10_004 భావ వ్యక్తీకరణ… పత్రికల నిర్వహణ – గాంధీజీ

                   

                     అది 1947 సంవత్సరం నవంబరు 12 ! ఆరోజు దీపావళి. దేశ విభజన జరిగి, మతకల్లోల గాయాలు, కాందిశీకుల యాతనలు ఇంకా తగ్గలేదు. పాకిస్తాన్ నుంచి తరలి వచ్చిన కాందిశీకుల నుద్దేశించి గాంధీజీ కురుక్షేత్రం వెళ్ళి ప్రసంగించాలి. అయితే వెళ్లలేకపోయారు. సరిగ్గా ఈ సమయంలో రేడియోను వినియోగించుకోమని సూచనతో పాటు, వత్తిడి కూడా పెరిగింది. ఇక్కడ వత్తిడి అనేమాట ఎందుకంటే అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా గాంధీ రేడియోలో ప్రసంగించాలని ప్రజలు కోరడం, ప్రపంచ యుద్ధం అనో, మరోటి అనో బ్రిటీషు ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. స్వాతంత్ర్యం సిద్ధించింది. కానీ గాంధీ ఇంకా ఇండియన్ రేడియోలో ప్రసంగించలేదు. కనుక ఎంతోమంది గాంధీని రేడియోలో వినాలని కోరుతూ వచ్చారు. గాంధీజీకి రేడియో అంటే కాస్త బిడియం. చాలామంది అభ్యర్థించడంతో ఆయన అంగీకరించారు. ఢిల్లీ – కురుక్షేత్ర దూరాన్ని జయించాలంటే గాంధీకి రేడియోనే మార్గంగా కనబడింది.

ఎటువంటి సందర్భంలోనైనా అత్యంత అప్రమత్తంగా, ప్రతిభావంతంగా, దాదాపు సంపూర్ణంగా వనరులు వినియోగించుకోవడం గాంధీ విధానం. ఎంత పరిమితమైన వనరులున్నా విజయవంతంగా సాగిపోవడం ఆయన నైజం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని లండన్ నుంచి 1931 డిసెంబరు 28 న గాంధీ బొంబాయి చేరారు. ఆతురతతో ఎదురు చూస్తున్న ప్రజలకూ, ఎందరో నాయకులకు జరిగిన చర్చలు వ్యర్థం అన్నట్టుగా తన రిక్తహస్తాలు చూపించారు. అది ఆ క్షణానికి అవసరమైన వనరులతో సాద్యమైన ప్రభావవంతమైన కమ్యూనికేషన్.

గాంధీ 19 సంవత్సరాల వయసులో ఇంగ్లాండు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి వార్తాపత్రికలను చూశారు. గమనించిందే తడవుగా, వార్తాపత్రికకు ఉన్న సౌలభ్యాలనూ, ప్రయోజనలనూ గుర్తించారు. అంటే రెండేళ్లలో అక్కడ వెజిటేరియన్ పత్రికకు ఆహారం, పండుగలు, సంప్రదాయాలు, అలవాట్లు గురించి రాయడం మొదలుపెట్టారు. వెజిటేరియన్ ఉద్యమంలో చేరారు. రాత, రాతతో ప్రారంభించిన పని ఉద్యమంలా సాగడం మొదలైంది. ఈ ప్రక్రియ ఆయన కనుమూసినపుడే ఆగిపోయింది. దక్షిణాఫ్రికాలో దిగిన మూడో రోజున న్యాయస్థానంలో అవమానం జరిగింది. వ్యాకులపడిన గాంధీ ఆ సంఘటన క్రమాన్ని స్థానిక వార్తాపత్రికకు రాశారు. ఒక్కరోజులో పెద్ద ప్రచారం లభించింది.

