12_004AV ఆనందవిహారి

దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

“8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” 3వ రోజు కార్యక్రమం, అక్టోబర్ 2, 2022, ఆదివారం అంతర్జాలం ద్వారా 14 గంటల  పాటు దిగ్విజయవంతంగా నిర్వహించబడింది. ఈ నాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొనగా, పారిస్ నుండి డా. డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు. అంతకు ముందు సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో మొదటి రెందు రోజుల సాహిత్య ప్రసంగాలూ న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక మరియు అంతర్జాలం లోనూ 24 గంటలు నిర్విరామంగా జరిగిన సంగతి తెలిసినదే. 

సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ నాటి సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు.

రాధిక మంగిపూడి (ముంబై), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతర్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థవంతంగా నిర్వహించగా డా. ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వు మధు మొదలయిన లబ్ఢప్రతిష్టులు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

ముగింపు వేదికలో మూడు రోజుల సదస్సు విశేషాలను సమీక్షిస్తూ సుమారు 35 దేశవిదేశాల వక్తలకీ, 18 మంది వేదిక నిర్వాహకులకీ, 30 మంది సాంకేతిక నిర్వాహకులకీ, ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకీ, మీడియా ప్రతినిధులకీ నిర్వాహకులు తమ ధన్యవాదాలని తెలియజేశారు.

వచ్చే ఏడు జూన్ 22, 23, 24 తేదీలలో ఫ్రాన్స్ లోని పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యం లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారంతో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప కల్పన జరుగుతోంది అనీ ఆ సాంస్కృతిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అనీ ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు.  

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు లో జరిగిన 18 వేదికలనీ ఈ క్రింది యూట్యూబ్ లింక్ లోనూ, ఇతర మాధ్యమాలలోనూ వీక్షించి ఆనందిచ వచ్చును.

https://www.youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