10_009 ఆనందసిద్ధి

” అంతా ఈశ్వరేచ్ఛ అని మనవాళ్ళు ఇదివరకు చెప్పిందే కదా ? అంటే ఏది చేసినా నేను కర్తను కాదు అనుకోవడం అనే కదా ? ” అన్నాడు  నారాయణ 

” నిజమే కానీ అవి మాటలుగానే మిగిలిపోయాయి. దానిని నూటికి నూరుశాతం మనఃస్ఫూర్తిగా నమ్మితే మన  ” ధ్యేయం ”  సిద్ధించినట్టే ( ధ్యేయం అనగానే మనం పైన అనుకున్నది మీకు మనసులో రావాలి )

” అలా నమ్మితే మనం దుఃఖాల నుంచి ఎలా బయటపడతామో వివరిస్తారా? ” అడిగాడు నారాయణ.

” తప్పకుండా, ముందు ఆ నమ్మకం ఎలా పనిచేస్తుందో వివరించి, ఆ తరువాత ఆ నమ్మకం వెనకాల ఉన్న శాస్త్రీయ వివరణ కూడా చెబుతాను. అప్పుడు దానిని మీరు గుడ్డిగా నమ్మడం కాకుండా దాని వెనకాల ఉన్న శాస్త్రీయ వివరణ ఆధారంతో నమ్మకం దృఢపడుతుంది.

ముందుగా ఆ నమ్మకం ఎలా సహకరిస్తుందో చూద్దాం.

ఏదయినా ఒక పని మనం చేసినప్పుడు ఆ పని చేయడం వరకే మన అధీనం లో వుంటుంది. అ పని కి ఫలితం మన చేతుల్లో లేదని మనకి తెలుసు కదా ? ఒకే పని ఒక వ్యక్తి రెండు మాట్లు చేసినప్పుడు ఫలితాలు వేరు వేరుగ ఉండవచ్చు. అలాగే ఒకే పనిని ఇద్దరు వేరు వేరుగ చేసినప్పుడు ఫలితాలు ఒకేలా ఉండక పోవచ్చు. దానికి కారణం మనం ఇదీ అని చెప్పలేము. ఫలితాలు అనుకున్నట్టు రాకపోవడం వల్ల నిరాశ చెందడం సహజం.

ఇప్పుడు నువ్వు ప్రమోషన్ కావాలనుకున్నావు. దానికి సంబంధించి ఏదో పరీక్ష రాశావు. ప్రమోషన్ రాలేదు. అన్నీ నువ్వే చేస్తున్నావు అనుకుంటే, ప్రమోషన్ రానప్పుడు చాలా బాధ కలుగు తుంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా ” అయ్యో పరీక్ష ఇంకా బాగా రాసి ఉండవలిసింది, లేదా ఇంకా ప్రిపేర్ అయి ఉండవలిసింది. అలా ఎందుకు చేశాను? ” అని అనేక విధాల కొంతకాలం పాటు మనస్తాపం అనుభవిస్తావు. అలా కాకుండా ‘ మనవల్ల ఏమీ లేదు. అంతా దైవేచ్ఛ ప్రకారం జరిగింది ‘ అని నమ్మితే, ఆ బాధనుంచి వెంఠనే బయట పడిపోతావు. అసలు బాధ ఉండదని కాదు. ఉంటుంది. కానీ వెంఠనే బయట పడిపోతావు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే నిరుత్సాహపరిచిన సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మనస్తాపం కలుగుతుంది. కానీ జరిగింది, నీ  వల్ల కాదు దైవేచ్ఛ వల్ల జరిగింది అని వెంఠనే గుర్తుకువస్తే మనస్తాపం పోయి పదే పదే గుర్తుకు రావడం తగ్గిపోతుంది. గుర్తుకు రావడమే దుఃఖం అని మీకు తెల్సు కదా ! మీరు ఆ సత్యాన్ని ఎంత గాఢంగా నమ్మితే అంత త్వరగా, మీ మనసుకి గుర్తుకు వచ్చి బయట పడతావు.

