12_011 ముకుందమాల – భక్తితత్వం

 

38.    శ్లో॥     ధ్యాయంతి యే విష్ణు మనంత మవ్యయం

                హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం

                సమాహితానాం సతతాభయప్రదం

                తే యాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం!

            నిరంతరం  హృదయ పుండరీకంలో సుస్ధిరంగా నిలచి ఉన్నవాడూ, తనను ధ్యానించే వారికి ఎప్పుడు అభయమిచ్చేవాడూ, ఆద్యంతాలు లేనివాడూ,  శాశ్వతుడూ అయిన విష్ణువును, ఎవరు ధ్యానిస్తారో వారు విష్ణుసంబంధమైన పరమ సిద్ధిని పొందగలరు.  ఈశ్వర స్వరూపం 5 విధాలుగా ఉంటుంది. 

అవి 1. పరము  2. వ్యూహము   3. విభవము   4. అంతార్యామి    5. అర్చ  అన్నవి.

            మొదటిదైన పరతత్వం శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటుంది. రెండవదైన వ్యూహతత్వం క్షీరసముద్రంలో శేషశయ్యపై పవళించి ఉండి, ప్రణవోపాసకులను అనుగ్రహించడానికై వేంచేసి ఉంటాడు. మూడవదైన విభవస్వరూపం ` ధర్మసంస్థాపనార్థం ఆయా కాలాల్లో రామకృష్ణాది అవతారాలలో సులభుడై చరించేదిగా చెప్పబడిరది. ఇక నాల్గవదైన అంతర్యామి`హృదయస్థానంలో దహర పుండరీకంలో ఉండేది. ఆలయాలలో, గృహాలలో మనచేత ఉపచారాలందుకుంటూ ఉండేది. అర్చావతారం. ఈ అర్చావతారునికే మనం షోడశోపచారాలతో పూజచేసి, పూజావసాన సమయంలో మంత్రపుష్పం సమర్పిస్తాము. ఈ ఐదింటిలోనూ కూడా హృదయపుండరీకంలో ఉండే భగవానునే ధ్యానించాలి. ‘

         శ్లో ॥    ధహ్రంవిపాప్మం పురమధ్య సంస్థం

                 హృత్పుండరీకం పరవేశ్మభూతం

            అని మన శరీరమధ్యభాగంలో పరమ పురుష నివాసస్థానంగా, సూక్ష్మమైన దహర పుండరీకం ఉంటుంది. దాని యందు అనంతుడు అవ్యయుడు అయిన విష్ణువు అంగుష్టమాత్రుడై ఉపాసకులను అనుగ్రహించడానికి వసించి ఉంటాడు. ఆ పరమాత్మ యందే మనసును ఏవిధమైన విచ్ఛేదం లేకుండా నిలిపి ప్రీతి పూర్వకంగా తలచడమే ధ్యానం. అలా ధ్యానించ గలిగిన వారికి పరమాత్మ సాక్షాత్కరించడమే కాదు. ఆ స్మృతిని సదా నిలిపి ఉంచి, అభయాన్ని ఇవ్వగలడు పరమాత్మ. అంతేకాదు అలా ఉపాసించిన వారు పరమంపదం అని చెప్పబడే పరంధామమనే వైష్ణవస్థానాన్ని కూడా పొందగలరు. అంటూ హృదయ పుండరీకంలోని స్వామిని ధ్యానించాక, క్షీరసాగర శయనుని మోహన రూపాన్ని వర్ణిస్తున్నారు.

39.     శ్లో।   క్షీరసాగర తరంగ శీకరా సార తారకిత చారుమూర్తయే

              భోగి భోగ శయనీయశాయినే మాథవాయ మధువిద్విషే నమః

            భక్తులననుగ్రహించడానికై పాల కడలిలో శేషశయ్యపై, నీలమేఘ శ్యామలుడైన నారాయణమూర్తి శయనించి ఉన్నాడు. ఆ నీల మేఘ శ్యామలమగు మధుర మంజుల దివ్యమంగళ విగ్రహంపై క్షీరసాగర తరంగాల నుండి గాలికెగసి పడిన పాలతుంపరలు ముత్యాల్లా భాసిస్తూ నీలాకాశంపై నక్షత్రాల్లా, మిలమిలా మెరుస్తూ ప్రకాశిస్తున్నవి. అటువంటి మదుసూదనుడైన మాధవునకు నమశ్శతాలు అర్పిస్తున్నారు మహారాజు.

