కాకపోవు. నందయశోదలు ఏ జన్మలో ఏ పుణ్యం, ఏ తపం చేసుకున్నారో కానీ సర్వేశ్వరుడే వారికి పుత్రుడైనాడు. అత్యంత సులభుడైనాడు. ఆహో…ఏమి వారి అదృష్టం!!
ఎన్న తపం శైదనై యశోదా! ఎంగుం నిరైంద పరబ్రహ్మం అమ్మా యండ్రళైక్క!
‘ సర్వత్రా నిండియున్న పరబ్రహ్మ చేత అమ్మా అని పిలిపించుకోవడానికి ఆ యశోద ఏం తపం చేసిందోగదా! ఈరేడు భువనాలూ కుక్షిని నిల్పుకున్న భువనేశ్వరుణ్ణి పొత్తిళ్లల్లో ఉంచుకుని పాలిచ్చి, జోలపాడి నిద్రపుచ్చే తల్లిగా ఎంత పుణ్యం చేసిందో కదా యశోద!’ అంటూ ఆమె అదృష్టాన్ని కొనియాడుతూ, ‘దుష్టశిక్షణకై అవతరించిన దైవాన్ని తల్లిౖయె తాను బెత్తం పుచ్చుకుని ఆగ్రహించడం ఆశ్చర్యం కదూ!’ అంటూ అబ్బురపడ్డారు ఉత్తుక్కడ వెంకటసుబ్బయ్య.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసులవారు కూడా
‘‘జగదోద్ధారన ఆడిదళెశోద
జగనోద్ధారణ న మగనెందుకెళియుత
మదుగళ మాణిక్యన ఆడిసిదళెశోదె
చ. అణోరణీయన మహతో మహీయన
అప్రమేయనన ఆడిశిదెళెశోద
ఈ జగత్తునే ఉద్ధరించడానికి అవతరించిన స్వామిని యశోద ఆడించింది! అణువునుండి మహత్తు వరకూ అంతటా నిండియున్న పరమాత్మను ఉయ్యాల తొట్లలో ఉంచి ఊపింది యశోద.
ఆమె మాత్రమే కాదు…నందగోపునితోసహా గోకులం, గోపగోపికలు, గోవులూ, ఆ యమునా కాళిందీతటం….ఇవన్నీ కూడా ఎంత సుకృతం చేసుకున్నాయో కదా!
ఆ మధుర మంజుల మూర్తి బృందావనంలో విహరిస్తున్నాడు.
శ్లో. మందారమూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం
గోగోపగోపీ జనమధ్య సంస్థం గోపంభజే గోకుల పూర్ణచంద్రం
ఆ ముగ్ధ మోహనరూపాన్ని దివి నుండి చూచిన దేవాంగనలు వాళ్లలో వాళ్లు ఇలా అనుకుంటున్నారు.
ప. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం
సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం నందనందనమఖండ విభూతి కృష్ణం
నందసునందాది వందిత కృష్ణం– శ్రీ నారాయణ తీర్ధ వరద కృష్ణ …లోకమే…
చిన్ని కన్నయ్య ఆనందతాండవం ప్రకృతిని మైమరపిస్తే, వేణుగోపాలుని మురళీగానం ప్రకృతిని స్థంభింపజేస్తుంది.
ఆమాటే అంటాడో తమిళ వాగ్గేయకారుడు!
‘నిలై పెయరాదు శివైపోలవే నిన్ట్రు
నేర మావదరియా మలే మిహవినోద మాన మురళీధరా ఎన్మన
మలైప్పాయుదేకణ్ణా ఉన్ ఆనంద మోహన వేణుగానమదిల్’
కృష్ణా నీ ముగ్ధ మోహన వేణుగానం నా హృదయాన్ని ఆనందతరంగిత మొనర్చుచున్నదయ్యా! నిశిధీ స్థంభించిపోయింది. ఆ నాదలహరిలో కాలగమనమే తెలియడం లేదు!! ఆహా! ఎంత అదృష్టం! ఈ పరవశం!!
శ్లో. అంగుళ్యత్రై రరుణ కిరణైర్ముక్త సంరుద్ధరంన్ద్రం
వారం వారం వదన మరుతా వేణుమాపూరయన్తమ్
వ్యత్యస్తాంఘ్రిం వికచకమలచ్ఛాయ విస్త్వారి నేత్రం
వందే బృందావన సుచరితం నన్ద గోపాల సూనుం ‘‘
ఎర్రని చిగురుల్లాంటి వేళ్ల కొనలతో పిల్లంగ్రోవి రంధ్రాలను మూస్తూ, తెరుస్తూ, ఒక పాదం ముందుకి, మరో పాదం వెనక్కి ఉంచి విలాసంగా తామరరేకుల్లాంటి కనుదోయిని పాటకనువుగా తిప్పుతూ బృందావన సీమలో విహరించే స్వామీ! నీకివే మా వందనాలు.
శ్లో. అయి మురళి ముకుందస్మేర వక్త్రారవింద
శసన మధుర సంజ్ఞే త్వాం ప్రణమాధ్యయంచే
అధర మణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం
కథయ రహసి కర్ణే మద్దశాం నంద సూనోః
ఓ వంశ నాళమా! శ్రీకృష్ణుని మోము తామర వాసన నీకు అనుభవవైకవేద్యం కదూ? దోసిలియొగ్గి నిన్ను వేడుకుంటున్నాను. ఈసారి ముకుందుని పెదవి దగ్గరకు చేరినప్పుడు స్వామి చెవిలో రహస్యంగా నా దీన దశను గురించి చెప్పవూ? చెబుతావు కదూ? ఓ మురళీ అందరికంటే దగ్గరగా స్వామి పెదవుల చెందనే ఉండి, కన్నయ్య మనసుననుసరించి మ్రోగుతావు కదూ! స్వామి ఊపిరికి సంగీతానివవుతావు. నీ కంటే స్వామికి సన్నిహితులు ఇంకెవరు? లీలాశుకుని భావనాపూర్వక విన్నపం అది.
