12_009 రామాయణాల ఇంద్రధనస్సు

సంకలన కర్త : మాడపాటి సీతాదేవి

శ్రీరాముడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, శ్రీరామాయణం నిత్యపారాయణ గ్రంథం. శ్రీరామాయణం ఎవరు ఏ భాషలో రచించినా, ఏ రూపంగా రచించినా నిత్యనూతనమైన కావ్యం, రసానుభూతిని అందించే కావ్యం. మాడపాటి సీతాదేవి గారు రకరకాల రామాయణాలు, అనువాదాలు, మూలాలు చదివారు. చదవడమే కాదు… ఆమె చదివిన వాటిలో మనసుకు హత్తుకొన్న కొన్ని విషయాలు ఒకచోట వ్రాసుకొన్నారు. అవన్నీ ఇంద్రధనస్సు రంగులు సంతరించుకొన్నాయి. మనము తిలకించి ఆనందిద్దామా !  

దేశభాషలలో స్త్రీలు వ్రాసిన రామాయణాలు –

మలయాళంలో  – సుభద్రాంత పురాట్టీ

కన్నడంలో – గిరియమ్మ

గుజరాత్ లో – దివాల్ బాయి, పూరీబాయి, కృష్ణాబాయి

వంగభాషలో – చంద్రావతి

తెలుగులో – మొల్ల

వీనిలో చంద్రావతి, మొల్ల రామాయణాలు ప్రాచీనాలు…. ప్రశస్తాలు. చంద్రావతి అవివాహిత, మొల్ల వితంతువు.

గుజరాతీ వాఙ్మయమున దివాల్‌బాయి శ్రీరామాయణం వ్రాసింది. ఈమె బాల వితంతువు. గురువుగారితో కలసి అయోధ్య నగరయాత్ర చేసిన పిదప ఈమె రామభక్తురాలయింది. అయిదు నూరుల పద్యములతో శ్రీరామచంద్రుని జీవితము వర్ణించి చెప్పెను.

శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవ సందర్భమున సింహాసనము అధిష్టించు సమయమున సీత యెట్టి పట్టు పుట్టమును ధరించుటయా అని తబ్బిబ్బు పడినదట ! ఆ తబ్బిబ్బును ఈమె సుదీర్ఘమైన పద్యమున వర్ణించినది.

నేను రేపటి దినమున ఏ చీర కట్టుకొనవలెను ? నలుపురంగు నిషేధము కదా ! ఎరుపురంగు, పసుపురంగు నాకు కిట్టవు. పాటల వర్ణము కల ఈ పట్టుచీరను కట్టుకొనమనెదవా రామా ! అని ప్రశ్నించినదట.

తమిళమున రచించిన కంబరామాయణములో అన్నమయ్య రచించిన ‘ బ్రహ్మ కడిగిన పాదము ’ వంటి పద్యము ఒకటి కలదు.

శా. :       అనాడొక్క పదంబునే కడుగు దివ్యాంభః ప్రసారంబుమా

            ధీనుండెక్కువ మక్కువంగొనుచు నెత్తిం దాల్చె నాబ్రహ్మయే

            యినాడంగము పూర్తిగా గడుగగా నీనీరమే చోట నీ

            శానుండాదట దాల్చునో యనుచుగాంక్షం జూచిరింద్రాదమరుల్

******

ఇదే రామాయణములో శ్రీసీతారామలక్ష్మణులు పుష్పకము నధిరోహించునపుడు పుష్పక విమాన వర్ణన

తే. :       పదియు నాలుగు జగముల ప్రాణులొక్క

            మొగిని కూర్చున్నను స్థలంబు మిగిలి యుండు

            దద్విమాన మహిమ కర్మతతి దహించు

            జ్ఞానులకె గాక తెలుప భూజనుల కరిని

*******

ఇదే రామాయణంలో భరతునకు ఆంజనేయుడు రామునుదంతంబు తెల్పుట….

శా. :       మారీచున్ హరిణంబుగా బనిపి తామౌనీంద్రవేషంబుతో

            శ్రీరామాంగనయున్న భూమిని పెకల్బెందేరిపైబెట్టినా

            దారిం బోవగనీక యడ్డు విహగేంద్రస్వామి జక్కాడెలం

            కారాజ్యంబున గారనుంచె జనకక్ష్మాపాల కన్యామణిన్

*******

అయ్యలార్యుని రామాయణము

శ్రీరాముడు రావణాసురుని సంహరించినందుకు శివుడు రాముని మెచ్చుకొనే ఈ క్రింది పద్యము గమనించండి –

            సురులకుగుండె తల్లాడము శూరుల డెందములోని కొట్టు

            ఖేచరతతి కంటిలోనలుసు సాధ్యుల కొంగుననున్న చిచ్చు

            భూసురులకు నెల్లనాడు మెడజుట్టిన పాము, మునీంద్ర కో

            టిపై బొరిబడనున్న యా పిడుగు బొల్పఱజేసితివీవు రాఘవా !

*******

భాస్కర రామాయణము – సుందరకాండ

హనుమంతుడు సముద్రమును దాటి లంకలో ప్రవేశించిన ఘట్టమున కావింపబడిన సూర్యాస్తమయ, చంద్రోదయ వర్ణనములు అద్భుతముగా రచించిరి.

