బాలు! అని చిన్నపిల్లవాడి దగ్గరనుంచి, వృధ్ధుల వరకు చనువుగా పిలుచుకునే SPB శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
‘పాడుతా తియ్యగా’ అంటూ మనకి ‘ చేదు నిజాన్ని’ మిగిల్చి వెళ్ళిపోయాడు.
ఐదు దశాబ్ల మనతో ఉన్న పాట బంధాన్ని తెంచుకు పోయాడా?
లేదు లేదు మనందరికి ఆ బంధం వేసి కొస మటుకు తనతో ఉంచేసుకున్నాడు.
గానగంధర్వుడా! నువ్వు పయనిస్తున్న దారంతా నీ మీద మేము రాసిన ప్రేమాక్షరాల పదచిత్రాలు కనిపిస్తాయి.
నువ్వు మా మీద కురిపించిన మధుర జల్లులు మా అంతరంగ సంద్రంలో విలువైన ముత్యాల్లా మారిపోయాయి. వాటిని అపురూపంగా దాచుకుంటామని ప్రమాణం చేస్తున్నాం.
పంచభూతాలు, చెట్లు, సుమాలు, ప్రవహించే నదులు, జలధి అన్నీ మళ్ళీ నీ కోసం వేచి ఉంటాయి… నీ పాట కోసం.
శంకరా నాద శరీర ! అంటూ పాడి నటరాజుని మెప్పించావు.
నీ పాట నచ్చి శివుడు నిన్ను తన కొలువుకి పిలిపించుకున్నాడు.
నీ గానంతో ఆయనని సంతోషపెడతావు ప్రతిరోజు.
కానీ మా గతి ఏమిటి?
నీ పాట వినని ఈ చెవులెందుకు?
గాలి సవ్వడి, పిల్లతెమ్మెర, కదిలే ఆకు, విరిసే సుమం, మందగమనం తో సాగే వాగులు వంకలు,
కూసే పక్షి, ఏది చూసిన నీ పాటే గుర్తుకు వస్తుంది. ఎలా నిన్ను వదిలి?
అందుకనే మరోజన్మ నీకు ఇమ్మని ప్రార్ధిస్తున్నాం శివయ్యని.
నిరంతరంగా నువ్వు మాతో ఉండేలా కాలాతీతుడైన కైలాసవాసిని కోరుకుంటాం బాలు! నువ్వు కూడా కాస్త చెప్పవూ!
మేము నీకు కన్నీళ్ళొక్కటే ఇవ్వగలం.
మాకు మాత్రం నీ పాట మళ్ళీ మళ్ళీ కావాలి బాలు!
చింతన, ప్రేమ, చిలిపి, నవ్వు, గాంభీరం, విచారం, ఉత్తేజం, భక్తి ఏదైనా నీ గళం లో ఇమిడిపోయేవి. అలా అలవోకగా మమ్మల్ని నీ పాటతో “పీటముడి” వేసేసుకున్నావు కదా!
నీ విద్వత్తుని వర్ణించే శక్తి నాకు లేదు. నీ పాట విని ఆనందించడం తప్ప.
నీ పాదాలకి నాలుగు అక్షర సుమాలు.
****************************