.
అది 1980 వ సంవత్సరం. ప్రయాణాలకి పాకేజీ టూర్లు లాంటివి ఎక్కువగా లేని రోజులు. అంటే టూరిజం చాలా బాగా, సౌకర్యవంతంగా లేదనిపించేది. దూరాభారం ప్రయాణాలు, పై దేశాలు అంటే కొంచెం జంకు, భయం. కానీ ఉద్యోగరీత్యా, వ్యాపార నిమిత్తం వెళ్ళేవారుండేవారు. కానీ బహుళ ప్రచారం లేదు.
.
మావారు ప్రమోషన్ పై నైజీరయన్ రైల్వేకి డెప్యుటేషన్ కి వెళ్ళినపుడు, యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసి 10, 15 రోజులు గడిపాము. ‘ లాగోస్ ’ నైజీరియా ముఖ్యపట్టణంలో ఉంటూ వరల్డ్ రైల్వే టైమ్ టేబుల్ ద్వారా అన్ని రైళ్ల సదుపాయాలు, టైమింగులు తెలుసుకుని ‘ రైలు ’ ద్వారానే యూరోప్ లో వియన్నా, ఆమ్‌స్టర్‌డామ్, బ్రసెల్స్ జర్మని, స్విట్జర్‌లాండ్, ప్యారిస్, లండన్ ల టూర్ ఏర్పాటు చేసుకున్నాము. ఏరోఫ్లోట్ సంస్థ ద్వారా మాస్కో మీదుగా ట్రిప్ కుదుర్చుకున్నాము.
.
ఇంటర్నెట్ లు వగైరా లేని సమయం. స్నేహితులు, ట్రావెల్ ఏజెన్సీ సహాయంతో ప్రయోగం చేశాము. ఈ ఏరోఫ్లోట్ కంపెనీ 2 రోజులు మాస్కో మీదుగా రానుపోను చిన్న చిన్న డిస్కౌంట్లతో ఏర్పాటు చేశారు. మా టీనేజ్ పిల్లల్ని బాంబె దాకా ప్లేన్ లో తీసుకువెళ్లి, మీరు మీ జీవితంలో పై దేశాల్లో చదువుకుని ఇలాంటి ప్రయోగాలు చేయగలగా లి అని చెప్పాము. ఆశీర్వదించాము.
.
ఏరోఫ్లోట్ వారి విమానంలో మాస్కో మొదటగా చేరుకున్నాము, వియెన్నా మీదుగా. వియెన్నా ని ‘ land of Mozat ’ అనేవారు. ఎయిర్పోర్టు లో పనిచేసే ఒక లేడీ మా పర్స్ కి తగ్గట్లు మాకు రెండు రోజుల కోసం పెన్షన్ ( Pension ) ఏర్పాటు చేసింది. మంచి బీతోవెన్ కారు ఏర్పాటుచేసి టూరిస్ట్ బస్ ఎక్కించింది. సామాన్లు పెన్షన్ కి భద్రంగా చేరవేశారు. చెన్నైలోని ఎంబసీలో పనిచేసి, వియెన్నా లో నివశిస్తున్న ‘ స్టెల్లా ’ అనే స్నేహితురాలి ద్వారా వియెన్నా అంతా తిరిగాము. అక్కడ రోడ్లు బిజీగా ఉండేవి.
పేవ్‌మెంట్ మీద అమ్మే టీ త్రాగాము. అక్కడ ఇండియన్ ఎంబసీ లో పనిచేస్తున్న రమణ వారి అపార్ట్మెంట్ కు తీసుకు వెళ్లారు. వియెన్నా లో ఉన్న 3 రోజులు వారి ఆతిథ్యం మాకు లభించింది. మూడవరోజు మాస్కో వెళ్లాము. ముక్కలై పోయిన రష్యా వైభవం గురించి – అది చరిత్ర — మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మహా గందరగోళం గా ఉంది. బోలెడన్ని రిపేర్లు, నిర్మాణాలు జరుగుతుందేవి. రాబోయే మాస్కో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేసుకుంటున్నారు అని తెలిసింది.
.
