12_008 తాండవ శివుని పంచసభలు

పంచసభలు…. నాట్యాచార్యుడైన నటరాజే స్వయంగా వివిధ సందర్భాలలో తన భక్తుల కోసం నర్తించిన పుణ్య వేదికలు. తమిళనాడులో నెలకొన్న ఈ ఐదు క్షేత్రాల గురించి……

 

కనక సభ

శివ నర్తనం చూడాలన్న సంకల్పంతో ఆదిశేషుడు వ్యాఘ్రపాదుడనే ఋషితో కలిసి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు ఆనంద తాండవం చేసిన వేదిక కనక సభ. రెండు వేల సంవత్సరాలుగా వాస్తు, శిల్ప, ప్రదర్శనా కళల శాస్తాలను ప్రభావితం చేస్తున్న చిదంబరం దేవాలయంలో కనక సభ నెలకొని ఉంది. ఈ సభనే తమిళంలో “ పొన్ ( బంగారు ) అంబళం ( సభ ) ” అని అంటారు.

 

రజత సభ

శివుడు సుందరేశ్వరుడిగా పాండ్యరాజు కుమార్తె మీనాక్షి ( పార్వతిని ) పెళ్లాడాడు. మధురైలో జరిగిన ఈ వెదుకను చూడ వచ్చిన పతంజలి, వ్యాఘ్రపాదులు చిదంబరంలో తన తాండవాన్ని చూసిన తరువాతే భోజనం చేస్తారు కాబట్టి వారి నియమాన్ని శివుడు గౌరవించి ఇక్కడ కూడా ఆనందంగా నర్తించాడట. సాయం సంధ్యలో చేసిన ఈ తాండవం పేరు ప్రదోష తాండవం. ఆ వెదికే మీనాక్షీ దేవాలయంలోని రజత సభ.

తమిళంలో “ వెళ్ళి ( వెండి ) ” అంబళం అని పేరు.

 

తిరువాంగాడు

భూమిని కలి ప్రభావం నుంచి కాపాడమని నారదుడు వేడుకొనగా శివుడు, కలి నాట్యంలో పోటీ పడ్డారు. పోటీ మధ్యలో శివుని చెవి ఆభరణం జారీ పడిపోయింది. నాట్యాన్ని ఆపకుండానే ఎడమ కాలితో అలవోకగా ఆభరణాన్ని తీసి చెవికి తగిలించేసుకున్నాడు ఆది నర్తకుడు. క్లిష్టమైన ఈ భంగిమను కలి చేయలేక, ఓడిపోయి వెనుదిరిగాడు. ఈ మహత్తర ఘట్టం జరిగింది చెన్నై, కాంచీపురం దారిలోని తిరువాంగాడు లో. రత్న కర్ణాభరణానికి గుర్తు అయిన ఈ వేదిక పేరు “ రత్న సభ ”.

 

తామ్ర సభ

తామే దేవుళ్ళమని చెప్పుకున్న మునుల అహంకారాన్ని అణచేందుకు సాంబశివుడు ఆడిన స్థలమే “ తామ్ర సభ ” గా పేరుగాంచింది. అద్భుతమైన కళానైపుణ్యంతో విరాజిల్లుతున్న ఈ తామ్ర ( ఇత్తడి ) సభ తిరునల్వేలి లోని నెల్లైయప్పర్ దేవాలయంలో ఉంది. మునుల కోసం చేసిన్ తాండవం ముని తాండవం అయింది.

 

చిత్ర సభ

కుట్రాళంలోని కుట్రాళేశ్వర దేవాలయంలో ఈ సభను చూడవచ్చు. వందల సంఖ్యలో ఇతిహాసాల కథలను చెప్పే అందమైన చిత్రాలను కలిగినది కాబట్టి ఈ సభ “ చిత్ర సభ “ అని పేరు పొందింది. ఈ సభ వాస్తు పరంగా మిగతా నాలుగు సభలను పోలి ఉన్నా ప్రధాన ఆలయానికి దూరంగా ఆహ్లాదకరమైన పరిసరాలలో నెలకొంది. త్రిపురాసుర సంహార సమయంలో చేసిన తాండవం చిత్ర తాండవం అని ప్రముఖ యువ భరతనాట్య కళాకారుడు సెంథిల్ వివరించారు.     

—— ( 0 ) ——

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page