10_006 పాలంగి కథలు – అత్తారింటికి పట్నం పిల్ల

                             

                                మద్రాసు నుంచి హౌరా మెయిల్‌ ఎక్కి మర్నాడు ఉదయమే నిడదవోలులో దిగాం అమ్మా, నాన్న, నేను. ‘ఇచ్చట నరసాపురానికి, భీమవరానికి మారవలెను’–ఈ బోర్డు ఏటా అమలాపురానికి వెళ్లడానికిదే రైలులో ప్రయాణం చేస్తూ చదువుతూ ఉండేదాన్ని. ఇప్పుడా ఊర్లో దిగి తణుకు వెళ్లాలన్న మాట! ఓ గంట అక్కడ సిమెంట్‌ బెంచీ మీద కూర్చుని గడిపాక తణుకెళ్లే రైలు అంటూ అక్కడున్న వాళ్లు లేచి రెండో ప్లాట్‌ఫాంవైపుకి వెళ్లడం చూసి, నాన్నగారు, అమ్మా, నేనూ కూడా అటు వెళ్లాం. ఈలోగా పొగలు కక్కుతూ రైలు వచ్చి ఆగింది. మెల్లిగా సామానుతో ఎక్కాం రైలు.

తణుకు స్టేషన్‌ వచ్చింది.

నేను ముందు దిగి ట్రంకు పెట్టె, హోల్డాలు, నాన్న తోలుపెట్టె ఒక్కొక్కటీ నాన్న అందిస్తుంటే గబగబా అందుకున్నాను. అమ్మ మరచెంబుతో దిగింది. మెల్లిగా సామానుచ్చుకుని స్టేషన్‌ బయటికి వచ్చాం రేకుల షెడ్డుదాటి.

సామాన్లతో మెట్లుదిగి ఎదర ఉన్న పెద్ద రావిచెట్టు మొదట్లో ఉన్న చప్టా మీద సామానుంచి నిలబడ్డాం అమ్మా నేనూ.

“ బాబూ బండి కట్టమంటారా ? ” అంటూ నాన్న చుట్టూ మూగారు వంటెద్దు బళ్ల వాళ్లు.

అందులో ఒకతను నాన్నగారి చేతిలో సంచీ అందుకుని ‘‘ రండి బాబయ్యా…’’ అంటుంటే

 “ పాలంగి వెళ్లాలి. ఎంతిమ్మంటావు ? ” అన్న నాన్న ప్రశ్నకి “ అర్ధరూపాయి ఇప్పించండి బాబు ’’ అన్నాడు.

ఈలోగా అమ్మ “ అబ్బే… పావలాయేగా ! ” అంది.

“ కలిగిన మారాజులు ఆరణాలిప్పించండి ” అంటూ బండిలో బ్యాగ్‌ పెట్టాడు.

పెట్టె, హోల్డాలు అందుకుని బండిలో సర్ది “ ఎక్కండమ్మా అమ్మాయిగారూ! ఆ యేపు కూకోండి మీరు ’’ అంటూ “ ఆ…ఎక్కండి బాబూ. హాయ్, ఎహే !! ” అంటుంటే బండి స్టేషన్‌ నుంచి బయల్దేరింది, బాట వెంట దుమ్ము రేగుతుంటే. మట్టి రోడ్డు, రెండువైపులా గుడిసెలే ఎక్కువగా ఉన్నాయి. వయ్యారాలు పోతూ గ్లాస్కో చీరలో ఒళ్లు కనబడుతుంటే నోట్లో నములుతున్న కిళ్లీ ఉమ్మేస్తూ, పరాచికాలాడుతూ, కిసుక్కున నవ్వుకునే ఆడంగులు… గళ్ల లుంగీలు పైకి ఎగదోసుకుంటూ, సిగరెట్టు పొగలు రింగున ఊదుకుంటూ మీద మీద పడుతూ కబుర్లాడుతూ, వాళ్లను తమకంతో చూస్తూ వెళ్లడానికుద్యుక్తులయ్యే మగాళ్లు… ఏదో అసహజంగా అనిపిస్తుంటే…పరీక్షగా వెనకవైపు నుంచి చూస్తున్న నన్ను బండివాడు “ అమ్మాయిగారూ ! ఈ ఊరికి కొత్తా? పట్నం నుంచి వత్తన్నారా బాబూ…చుట్టాలింటికా ? ” అంటుంటే పరధ్యానంగా ఉన్న నాన్నగారు “ ఆ…” అనేశారు. అమ్మా ఏం మాట్లాడలేదు.

