10_020 ఆనందవిహారి

.

చెన్నై లో లలితమ్మ భజన – సి‌డి ఆవిష్కరణ

జోస్యుల ఉమ అచ్చ తెలుగులో రచించగా ఆమె చిన్న కుమారుడు శైలేష్ స్వరాలు కూర్చిన “లలితమ్మ భజన ” సీడీ ఆవిష్కరణ కార్యక్రమం అంతర్జాలంలో వేడుకగా జరిగింది. జూన్ నెల 12వ తేదీ శనివారం ఉదయం “స్వరార్ణవ” సంగీత బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకాశవాణి మద్రాసు కేంద్ర సహాయ సంచాలకురాలు గోడా లలిత, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకరరావు, ఆకాశవాణి చెన్నై కేంద్ర విశ్రాంత ఉద్ఘోషకురాలు బిట్రా గజగౌరి సీడీని ఆవిష్కరించారు.

.

లలిత మాట్లాడుతూ… దైవకార్యాన్ని సంకల్పించినప్పుడు ఆ దైవం మనతోనే ఉంటుందన్న దానికి ఈ సీడీ రూపకల్పన, విడుదలలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో పట్టుదలగా ప్రయత్నించి విజయం సాధించిన జోస్యుల కుటుంబానికి జోతలన్నారు. గంటపాటు సాగే వేయి వరుసలు గల లలితమ్మ భజనను ఉమ సహజమైన మాటల్లో రచించారని, అంతగా వాడుకలో లేని అచ్చులు హల్లులతో కూడా కొన్ని పదాలను రాయడం ముదావహమని ప్రశంసించారు. మిగతా ఐదు పాటలనూ గాయత్రీ దేవికుండే పంచ ముఖాలుగా అభివర్ణించారు. విన్న వెంటనే పట్టుకోగలిగేటువంటి సంగీతాన్ని అందించారంటూ శైలేష్ ను అభినందించారు. ఉమను ఎప్పుడూ ప్రోత్సహించే భర్త శ్యామసుందర్ స్నేహశీలి అని కొనియాడారు.

.

అల్పాక్షరాలలో అనంతార్థాన్ని చెప్పే సాహిత్య సృష్టే సినీకవుల విజయానికి కారణమని ఆచార్య డా. విస్తాలి శంకరరావు పేర్కొన్నారు. అటువంటి నైపుణ్యానికి తోడుగా మనసు దోచే సంగీత జలపాతాల రూపకల్పన చేయగలిగే ప్రతిభను కూడా భగవంతుడు జోస్యుల కుటుంబానికి ప్రసాదించడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టమని ఆయన కొనియాడారు. సంగీత సాహిత్యాలతో మిళితమైన ఇంత ఆహ్లాదకర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ సీడీని అందరూ విని ఆస్వాదించాలని సూచించారు.

.

గజగౌరి మాట్లాడుతూ… సీడీ అనే ఆధునిక ఉపకరణం ఏ విధంగా రూపుదిద్దుకుందో వివరించారు. జోస్యుల కుటుంబాన్ని అభినందించారు.

.

ఉమ మాట్లాడుతూ… ఆది గురువైన అమ్మకు అచ్చ తెలుగులో, సంగీతానికి ఆదిమూలమైన జానపద శైలిలో  కృతజ్ఞతలు చెప్పుకోగలిగానని, తన చిరకాల వాంఛ నెరవేరిందని వెల్లడించారు. కుటుంబ, శిష్యబృంద అండదండలు మరువలేనివాని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

.

ఆద్యంతం కార్యక్రమాన్ని చూసిన సినీ గీత రచయిత భువనచంద్ర, ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఇలపావులూరు సుబ్బారావు ( కొత్త ఢిల్లీ ) కొన్ని ఆథ్యాత్మిక విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

.

ఉమ పెద్ద కుమారుడు, అమెరికా వాస్తవ్యులు అయిన సుబ్రహ్మణ్యం… తమ్ముడు శైలేష్ తో కలిసి కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఉమ భర్త శ్యామసుందర్, సీడీ రూపకల్పనలో పాల్గొన్న వాద్య కళాకారులు, ” స్వరార్ణవ ” శిష్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

.