40.             యస్య ప్రియౌ శృతిధరౌ కవిలోకవీరౌ

                మిత్రే ద్విజన్మవర పద్మశరావభూతాం

                తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన

                రాజ్ఞా కృతా కృతి రియం కులశేఖరేణ ॥

            వేదవిద్యాప్రతిష్టాపకులు, కవిలోకవీరులూ అగు ద్విజన్మవర, పద్మశరులు ఎవరికి మిత్రులైయుండిరో ఆ పుండరీకాక్ష పదాంబుజ భృంగమగు కులశేఖరులచే ఈ ముకుందమాల రచింపబడిరది. అంటూ కులశేఖరులు తాను ఈ కృతికి కర్తనంటూ చివరి శ్లోకంలో చెబుతున్నారు. ‘‘వేదః ప్రాచేతసాదాసీ త్సాక్షాద్రామా యణాత్మనా’’ అని వేదమే రామాయణమై అవతరించినట్లు పెద్దలు చెప్తారు. అదే విధంగా తమిళంలో నమ్మాళ్వార్ల నాలుగు గ్రంధాలూ నాలుగు వేదాలని ద్రావిడ సంప్రదాయం. శ్రీమద్రామాయణం నమ్మాళ్వార్ల తిరువాయ్‌మొళి ఈ రెండు గ్రంధాలూ శ్రీ కులశేఖరులకు ఎంతో ఇష్టమైన గ్రంథాలు.

            సృష్ఠిలో అన్ని జీవరాసులలోకీ మానవజన్మ ఉత్తమమైనది. అందుకే

         శ్లో॥    దుర్లభంత్రయమే వైత దేవానుగ్రహ హేతుకం

                మనుష్యత్వం ముముక్షత్వం, మహాపురుష సంశ్రయమ్‌ ॥

అంటారు పెద్దలు. ఉత్తమమైన ఈ జన్మ లభించినా ఈ సంసార జంజాటంలోనే గడిపేస్తూ, ప్రాపంచిక సుఖాలేధ్యేయంగా బతకకుండా, భగవంతుని చేరాలనే కోరిక కల్గుడం ఒక ఎత్తు. అలా కోరుకున్నా ఎలా సాధన చేయాలో తెలియనప్పుడు. అందుకు దారి చూపే మహానుభావులు లభించడం ఓ ఎత్తు. అలాంటి మహా పురుషుల సాంగత్యం లభించడం మరీ ముఖ్యం. అలా సాధన చేయాలనుకునే అందరికీ దారి చూపడానికే శ్రీ కులశేఖరులు ఈ ముకుందమాలను రచించారు.

            మరోజన్మనెత్తవలసిన అవసరం రాకుండా, ఈ జన్మలోనే సక్రమమైన బాటలో చరించి, ధర్మార్థకామమోక్షాలను సాధించాలని ఆర్షధర్మం ప్రతిపాదిస్తోంది. ధర్మబద్ధమైన జీవితంతో అర్థకామాలను ఆర్జిస్తే మోక్షం కరతలామలకమవు తుందంటారు పెద్దలు. ఇలా పురుషార్థాలను సాధించి, పరమేశ్వరుని చేరడానికి అనేక మార్గాలు సూచించబడ్డాయి. కర్మ, భక్తి, జ్ఞానమార్గాల గురించి చెప్పారు గీతాచార్యులు. వీటిలో ‘‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవవిశిష్యతే’’ అనీ ‘‘అన్యస్మాత్‌ సౌలభ్యం భక్తౌ’’ అనీ అన్నిటికన్నా భక్తి సులభం అని చెబుతారు నారదుల వారు. ఈ భక్తిని తొమ్మిది విధాలుగా చెబుతారు. ‘‘తనుహృద్భాషల సఖ్యమున్‌, శ్రవణమున్‌, దాసత్వమున్‌, వందనార్చనముల్‌, సేవయు, నాత్మలో నెరుగకయున్‌ సంకీర్తనల్‌ చింతనంబులు.  ఈ తొమ్మిదింటిని భక్తి మార్గాలుగా చెబుతారు ఈ తొమ్మిది వేటికవి విడివిడిగా ఆచరించేవని కాదు కానీ, భక్తి అన్నది మూలంగా, వీటిల్లో అన్ని పద్దతులనూ అనుసరిస్తాడు భక్తుడు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిపై ఎక్కువ  మక్కువ  ఉంటుంది. సఖ్యానికి అర్జునుడు, శ్రవణభక్తికి పరీక్షిత్తునూ,  దాసత్వానికి ఆంజనేయునీ, ఇలా ఒక్కొక్కరినీ ఒక్కొక్క భక్తికి ఉదాహరణగా చెప్పుకుంటాము కానీ, ఈ అందరూ అన్నివిధాల భక్తి భావాలనూ అనుసరిస్తూ భగవంతుని కొల్చినవారే! శ్రీకులశేఖర మహారాజు తమ ముకుందమాలలో ఈ అన్నివిధాలైన భక్తిమార్గాల గురించీ చెప్పారు.

            శ్రీ కులశేఖరాళ్వార్లు రచించిన ముకుందమాల పూర్తికావస్తూంది. ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత  భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’. భగవంతునిపై ప్రేమగా మొదలై, అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మేనన్న విషయం తెలియరావడంతో అందరినీ తనలా ప్రేమించే స్వభావం ఏర్పడుతుంది. అందువలన ఘర్షణకు అవకాశం తగ్గుతుంది. ఇదే సర్వమానవ సౌభ్రాతృత్వానికి దారి.