ఆ వీధి మలుపు దాటింది బండి. ఇందాకటి దృశ్యమే గుర్తుకొస్తోంది. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‘ భారతి ’ లో రాసిన కథేదో గుర్తుకొస్తోంది. పైగా ఆ బాటంతా ఎప్పటినుండో పరిచయమైనదిగా అనిపించింది కూడా. ఆ మాటే నాన్నగారితో అంటే ‘బాలగంగాధర తిలక్‌ ది ఈ ఊరే కదమ్మా ? అతను రాసిన ఎన్నో కథలకి నేపథ్యం ఈ ఊరే అవడంలో ఆశ్చర్యం ఏముంది ? అతని కథలన్నీ చదువుతుంటావు కదా ! అందుకే ఈ ఊరితో గత పరిచయం ఉన్నట్లు అనిపించడం. రచయిత ముద్ర అంటే అదే మరి ”.

“ ఈ ఊరికి కొత్తా బాబయ్యా ” బండివాడి ఆరా !

“ అవునయ్యా ! పాలంగి వెళ్లానన్నాను కదా?! ” బండి మరికొంత ముందుకెళ్లింది.

“ ఈ ఎడం వేపు వీధిలోనే కథలు రాసేటాయన ఇల్లు. మొన్ననే ఇంకో కథలు రాసేటాయనట ఇలాగే రైలు దిగి వస్తే ఆరినీ దింపాను. మీరూ ఎల్తారేటి బాబూ తిప్పనా బండి? ”

“ అబ్బే అక్కర్లేదయ్యా. బండి పాలంగి పోనీ ! ”

“ అలాగే బాబయ్యా ! ”

“ ఓయ్‌ బండెంకట్రావ్‌ మామా! మాపటేలికి మండపాకెళ్లి రావాల. ఓ పాలొచ్చి కనబడు. అక్క సెప్పమంది. మర్సిపోకు సుమా!! ”

“ సాల్లే ఒరేయ్‌! నేనియాల రాలేను. ఉన్నాడుగా సింగడు ? ఆణ్ణి కట్టమను బండి. నా బండి ఇయాల రాదు ”

 “ ఇయాల నీ బండికేటవుద్దేం? రాకపోడానికి? ”

“ ఎహెయ్‌ ఇవాల లచ్చింవారం. ఉండ్రాజరాన్నుంచి రాత్రికి రాజయ్యగోరిని (పేకాట) క్లబ్బు కట్టుకు రావాల. ఆ… ” అంటూ మలుపు తిప్పాడు.

బండి గతుకుల్లో సాగుతోంది. వాళ్ల భాషలోని యాసను గురించి ఆలోచిస్తున్న నాకు ఒక్కసారి మద్రాసు ఇల్లు, వదినలు, అన్నయ్యలు గుర్తుకొచ్చారు. నిన్ననీపాటికి వదిన చేసిన పరమాన్నం తింటున్నాను. సాయంత్రం టాక్సీలో నల్లని తార్రోడ్డు మీద రయ్యి మంటూ చేరాం సెంట్రల్‌ స్టేషన్‌కి. తెల్లారి ఇదిగో… డబ్బా రేకుల స్టేషన్‌ దాటి గతుకుల రోడ్డు మీద సాగుతోంది వంటెద్దు బండి ప్రయాణం. మళ్లీ స్టేషన్‌ రోడ్డు గుర్తుకొచ్చింది. భారంతో గుర్తుకొచ్చారు వాళ్లంతా. ఓహో వాళ్లంతా బోగం వాళ్లన్నమాట. ఒక్కసారి ఒళ్లు జలదరించింది.

