ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వు లొలుకుదంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
ముత్యాలహారాలు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నది, నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలది, ఘల్లుమంటున్న అందెలు ధరించినది, పద్మములవంటి సౌందర్యము కలది, కోరికలనన్నిటినీ తీర్చునది, హిమవంతుని కుమార్తెయైనది, సరస్వతి- లక్ష్మీదేవులచే సేవించబడుచున్నది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైన్నది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఈశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింపచేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగవాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
అనేక యోగుల- మునీశ్వరుల హృయములందు నివశించునది, అనేకకార్యములను సిద్దింపచేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండుపాదములు కలది, నారాయణునిచే పూజింపబడునది, నాదబ్రహ్మస్వరూపిణియైనది, శ్రేష్ఠమైనదాని కంటే శ్రేష్ఠమైనది, అనేక పదార్థముల తత్త్వమైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.
జయ జయ శఙ్కర హర హర శఙ్కర