అలా కాకుండా, నువ్వు  రాసిన పరీక్షకి ప్రమోషన్ వచ్చిందనుకో.  అప్పుడు కూడా నా వల్లే వచ్చిందని అనుకుంటే నీలో గర్వం పెరుగుతుంది. ఆ గర్వం అనేక అనర్ధాలకి దారి తీసి చాలామంది చేత ద్వేషించబడే అవకాశం ఉంది. 

అలా కాకుండా అదృశ్య శక్తి వల్ల వచ్చిందని నమ్మితే, అణకువ పెరుగుతుంది. అణకువ ఉన్న వారిని అందరూ లైక్ చేస్తారు ” సుదీర్ఘ వివరణ ఇచ్చారు స్వామి.

మళ్ళీ ఆయనే అన్నారు ” ఇందులో ఇంకో మంచి విషయం ఉంది. ఈ సత్యాన్ని మీరు నమ్మితే ఇతరులు చేసిన తప్పులు మీరు సుళువు గా క్షమించి వాళ్ళని ద్వేషించరు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ప్రత్యేకంగా లేడు కదా. జరగవలిసింది. జరిగింది. అంతే ” వివరించారు స్వామి.

” మనం చేసిన పనుల వల్లే కాకుండా, మన ప్రమేయం లేని సంఘటనల వల్ల కూడా మనస్తాపం కలుగుతుంది కదండీ ” అన్నాడు ఆనంద్.

” అప్పుడు కూడా ఇదే విశ్లేషణ చేసుకోవాలి. ఏదో ప్రమాదం లో ఇరుక్కున్నారు. తప్పు మీది అవచ్చు, అవతలి వాళ్ల దవచ్చు. అయిపోయిన తరువాత, మీ తప్పు గురుంచో, అవతలి వాళ్ళ తప్పు గురించో ఆలోచనలు వచ్చి, ముందు జరగవలిసిన దానికంటే, జరిగిపోయిన దాని మీద గొడవ పెట్టుకుంటారు. కానీ మన సిద్ధాంతం  గుర్తుకువస్తే అలా జరగవలిసింది… జరిగింది అనుకుని  అవతలి వాళ్లతో గొడవపడటం వల్ల ఉపయోగం లేదనిపించి, ఆ పైన చేయవలిసిన దాని గురించి ఆలోచిస్తారు. పోలీసులు రాసుకున్న కేసు బట్టి, భీమా వసూలు చేసుకోవడమో ఏదో జరిగేది జరుగుతుంది. ముఖ్యమయిన విషయం, మన సిద్ధాంతం వెంఠనే గుర్తుకు రావడం. గుర్తుకు వచ్చిందంటే పెద్ద మనస్తాపం లేకుండా బయటపడతాము. ఈ భావన పెద్ద పెద్ద విషయాల లోనే కాదు. చాలా చిన్న చిన్న విషయాలలో కూడా ఈ సిద్ధాంతం చిరాకులనుంచి బయట పడేలా చేస్తుంది ” అన్నారు స్వామి.

” అదెలాగా ? ” అడిగాడు నారాయణ.  

” మీరు పొయ్యి మీద పాలు పెట్టి వేరే పనిలోకి వెళ్లి మరిచిపోయారు. పాలు పొంగి పోయి మాడు వాసన వస్తే కానీ తెలియలేదు. అప్పుడు మన సిద్ధాంతం ప్రకారం మీరు జరిగిపోయిన దాని గురించి విచారించకుండా ముందు పని ఆలోచిస్తారు. అదే పని మీ ఇంట్లో ఎవరు చేసినా వాళ్ళని ఏమీ అనకుండా సహనం చూపిస్తారు. అదే మామూలు వాళ్లయితే చాలాసేపు వాళ్ళని తిట్టడం, మనః శాంతి పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇలా అనేకం చెప్పవచ్చు.

ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్మినట్టయితే అనేక సందర్భాలలో ప్రశాంతంగా ఉండవచ్చు. ఇంకో ఉదాహరణ చెబుతాను.