బండి సాగుతోంది. అమ్మ నాకేసి తిరిగి “ జాగ్రత్తగా నిభాయించుకోవాలమ్మా ! ఇక్కడి పద్ధతులూ, మాటలూ కొత్తగా ఉంటాయి నీకు. ఏదో కొద్దిరోజులు చుట్టపు చూపుగా పల్లెటూళ్లకొచ్చి ప్రకృతి బాగుందని కథలు చెప్పుకోవడం కాదు పల్లెటూరి కాపురం. అందరితో ఎలా నిభాయించుకొస్తావో!! నాకైతే బెంగగా ఉంది సుమా జాగ్రత్త తల్లీ ! ”

“ కమలా ఇటు చూడు. రోడ్డుకి ఈవైపు స్కూలు చాలా పురాతనమైంది. నన్నయ్య భట్టారకుని పేరుతో ఓ సాహితీపీఠం ఉంది ఈ ఊళ్లో. అన్నట్టు నన్నయ్య భట్టారకుడు భారత రచనకు ముందు యజ్ఞం చేసి సోమయాజిౖయెనది ఈ ఊళ్లోనే. రోడ్డుకి మరోవైపు టవును హాలు. అక్కడే ఎక్కడో బాలగంగాధర్‌ తిలక్‌ ఇల్లు ”.  

“ బాగానే ఉన్నాయి తణుకు గురించి మీ పరిచయ వాక్యాలు. అవన్నీ ఈ ఊళ్లో ఉంటే ఏమిటట ? పిల్ల పల్లెటూళ్లో ఎలా ఉంటుందోనని నేను మథనపడి చస్తుంటే స్కూలుంది, హాలుంది అంటారేమిటి ? ”

“ మథనపడి ఏం చేస్తావు ? అయినా అది బాగానే సర్దుకుపోతుంది. నాకా నమ్మకం ఉంది ”.

“ ఇది సర్దుకుపోవడం గురించి కాదు. పల్లెటూరు పన్లు చేతకావాయె ! ఆ పరిసరాల్లో ఇమడటమూ కష్టమే. ఎంతసేపూ సంగీతాలు, సభలు అంటూ మీతో తిప్పుకున్నారు గానీ, ఇంట్లో ఉండి పనీపాటా చేసిందా ? ”

 “ పనిమాటెలా ఉన్నా పాట పాడుతుంది కదా !? ”

“ అందుకే భయం…! అలా పాడుతూ కూర్చుంటే పంపించేస్తారు పుట్టింటికి. అదే నా భయం. పైగా అందరూ అనడమే. వాళ్లత్తగారు బాగా గడ్డు మనిషని. చాలా బెంగగా ఉంది నాకు ”

“ పిల్లాడు ఎమ్మే చదివాడు కదా ! ఇంతా చదివి ఇక్కడే ఉండిపోతాడా ఉద్యోగం చూసుకుంటాడు లే ! ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతాడా? ” నాన్న ఆశాభావం.

వాళ్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేస్తున్నారు. మాట్లాడటానికి నాకేం ఉంది ? మనసు బిక్కుబిక్కుమంటోంది. ఉత్తరాల్లో బోల్డు వలపు కురిపిస్తారు. వాటివల్ల నిత్య జీవితానికి ఏం ప్రయోజనం ? జీవితం ఎలా ఉండబోతోంది ? ఆయన నాకు రేపటినుంచి సాయం చేస్తాడా ఇంట్లో అలవాటు పడటానికి ? అదీ అనుమానమే. ఎంతసేపూ ఒక్క కొడుకైన తనంటే వాళ్లమ్మకెంతిష్టమో, చెల్లెళ్లంటే తనకెంతిష్టమో… వీటి గురించే ఉంటుంది ఉత్తరాల్లో. సంతోషమే ! ఆ ప్రేమ నాక్కూడా కాస్త పంచుతారా అని ? నిజానికి అత్తగారి చూపు కొరడా ఝుళిపించినట్టే ఉంటుంది ఏం మాట్లాడకపోయినా. మంచిచెడులు మనమేం చెప్పగలం ? ఏదైతే తప్పేను గనుక ! దేనికైనా సిద్ధంగా ఉండటమే !! ఆలోచనలు జోరీగల్లా ముసురుతున్నాయి.

