10_014 తో. లే. పి. – లిండా స్యు పార్క్

.

నాకు సంగీతమన్నా, సాహిత్యమన్నా చిన్నప్పటినుంచీ ఆకర్షణ, వల్లమాలిన ప్రేమ, చికాగో లో ఉంటున్న మా పెద్ద అబ్బాయి సుధాకర్ దగ్గరకి, లండన్ కి చేరువలో స్లవ్ లో ఉంటున్న మా రెండో అబ్బాయి శ్రీధర్ దగ్గరకి ఏడాది విడిచి ఏడాది వెళ్లి వస్తూ ఉండడం గత రెండు దశాబ్దాలు గా నాకు పరిపాటి. మిత్రులు అనేకమంది నన్ను అడుగుతూ ఉంటారు ” మీకు అక్కడ ఎలా కాలక్షేపం అవుతుంది? ” అని. అక్కడ ఉండగా నేను క్రమం తప్పకుండా తరచూ దేవాలయానికి వెడుతూ ఉండేవాణ్ణి. ఇంతకీ ఏమిటా దేవాలయం అంటారా ? అదే గ్రంధాలయం. అదే సరస్వతీదేవి పవిత్ర నివాసం కదా ?! 

అమెరికాలోనూ – ఇంగ్లాండ్ లోనూ ఉన్న ఒక ప్రత్యేక సౌకర్యం ఏమంటే…. కొత్త పుస్తకాలు 

గ్రంధాలయాలకు రావడంతో స్థలాభావం చేత పాత పుస్తకాలను బయట ఒక రేక్ లో జాగ్రత్తగా సర్ది, వాటిని ఆసక్తిగల కొనుగోలుదారుల కోసమని అమ్మకానికి పెడుతూ ఉంటారు. అది కూడా అతి తక్కువ ధరకు. ఉదాహరణకు 30, 40 డాలర్లు విలువచేసే పుస్తకం కూడా కేవలం అర డాలర్ కి ( 50 సెంట్లకి ) అమ్మకానికి పెడతారు. ఇదిగో… ఆ రకం గా నాకు ఇష్టమయిన పుస్తకాలను అనేకం కొని ఇంటివద్ద హోమ్ లైబ్రరీ లా maintain చేసేవాడిని. ఇంగ్లాండ్ లోనూ, అమెరికాలోనూ కూడా మా అబ్బాయిల ఇళ్లల్లో నా రూమ్ లో అలా కొనుక్కున్న పుస్తకాలలో ఒకటి ” A single shard “. రచయిత్రి శ్రీమతి లిండా స్యూ పార్క్. 