XXXXXXXXXXXXXXXXX

.

మహిళలపై జరిగే దాడులు, నివారణ చర్యలు – నెల నెలా వెన్నెల

.

జూన్ 12వ తేదీ శనివారం అమరజీవి స్మారక సమితి నిర్వహణలో ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమం లో భాగంగా “ మహిళలపై జరిగే దాడులు, నివారణ చర్యలు ” అనే అంశంపైన ప్రసంగ కార్యక్రమం జరిగింది.

.

ప్రారంభంలో….  ఇటీవలే మనకు దూరమైన పట్రాయని సంగీతరావు, ఘంటసాల రత్నకుమార్ లకు ఆచార్య డా. కాసల నాగభూషణం రచించిన కవితల ద్వారా సంస్థ నివాళులు అర్పించింది.

.

గోపరాజు మనోహర్ ఉత్తేజ్ కార్యక్రమానికి ఆహ్వానం పలికి చివరిలో వందన సమర్పణ చేసారు.

గుడి, బడి తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మానవహక్కులు మగవారికి వర్తించినంతగా ఆడవారికి వర్తించడం లేదు అని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

.

ప్రధాన వక్త దా. కాళ్లకూరి శైలజ మాట్లాడుతూ సమాజంలో అంతర్భాగమైన మహిళలపై మానసిక, సాంస్కృతిక, సాంఘిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవి వివక్ష, లింగభేదం అనే స్థాయిలను దాటి మానభంగం, హత్య అనే స్థాయిలకు వెళ్లిపోయాయి. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు మారడంతోనే ఈ ధోరణి మొదలైంది. ఏ చరిత్ర చూసినా యుద్ధాలతోపాటు మహిళలపై దాడులు కనిపిస్తాయి. విద్యాపరంగా ఎదిగిన సమాజంలో కూడా ఇవి జరుగుతుండడం గర్హనీయం. ఇంటా, బయటా, కార్యాలయాల్లో, చివరికి రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇందుకు మినహాయింపేమీ కాదు.

.

మగపని, ఆడపని అనే విభేదాలను దాటి నేడు మహిళలు విజ్ఞాన, రక్షణ సహా అనేక రంగాల్లో ముందంజ వేస్తున్నారు. అయినా కూడా సమాజం మాత్రం మహిళలను దోపిడీ చేయదగినవారిగానే చూస్తూంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన చాప్టర్ 6 అనే డాక్యుమెంట్ లో… మహిళలపై జరిగే దాడులు ఒక పిరమిడ్ ఆకారంలో ఆ సంస్థ చూపెట్టింది. టిప్ ఆఫ్ ద ఐస్ బెర్గ్ లాగా పై భాగం మాత్రమే, అంటే, పది శాతం మాత్రమే స్పష్టంగా తెలుస్తూంది. పోలీసులకే కాక దగ్గరివాళ్ళకి కూడా చెప్పుకోలేని కేసులే ఎక్కువ. ఈ పరిస్థితి ఎందువల్ల? దాడులకు పాల్పడేది ఎక్కువగా తెలిసినవారే కావడం వల్ల.

.

కులం, మతం, ఆస్తి తేడాలు, పరువుహత్యలు అన్నింటిలో అసహనమే కారణం. అవి హత్యవరకు వెళ్ళడం మరీ దారుణం. వ్యవస్థీకృతమైనటువంటి నేరాల్లో (organized crimes) లైంగికమైన విలాసాల కోసం మాత్రమే చేసే వ్యాపారాలు జరుగుతున్నాయి.

.

ఏవో కలహాల కారణంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడం కూడా జరుగుతున్నది. ఈ సమాంతర వ్యవస్థ సమాజంలో ఒక నీలి నీడ. సమాజంలో మంచి భాగానికున్నంత అస్థిత్వం దీనిక్కూడా ఉంది.