బండి ఎడంవైపు మలుపు తిరిగింది. అక్కడో దేవాలయం ఉంది. తిలక్‌ చెప్పిన కేశవస్వామి గుడి ఇదే కాబోలు. అంతే అయి ఉంటుంది. ఎందుకంటే బళ్ల సావిడి దాటి కాలవమీది వంతెన దాటి ( అదే గోస్తనీనది అన్నారు నాన్నగారు ), సంతబజారు మలుపులో ఉన్నదే అని ఏదో కథలో చెప్పడం గుర్తు.

దారికి రెండువైపులా పచ్చటి పొలాలు చూడ్డానికి పచ్చటి వెల్వెట్‌ తివాచీ పరిచినట్టు ఎంత హాయిగా ఉన్నాయో ! బాటకి ఇటూ అటూ మామిడి చెట్లు, కాయలు గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. పైరగాలి పలకరింపు మనసుని పులకరింపజేస్తోంది. నాన్నగారు బండి ఆపమని దిగి నడిచి వస్తున్నారు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ. కానీ అమ్మ ముఖంలో బెంగ, వేదన కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బహుశా దుఃఖాన్ని దిగమింగుకుంటున్నట్లుంది. ఊరి పొలిమేరలో ఆంజనేయస్వామి గుడి దగ్గర నాన్న బండి ఎక్కేశారు. దారిలో నలుగురైదుగురు బండికేసి చూసి – ఎవరింటికి రా అబ్బాయి ? అనడం, బమిడి సూరన్నగారింటికండీ… అంటూ ముందుకు పోనిచ్చాడు బండబ్బాయి.

“ ఒహో…పట్నం నుంచా పంతులు గారూ ? మా ఊరి కోడలిగార్ని తీసుకొస్తున్నోరు ? ” అంటూ పలకరించారొకరు. “ అవునండీ ! ” – అంటూ దిగబోతున్న నాన్నగారిని వారించి ‘ ‘వద్దు వద్దు దిగకండి ” అంటూ బండి కూడా నడుస్తున్న ఆసామీతో మరి నలుగురు కలిశారు.

“ మన సూరన్నగారి ఇయ్యాలారు. పట్నం నుంచి వచ్చారు. పేద్ద చదువులు చదువుకున్నోరు ! ”

బండి చెరువు దగ్గరకొచ్చేసింది. చెర్లో బట్టలుతుక్కుంటున్న కొందరాడాళ్లు నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు.

“ హే…హే…తిరుగు ” అంటూ బండి మలుపు తిప్పి సందులోకి పోనిచ్చాడు బండబ్బాయి. ఇంతలో అయిదారుగురు పిల్లలు పరుగెత్తుకుంటూ బండిని వెంబడిస్తుంటే అందులో ఓ అబ్బాయి “ ఒరేయ్‌..వదినరా…వదినే…. ” అంటే బండి కంటే ముందు పరిగెత్తారు ఇంటికెళ్లి కబురు చెప్పడానికి కాబోలు.

( మొత్తానికి అత్తారింటికి వచ్చేశాం )

( సాయంత్రం అమ్మానాన్నగారు బయల్దేరి అమలాపురం వెళ్లడానికి సిద్ధమవుతున్నారు రాత్రికి ఉండమని చెప్పినా వినకుండా. నా మనసంతా తెలియని భావంతో గజిబిజిగా ఉంది. అమ్మ తనున్న గదిలో అటూ ఇటూ తిరిగి మాటిమాటికీ కళ్లు తుడుచుకుంటోంది. నాన్నగారు రిటైరై తను అనుకున్నట్లుగా కూతురికి పెళ్లి చేసి, తన భారాన్ని ఈ రోజుతో పూర్తిగా దించుకున్నానని అనుకుంటున్నారో, ఏమో!!  హాల్లో చూడ్డానికొచ్చిన బంధువులతో, ఊరిపెద్దలతో కబుర్లు చెబుతున్నారు.)