            ఏ పనినైనా కర్తవ్యంగా మాత్రమే చేయడం, విపరీతమైన ఆశలకు పోకపోవడం, తృప్తీ, ధైర్యం ఇవన్నీ భక్తివలన భక్తుడికి సంక్రమించే సల్లక్షణాలు. ధైర్యం భక్తివలన ఏవిధంగా కల్గుతుందీ ? అని ప్రశ్నించితే తప్పక కల్గుతుంది నమ్మకంతో తన భారాన్ని భగవంతునిపై ఉంచి, తాను ఆ స్వామి భావనలో, చింతనలో, స్మరణలో కాలం గడిపేస్తాడు భక్తుడు. అటువంటి వారి యోగక్షేమాలు భగవంతుడు తానే వహిస్తానని చెప్పాడు కదా!

         శ్లో॥    అనన్యాశ్చింతయంతోమాం ఏజనాః పర్యుపాసతే

                తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥

            భక్త ప్రహ్లాదుని గురించి మనందరికీ తెలుసు. ‘‘యోగక్షేమం వహామ్యహం’’ అన్నమాటను అక్షరాలా నిల్పుకున్నాడు కదా భగవంతుడు! బాలుడైనా, భక్తుడైన ప్రహ్లాదుడు మనసును పూర్తిగా పరమేశ్వరునిపై లగ్నం చేశాడు. ‘‘ఈ శరీరం ఉంటే, దానితో భగవంతుని పూజించి, సేవిస్తాను. అలాకాక తండ్రీ! ఈ శరీరాన్ని అంతం చేస్తే పరమాత్మా నీలో కలిసి పోతాను!’’ అదీ ఆ బాలుని ధైర్యం. నమ్మకం. తన్ను నమ్మిన భక్తుని కాపాడే బాధ్యత ఎప్పుడూ పరమాత్మే వహిస్తాడు! ఇంక భక్తునికి ధైర్యం కాక?! మరి కేవలం భజనలు, సంకీర్తనలూ అంటూ కాలం గడిపేస్తే, ఇతర ప్రాపంచిక వ్యవహారాలెలాగూ? అదీ ఈ పరుగుల కాలంలో! అని ప్రశ్నించ వచ్చు. నిజమే కాలమంతా అలాగే గడపమని కాదు. కర్తవ్యాన్ని కాదని దేనినీ చెయ్యమనదు శాస్త్రం. అందుకు ధర్మవ్యాధుని కథే ఉదాహరణ. ఒక నిర్ధిష్టమైన కాలం ఇతర వ్యాసంగాలకు అడ్డురాని కాలం, అది సాధారణంగా బ్రాహ్మీముహూర్తం  అవుతుంది. భగవదారాధనకు కేటాయించుకుని, ఆపై మనసును పరమాత్మ భావనలో ఉంచి, ‘‘యద్యత్కర్మకరోమి తత్తదభిలం శంభోతవారాధనం’’ అనే భావనతో మనం చేసే ప్రతీ పనీ భగవంతుని ప్రీతి కోసమేననుకుంటూ, చేయగల్గిన నాడు భగవత్ప్రాప్తి కలుగుతుంది. ఆయా సాధనలూ, వాటికి ఉన్న అవాంతరాలూ, వాటిని అధిగమించడానికి ఉపాయాలూ కులశేఖరుల వారు తమ ముకుంద మాలలో చెప్పనే చెప్పారు కదా!

            ఇంతటితో శ్రీ కులశేఖరాళ్వార్లు రచించిన ముకుందమాల సమాప్తమైంది. మహారాజు గారి శ్లోకాలతో పాటు ఇతర భాగవతుల భక్తవాగ్గేయ కారుల సారూప్య భావాలను కూడా చెప్పుకున్నాంకదా. ఏ యుగంలోనైనా ఏకాలంలోనైనా భక్తుల భావాలు ఒక్కలాగే ఉండటం గమనించాం.

                 కద్దన్న వారికి కద్దు కద్దని మొరలనిడు

                 పెద్దల మాటలు నేడబద్ధమౌనో              ॥ కద్ద ॥

            అందుకే ఉన్నాడని నమ్మి సేవిస్తే తప్పక మన యెడ తానుండి రక్షిస్తాడు పరమాత్ముడు. సంస్కృతంలో ఆదికవి వాల్మీకి రచించిన రామాయణమూ, తమిళంలో శ్రీ నమ్మాళ్వార్లు రచించిన తిరువాయ్‌యొళి ఈ రెండు గ్రంధాలూ శ్రీ కులశేఖరులకు ఎంతో ఇష్టమైనవి. అలాగే వాల్మీకి మహర్షినీ నమ్మాళ్శార్లనూ తమ  మిత్రులుగా సంభావిస్తారు మహారాజు. అట్టి మహనీయుడైన కులశేఖర మహారాజు శ్రీ కృష్ణ భక్తి పూరితమైన ముకుందమాలను మనకనుగ్రహించారు. అనన్య భక్తితో భగవంతుని చేరగలిగే సుగమమైన దారిని మనకు చూపిన, శ్రీ కులశేఖర మహారాజులు పయనించిన దారిలో మనమూ పయనించి, ప్రశాంతినీ కైవల్యాన్ని పొందుదుము గాక!

 

ఓం అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయా

ఓం శాంతిః శ్శాంతిః శ్శాంతిః

హరిః ఓం

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page