12_008 దివ్య దంపతుల చూపుల పందిళ్ళు

 

భారత జాతీయ జీవనానికి, శివరాత్రి కీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నిజం చెప్పాలంటే – ఇది పరమశివుడు పాలించే సీమ. కైలాస శిఖరం నుంచి ఆ పన్నగధారి నేత్రాల నుంచి వెలువడే చల్లటి చూపులు ప్రాకి, ప్రాకి కన్యాకుమారి నుంచి కదిలివచ్చే కాత్యాయని చూపులతో కలసి చల్లని పండిరులల్లుకొంటాయి. ఆ నీడలోనే భారతజాతి నిండు గర్వంతో జీవిస్తుంది. నదులన్నీ నంది దేవుని మెడలో గంటలవలె కెరటాల చప్పుళ్ళు వినిపిస్తాయి. ప్రతి అణువు శివోహమ్ – అంటూ అహరహం స్మరించి తరించాలని ప్రాకులాడుతూ వుంటుంది. ఆ శబ్దాలు ప్రతి హృదయంలో స్పందిస్తాయి. పరమేశ్వరుని కృపకోసం ఎదురుచూస్తూ వుంటాయి.

నిజానికి సంవత్సరానికి ఒకమాటు వస్తుంది శివరాత్రి. కానీ ప్రతి నిత్యం మనకు శివరాత్రే. మనం తెలుగువారం. ఇది త్రిలింగదేశం. మూడు తావుల్లో వెలిసిన ముక్కంటి స్వరూపాలను స్మరిస్తూ తెలుగు ప్రజలు జీవితాలను గడుపుతూ వుంటారు. మహేశ్వరి మనలను సదా దీవిస్తూ వుంటుంది. చల్లటి తెల్లటి ప్రాలేయ శృంగాలను విడిచి భక్త జన పరిపాలనకై ఆ మిత్తిగొంగ తెలుగు దేశంలో వెలిశాడు. అది తన సామ్రాజ్యంగా భావించి దీవిస్తున్నాడు. ఆ చంద్రశేఖరుని దయను కోరేవారికి శివరాత్రి ఎలాటి పండుగ ! ఎదలు నిండిన వెలుగు ఆ విశ్వేశ్వరుడు. సకల సంపదలను సమకూర్చే దాత ఆ సర్వేశ్వరుడు. జీవితాలలో తుషార బిందువులు వెదజల్లే కరుణామయుడు ఆ వృషభవాహనుడు. తెలుగువారికి శివరాత్రి గొప్ప మహోత్సవం. అది నిత్యోత్సవం కూడా !

*******************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Please visit this page