సాయంత్రం నాన్నగారు, అమ్మా బయల్దేరి అమలాపురం వెళ్లడానికి ముందు అమ్మ అత్తగారిని గదిలోకి పిలిచి తను తెచ్చినవన్నీ ( చాపమీద పరిచి ఉంచింది ) చూపించి “ వదినగారూ 1 ఇదిగో పిల్ల కోసం ఈ వెండి కంచం, గ్లాసు తెచ్చాను. అల్లుడితోపాటు అమ్మాయి కూడా వెండికంచంలో తినాలని మా కోరిక. దాని పెళ్లికి వచ్చిన వెండిసామాన్లు, బహుమతులు దానికి చిన్నప్పటినుంచీ వచ్చిన ప్రైజులు అన్నీ తెచ్చాను. ఇవిగో ! ” అంటూంటే – “ ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు ? ” ( అక్కడ పరిచినవాటిని పరిశీలిస్తూనే )….అత్తగారు విసుగ్గానూ, ఉదాసీనంగానూ మొహం పెట్టి.

“ అది కాదు వదినగారూ…అది చిన్నపిల్ల. మీకు దాన్ని అప్పజెబుతున్నాను. పన్లు అవీ చెప్పి చేయించుకోండి. ఇదిగో మంచం, పరుపులు కొనడానికి ఈ డబ్బుంచండి. మీ పిల్లలతోపాటుగా మరో అమ్మాయని అనుకుని చిన్నపిల్ల…” అమ్మ కంఠం రుద్ధమైంది.

“ చిన్నపిల్లేమిటి ? నేను పదమూడు సంవత్సరాలకి కాపురానికొచ్చాను. నాకు పదిహేనేళ్లకి పుట్టాడు మా అబ్బాయి ” అని ఆవిడంటుంటే అమ్మపక్కకి వెళ్లి కళ్లతోనే వారింపుగా చూశాను. మనసులో దుఃఖాన్ని పైకి రానివ్వకుండా. మరో మాటనలేదమ్మ.

గదిలో తెచ్చినవన్నీ పరిచి నన్నప్పగించి అయిదుగంటలకల్లా వెళ్లిపోయారు అమ్మానాన్న వియ్యంకుడు కట్టించిన రెండెడ్ల బండిలో.

ఒక్కసారి ఆధారం కోల్పోయినట్లు అనిపించింది. గుండెలనిండా గాలి పీల్చుకుని ‘ కృష్ణా పార్థసారథి నువ్వు మాత్రం నాతోనే నాలోనే ఉండాలి సుమా ! నీ అండతోనే నా జీవితం స్వామీ ! ’ అనుకున్నాను.

“ ఒదినా ! ఒదినా ! ” అంటూ పిల్లలు గదిలోకి వచ్చి నన్ను బయటికి లాక్కెళుతుంటే, మెల్లిగా విడిపించుకుని పెరట్లోకి నడిచాను. అత్తగారు పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టినట్టున్నారు. దగ్గరగా వెళ్లి “ కూరేదైనా తరగనా ? ” అంటూంటే ఈలోగా పెరటి గుమ్మం గుండా వచ్చినట్టున్నారు పెద్దత్తగారు – “ కొత్త కోడలా ! తరుగుదువుగాని లే. అయినా నీకు వంట కూడా వచ్చేమిటి ? ఇవాళ్టికి వద్దులే ” అంటూ నా మెడకేసి పరీక్షగా చూస్తూ “ ఈ నెక్లెస్‌ చాలా బాగుందుస్మీ!! ఫ్యాషన్‌గా ఉంది. ఎన్ని కాసులో… ? ”

ఈలోగా – “ విశాలాక్షీ, దుర్గాంబ వాళ్లంతా వచ్చారే. వదిన్ని చూస్తారట. ఉండు వదినా నిన్ను చూడ్డానికే ! ” అంటూ హడావుడి పడిందో ఆడబడుచు.