మీరు సాయంత్రం సినిమాకి వెడదామని బయటికి వచ్చారు. స్కూటర్ ఇవతలికి తీస్తే , టైర్ లో గాలి పోయి ఉంది. 

టైర్ మార్చే టైం లేదు. ఆటోలు ఎక్కడా కనపడటం లేదు. మామూలుగా అయితే, ముందుగా చూసుకోనందుకు మిమ్మలని  మీరు తిట్టుకుంటూ, సినిమా మిస్ అవుతున్నామనే ఆందోళనపడతారు. ఆలా కాకుండా, ఓకే జరగవలిసింది జరిగింది. ఆటో దొరికితే వెడదాము. లేకపోతే ఇంకో రోజు చూ డవచ్చు అనుకుని మన సిద్ధాంతం గుర్తుకు వస్తే, మనస్తాపం వెంఠనే తగ్గిపోతుంది. ఇలా జీవితం లో చాలా సంఘటనల లో మన ప్రవర్తన లో మార్పు వచ్చి, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఆందోళనకరమయిన ఆలోచనలు శరీరం మీద ప్రభావితం చూపుతాయన్న సంగతి  తెలిసిందే కదా? ” ఉదాహరణలతో వివరించారు స్వామి.

” నిజమేనండి. ఒక్క మాటు ఆలోచిస్తే మనం చాలా సందర్భాలలో జరిగిపోయిన వాటి మీద అనవసరమయిన చర్చలు, దెబ్బలాటలూ చేస్తూ ఉంటాము. జరిగిపోయినది ఏమీ మార్చలేమని గుర్తించి, ముందు పని ఆలోచిస్తే చాలా శాంతి గా ఉండవచ్చు. అంటే ఈ సిద్ధాంతం లో ముఖ్య విషయం, మనం ఏ పనులు చేసినా, దాని ఫలితాలు మన చేతిలో లేవని గుర్తించి, వచ్చిన ఫలితాలు దైవమో లేదా ఏదో అదృశ్య శక్తో ఇచ్చిన ప్రసాదం అని స్వీకరించి ముందుకు వెళ్లిపోవాలి ” తనకి అర్థమయినది వివరించాడు ఆనంద్.

 ” సరిగ్గా గ్రహించారు. కానీ ఇంకో ముఖ్య విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఏ పని చేసినా, ఆ పని చేయడానికి మీకు పూర్తి స్వేఛ్చ ఉందని నమ్మి చేయాలి. కానీ ఆ పనికి ఫలితం పొందినప్పుడు అది దైవ ప్రసాదమని స్వీకరించాలి. 

మీరు ఆ పని చేసినప్పుడు, మీరు స్వేచ్ఛతో చేసినట్టు అనుకున్నా, ఫలితం అందుకునేటప్పుడు అది నిజమయిన స్వేచ్ఛకాదనీ, మీరు స్వేచ్ఛగా చేశారు అనుకున్న పని వాస్తవంగా దైవ ప్రేరితమనీ నమ్మాలి. ఎందుకంటే, వ్యక్తి ఎవరూ లేరని కదా? మన సిద్ధాంతం ” మళ్ళీ వివరించారు స్వామి.

” అయితే దీనికంతకీ ఆధారం, ఎక్కడ ఏది జరిగినా వ్యక్తుల వల్ల జరగటం లేదనీ, ఒకే శక్తి వల్ల అలా జరుగుతోందనీ నమ్మాలి ” అంతే కదా అన్నాడు నారాయణ.  

” అవును నమ్మాలి. అయితే ఈ సిద్ధాంతం వెనక ఉన్న తర్కాన్ని, లేదా హేతు బద్ధమయిన వివరణ అర్థం చేసుకుంటే, సిద్ధాంతం మీద నమ్మకం ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువ ఉంది ” అన్నారు స్వామి.

” అవును మొదట్లో తమరు అన్నారు, సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చెప్పి, తరవాత దాని వెనకాల ఉన్న హేతుబద్ధత వివరిస్తామన్నారు ?. ఇప్పుడు శలవీయండి . ” అడిగాడు ఆనంద్.

*********************************************