10_009 తో. లే. పి. – ఇన్గే స్టెగ్ ముల్లర్

              విశాఖపట్నం అంతర్జాతీయ కేంద్రం గా కొన్ని దశాబ్దాల క్రితం స్థాపించబడిన ఆధ్యాత్మిక సంస్థ జగర్గురు పీఠం. అనాదిగా వస్తూన్న భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల గురించిన అవగాహన ను అందరికీ విస్తృత స్థాయిలో కల్పించడమే ఈ  సంస్థ ప్రధానోద్దేశము. ఈ సంస్థ కార్యకలాపాల నేపథ్యం లో మన  ప్రాచీన పురాణ ఇతిహాస గ్రంధాలు, జ్యోతిష శాస్త్రం, శాస్త్రీయ సంగీతము, సాహిత్యము, వైద్యం మొదలైనవి చోటు చేసుకున్నాయి. రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు, హోమియో, ఆయుర్వేద వైద్య సేవ వంటివి సుశిక్షితులైన వారి పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్నాయి, ఈ విధంగా శిక్షణ పొందినవారిలో మన భారతీయులతో బాటుగా విదేశీయులు కూడా ఉండడం విశేషం. ఈ సంస్థ కు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలలోనే కాకుండా స్విట్జర్లాండ్,, బెల్జియం, ఫ్రాన్సు తదితర దేశాలలో కూడా శాఖలున్నాయి.. సేవాభావం ఈ సంస్థ యొక్క ప్రాధమిక లక్ష్యం. ఇందులో కార్యకర్తలందరు నిస్వార్ధ సేవాభావం తో పనిచేసేవారై ఉండడం గమనార్హం. ఈ సంస్థ వ్యవస్థాపకులు కులపతి మాన్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు.– వ్యవహార నామం — మాస్టర్ ఇ. కె. గారు…

ఈ సేవా సంస్థ తో నేనూ అనుబంధాన్ని అణుమాత్రమైనా కలిగి ఉండడం నా పూర్వ జన్మ సుకృతం. అంతే కాకుండా పూర్వాశ్రమం లో — అంటే 1957-58 ప్రాంతాలలో నేను గుంటూరు లోని హిందూ కళాశాలలో చదువుకుంటున్న రోజులలో శ్రీ కృష్ణమాచార్య మాస్టరు గారు ఉపన్యాసకులుగా మాకు గురుస్థానం లో ఉండి, శ్రీ విశ్వనాధ విరచిత ‘ ఏకవీర ‘– ఉపవాచకాన్ని బోధించేవారు. 

నేను ప్రత్యేకించి ప్రతీ ఏడాది విశాఖపట్నం, గుంటూరు తదితర పట్టణాలలో నిర్వహింపబడే గురుపూజా మహోత్సవాలలో సాధారణం గా పాల్గొనేవాడిని… అటువంటి ఒక సందర్భం లో జగద్గురు పీఠం, విశాఖపట్నం లో జరిగిన ఒక ప్రవచన కార్యక్రమ సందర్భం గా జర్మనీ దేశస్థురాలు శ్రీమతి ఇన్గే స్టగ్ ముల్లర్ తో పరిచయం ఏర్పడింది. తనకి భారతీయ సంప్రదాయం, కట్టు, బొట్టు, సంగీత సాహిత్యాలంటే అపారమయిన గౌరవము, భక్తి అని చెబుతూ ఆ ఆకర్షణ తో ఈ కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నానని చెప్పారు. సంస్థ వారు నిర్వహించే అనేక కార్యక్రమాలలో ఎంతో ఆసక్తితో పాలు పంచుకుంటున్నానని చెప్పారు… అదే ఆసక్తితో తెలుగు భాష ను కూడా గురుముఖం గా నేర్చుకుంటున్నానని కూడా వారు నాతో చెప్పడం జరిగింది. 

ఈ గురుపూజా మహోత్సవాలకు హాజరై, తిరిగి నేను మా వూరు, గుంటూరు చేరాకా ముల్లర్ గారికి మర్యాద పూర్వకం గా కృతజ్ఞతలను తెలుపుతూ నేను ఉత్తరం వ్రాసాను… దానికి ఆమె వెంటనే స్పందిస్తూ ఎన్నో విశేషాలను పేర్కొంటూ నాకు ఉత్తరం వ్రాసారు. ఈ ఉత్తరం లోని అంశాలను అన్నిటినీ పరిగణిస్తే, అది వారి అంతరంగ కథనం అని చెప్పక తప్పదు… 

దేశకాలమానాలకు అతీతంగా, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలపట్ల ఏర్పడిన ప్రత్యేక ఆకర్షణ తో వాటిని మనసారా అభిమానించి, గౌరవించి, ఆచరించి చూపే ఇంగే స్టెగ్ ముల్లర్ వంటి వారు మరెందరికో ఆదర్శప్రాయులు. 

వారి లేఖ ఈనాటి మన తోక లేని పిట్ట — తిలకించండి ~  దయచేసి స్పందించండి. 

<><><>***  ధన్యవాదములు… నమస్కారములు ***<><><>