“ సుబ్బమ్మొదినా! కొత్త కోడలొచ్చిందటగా, ఇందాకా చెర్లో ఉండగా చూసిందట ఒంటెద్దు బండి మీద రావడం. రామలక్ష్మి చెప్పింది ”

“ రండి…రండి హాల్లో కూర్చుందురుగాని నడవండి ” అంటూ నడిచారు అత్తగారు.

అందరం హాల్లో కూర్చున్నాం. ఎవరికి వాళ్లు నన్ను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తుంటే నాకేదోలా అనిపించింది.

“ అమ్మా…అచ్చు సినిమా యాక్టర్‌లాగ ఉంది కదే ? ”

“ అవును అచ్చుమచ్చు అంజలీదేవిలా ఉంది. మీరు పట్నంలోనే ఉంటారుట కదూ ? ”

“ అవును ”

“ అయితే సినిమా యాక్టర్లందరినీ చూసే ఉంటారు కదూ? నీ పేరేమిటన్నావ్‌? ” పెద్దావిడ ప్రశ్న.

“ కమలండి ”

“ పేరు కూడా ఎంత బాగుందో. బాగా పాడతావుట కదా ! ”

ఏం చెప్పను ? మౌనంగా ఉండిపోయాను.

“ ఎంత తెల్లగా ఉందో కదూ…? ” ఒకమ్మాయి కామెంట్‌.

“ మోడర్న్‌గా ఉంది ”

“ మోడర్నే కానీ, బొట్టు అంత పెద్దది పెట్టుకుందేమిటి ? జుట్టు బాగానే ఉంది కానీ మరీ దుబ్బులు దుబ్బులుగా లేదు ”

“ ఓ పాట పాడవా ? ”

ఏమనాలో తెలీదు. ఇబ్బందిగా మొహం పెట్టాను. ఈలోగా అత్తగారే… “ చాల్లే ! వంటలవేళ. పిల్లలొచ్చేస్తారిక ఆకళ్లంటూ ! ఇక్కడే ఉంటుందిగా ! గానా బజానా పెట్టించుకుందురు గానీలే ఓరోజు ”’

“ నిజమేలే వదినా ! వెళ్లొస్తాం ”

“ అన్నట్టు వియ్యాలారేరి? ”

“ వాళ్లా ఇందాకే వెళ్లిపోయారు ”

“ అయ్యో వాళ్లని కూడా చూడొచ్చు కదా అని వచ్చామిప్పుడు. రెండ్రోజులు పిల్ల అలవాటు పడేదాకా ఉండాల్సింది. ఇవాళే వచ్చి ఇవాళే వెళ్లిపోయారా ! ”

మొత్తానికి అందరూ వెళ్లిపోయారు. వానవచ్చి వెలిసినట్టుంది. ఏడుగంటలకల్లా అందరి భోజనాలూ అయి వంటింట్లో కడుక్కోవడంతో సహా పనులన్నీ అయిపోయాయి. పిల్లలు ఎప్పుడో నిద్దరోయారు. గదిలో విశ్వంతో స్వీట్‌ నథింగ్సే ! ఎప్పుడు నిద్రపట్టిందో విశ్వం పరిష్వంగంలో !!

‘ ఉత్తిష్ట కమలాదేవీ ఉత్తిష్ట ’ నాన్నగారి గొంతు!! ఉలిక్కిపడి లేవబోతే విశ్వం చేతులు చుట్టుకుని ఉన్నాయి నన్ను.

నేను ఇక్కడున్నాను. మరి నాన్నగారి గొంతు ?

కలా ?

కాదే !

