10_012 చండాలిక

.

                ఇది త్రేతాయుగం నాటి కథ. రామాయణకాలంనాటి నుండీ అజ్ఞాతంగా ఉండిపోయిన కథ ఇది. జనకమహారాజు విప్రయాగం చేస్తున్నాడు. చివరికి వచ్చేసింది. చివరి రోజు మహావిప్రునికి ఒకనికి అగ్రపూజ చేయటం సాంప్రదాయం. యాగపరివేదిక చుట్టూ సకలశాస్త్ర పారంగతులైన ఋషులు క్రిక్కిరిసి కూర్చుని ఉన్నారు. వశిష్టుడు, విశ్వామిత్రుడు, శాకల్యుడు, దేవరతుని మానసపుత్రుడైన యాజ్ఞవల్క్యుడు, వచిక్నుని కుమార్తె గార్గి…. ఇలా ఎటు చూసినా మహామహులే. జనకునికి ఎటూ పాలుపోక “ మహర్షులారా ! మీలో ఈనాటి అగ్రపూజను ఎవరికి చేయాలో, దానికి అర్హులెవరో తెలిసికోలేకున్నాను. అర్హుడైన ఋషీశ్వరుని మీలో మీరే నిర్ణయించుకుని నాకు తెలియజేయవలసినది ” అంటూ వారికి ప్రణమిల్లి కూర్చున్నాడు. వెంటనే నేను ఘనుడనంటే నేను ఘనుడని వారందరు తమలో తాము వాదులాడుకోసాగారు. ఈ రణగుణ ధ్వనుల మధ్య జనకుడు మళ్ళీ లేచి ఎలుగెత్తి మరొక ప్రకటన చేసేడు. “ యాగానంతర సంతర్పణ నిమిత్తం ఇక్కడ ఉంచిన ఈ అపార ధనకనక రాశులు కూడా అగ్రపూజ అందుకొనే విప్రోత్తమునికే చెందుతాయి సుమా ! మీ నిర్ణయమే తరువాయి ” అన్నాడు.  అగ్రపూజ అందుకోవటానికి వీరు చేస్తున్న రచ్చ కోట కూడా దాటిపోయింది.

ఇంతలో యాజ్ఞవల్క్యుడు వేదిక మీదకు వెళ్ళి ధనరాశిపై చెయ్యి వేసి “ ఈ అపార ధనకనకవస్తువాహనాలు నావి ” అన్నాడు. సభలో అందరూ నిర్వ్హిణ్ణులై, నిరుత్తరులై పోయారు. తమ తమ మధ్య ఉన్న స్పర్థ, మాత్సర్యాన్ని మర్చిపోయి కోపోద్రిక్తులై అందరూ యాజ్ఞవల్క్యునే చూస్తున్నారు. జనకమహారాజు వశిష్టవిశ్వామిత్రుల వైపు సాభిప్రాయంగా చూశాడు. ఇద్దరూ స్థితప్రజ్ఞత్వంతో చూస్తూ కూచున్నారే కాని ప్రత్యుత్తరమివ్వలేదు. అందరూ తీష్ణదృక్కులతో చూస్తూ ఉండగా ఈ సంపదనంతటినీ ఆశ్రమానికి తీసికొనిపొమ్మని తన శిష్యులను ఆదేశించాడు యాజ్ఞవల్క్యుడు. అతడు బాష్కలుని వద్ద యజుర్వేదం, అగ్ని నుండి అధర్వవేదం, జైమిని నుండి సామవేదంలోని సహస్రశాఖలూ పాంగోపాంగంగా నేర్చిన భీషణ ప్రతిభాశాలి. అతనిని ఎదుర్కొనటానికి సభలో ఉన్న మునులంతా తటపటాయిస్తూ ఉండగా శాకల్యముని లేచి ఒక్క పెడబొబ్బ పెట్టాడు. “ యాజ్ఞవల్క్యా ! నేను అడిగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తరువాతనే నువ్వు అగ్రపూజ అందుకోవటానికి అర్హుడవౌతావు ” అంటూ. దీనితో సభ కొంత తెప్పరిల్లింది. యాజ్ఞవల్క్యుని నిలువరించగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడు కదా అని ఒకింత ఉత్సుకతతో, ఆనందంతో, వినోదంతో అందరూ శాకల్యుని వైపే చూస్తున్నారు.

“ నీ  ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయినట్లైతే ఇక్కడే ఈ యాగాగ్నిలో దూకి ప్రాణాలను తీసుకొంటానని భీషణప్రతిజ్ఞ చేసేడు యాజ్ఞవల్క్యుడు. నేను ఓడినట్లైతే నేను కూడా ఈ యాగాగ్నిలోనే ప్రాయోపవేశం చేస్తానని శాకల్యుడూ ప్రతిజ్ఞ చేస్తాడు.

