10_008 ఆనందసిద్ధి

—————————————————————–

” అయితే ప్రపంచం లో జరిగే వాటి గురించి తెలుసుకోవడం వలన ఉపయోగం లేదంటారా స్వామి? ” మొదటి సారిగా ప్రశ్నించాడు ఆనంద్.

” నీ వ్యవహారాలు జరుపుకోవడానికి కావలిసిన వాటి గురించి తెలుసుకో. వాటి గురించి కాకుండా, ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయి?, ఎందుకు

జరుగుతున్నాయి?, దుర్మార్గులు శిక్ష లేకుండా ఎందుకు

తప్పించుకుంటున్నారు?, రాజకీయవేత్తల అవినీతి – ఇలాంటివన్నీ నువ్వు

తెలుసుకోవడం వల్ల నీకు ఉపయోగమేమిటి? ఒకవేళ తెలుసుకోవడానికి

ప్రయత్నించినా, నేను పైన చెప్పిన కారణాల వల్ల పూర్తిగా తెలుసుకోవడం అసంభవం.” వివరించారు స్వామి.


” అయితే ప్రపంచం తో మన సంబంధం ఎలా ఉండాలి ? దానిని పూర్తిగా పట్టించుకోవద్దంటారా? అది సాధ్యమా ?” అడిగాడు నారాయణ.  

” ఇందాక చెప్పినట్టు, ప్రపంచములో నువ్వు జీవిస్తున్నావు కనుక దానిని విస్మరించడం ఎలా కుదురుతుంది? ఒకటి  గుర్తు ఉంచుకో ప్రపంచం అంటే, అందులో నీ శరీరం, నీ భార్యా పిల్లలూ, నీ ఆస్తి పాస్తులూ, బంధు మిత్రులూ అంతా  కలిపే కదా?. నీ సుఖ దుఃఖాలన్నీ వీటన్నిటితో ముడి పడి వున్నాయి. ప్రపంచం లో జరిగే విషయాలను నువ్వు  ప్రభావితం చేయలేవు. అవునా ?” అడిగారు స్వామి.

” అంటే? కొంచెం వివరిస్తారా? ” అడిగాడు నారాయణ.  

” మీ తమ్ముడికి మంచి ఉద్యోగం రావాలి, మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, మీకు ప్రమాదాలు జరగకూడదు, మీకు ప్రమోషన్లు రావాలి – ఇవన్నీ ప్రపంచం తో మీకు ఉన్న సంబంధం వలనే కదా?”

“ అవునండి ”


” వాటిని, మీకు కావల్సిన విధంగా జరిగేలా ప్రభావితం చేయగలరా? ” అడిగారు స్వామి.

” మనకు కావలిసిన విధంగా ప్రభావితం చేయలేము. దానికే కదా భగవంతుణ్ణి ఆశ్రయించడం ” నారాయణ.  

” ఇప్పుడు మీరు అసలు విషయానికి వచ్చారు. ప్రపంచం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి, అలా ఇబ్బంది పడకుండా, ఎప్పుడూ ఆనందంగా ఉండడం కోసం మీరు మొక్కుబడులు, పూజలు, జపాలు వంటి వాటి ద్వారా ప్రయత్నిస్తున్నారు. అవి చేస్తే మీకు కావలిసినవి లభించడం లేదా కావలిసినట్టు జరగడం జరుగుతుందని ఆశ. అవునా? ” అడిగారు స్వామి.  

” అవునండి మనకి కావలిసిన దానికోసమే కదా భగవంతుడిని ఆశ్రయించడం” నారాయణ 

” అయితే, మరి మీకు కావాల్సినవి లభించడం గానీ, లేదా మీరు ఆశించినట్టు జరగడం కానీ అన్నీ జరుగుతున్నాయా ?? లేదా మిగతా ప్రపంచం లో ఎవరికయినా, అన్ని సందర్భాలలోనూ, వాళ్లకి కావలిసినవి భగవంతుడిని ప్రార్థించడం వలన సాధించుకోగలుగుతున్నారా ? ” అడిగారు స్వామి.

” లేదండి. మాకయినా, ఎవరికయినా, ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ఆశించినవి ఒక్కొక్కప్పుడు జరుగుతాయి, ఒకప్పుడు జరగవు ” నారాయణ.  

” ప్రపంచం ద్వారా మనకు వచ్చే సుఖాలు వల్ల సమస్య లేదు. దుఃఖాలు లేకుండా చేసుకోవాలి. అంతే కదా? ” అడిగారు స్వామి.

” దుఃఖాలు లేకుండా చేయమని భగవంతుడిని ప్రార్థించాలంటారా? ” అడిగాడు నారాయణ.  