.

నిర్భయ, దిశ కేసులు రాత్రి 9 లోపల దేశ, రాష్ట్ర రాజధానుల్లో జరిగినవే. ఆ తరువాత దిశ ఆప్, అంతకుముందే ఉన్న షీ టీమ్స్ పోలీసు వ్యవస్థ చేపట్టిన మంచి కార్యక్రమాలు. కానీ నివారణ దిశగా ఎక్కువగా దృష్టి పెట్టాలి. 

.

చలనచిత్రాలే కాక లఘు చిత్రాలు, అంతర్జాల కార్యక్రమాల్లో హింస పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొని ఉన్న వ్యక్తిలో కూడా ఇవి నేరప్రవృత్తిని పెంచుతున్నాయి. సభ్య సమాజం తలదించుకొనే, స్త్రీని విలాస వస్తువుగా చూపించే ఇటువంటి కార్యక్రమాల రూపకర్తలు ఆలోచించుకోవాలి. వీటిపై సంస్థాగత చర్యలు, నియంత్రణ ఉండాలి. ఆడ, మగ ఒకటేనన్న భావన సమాజంలో పెంపొందించాలి.

.

మహారాష్ట్రలో ఒక మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ మానసిక దాడులకు గురై, గర్భ విచ్ఛిత్తి కూడా జరిగినా… తల్లి ఇచ్చిన మానసిక బలంతో మళ్ళీ విధుల్లోకి వచ్చింది. అయినా, మళ్ళీ ఎదురైన వేధింపులకు తట్టుకోలేక, పై అధికారుల తోడ్పాటు లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఇలాంటివి ఎదుర్కొంటున్న మహిళలు తమ పరిస్థితిని ఇంకొకరితో చెప్పుకొనే వ్యవస్థ ఉండాలి. సానుభూతి కనబరచాలి. మాదకద్రవ్యాలు, జూదం, బెట్టింగ్ వంటి నేరాలకు పురికొల్పేవాటిని అరికట్టాలి. తమ రక్షణ వలయం నుంచి బయటికి వెళ్లకూడదని మహిళలకు చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి. 

.

మహిళల్లో అయినా నేరాలకు పాల్పడేవారిలోనైనా మానసిక పరివర్తన తేవడమే ముఖ్యం. ఇలా చేస్తే నేరాలను పూర్తిగా నిర్మూలించలేకపోయినా చాలా వాటిని తప్పకుండా నివారించవచ్చు. 

.

.

XXXXXXXXXXXXXXXXX 

.

సర్వం విష్ణుమయం – అంతర్జాలంలో సీడీ ఆవిష్కరణ కార్యక్రమం

.

కర్ణాటక, హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, కవయిత్రి, రచయిత్రి అయిన జోశ్యుల ఉమ రచించగా శైలేష్ జోశ్యుల స్వరకల్పనలో రూపొందించిన “సర్వం విష్ణుమయం” సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జూన్ నెల 5వ తేదీ శనివారం అంతర్జాలంలో జరిగింది.

.

విష్ణుమూర్తి గురించిన పాటలు, గోవింద సహస్రనామ సంకీర్తనను ఉపరాష్ట్రపతి కార్యదర్శి, తితిదే మాజీ ఈవో ఇలపావులూరి సుబ్బారావు, సినీ గీత రచయిత భువనచంద్ర ఆవిష్కరించారు.

.

సుబ్బారావు ప్రసంగిస్తూ సంస్కృత వాజ్మయం చెప్పిన భక్తి సూత్రాలు, జీవన్ముక్తి గురించిన విషయాలను సంకీర్తనకారులు, వాగ్గేయకారులు అందరికీ అర్థమయ్యేలా దేశీయ భాషలలో వివరించారని, వారిని బాటలోనే రచయిత్రి తెలుగు పాటల్లో, గోవింద సహస్రనామ సంకీర్తనంలో ఆ వివరాలను పొందుపరిచారని ప్రశంసించారు. సహస్రనామ సంకీర్తనని 250 రాగాల్లో కూర్చడమంటే సాహసమేనని శైలేష్ ను అభినందించారు. ఈ పాటలన్నింటినీ మళ్ళీ మళ్ళీ విని ఆనందించానన్నారు. తితిదే ఈవోగా సేవలందించిన రోజులను, ఆ విశేషాలను గుర్తు చేసుకున్నారు.