శాకల్యమహర్షి సకల శాస్త్రాల మీదా ఒక వెయ్యి ప్రశ్నలను గుప్పించాడు. అన్నింటికీ లిప్తకాలంలో సమాధానాలిచ్చాడు యాజ్ఞవల్క్యుడు. అనంతరం శాకల్యమునిని యాజ్ఞవల్క్యుడు ఒకే ఒక ప్రశ్న వేశాడు. దానికతడు సమాధానం చెప్పలేక, ప్రాయోపవేశం చేసి ప్రాణాలు పోగొట్టుకోవటానికి భయపడి సభను వీడి వెళ్లిపోయాడు. యాజ్ఞవల్క్యుడు విజయం అప్రతిహతమయింది. అయినప్పటికి “ నువ్వు అగ్రపూజకు అర్హుడవు కావు ” అని సభలోంచి ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఈ స్వరం గార్గిది. ఈమె నచిక్నుని కుమార్తె. నచిక్నునికి కుమారులు లేని కారణాన కుమార్తెకు వేదాలు నేర్పి కూడా స్త్రీ అయిన కారణంగా ఆమె వేదాలలో ప్రశ్నించటం కాని, బయిటకు ఉచ్చరించటం కాని చేయరాదని కట్టడి చేశాడు. “ నీకున్న అభ్యంతరం ఏమిటి ” అని ప్రశ్నించాడు. “ ఈ సభలో మైత్రేయి కూడా ఉన్నది. ఆమెను ఓడించినప్పుడు కదా నువ్వు సంపూర్ణవిజేతవవుతావు ” అంటుంది. యాజ్ఞవల్క్యుడు మైత్రేయి భర్టే. ఆమె సకలవిద్యా పారంగతురాలు. ఆమె నుంచి పొందిన జ్ఞానప్రకాశం తోటే యాజ్ఞవల్క్యుడు వెలుగుతున్నాడనే పుకారు, లోకనింద ఉండనే ఉంది. ఇప్పుడు ఆ రహస్యం సభలో వెల్లడికావటంతో యాజ్ఞవల్క్యుడు ఇరకాటంలో పడిపోయాడు. అయినా అది కప్పిపుచ్చుకొని ఆమే నేను నేనే ఆమె… మాకు అబేధం, ఈ జయాపజయాలు అంటవు అంటూ తప్పించుకో చూచాడు. అయితే ఆమెకూ అగ్రపూజ జరుగవలసిందే అని గార్గి పట్టుబట్టింది. పతివ్రతలకు సభలు శ్రేయస్కరం కావు అని వాకృచ్చాడు. ఈ మాట గార్గికి గ్రుచ్చుకొంది. అయితే నన్ను గెలువు అని సవాలు విసిరింది. ఒక స్త్రీ పురుషుని ప్రశ్నించటమా ? అని ఋషులందరూ చెవులు కొరుక్కోసాగారు. సింహాసనం మీద కూర్చున్నా జనకుడు ఆందోళనకు లోనయ్యాడు. అప్పటిదాకా యాజ్ఞవల్క్యుని పట్ల మత్సరం గొన్న విప్రోత్తములు కూడా గార్గి ప్రశ్నించటానికి వీలుకాదని అడ్డుపడ్డారు. కాని యాజ్ఞవల్క్యుడు ప్రశ్నించు అంటూ గర్జారావం చేశాడు. అయితే వేదవేదాంగాల నుండి మాత్రం ప్రశ్నించటానికి వీలులేదని సభ అభ్యంతరం పెట్టింది. అట్లే అంటూ తన తొట్టతొలి ప్రశ్న సంధించింది. “ యాజ్ఞవల్క్యా ! బ్రాహ్మణుడు కత్తిపట్టి రాజ్యపాలన చేసేదేప్పుడూ ? ” ఈ ప్రశ్నతో జనకమహారాజు కళ్ళు నిప్పులు కురిసేయి. యాజ్ఞవల్క్యుడూ చలించాడు. అయినప్పటికీ లోగొంతుకతో జవాబిచ్చాడు. “ క్షత్రియులు తమ ధర్మం తప్పినప్పుడు ” అని. “ ఇది సంభవమా ? ” అని తన ప్రశ్న ముగించింది గార్గి. “ గార్గీ ! నువ్వు అడగరాని ప్రశ్నలను అడుగుతున్నావు. నీ ప్రశ్నలను ఉపసంహరించుకో ” అని యాజ్ఞవల్క్యుడు గర్జించాడు. సభలో ఉన్న తక్కిన విప్రులూ, జనకుడూ కూడా క్రోధంతో ఊగిపోయారు. “ అడుగరాని ప్రశ్నలు అంటూ ఉంటే సత్యం ఏవిధంగా ఆవిష్కృతమౌతుంది ? ” అని గార్గి సభను నిలదీసింది. అయితే ఒక స్త్రీ చేతిలో ఓటమిని సహించలేని సభ, అప్పటికే క్రోధంతో ఊగిపోతున్న సభ గార్గి సభలో ఉండతగింది కాదంటూ ఆమెను సభా బహిష్కృతురాలిని చేసేరు. జనకమహారాజ విప్రయాగం యాజ్ఞవల్క్యుని అగ్రపూజతో నిర్విఘ్నంగా పూర్తయింది.