35 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికాలో ‘ ఇండియన్ ఒపీనియన్ ’ పత్రికకు బాధ్యతలు స్వీకరించాడు. సంపాదకుడున్నా అన్ని బాధ్యతలు గాంధీ స్వీకరించి మమేకమయ్యారు. ప్రతివారం తప్పక రెండు వ్యాసాలు రాసేవారు. ‘ ఇండియన్ ఒపీనియన్ ’ పత్రికకు ఎక్స్ చేంజ్ కాపీలుగా 200 పత్రికలు లభించేవి. ఆ పత్రికలు చదివి, ఉపయోగపడతాయనే అంశాలను తన పత్రికలో తిరిగి ప్రచురించేవారు. సరళమైన భాషలో, విశేషణాలు, అలంకారాలు లేకుండా, ప్రకటనలు లేకుండా పత్రిక సాగేది. అనువాదంలో, పదాల ఎంపికలో జాగ్రత్త పడేవారు. పేరులేని లేఖలంటే గౌరవముండేది కాదు. తీవ్రమైన విమర్శలున్న వాటిని దాఖలాలతో సహా ప్రచురించేవాడు. పదేళ్లపాటు ఈ పత్రిక కోసం పాటుపడ్డాడు. తొలుత నష్టాలలో నడిచే పత్రికకు ప్రతినెలా 1200 రూపాయలు తను ఖర్చు పెట్టాడు. ఇలా 26,000 రూపాయలు నష్టపోయాడు. ఇది దక్షిణాఫ్రికా విషయం కాగా, భారతదేశంలో ముప్ఫయి సంవత్సరాలపాటు పత్రికలు నడిపారు. ‘ ఇండియన్ ఒపీనియన్ ’ కు గుజరాతీ సంచిక ఉండగా, మన దేశంలో ‘ నవజీవన్ ’ ప్రారంభించి తర్వాత దీన్ని ఇంగ్లీషులో ‘ యంగ్ ఇండియా ’ అన్నారు. ‘ హరిజన్ ’ పత్రికను జైలులో ఉన్నపుడు 1933లో ప్రారంభించారు. దీన్ని ఇంగ్లీషులో ప్రచురించాలని ఒక మిత్రుడు ప్రతిపాదిస్తే అంగీకరించాడు. మొదట పదివేల కాపీలతో ప్రారంభించి, మూడు నెలల్లో స్వయం పోషకత్వం సాధించాలని నిర్ణయించారు. అయితే రెండు నెలల్లోనే స్వయం పోషకత్వం సాధించారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం, తెలుగు, ఒరియా, మరాఠి, గుజరాతి, కన్నడ, బెంగాలీ భాషలలో ప్రచురితమైంది. గాంధీ భారతదేశంలో ఏ పత్రికను నష్టాలతో నడపలేదు. ఆయన ప్రకటనలను ప్రచురించలేదు. అంతేకాదు ఈ మూడు విషయాలను మనం గమనించాలి.

ఒకసారి గాంధీని, ఆయన వ్యాసాలనూ తీసుకువెళుతున్న రైలు ఆలస్యంగా నడుస్తోంది. వ్యాసాలను పోస్టు చేయడానికి అవకాశం దొరకలేదు. ఒక మనిషి ద్వారా వ్యాసాలను బొంబాయి పంపించి, పత్రిక స్వంత ప్రచురణాలయంలో కాకుండా బొంబాయిలో ప్రచురించి పత్రికను సకాలంలో విడుదల చేశారు.

‘ యంగ్ ఇండియా ’ లో ప్రచురింపబడిన విమర్శల కారణంగానే భారతదేశంలో తొలుత గాంధీ అరెస్టు అయ్యాడు.

70 సంవత్సరాల వయసులో కూడా ‘ హరిజన్ ’ పత్రిక పని పూర్తి చేయడానికి అర్థరాత్రి ఒంటిగంటదాకా మేల్కొని పూర్తి చేసేవాడు. నడుస్తున్న రైలులో చాలాసార్లు రాశాడు. ప్రసిద్ధ సంపాదక వ్యాసాలు క్రింద ‘ రైల్లోంచి ’ అని ఉంటుంది. అలాగే కుడిచేయి నొప్పిపుడితే ఎడమ చేతితో రాసేవాడు. జబ్బు చేసినపుడు కూడా వారానికి నాలుగు వ్యాసాలు రాశాడు.

గాంధీ ఎంత ప్రొఫెషనల్ జర్నలిస్టో తెలుసుకోవడానికి ఈ విషయాలు దోహదపడతాయి. 1910లో దక్షిణాఫ్రికాలో అక్కడి బ్రిటీషు ప్రభుత్వం అచ్చు యంత్రాలు మొదలుపెట్టాలంటే భారీ మొత్తంలో డిపాజిట్టు అవసరమనే నియమం పెట్టింది. ఇది పత్రికల ప్రచురణను ఆపడానికి ఉద్దేశించినదే ! దీనిని బాగా వ్యతిరేకించడమే కాదు, శిక్ష కూడా పొందాడు. బ్రిటీషు ప్రభుత్వం మీద 1930 సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ మొదలుపెట్టినపుడు అమెరికాలో ఉన్నవారికి గాంధీ ఇలా టెలిగ్రామ్ పంపారు. “ ఐ వాంట్ వరల్డ్ సింపథి ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ రైట్ ఎగెనెస్ట్ మైట్ ” కేవలం పదకొండు పదాలే, అయినా గొప్ప అర్థాన్ని ఇవ్వడమే కాదు ప్రేరేపిస్తాయి కూడా !