గోపీనాథ రామాయణము

నిప్పర్వత శిఖరంబు శ్వేతకృష్ణ తామ్ర శిలోపశోభితంబును నానాధాతు సమాకర్ణంబును దరీ నిర్ఘర విరాజితంబును నిరంతరకుసుమిత మాలతీ కుండ గుల్మ సిందు వివిధ ఫల లతా తరుఘాడ మండితంబును, శుకపిక శారికా మయూర మరాళ మనోహర సంఫల్ల కమలా కల్హార కైరవ మండితంబైన యొక్క సరోవరంబు రమ్యంబుగా ప్రకాశించుచు యిచ్చటికి సమీపమందున్నది. నీ గృహద్వారంబు నందు సమతలంబై దీర్ఘంబై భీన్నాంజన చయోపమంబై స్నిగ్ధంబై యొక్క పాషాణంబున్నది. యిచ్చటికిం తూర్పున బ్రాచీన వాహిని యగు నొక్కనదియు కర్బమై త్రికూటంబునందు జాహ్నవియుం బోలె తేజరిల్లుచున్నది.

చ. :       పులిననితంబయు బ్రఫుల్ల సరోరుహ పత్రనేత్రయున్

            లలిత మృణాల దోర్యుతయు రాజిత శైవల కేశపాశమున్

            విలసిత వీచికావళియు విశ్రుత చక్ర పయోధ రాఢ్యయై

            చెలువయు బోలె నొప్పెడు బ్రసిద్ధ చరిత్రక కంటె నిమ్నగన్

                                                ఋష్యమూక పర్వత వర్ణన

*******

విట్టల ఉపమాక వెంకటేశ్వరకవి – రామాయణ సంగ్రహము

19వ శతాబ్ద కవియగు విట్టల ఉపమాక వేంకటేశ్వరకవి చిత్రకవిత్వమును అపూర్వముగ ప్రదర్శించుచు ముప్పది సర్గలలో రామాయణ సంగ్రహమును వ్రాసెను. అతడా గ్రంథ శ్లోకములందు మరి నాలుగు కావ్యములు గర్చితములగునట్లు కూర్చెను. అయోధ్యకాండ నుండి యుద్ధకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో “ గౌరీ వివాహ”మను కావ్యమును – ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపినచో “ శ్రీరంగాది క్షేత్రమహాత్మ్యము ” – తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో “ భగవదవతార చరిత్ర ” కావ్యమును – చతుర్థ పాదమునందలి అక్షరములన్నియు కలిపినచో “ ద్రౌపదీ కల్యాణం ” కావ్యమును ఏర్పడును. బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో “ రామకవచ ”మేర్పడును. ఇది చతుస్సర్గ కావ్యమన ప్రశంసించబడినది.

********

శ్రీరామావఝ్ఝుల కొండయ్యశాస్త్రి గారు

శ్రీరామవిజయము అనే నామాంతరం కలిగిన సహస్ర కంఠ రామాయణము.

            భువన హితార్థమై తరులు పూర్ణఫలంబు లొసంగు నిత్యమున్

            భువన హితార్థమై నదులు పూర్ణముగా బ్రవహించు నెప్పుడున్

            భువన హితార్థమై జలద పూగము నీటినొసంగు రాగాన మీ

            రవని పరోపకార పరులై జరియింపుడు శాంతభావనన్ ||

                                                            ( పూగము = ప్రోగు )

పద్మపురాణంలోని కథను ఆధారం చేసుకొని రచించిన గ్రంథమిది. వావిళ్ల వారు 1928 లో ప్రధమంగా ముద్రించారు.

రాముడు అవతారం చాలించి వైకుంఠానికి తిరిగి వెళ్ళే ముందు పురజనులకు, సద్వర్తనులుగా జీవించవలసిందని ఉద్భోధ చేశాడు. తను వైకుంఠానికి వెళ్లిపోతుంటే దుఃఖిస్తున్న ప్రజలను చూసి తన విగ్రహాన్ని చేయించి పెట్టుకోవలసిందని, అందులో తన కళలను ప్రవేశపెడతానని కూడా చెప్పాడు. అప్పుడు ప్రజలు రాముడి బంగారు విగ్రహాన్ని చేయించారు.

కనకరాముని చేయించి

కనకరత్న ఖచితలోలాయంబున

ఘనత నిలుప

అందు రాజొచ్చి నిలిచె బొందుగాను

షోడశాంత సమేతుడై సొంపుమీఱ |

అప్పటినుంచి మొదలైంది అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రజలు సేవించడం. అలనాటి ప్రజలు అయోధ్యలో ప్రతిష్టించుకొన్నది రాముని బంగారు విగ్రహం. అటు తరువాత ఎన్ని విగ్రహాలు మారాయో ! విగ్రహాలు స్వర్ణయుగం నుంచి శిలాయుగానికి మారడానికి ఎంతకాలం పట్టిందో !

********

ఏదో తపస్వీ వచ్చె మన ఇంటికి నేడని – యేదోమాటమ

ర్యాదకు నేమి కావలయునంటిని, వీనికి వాంఛ యేదియున్

లేదుగదా యటంచు ! బెకలించెను గుంకుడు వేరుతోడ నా

పాదును దేశీకేంద్రయిటువంటి దురాశలు మౌని కొప్పునే !

                                               

( “ అహంవేద్మి ” నుండి )

‘ మందాకిని ’ లిఖిత పత్రిక సౌజన్యం

*********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page