” ఇప్పుడే అనుకున్నాము కదా! మనం ప్రార్థించినా ఆయన అన్ని మాట్లు మన మొర ఆలకించడం లేదు కదా? “

” మరి మార్గం ఏమిటండి ? ” అడిగాడు ఆనంద్.  


” ఒక మార్గం ఉంది. కానీ దానివల్ల నూటికి నూరు శాతం దుఃఖాలు, నిరాశలూ లేకుండా చేయలేము కానీ, ఎటువంటి దుఃఖం నుంచి అయినా త్వరగా బయటపడిపోయి ఇప్పటి కంటే ఎక్కువ ఆనందంగా జీవించవచ్చు. దాని గురించి రేపు మాట్లాడుకుందాం ” అని లేచారు స్వామి.

నారాయణ, ఆనంద్ నమస్కరించి వచ్చేశారు.  


*******


తరువాత నారాయణ, ఆనంద్ స్వామి చెప్పిన విషయాలు చర్చించుకున్నారు. వాళ్లకి స్వామి చెప్పిన విషయాలు చాలా హేతుబద్ధంగా అనిపించాయి.

కష్టాలు కానీ, దుఃఖాలు కానీ వచ్చినప్పుడు, వాటి ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఆయన చెబుతానని అంటే, అది ఖచ్చితంగా, మంత్రమో, తాయెత్తో కాదని వాళ్ళకి తెలుసు. అటువంటి వాటి వల్ల ఖచ్చితంగా ఫలానా ఫలితం వస్తుందని హామీ ఎక్కడా లేదు. అది చాలామంది విషయం లో చూస్తూనే ఉన్నాము అనుకున్నారు.

మరునాడు, స్వామిని ఆయన ఇంట్లో కలవడానికి వెళ్లారు. ఆయన చిరునవ్వుతో ఆహ్వానించారు.  

” నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు గుర్తు ఉన్నాయా ? ” అడిగారు స్వామి.

” భగవంతుడి తో ప్రమేయం లేకుండా మనం దుఃఖాలు ఎలా తగ్గించుకోవడం అన్నది చెబుతానన్నారు ” అన్నారు ఆనంద్, నారాయణ.  

” మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. భగవంతుడి ప్రమేయం లేకుండా అని కాదు. పూజలూ అవీ చేసి భగవంతుడిని మెప్పించి కష్టాలనుంచి బయటపడడం కోసం ప్రయత్నాలు కాకుండా భగవంతుడు గురించి కొంత సరి అయిన అవగాహన తో, కష్టాల నుంచి ఎలా త్వరగా బయటపడడం అన్నది తెలుసుకుందామనుకున్నాము. అయితే ఇప్పుడు మన ధ్యేయం ఏమిటి? సాధ్యమయినంత మటుకు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం, లేదా దుఃఖపరిచే పరిస్థితులు వస్తే వాటినుంచి ఎలా బయటపడాలి ? ఇది మన ధ్యేయం. అవునా ?. ఇక పైన నేను ‘ ధ్యేయం ’ అన్న పదం ఎప్పుడు వాడినా ఇది మీకు గుర్తు రావాలి.

” అవునండి, మనం ఏ పూజలు, జపాలు చేసినా అందుకోసమే కదా? ” నారాయణ అన్నాడు.  

“ సరే ! ఆ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ధ్యేయాన్ని సాధించాలంటే ఒక విషయం లో మీకు గట్టి నమ్మకం ఉండాలి.

మిగతా వాళ్ళు ఏమి చెబుతున్నారన్నది పక్కన పెట్టి నేను చెప్పే విషయం మీద మీకు చాలా గట్టి నమ్మకం ఉండాలి.

మన ధ్యేయం సాధించడానికి ఇది ఒక భావన ( concept ). దాని గురించి చెబుతాను.

” అదేమిటండి ? దేనిని నమ్మాలి ?” ఆతృత గా అడిగాడు నారాయణ.  


” సంఘటనలు జరుగుతాయి, పనులు చేస్తారు, కానీ వాటిని వ్యక్తిగతంగా చేసే ఒక వ్యక్తి లేడు ( events happen, deeds are done, but there is no individual doer ). ఇదీ భావన. దీనిని నమ్మే ముందు బాగా అర్థం చేసుకోండి ” అన్నారు స్వామి.

” కొంచెం వివరిస్తారా? ” అడిగాడు ఆనంద్.  

” అంటే ప్రపంచం లో ఎక్కడ ఏది జరిగినా, లేదా మీరు ఏ పని చేసినా, లేదా ఇతరులు చేసినా అది వ్యక్తిగతం కాదు. అవన్నీ దైవం అనండి లేదా ఒక అదృశ్య శక్తి అనండి, దాని ప్రభావం వల్ల జరుగుతున్నాయి తప్ప వేరే కాదు. ఇది బాగా నమ్మాలి మీరు ” అన్నారు స్వామి.  

**************************************