1947 నవంబరు 12 మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ మహాత్ముడు రాజకుమారి అమృతకౌర్ తో కలసి ఢిల్లీలోని బ్రాడ్ కాస్టింగ్ హౌస్ కు వచ్చారు. అప్పటికి రికార్డు చేసి వినిపించే అవకాశం లేదు. ప్రార్థనకు గాంధీ వాడే చెక్కవేదిక వంటిది ఏర్పాటు చేశారు. స్టూడియోలోకి వెళ్ళగానే గాంధీ చాలా సహజంగా మారిపోయాడు. బిడియం మాయమైంది. రేడియో పరికరాన్ని సొంత పరికరంగా భావించాడు. ప్రసంగం హాయిగా 20 నిమిషాలు సాగింది. 1947 నవంబరు 13న హిందూస్తాన్ టైమ్స్ పత్రిక వివరమైన కథనం ప్రచురించింది. అప్పటికి అదే గాంధీకి ఆకాశవాణి ప్రసంగం చివరిదని ఎవరికీ తెలియదు. తర్వాత మూడు నెలలోపే హత్య జరిగింది. ఈ అపురూపమైన గాంధీ ఆకాశవాణి ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ 2001 నుంచి ‘ ప్రజోపయోగ ప్రసార దినోత్సవం ’ ( పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్ట్ డే ) జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రసారమంటే భావ ప్రసారం లేదా సమాచార ప్రసారం.

గాంధీ దీనిని ఎలా పరిగణించారు ? వేటిని తన భావప్రసారానికి వినియోగించుకున్నారు ? ఇటువంటి ప్రశ్నలను పరిశీలించాలంటే ఆయన మొత్తం జీవితాన్ని తరచి చూడాలి. 1946లో కలకత్తాలో మతకలహాలు చెలరేగాయి. ఆ సమయంలో శాంతి స్థాపనకోసం గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. బెంగాలీ పాత్రికేయులు ప్రజలకు సందేశమివ్వండి అని అడిగారు. ఆరోజు గాంధీ మౌనవ్రతం. కనుక పలకమీద బెంగాలీ లిపిలో ‘ అమార్ జీబనీ అమార్ బానీ ’ అని రాశారు. నా జీవితమే నా సందేశం అని ఆ మాటలకు అర్థం. మరి గాంధీజీ ఏమిటో ఎలా తెలుసుకోవాలి ? ఆయన ఏమి చెప్పారో, ఎలా చెప్పారో గమనించి అలాగే ఆయన వస్తువులు, దుస్తులు, పనులు కూడా జాగ్రత్తగా గమనించాలి.

మాటా – మౌనం –

తన కమ్యూనికేషన్ కు మాటను, మౌనాన్నీ వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమారు నలభై సంవత్సరాలు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీషు వాడినా మాతృభాషను, భారతీయ భాషలను ఆయన నిరాదరించలేదు. ఆయన తొలి పుస్తకంతో పాటు ఆత్మకఠను కూడా గుజరాతీలో రాశారు. పత్రికలే కాదు కరపత్రాలు ప్రచురించారు. పుస్తకాలు కూడా వెలువరించారు. మాట పనిచేయని ఛోటా, వేళా మౌనవ్రతం కూడా పాటించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆకారం –

బక్కచిక్కిన మనిషి ! కళ్ళజోడు, చిరునవ్వు, ప్రశాంతమైన కళ్ళు ఇవి మనకు గుర్తొచ్చే అంశాలు. తుండుగుడ్డ, అంగవస్త్రం, చేతికర్ర అదనం. ఇంకా మొల గడియారం, మూడుకోతులు. ఇవన్నీ కూడా మనకు సందేశాన్ని పంచే విషయాలే ! ఆయన సహజత్వాన్ని, సరళా జీవితాన్ని చాటి చెప్పడమే కాదు మన దేశ పరిస్థితులకూ, శీతోష్ణస్థితికి, ఆర్థిక పరిస్థితికి తగిన విషయాలని కూడా తెలుసుసుకుంటే బోధపడుతుంది.   

ప్రవర్తన – మాటమాత్రమే మృదువు కాదు, ప్రవర్తన కూడా లలితం. మహా ఓపిక. తన శత్రువుకు కూడా హానిచేయని ఆలోచనారీతి. నచ్చజెప్పి, అందరం మెరుగు కావాలనే ధోరణి. దానికోసమే సత్యాగ్రహభావనను ప్రపంచానికి అందించిన ప్రతిభావంతుడు. మన దేశంలోని మతాలన్నింటిలో ఉండే మంచిని స్వీకరించిన ఉదారుడు. ఆయన స్పృశించని ఆలోచన లేదు. తలపెట్టని సత్కార్యం లేదు.

ఆయన దీనికి వాడిన విధానం సంభాషణం. తద్వారా సమాజాన్ని సంబాళించడం. కనుక ఆయన మార్గం సవ్యమైన, సమగ్రమైన జర్నలిజం, తద్వారా సిద్ధించే ఆరోగ్యవంతమైన, ఆశావహమైన సమాజం గమ్యం గాంధీ నిత్యస్ఫూర్తి !

*********************