.
పడిపోయినఆకెరటా లెందుకు
మళ్లీ మళ్లీ లేస్తున్నాయీ ?
.
అపజయమ్ము లెదు రైనా కానీ
ఆశవిడువ వద్దంటున్నాయి !
మళ్లీ మళ్లీ ప్రయత్నించు మని
మనకు నీతి బోధిస్తున్నాయి !
.
సలసల క్రాగేనూనెను తాకిన
ౘన్నీ ళ్లెందుకు మండుతున్నవి ?
.
మఱిగేనూనెకు నీళ్లు తగిలితే
మంటలు తెగ లేస్తున్నాయి !
ఉద్రేకంలో ఊగేవాడికి
నీతి చెప్పవ ద్దంటున్నాయి !
.
మిలమిలలాడేవెలుగుచెంతనే
క్రీనీ డెందుకు ముసరుతున్నదీ ?
.
గుణముప్రక్కనే దోష ముండు నని
క్రీనీడలు తలపించుచున్నవి !
గుణమే గ్రహించి చెడుగును విడు డని
వెలిగేదీపం పలుకుతున్నది !
.
పూసి పూసి ఒకపూటకు రాలే
పువ్వులు ఎందుకు నవ్వుతున్నవీ ?
.
ఉసూరు మంటూ బ్రతికేనరులకు
నవ్వుచు బ్రతుకుట నేర్పుతున్నవి !
బ్రతికే దొక్కొకపూటయె యైనా
వలపులు కులుకుచు బ్రతుకు మన్నవి !!
.
******************