.
అడుగో ! అడుగో ! సూర్యుడు !
ఆకాశంలో ఉన్నాడు !
అందరితోనూ పందెం వేసి
అందకుండా పోతున్నాడు !
.
మాఅమ్మమ్మమొగాన దిద్దుకొను
కుంకుమబొట్టల్లే ఉన్నాడు !
ఇప్పుడు పుట్టినతమ్ముడులాగే
ఎంతో యెఱ్ఱగ ఉన్నాడు !
.
పసివాడల్లే రెప్ప వాల్పకే
ప్రతివస్తువునూచూస్తున్నాడు !
ఎవ రెపు డేపని చేస్తున్నారో
యెఱుగనట్లె చూస్తున్నాడు !
.
ఇప్పు డిప్పుడే పుట్టినసూర్యుడు
తప్పటడుగులేస్తున్నాడే !
ఇంటికి వెలుగు – మింటికి వెలుగు –
ఈసూర్యుడు లోకాలకె వెలుగు !
.
తాతయ్యంతటిపెద్దవాడు మఱి
దణ్ణం పెడతా డేమిటీ ?
ఆయుక్షీణం అయి పసిసూర్యుడు
అస్తమింౘడా యేమిటీ ?
.
అందుకె అతనిఉసురు తగిలి మన
అందఱిఆయువు క్షీణిస్తోంది !
అతనిని ఆపేమొనగా డుంటే
అందఱిఆయువు వృ ద్ధవుతుంది !
.
ఈ కోసనుండి ఆకోసదాకా
ఎండలో తిరుగుతున్నాడు !
అతనికి పట్టినచెమటబొట్లు క్రిం
దందఱిమీదా పడుతున్నాయి !
.
అంతపెద్దలై టేస్తున్నాడే !
అందఱిఫోటోలు తీస్తున్నాడా ?
అందుకోసమే చిఱునవ్వులతో
ఆతామరపువు పో జిస్తోందా ?
.
పట్టపగలె ఆబేటరీలయిటు
వట్టినె వేసేస్తున్నాడు !
పగలే బేట్రీ ఖ ర్చయిపోతే
చీకటిలో ఏం చేస్తాడు ?
.
కుఱ్ఱచేష్ట లివి కూడవు అంటే
కోపం ఆయనగారికి !
వట్టినె అందరిపైన మండి పడు
అంతటిగారం యేమిటి ?
.
అమ్మా నాన్నా యెవరో ? పాపం !
అలా వదలిపెట్టేశా రేమీ ?
ఎవ్వరిభయమూ లేకపోతే మఱి
యెలా అతడు పై కొస్తా డేం ?
.
ఉదయం తూరుపు – రాత్రి పదమరా –
ఒకదిక్కంటూ యే ముంది ?
దిక్కూ మొక్కూ లేనిసూర్యుడు
దేశదిమ్మ రై పోయాడు !
.
ఇంత దుడుకువా డని భయపడియే
ఎటనో తారలు నక్కినవి !
ఇతనితాకిడికి నిలువలేకయే
ఎడ మై బెంగకు చిక్కినవి !
నిచ్చెన గిచ్చెన లేకుండగనే
నింగిని నడికొ ప్పెక్కెశాడే 1
అందనియెత్తున కాలు జాఱితే
క్రిందకి పడతా డేమో పాపం !
అయ్యో ! అయ్యో ! అనుకొన్నంతా
అయింది ! ఆ ఒళ్ళంతా రక్తం !
ఆగాయా లెంతెంత పెద్దవో –
ఆపడమరది క్కంతా రక్తం !
దెబ్బ తగిలినా నదురా ? బెదురా ?
నాదెబ్బ చూసుకోం డంటున్నాడు !
రక్తపు చారలు తుడుచుకొంటు మ
ర్నాడే యెగిరెస్తున్నాడే ! !
*******************************