10_004 మేఘబంధం

మనసులోని భావాల సుమాల మాల కట్టి

వినువీధిలో విహరించమని

పంపిస్తున్నా..  ఇదిగో.. ఈనాటి నా మేఘమాల !

ఒక్కో అక్షరం పోగేసుకుని 

సాగిపోయే నా కవిత్వంలా

ఒక్కో చుక్క  పోగేసుకుని

భూగోళమంతా పంచిపెడుతూ 

 మేఘమాల  !

భానుడి ప్రతాపానికి – నీటి చుక్కలు

నిర్దయుల  కాఠిన్యానికి నా విన్నపాలు ఆవిరౌతూనే ఉంటాయి

“రేబవళ్ళు- ప్రకృతి ధర్మం..పద ముందుకు !”

అని బోధ చేస్తూ..  మేఘమాల  !

మెట్టు మెట్టుగా.. ప్రతిరోజు

పాఠాలు నేర్చుకుంటూ నేను,

మహోన్నత లక్ష్యం కోసం

నింగిలో వేలాడుతూ..  మేఘమాల !

పిట్టతో చెట్టు తో మమేకమై

పరవశించే నేను..

ప్రకృతికే ప్రాణమై  

పరుగులు తీసే మేఘమాల !

నా ఆత్మగౌరవాన్ని ఎవరైనా

 దెబ్బ కొడితే..  నిద్రలేచిన సింహమౌతా

“శాంతి నా మంత్రమే – బలహీనత కాదం”టూ

ఎదురు దెబ్బలకి గర్జిస్తుంది మేఘమాల !

ఇతరుల కంటతడి  చూస్తే..

ద్రవిస్తుంది నా హృదయం

దాహార్తినున్న చెట్టుచేమల్ని చూసి

అమ్మై  వర్షిస్తుంది ..  మేఘమాల !

నా దారిలో..నే పోతుంటే

వెంటపడే ప్రియుడిలా

నాతోపాటు నడుచుకుంటూ

నాకు గొడుగు పట్టేది,  కదిలే *మేఘమాల !

ఎన్నిసార్లు నాచెక్కిళ్లపై కనురెప్పలపై

చిలిపి తుంపర్ల సరసాలాడలేదు?

దోబూచులాటల్తో ఆటపటిస్తూ

ఉరుముల మెరుపుల సందేశాలు

కానుక చేయలేదు.. ఈ మేఘమాల ..?

అప్పుడే వచ్చి తేలిపోయే మనస్పర్ధలు

పిడుగుపాటు వార్తలు

అకస్మాత్తుగా పలకరించే

సమస్యల తుఫాన్లు

 ఒకటా.. రెండా.. ఎన్నని   నీ ఆగడాలు..?  ఓ మేఘమాల !

 

*నీదీ – నాదీ  నూరేళ్ల బంధమేమో

నీలో -నన్ను,  నాలో – నిన్ను

చూసుకుంటూ నేను….*

రచయిత్రి స్వరంలో…..

******************************