10_014 ఆనందవిహారి

.

.

అలరించిన పద్యాలు, శ్రీరాముడి గురించిన ప్రసంగం

.

                మానవ జన్మమెత్తి పురుషోత్తముడిగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన  శ్రీరాముడి గుణగణాలను కోటా రాజశేఖర్ ఎంతో అద్భుతంగా సోదాహరణంగా వివరించారు. వేద విజ్ఞాన వేదిక “తరతరాల తెలుగు కవిత” పేరిట ప్రతి నెలా నిర్వహించే ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా 

“షోడశ గుణాభిరాముడు శ్రీరాముడు” అంశంపై నెల్లూరుకి చెందిన కవి, అవధాని, సంస్కృతాంధ్ర భాషా కోవిడులు కోటా రాజశేఖర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రాంగణంలో జరిగింది. ముందుగా సంస్థ కార్యదర్శి మధు కందనూరు స్వాగతోపన్యాసం చేస్తూ, తెలుగు భాషా మాధుర్యాన్ని తరువాతి తరాలకు కూడా అందజేసే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోవిడ్ వల్ల దాదాపు ఏడాదిపాటు  కార్యక్రమాలు నిర్వహించలేకపోయామని, గత నెల నుంచి పునః ప్రారంభించామని వెల్లడించారు. ప్రేక్షకులు మునుపటివలే అధిక సంఖ్యలో వచ్చి ఆదరిస్తున్నారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షులు జేకే రెడ్డి శ్రీరాముడి మీద శ్లోకాలు కొన్ని ఆలపించి సభను అలరించారు. వక్తను సభకు పరిచయం చేస్తూ…. ఆయన ప్రవృత్తులు పద్య రచన, అవధానం, తితిదే తరఫున ధార్మిక ఉపన్యాసాలు చేయడం అని వెల్లడించారు. “తినబోయే తీపి రుచి చూడండి” అంటూ… శ్రీరాముడి మీద రాజశేఖర్  రచించిన ఒక తేట తెలుగు పద్యాన్ని కూడా జేకే రెడ్డి ఆలపించారు. అనంతరం ఆస్కా కమిటీ సభ్యులు కెకె చౌదరి, కె రంగారెడ్డి, జేకే రెడ్డి, మధులు వక్తను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. వక్త శ్రీరాముడి గురించిన స్వీయ పద్యాలతో, కవి కోకిల వాల్మీకి మీద శ్లోకంతో ప్రసంగాన్ని  ప్రారంభించారు. తన గురువు నరాల రామిరెడ్డి రచించిన ఒక పద్యాన్ని, తన గురుస్తుతిని (స్వీయ పద్యం)  వినిపించారు. బ్రహ్మదేవుడు వ్యాసుడితో, కొండలు నదులు ఉన్నంతవరకు రామనామం ఉంటుందని చెప్పాడని పేర్కొన్నారు. తరువాత తనను చూడ వచ్చిన నారద మహర్షితో వాల్మీకి మహర్షి, 16 సద్గుణాలను గురించి ప్రస్తావించి, అవి ఎవరిలో ఉన్నాయని అడిగారన్నారు. ఈ సందర్భంగా వక్త స్వీయ సీస పద్యాన్ని వినిపించారు. అప్పుడు నారద మహర్షి సంక్షిప్త రామాయణం చెప్తూ  రాముడి గుణగణాలను, ధర్మ నిరతిని వివరిస్తాడని అన్నారు. వక్త ఆ గుణాలను వివరిస్తూ…

గుణవాన్ అంటే సౌశీల్యము, మంచితనము. చిన్నా పెద్దా భేదం లేకుండా అందరితో ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు. ఉదా. తనకంటే తక్కువైన  కొండజాతి రాజు గుహుడికి, వానరరాజు సుగ్రీవుడికి, రాక్షసుడు విభీషణుడికి తన కౌగిలిని ఇచ్చాడని వివరించారు. దాశరథి శతకంలోని ఒక పద్యాన్ని ఉటంకించారు.  మిగతా 15 గుణాలను కూడా ఇదే విధంగా వివరించారు. పితృవాక్య పరిపాలనను తమ వంశ పూర్వీకులు చాలామంది ఆచరించారని రాముడు ఒక సందర్భంలో కౌసల్యతో చెప్పాడని అన్నారు.  ఆసాంతం అనేక పద్యాలు, శ్లోకాలు వినిపించి సభను అలరించారు. తను రాసిన “సీతారామ కల్యాణం” పుస్తకం నుంచి రచించిన పద్యాలను కూడా సందర్భానుసరం కర్ణపేయంగా వినిపించారు.

.

***************************