చిన్నికృష్ణుని శైవవలీలలు గుర్తుకొస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పొత్తిళ్లల్లో పసివాడై పూతనను చంపాడు. ఉయ్యాలలో బాలునిగా శకటాసురుని ఒక్క తన్ను తన్నాడు. అమ్మ ఒళ్లో కూర్చుని ముచ్చటలాడేనాడు. తృణావర్తుని అంతం చేశాడు. గోవర్ధనగిరిని చిటికెన వ్రేలిపై నిలిపి ఇంద్రుని వడగళ్ల వాన నుండి గోకులాన్నంతా రక్షించాడు. ఇంద్రుని గర్వాన్ని అణిచాడు. తన్ను పరీక్షింప దలచిన బ్రహ్మనే పరీక్షకు పెట్టి, గోవులుగా, గోపాలకులుగా తానే అనేకమైనాడు. పసితనంలోనే దుష్ట శిక్షణా వ్రతం ప్రారంభించిన దైవం కృష్ణుడు కిశోరప్రాయంలో కంససంహారం గావించాడు.
గోపికల ఇళ్లల్లో వెన్న మెక్కి వచ్చి అమ్మ దగ్గర మాత్రం నంగనాచిలా బువ్వపెట్టమ్మా అనే కిష్టయ్య చేష్టల్ని మురిపంగా నారాయణ తీర్థులు ఇలా పాడారు. యశోదలో చెప్పిన వైనం
చ. అపహృత బహుతర నవనీతం అనుపమలీలానటనాకృతం
కపటమానుష బాలక చరితంకనక కందుక ఖేలన నిరతం
ప. కలయ యశోదే తవబాలం ఖలబాలక ఖేలనలోలం
ఏమిరా తండ్రీ నిజమేనా? అంటే బుంగమూతి పెట్టిన బాలకుణ్ణి చూస్తే ముద్దొస్తుందికానీ కోపం వస్తుందా? అయినా ఎప్పుడూ ఏదో అల్లరి. ఓసారి మన్నుతిన్నాడని ఫిర్యాదు. ‘మన్నేటికి భక్షించెదు…?’ అంటే ‘మన్నుతినంగా నే వెర్రినో…’ అంటూ నోటిలో బ్రహ్మాండాలు చూపిస్తాడు. ఋషులు చేస్తున్న ‘యజ్ఞమూర్తి’ని తానేనని తెలియజెబుతాడు. నమ్మిన ఋషిపత్నుల చేతి భోజనం చేస్తాడు.
ఇలా తన లీలామానుష స్వరూపంతో, అతి మానుష చేష్టితాలతో, లోకాలననుగ్రహించే స్వామి తన మధుర మంజుల మురళీనాదంతో లోకాలను సమ్మోహనపరిచే లీలలను గుర్తుతెచ్చుకోవడంలోని ఆనందం చెప్పశక్యం కాదు.
శ్లో. వదనే నవనీత గన్థవాహం–వచనే తస్కరచాతురీ ధురీణం
నయనే కుహనాశ్రు మాశ్రయేధా–శ్చరణే కోమలతాండవం కుమారమ్
అదీ కన్నయ్య రూపం!!
శ్లో. ఉపాసతా మాత్మ విదః పురాణాః
పరం పుమాసం నిహితం గహాయామ్
వయం యశోదా శిశుబాల లీలా
కథాసుధా సిన్ధుషు లీలయామః
ఆత్మ స్వరూపవేత్తలైన పూర్వ ఋషీశ్వరులు హృదయకుహరంలో పరమాత్మను తదేక చిత్రంతో ధ్యానింతురుగాక! మేం మాత్రం లీలా గోపబాలుడై క్రీడలు సల్పే కృష్ణ పరమాత్మ యొక్క చిన్నతనపు(బాల్యపు) విలాస కథలనే సుధాసముద్రంలో ఓలలాడతాంసుమా! అంటారు లీలాశుకుడు!
శ్లో. ముకుందమూర్థ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియం తమర్థం
అవిస్మృతిస్త్వచ్ఛరణారవిందే భవేభవేమేస్తు భవత్ప్రసాదాత్
కృష్ణా! శిరసువంచి, దోసిలియొగ్గి ఈ చిన్నికోరికను కోరుకుంటున్నానయ్యా! అనుక్షణం నీవు నా స్మృతిపథంలోనే ఉండాలనీ, నీ పాదారవిందాలపై నా తలపు క్షణకాలమైనా ఏమరని భాగ్యం జన్మజన్మలకూ నాకు లభించాలన్నదే నాకోరిక. మన్నించు తండ్రీ!! ఇంతకంటే భగవానుని ఏం కోరుకోగలం? ఇది చాలదూ జన్మ తరించడానికి!!
శ్లో. కృష్ణో రక్షతునో జగత్రయ గురుః కృష్ణం నమస్త్యామ్యహం
కృష్ణే నామర శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః
కృష్ణాదేవ సముస్థితం జగదిదం కృష్ణస్యదాసోçస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే! కృష్ణా! రక్షస్వమాం
.
— అస్తు —