.
గుడివాడ ప్రాంతపు రైస్ మిల్లుల నేపథ్యపు విజయకుమార్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో చదువు వంక తో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. చిత్త కార్తి అంకినీడు స్నేహితుడు. తాను భయపడుతూ రహస్యంగా చేసే పనులు, భయపడకుండా ధైర్యంగా చేసే రంగారెడ్డి అంటే ఇతనికి కొంచెం అసూయ. శ్రీపతికి రంగారెడ్డి నైజం ఇష్టం. ఒక సందర్బంలో విజయకుమార్ శ్రీపతి సమక్షంలో రంగారెడ్డి ని ఏదో వంకర మాట అనగా రంగారెడ్డి బదులు ఇవ్వడు. శ్రీపతి విజయకుమార్ ని అంట కాల్చి, రంగారెడ్డిది నిజాయితీ బేరం అని కితాబు ఇస్తాడు.
.
శ్రీపతి చిత్ర లేఖనాల ప్రదర్శన సందర్బంలో (అనుకుంటా ) విజయకుమార్, జనాన్ని ఇంప్రెస్ చేయడానికి తాను బంజారా హిల్స్ లో ఉన్న సంజీవ్ దేవ్ గారి బంగ్లాకు వెళ్ళగా ఆయన తనకి ప్రత్యేకంగా గీసిన పెయింటింగ్స్ ని చూపించారు అని కోతలు కోయగా, పెన్సిల్ డ్రాయింగ్ కీ పెయింటింగ్ కీ తేడా తెలియని అతని అజ్ఞానానికి శ్రీపతి నవ్వుకుని, ఇలాంటి వాళ్ళని సంజీవ్ దేవ్ గారు తన ఇంటి గడప కూడా తొక్కనివ్వరిని అనుకుంటాడు.
.
విజయకుమార్ కుహనా విప్లవ వాది. విరసం లో యాక్టివ్ గా ఉంటాడు. ఇతను పోయించే మందు నీళ్లకు కక్కుర్తి పడే కవి మిత్రులు ఇతనికి విరసం లో మద్దతు ఇస్తూ ఉంటారు. నిఖార్సైన విప్లవ వాది మోహన్ రెడ్డి కి ఇతనంటే చిరాకు. విరసం డొల్లతనాన్ని గాయత్రి ఎండగడుతున్నప్పుడు ఈ విషయం స్పష్టం అవుతుంది. వీడు తనతో పాటు చదువుకున్న శ్రీగంధం కస్తూరి అనే అమ్మాయి ని ప్రేమ పేరు తో మోసం చేసి ఆ అమ్మాయిని వ్యభిచార కూపం లోకి దింపిన త్రాష్టుడు.
.
దిలావర్ అనే పింప్ వీడి దగ్గర డబ్బులు లాగుతూ ఉంటాడు.
.
వందన అనే తెలంగాణా ప్రాంతపు జమీన్ దారీ అమ్మాయి ని విజయకుమార్ ఇంప్రెస్ చేయబోగా ఆమె ఇతని నైజం కనిపెట్టి చెప్పు దెబ్బ తో సత్కారం చేస్తుంది. వీడు దులిపేసుకుంటాడు.
.
కట్నం కోసం వీడు సీత అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. వీడు ఒక సెక్సువల్ పెర్వెర్ట్ అవడం తో వీడి హింసలకూ, రోగాలకూ ఆ అమ్మాయి బలి అయిపోతుంది. తరువాత కనకదుర్గ ని పెళ్ళి చేసుకుంటాడు. వందనా, కనకదుర్గా క్లాస్‌మేట్లు. చెప్పు దెబ్బల విషయం విడిచి పెట్టి మిగతా విషయాలు వివరంగా చెప్పి, వందన కనకదుర్గని హెచ్చరిస్తుంది.
.
విషయాన్ని వంట బట్టించుకున్న కనకదుర్గ మొదటి రాత్రే, వీడి తో వీడి కన్నా వికృతం గా ప్రవర్తించి, వీడిని భయభ్రాoతుణ్ణి చేసి, చెప్పు క్రింద తేలు లా అణగదొక్కి చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఫలితం గా సొంత మిల్లుల్లోనే గుమస్తా గా వీడి శేష జీవితం గడుస్తుంది. పెన్సిలూ, రూళ్ల కర్రా, చిత్తు లెక్కలూ, అసలు లెక్కలూ ఇదే బ్రతుకవుతుంది.