.

శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్టుమెంట్లలో గంటల తరబడి ఎదురుచూడడం చూశానని, అందుకే “సుదర్శనం” పేరిట దర్శనానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. అనేక ఆథ్యాత్మిక విశేషాలను వివరించి ప్రేక్షకులను కట్టిపడేశారు.

.

భువనచంద్ర ప్రసంగిస్తూ తనదైన ఆథ్యాత్మిక బాణీలో ప్రసంగించి అనేక విషయాలను వెల్లడించారు. తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమాలకు వదిలేస్తున్న ఈరోజుల్లో కుమారులు వాళ్ళ ప్రతిభను వెల్లడి చేయడం కోసం ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయడం తన మనసును పులకింపజేస్తూందని భువనచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. రచయిత్రి కవయిత్రి, పేరడీ పాటలకు ప్రసిద్ధి, సంగీత విద్వాంసురాలు అయిన  ఉమ కరోనా క్లిష్ట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆదర్శనీయమన్నారు. సీడీలోని  పాటలు, వాటిని పాడిన విధానం అద్భుతమని ఉమ, ఆమె కుమారుడు, స్వరకర్త అయిన శైలేష్ ను ప్రశంసించారు. వాటి సాహిత్యాన్ని అక్కడక్కడా విశ్లేషించారు. సుదర్శన చక్రం మీద రాసిన పాటలో సమాజ నిర్మాణ రహస్యాన్ని పొందుపరిచారని వివరించారు. అత్తి వరదరాజస్వామి మీద ఇప్పటివరకు పాటలు వచ్చినట్టు లేదని, ఉమ రాసిన పాటలే తొలి తెలుగు పాటలు కావొచ్చని వ్యాఖ్యానించారు.

.

తితిదే ఈవోగా సేవలందించిన  సుబ్బారావు… పివిఆర్కే ప్రసాద్ బాటలో… అప్పటి తన అనుభవాలను వివరిస్తూ పుస్తకాన్ని రచించాల్సిందని కోరారు.

.

ఉమ మాట్లాడుతూ… తనకొక అందమైన కుటుంబాన్ని, అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలిపేలా గోవింద సహస్రనామ సంకీర్తనను, లలిత అమ్మవారిపై మరొక సుదీర్ఘమైన సంకీర్తనను, పాటలను రాయాలని అనిపించిందని, ఆ కోరిక నెరవేరడం కూడా దైవకృపేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారులతోపాటుగా శిష్యగణం ప్రేమకు కూడా పాత్రమవ్వడం తమ దంపతుల సుకృతమని అన్నారు.

.

సీడీలోని ఒక పాటకు ఉమ మనవరాలు త్విష చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. శైలేష్, ఉమ పెద్ద కుమారుడు, అమెరికా వాస్తవ్యుడు సుబ్రహ్మణ్యంలు కార్యక్రమాన్ని ఎంతో సందడిగా నిర్వహించారు. సంగీత సాహిత్యాలలో తమ తల్లి ఎదిగిన వైనాన్ని కళ్ళకు కట్టే వీడియోను ప్రసారం చేశారు.

.

ఈ కార్యక్రమాన్ని ఉమ, శైలేష్ స్థాపించి నిర్వహిస్తున్న ” స్వరార్ణవ ” బృంద సభ్యులు సమర్పించారు. ఆ బృంద సభ్యులు, ఆహూతులతోపాటు ఉమ భర్త జోస్యుల శ్యామసుందర్, కోడలు డా. సాధన, మనవడు కౌస్తుభ్ లు పాల్గొన్నారు.

.

*****************************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************