మెల్లిగా చేతులు విడదీసుకుని లేచి కిటికీలోంచి బయటకు చూస్తే ఇంకా చీకటిగానే ఉంది. బయట చీపురుతో తుడుస్తున్న చప్పుడు. గుండె వేగంగా కొట్టుకుంది. అత్తగారు లేచి పనులు మొదలుపెట్టారా ? ఆలస్యంగా లేచానని కోపగించుకోరు కదా ! ఇవాళేగా వచ్చింది అని ఊరుకుంటారా ? అందరూ అనడం…ఆవిడకి కోపం ఎక్కువని. మాట అనడానికి వెనకదీయదని. ఛా…పొద్దున్నే ఇలా ఆలోచించడం తప్పు. ఆవిడకి కొడుకంటే ప్రాణంట. విశ్వమే చెప్పాడు. అలాంటపుడు ఆయనగారు కావాలని చేసుకున్న నా మీద మాత్రం ప్రేమ ఉండదా! అయినా నిద్ర మంచం మీంచి ఈ ఆలోచలేమిటి !…లేచి మంగళసూత్రాలు కళ్లకద్దుకుని విశ్వం పాదాలకు నమస్కరించి, ఓసారి నన్ను నేను చూసుకుని ఎదురుగా అద్దాల అల్మారాలో ఉన్న రాధాకృష్ణుల్ని చూడగానే Morning Prayer గుర్తుకొచ్చింది… ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం

‘ హే గోపాలకా హే కృపా జలనిధే ’ నాన్నగారు లేచి నన్నే తల్చుకుంటున్నారు కాబోలు. అందుకే నాన్న మాట వినబడింది అంతరంగానికి.

మెల్లిగా పెరటివైపు తలుపు తీసి వెళ్లాను పెరట్లోకి. కనుచీకటిలో తుడుస్తున్నది అత్తగారిలా లేరే ! ఇంకొంచెం దగ్గరకెళ్లి చూస్తే అత్తగారి ఆడపడుచు.

ఈయనగారి మేనత్త. దగ్గరకెళ్లి – “ నే తుడుస్తా. ఇలా ఇవ్వండి చీపురు ” అన్నాను. వినిపించుకోలేదు.

అన్నట్లు ఈవిడకేగా బ్రహ్మచెముడు ? వంగి ఆవిడ చేతిలో చీపురు అందుకోవడానికి ప్రయత్నించా. అప్పుడు చూసిందావిడ నన్ను.

“ ఎవరు ? కొత్త కోడలు పిల్లవా ? అప్పుడే లేచాశావేం. ఇంకా తెల్లారలేదు. ఎవరూ లేవలేదుగా. వెళ్లి పడుకో ఇంకాసేపు ”

“ నాకు పెందరాళే లేవడం అలవాటే…”

“ చిన్నపిల్లవు. పెందరాళే లేచి ఏం చేసేదానివి ? ఓహో…చదువుకుంటావేమో కామోసు. అయినా మీ పుట్టింట్లో నీకు పనేముంటుంది గనుక. విన్నాను మీ మేనత్త చెప్పింది నువ్వెంత అబ్బరంగా పెరిగావో. ఎంత అబ్బరంగా పుట్టింట్లో పెరిగినా అత్తగారింట్లో సాగదనుకో. అయినా నేనిక్కడున్నన్నాళ్లూ నువ్వు మాత్రం ఇంత పెందరాళే లేవొద్దు. సరా? ”

“ అది కాదండీ…”

“ ఏదీ కాదు. నడు ” అంటూ చీపురక్కడ పడేసి నా జబ్బ పట్టుకుని నడిపించి గది దాకా తీసుకెళ్లి లోపలికి తోసి “ పడుక్కో తల్లీ మరికాసేపు ” అంటూ లాలనగా భుజం తట్టి తలుపు దగ్గరగా వేసి మరీ వెళ్లిందావిడ.

ఆవిడ స్పర్శలోని ఆత్మీయత, ఆవిడ మాటల్లోని ప్రేమ మనసంతా అలుముకున్న ఆ అనుభూతిని గురించి ఆలోచిస్తూ మంచం మీద విశ్వం పక్కలోకి చేరా.

బద్ధకంగా కదులుతూ “ చెప్పానా ! ఇప్పుడప్పుడే లేవక్కర్లేదని ? ఏం చేయాలో తెలియక వచ్చేశావా ? ఇలా రా నే చెబుతా ! ”

*********************