ఇమ్మిగ్రేషన్ వాళ్ళు మా వీసాలు మరుసటి రోజు నుంచేనని, మేము ఒకరోజు ముందుగా వచ్చామని, వెనక్కి వియెన్నా వెళ్లిపోవాలి అన్నారు. చాలా కంగారు, భయం కలిగాయి. చివరికి మా అఫీషియల్ పాస్‌పోర్ట్ లు రక్షించాయి. ఎంతో సందిగ్ధత, ఏమి చెయ్యాలో తోచని స్థితి. ఇంగ్లీష్ సరిగా అర్థం కాని, మాట్లాడలేని గవర్నమెంట్ వ్యక్తుల మధ్య విపరీతమైన ఒత్తిడితో గడిపాము. మమ్మల్ని అయిదారు గంటల సేపు సంధిగ్ధం లో పెట్టి, చివరికి మా తప్పులేదని, ‘ లాగోస్ ’ లోని ఎంబసీ పొరబాటు అని తలకి ఎక్కించుకుని, మావి అఫీషియల్ పాస్‌పోర్ట్ కావడం వల్ల పేపర్ల మీద స్టాంప్ వేశారు. ఆఖరికి మాస్కోలో కాలు పెట్టి ట్రాలీ బస్ లో ( మన ఎలక్ట్రిక్ ట్రైన్ లాగే ఉండి రోడ్ల మీద వెడుతుంది ) ఏరోఫ్లోట్ హోటల్ 8 అంతస్తుల బిల్డింగ్ కి చేరుకున్నాము. గుండె దడ తగ్గాక ఓహో ఇప్పుడు మాస్కో లో ఉన్నాం అనిపించింది.
.
నేను చిన్నతనం నుంచి మేనమామల ఇంట రష్యన్ విమెన్, సోవియెట్ రష్యా మాగజైన్ లు చదివేదాన్ని. అక్కడ స్త్రీలు దృఢంగా ఉండటం, వ్యవసాయం చేయటం, ట్రాక్టర్లు నడపడం అద్భుతం అనిపించేది. ఆరోజుల్లో USSR పూర్తి కమ్యూనిస్ట్ ల ఆధ్వర్యంలో ఉండేది. చారిత్రిక కట్టడాలు, రెడ్ స్క్వేర్, మాగజైన్ లలో చూసినవి ప్రత్యక్షంగా చూస్తూ రోడ్ల వెంట నడవడం ఒక గొప్ప అనుభూతి !
.
పెద్ద పెద్ద మాల్స్ ఉండి కూడా ఎక్కువగా వస్తువులు ఉండేవి కావు. జనం అంతా విదేశీ సరుకుల కోసం, క్యూ లతో పడిగాపులు పడి ఉండటం చూశాం.
మాస్కో వీధుల్లో తినుబండరాలు చిన్న చిన్న ప్లేట్ లలో పెరుగు, జిగురు అన్నం దొరికేవి. ‘ బబూషక్స్ ’ అనే వయసైన స్త్రీలు అమ్మకాలు చేసేవారు. ఐస్ క్రీమ్ కూడా.
.
ఊళ్ళో తిరిగే ట్రామ్స్ ఎక్కువగా, సౌకర్యం కలిగి ఉండేవి. అందుచేత స్వంత కార్లు తక్కువగా కనబడేవి. రోడ్లు అతి శుభ్రంగా ఉంచేవారు. నీటితో మిషన్ల ద్వారా కడిగి రాత్రికి రాత్రి శుభ్రపరచేవారు. అక్కడ రష్యన్ ఫోక్ డాన్స్ లు, 5 స్టార్ హోటల్ cosmos లో చూసాము. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ మాస్కో మెట్రో ’ లో ప్రయాణించి రెడ్ స్క్వేర్, జార్ ( Czar ) ప్యాలెస్ లు, చర్చిలు చూసి వోల్గా నది ఒడ్డున నడిచాము. ‘ టూరిస్ట్ ’ బస్సుల్లో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన గైడ్ లు ఉండేవారు.
.
అటువంటి మాస్కో – రష్యా ముక్కలైపోయి, విడిగా స్వతంత్రంగా ఉంటున్నది నేటి రష్యా. ఇది కాలం తెచ్చిన మార్పు. మానవుని ఆశలు, అసంతృప్తి, అసహనం, జీవనగతులు తెచ్చిన మార్పులు ఇవి. ఎంతో గొప్పగా వెలిగిన రష్యా తుంపులై పోవడం ఒక చారిత్రిక సంఘటనగా నిలిచిపోయింది.
.
తిరిగి మళ్ళీ వియెన్నా వచ్చాము. వియెన్నా వుడ్స్ ( Vienna woods ) వెళ్లాము టూరిస్ట్ బస్ లో. డ్యాన్సింగ్ హార్సెస్, బీతోవెన్ నివాసం, రోలర్ కోస్టర్ రైడ్ ( అదే మొదటి, ఆఖరుది నా జీవితంలో. హడలిపోయాము ). అది ప్రాట్ట్లెర్స్ ప్లేస్ లో ఉంది. రామన్ గారు రాత్రికి సాంబారుతో డిన్నర్ ఇచ్చారు. ప్రాణం లేచి వచ్చింది అనాల్సిందే !—- ప్రయాణల్లో తగిలే ఆప్తులు కొందరు ఉంటారు. వారికి నమస్సుమాంజలులు.
.
తరువాత జర్మనీ పర్యటన గురించి ……….
.
—–(0)—–