.
********
.
పప్పు వరాహ శాస్త్రి, ఇంగువ నిరంజన్ రావు, వై వి ఎల్ ఎన్ ప్రసాద్, బందరు ప్రాంతపు రామ్మూర్తి సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు. ఇంగువ నిరంజన్ రావు ది స్కాలర్ షిప్ కమ్యూనిటీ. అగ్రవర్ణాల పై విసుర్లు. కానీ అనుసరించేవి వారి పద్ధతులే. చదువంటే శ్రద్ధ. తోటి విద్యార్థుల తో, ప్రొఫెసర్ లతో వాగ్వాదాలు.
మంచి మార్కుల పీజీ ఉన్నా ఉద్యోగం రాక పోవడం తో స్కాలర్ షిప్ ల కోసం యూనివర్సిటీ లో కాలక్షేపం. ఇతన్ని చూస్తే శ్రీపతి కి వాన లో తడిసిన కాకి గుర్తుకొస్తూ ఉంటుంది.
.
వై వి ఎల్ ఎన్ ప్రసాద్ ది కృష్ణాజిల్లా భూస్వామ్య నేపధ్యం. పి హెచ్ డి అవగానే లెక్చరర్ ఉద్యోగం, తన జూనియర్ రమాదేవి తో వివాహం.
.
రామ్మూర్తి పి హెచ్ డి అనంతరం డిపార్ట్మెంట్ లోనే వేకెన్సీలొస్తాయి. ఆ విషయం లో శ్రీపతి సలహా మేరకు గంగినేని రవి ని కలుసుకుని సహాయం ఆర్ధిస్తాడు. అప్పటికి రవి కి ఏ పదవీ ఉండదు. రవి రామ్మూర్తి కి అదే విషయం చెప్పి, తన ప్రయత్నం తాను చేస్తాను అనీ, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అనీ చెపుతాడు. రవి ప్రయత్నం ఫలించి రామ్మూర్తి కి ఉద్యోగం అవుతుంది. రామ్మూర్తి కి నిర్మల తో పెళ్ళవుతుంది.
.
వరాహ శాస్త్రి తండ్రి రాష్ట్ర ప్రభుత్వద్యోగి. ఇతని అవిటి చెల్లెలు చారుమతి వైణికురాలు. చారుమతి టెంపరరీ టీచర్ వేకెన్సీ ని పెర్మనెంట్ చెయ్యడానికి ఎవరో అడ్డు పడగా, తండ్రి సలహా మేరకు సంబంధిత డిపార్ట్మెంట్ లోని ఒక నిజాయితీపరుడైన అధికారిని కలుసుకోవడానికి ఒక సాయంత్రం వెళ్ళగా ఆ ఇంటి ముందు లాన్ లో మల్లె అంట్ల మధ్యలో కూర్చొని టేప్ రికార్డర్ లో బాలమురళి సంగీత ఆస్వాదన చేస్తున్న స్వప్న రాగలీన చారుమతి ని గుర్తు పట్టి సాదరం గా ఆహ్వానించి వచ్చిన పని కనుక్కుని బాబాయి కాంప్ కి వెళ్ళారనీ, చారుమతి కేసు జన్యువిన్ అయితే ఎవరి రికమండేషనూ అవసరం ఉందని ధైర్యం చెప్పి పంపుతుంది. చారుమతి ఉద్యోగం పెర్మనెంట్ అయి తోటి ఉద్యోగి తో పెళ్ళి అవుతుంది.
.
వరాహ శాస్త్రి పి హెచ్ డి పూర్తి అయినా ఉద్యోగం రాదు. ప్రొఫెసర్ దయతో పోస్ట్ డాక్టరోల్ స్కాలర్ అవుతాడు. ఏవో చిన్న చిన్న ఉద్యోగాల తో కాలక్షేపం. అన్న పానాదుల భారం కన్నవారి మీద వేసినా, పై ఖర్చుల కోసం ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటాడు. సంగీతం ఒంట బట్టించుకున్న వాడవడం మూలాన లోలోపల పాడుకుంటూ ఉంటాడు. చెల్లెలి పెళ్ళి లో సంగీత కచేరి చేస్తాడు.
.
… తరువాయి భాగం వచ్చే సంచికలో
.
——–(O)——–