ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను తెలుగు వారు ఉన్నారు. విదేశాల్లో నివశిస్తున్న తెలుగు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానితో బాటే తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద వారికి మక్కువ పెరుగుతోంది. తమ తర్వాత తరాలకు వీటిని అందించాలనే తపన పెరుగుతోంది. ఫలితంగానే అనేక ప్రవాస తెలుగు సంఘాలు, తెలుగు రేడియో లు, టీవీ ఛానళ్ళు వస్తున్నాయి. ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాలతో పోటీగా జరుగుతున్నాయి.
ప్రపంచంలో ప్రతి చిన్న, పెద్ద భాషలన్ని రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే ఇతర భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక నేపధ్యాన్ని / థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ, 1999 నవంబరు 17న తీర్మానించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో ప్రకటిస్తోంది.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అలాగే మన మాతృభాష అయిన తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.
‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి ’ అనేది ఈ ఏడాది థీమ్. ఈ సందర్భంగా పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్‌షాప్ జరిగాయి. ‘భాషల లెక్కింపు’పై ఒక డిబేట్ కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
“ విద్యనందించడం, అందరినీ సమాజంలో భాగస్వాములు చెయ్యడానికి బహుభాషా వాదాన్ని పెంపొందించడం ” అనేది భాషల్ని కాపాడటానికి, బహుభాషా వాదాన్ని అభివృద్ధి చెయ్యడానికి దోహద పడుతుందని యునెస్కో అభిప్రాయపడింది. అప్పుడే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు నెరవేరుతాయని ఆ దిశగా దృష్టి సారించింది. బాల్యాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని, ప్రాథమిక విద్యను అభ్యసించాలంటే మాతృభాష ఆధారంగా మొదటి సంవత్సరం నుంచీ బోధన జరగాలని యునెస్కో అంటోంది.
తెలుగు గడ్డకు దూరంగా ప్రవాసంలో ఉంటున్న తెలుగు వారు తమ మాతృ భాషా వైభవాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవడానికి తర్వాత తరాలకు అందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి మాతృభాషాభిమానానికి నిదర్శనమే 2021 ఫిబ్రవరి 21 వ తేదీన హాంగ్‌కాంగ్ లో తెలుగు భాషావికాసానికి కృషి చేస్తున్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాలంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృభాషా దినోత్సవం, అందులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు.
ప్రవాసాంధ్రులు తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషిని తెలియజేసే మరో నిదర్శనం ఈ సందర్భంగా మనకి కనిపిస్తుంది. అంతర్జాలంలో సమాఖ్య నిర్వహించిన మాతృభాషా దినోత్సవానికి ముఖ్య అతిథి గా మారిషస్ లో ఉండే సంజీవ నరసింహ అప్పడు పాల్గొన్నారు. వారికి తెలుగుపై ఉన్న మక్కువ గురించి, మారిషస్ లో ఆ భాషా వికాసానికి ఆయన చేస్తున్న అలుపెరగని పోరాటం గురించి చెప్పడం ముదావహం.
సుమారు 250 సంవత్సరాల క్రితమే తెలుగు నెల నుంచి మారిషస్ కి కొన్ని తెలుగు కుటుంబాలు జీవనోపాధి కోసం వలస వెళ్ళాయి. అక్కడే స్థిరపడి అక్కడి ప్రజలతో మమేకమై, అక్కడి ప్రాంతీయ భాషలనే మాతృభాషగా చేసుకుని జీవిస్తున్నారు. తెలుగు ప్రాంతానికి దూరమైన వీరికి తెలుగు భాష కూడా దూరమైంది. నేర్చుకుందామన్నా అవకాశాలు మృగ్యం. ఆ పరిస్థితుల్లో పెద్దబాలశిక్ష సహాయంతో తెలుగు భాషను అభ్యసించి, తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు వారికంటే స్వచ్ఛంగా మాట్లాడగలిగి, వ్రాయగలిగే స్థాయికి చేరుకున్నారు సంజీవ నరసింహ అప్పడు. తెలుగు సంస్కృతి, సాహిత్యం మీద ఆయనకున్న అభిమానానికి ప్రతీకలుగా తెలుగు సాంస్కృతిక వారసత్వం గురించి అద్భుతంగా రావి ఆకులపై చిత్రించిన 1400 పైగా చిత్రాలు నిలుస్తాయి.
ఇవిగాక హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య హాంగ్‌కాంగ్ లో తెలుగు భాషా వికాసానికి, సంస్కృతీ వికాసానికి మరికొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పళ్ల సంబరాలు, పెద్ద పిల్లలకోసం ‘ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ ’ పేరుతో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం పిల్లలకోసం “ పిల్లలూ ! కథ విందామా !! ” పేరుతో అంతర్జాలంలో చక్కటి కథలను వినిపిస్తూ వారిలో తెలుగు భాషపై ఆసక్తిని పెంచుతున్నారు.
.
హాంగ్‌కాంగ్ లోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఇంకా అనేక దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ స్వంత గడ్డకు, భాషకు, సంస్కృతికి దూరమయ్యామనే భావన లేకుండా అనేక రకాలుగా వారున్న ప్రదేశాలలోనే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు తల్లికి తమ వంతు సేవ చేస్తున్నారు.
.
జై భారత్ !
జై తెలుగు తల్లి !
జై హింద్!!
******************************
.
— Peesapati Jaya
Org : The Hong Kong Telugu Samakhya
Mail : telugusamakhyahk@gmail.com
.
___________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
___________________________________________________