చాలా చక్కటి పుస్తకం ఇది. పేరు ” A  single shard ” ( పగిలిన పింగాణీ పాత్ర ) ఇంటికి వస్తూనే ఆ పుస్తకాన్ని ఏక బిగిని చదివేసాను. అంత గొప్ప కథాంశం ఉంది అందులో. 12 వ శతాబ్ది కాలం లో కొరియా దేశంలోని జీవన సంఘర్షణ నేపధ్యం లో ఈ రచన సాగింది. 12 సంవత్సరాల వయసున్న అనాధ బాలుడు, ట్రీ ఇయర్. నా అన్నవాళ్లు లేక, ఉండడానికి వసతి లేక ఒక బ్రిడ్జి కింద జీవితాన్ని అతి సామాన్యం గా వెళ్లబోసేవాడు. అదే స్థలం లో మిన్ అనే  వృద్ధుడు ఒకడు ఏకాకి గా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అదే బ్రిడ్జి  క్రింద. తాను మిన్ పంచన చేరి అతడు తయారుచేసే పింగాణీ సామగ్రి తయారు పని లో అతనికి తనకి తోచిన సహాయమందిస్తూ ఆ పని లోని మెళకువలను క్రమేపీ ఆసక్తి తో గమనించసాగాడు. ట్రీ ఇయర్ లోని ఆసక్తిని గమనించిన మిన్ తనకి ఆ విద్యలో శిక్షణ ఇవ్వసాగాడు. ఇలా ఉండగా ఒకసారి ట్రీ ఇయర్ చేతిలోని పింగాణీ పాత్రని పొరబాటున క్రిందకి జారవిడవడం తో అది బ్రద్దలయింది. దీనిని ప్రత్యక్షం గా చూస్తూన్న మిన్ కి  ట్రీ ఇయర్ మీద విపరీతమైన కోపం వచ్చి శిక్షగా అతనికి మరింత పని భారాన్ని అప్పజెప్పాడు. బాధ్యతాయుతం గా పని చేస్తూ కనీసం కొంతలో కొంతైనా ఆ పనిని నేర్చుకుంటాడని యజమాని ఉద్దేశం. మిన్ ఉద్దేశాన్ని గ్రహించి, కష్టపడి ఆ విద్యను గురుముఖం గా నేర్చుకుని అందులో నిపుణత ని సాధించి ఆయన మాట నిలబెట్టాడు ట్రీ ఇయర్.. అలా క్రమేపీ గురువు గారి వద్ద అంచెలంచెలు గా ఆయా విద్యలో ఎదిగి, పరిణతి ని సాధించాడు, ఒక  దశలో. గురువు గారి ఆశీర్వాదబలం తో దేశాన్నిఏలే మహారాజు గారి సందర్శనా భాగ్యాన్ని, రాజగౌరవాన్ని పొంది వినుతికెక్కాడు ట్రీ ఇయర్. ఇదీ A single shard నవల లోని మూల కథ. కథాకాలం షుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదే అయినప్పటికీ, కథ ప్రత్యేకించి ఈనాటి యువత కి  కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అని వేరే చెప్పక్కరలేదు.

ఈ నవల కి 2002 John Newberry Medal లభించింది. New York Times best sellar గా గుర్తింపుని తెచ్చుకుంది. 

ఇక ఈ నవలా రచయిత్రి లిండా స్యూ పార్క్ కొరియన్ అమెరికన్ రచయిత్రి. ఈమె తొలి నవల Seesaw Girl ( 1999 ), అటు తరువాత ఎన్నో పిల్లల నవలలు, picture books వ్రాసారు. వీరి ఇతర రచనలు A Long Walk to Water, Prairie Lotus. ఈమె తల్లిదండ్రులు సుసీ కిమ్, యూన్గ్ ఎడ్, మార్చి 25, 1960 న అర్బానా, ఇల్లినాయిస్ ( అమెరికా) లో జన్మించారు. 1984 లో బెన్ డోబ్బిన్ ని వివాహమాడారు. 

లిండా స్యూ పార్క్ రచన A single Shard చదువుతూనే కలిగిన ప్రేరణతో ఆమె ను అభినందిస్తూ ఆమె పేరున ఒక ఉత్తరం వ్రాసి పబ్లిషర్స్ కి పంపాను. వారు దానిని రచయిత్రి కి పంపడం ఆ వెంటనే లిండా నాకు ప్రత్యుత్తరం వ్రాయడం ఇవన్నీ టక టకా జరిగిపోయాయి. లిండా ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట సుమండీ !

ఇక్కడ ఒక విశేషాన్ని మీ అందరికీ మనవి చేయాలి. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలలో మనం ఏదైనా పుస్తకం చదివి రచయిత / రచయిత్రి లేదా పబ్లిషర్ కి మన స్పందన ను తెలుపుతూ ఉత్తరం వ్రాస్తే దానికి ప్రతిస్పందన గా వారి నుండి అనేక సందర్భాలలో జవాబు రావడం చాలా సహజం. కాగా, ఇటువంటి సందర్భాలు ఇక్కడ ఈ రోజులలో చాలా అరుదని చెప్పవచ్చును. స్వానుభవంతో నేను చెబుతూన్న మాటలండి ఇవి.  

                <><><>***  ధన్యవాదములు …నమస్కారములు  ***<><><>