ఖిన్నురాలైన గార్గి మైత్రేయి దగ్గరకు వెళ్ళి “ బ్రాహ్మణుడు కత్తి పట్టేదెప్పుడు ” అని ప్రశ్నించింది. ప్రాణభయం లేని చండాలిక మాత్రమే దీనికి సరియైన సమాధానం చెప్పగలదని మైత్రేయి జవాబివ్వటంతో చండాలికను వెతికే పనిలో పడ్డ గార్గి “ చండాలిక ఎవరు ? ” అని అడుగగా “ ఆమె శ్మశానవాసిని. స్టీలకు అక్కడ జీవించియుండగా ప్రవేశం నిషిద్ధం. అయితే నువ్వు రాజ్యబహిష్కృతురాలివి కనుక నిరభ్యంతరంగా ఆమెను సమీపించి జ్ఞానోపదేశం పొందు. నీ శిష్యురాలు పంపింది అని చెప్పు ” అని ఆశీర్వదించి పంపింది. గార్గి సరయూనదీ సమీపాన ఉన్న శ్మశానాన్ని సాయం సంధ్యవేళ సమీపించింది. చితి మంటల చిటపటలు, కాంతిచ్ఛటల మధ్య ఒక గెడకర్ర పట్టుకొని కాలయమునిపోలే ఒక నల్లని శిల్పం వలె నిల్చున్న చండాలికను చూసింది గార్గి. అక్కడి చితిమంటలు గుహాంతర్గత మానవుడు ఉద్భవించటానికి ముందు నుంచీ ఉన్నవి. దైవాంశసంభూతులను సృజించటానికి బ్రాహ్మణుడు హోమాగ్నిని వ్రేల్చటానికి ముందునుంచీ ఉన్నవి. జనకుని కూతురిని శీలపరీక్ష చేసిన రాముడు కల్పించిన అగ్నిగుండానికి ముందునుంచే ఉన్నవి. అనంతర యుగాలలో మానవుల కృత అకృత్యాలకు సాక్షీభూతంగా నిలవటానికి అవి మానవుల జీవితపరిసమాప్తి అనంతరం కూడా ఉండగలవు. అటువంటి మంటల తెరలలోంచి చండాలిక “ నువ్వెవరు ? ఇంతవరకూ జీవించియున్న ఏ స్త్రీ ఇక్కడికి రాలేదు. నువ్వు బాగా ధైర్యం కలదానివే ” అంది. “ విప్రాళి నుండి బహిష్కరణకు గురైనదానిని. క్రొత్తగా నాకు విధించబోయే శిక్ష అంటూ ఏదీ లేదు. ఇక్కడికి రావటానికి తెగించటానికేమీ లేదు ” అని గార్గి ప్రత్యుత్తరమిచ్చింది. “ నా పేరు గార్గి. నీ శిష్యురాలు మైత్రేయి పంపగా వచ్చినదానను ” అని చండాలికకు నమస్కరించి జరిగిన కథనంతా వివరించింది. “ అడుగరాని ప్రశ్నలు ఉన్నట్లయితే సత్యాన్ని ఏవిధంగా తెలిసికోవాలి ? ” అని విప్రాళిని అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది.

“ నా తండ్రి ముసలితనం చేత కదలలేకపోవటం వల్ల, నాకు సోదరులు లేకపోవటం వల్ల నన్నిక్కడ కాటికాపరిగా ఉండనిచ్చారు. నేను ఇప్పుడు ఈ కుండనీటికోసం ఈ దగ్గరలోనే ఉన్న నీటిఉబ్బ దగ్గరకు వెళ్ళిరావాలి. ఈలోపల నువ్వు ఈ శ్మశానంలోని కపాలాలలో యేవి రాజువో, ఏవి బంటువో వేర్పరిచి ఉంచు ” అని చండాలిక నీటిఉబ్బ వైపు నడచి వెళ్లిపోయింది.

శ్మశానవాటికలో పిశాచగణాల మధ్య గార్గికి చండాలిక వేదాంత రహస్యాలను, కాలజ్ఞానాన్ని బోధిస్తున్నదన్న వార్త కార్చిచ్చులా విప్రసమూహం మధ్య వ్యాపించింది. ఈ అరిష్టాన్నుంచి దేశాన్ని ఉద్దరించాలని విప్రాళి శ్మశానానికి బయిలుదేరింది. నీటి కుండతో చండాలిక తిరిగివచ్చింది.

“ అమ్మా ! నేను ఎంత ప్రయత్నించినా ఈ కపాలల నుండి రాజుని, బంటుని వేరు చెయ్యలేకపోయాను. ఇది అసాధ్యంగా కనిపిస్తోంది ” అని తన అశక్తతకు సిగ్గు పడుతూ గార్గి తల వంచింది. చండాలిక తన చెంతనే ఉన్న ఒక పుర్రెను చేతిలోకి తీసికొని “ ఇది ఒక మహారాజు పుర్రె ” అని పకాలున నవ్వింది. ఆ కపాలం రాజుదే అన్న విషయం గార్గి కూడా గ్రహించింది కాని సంఘభీతి చేత మౌనం దాల్చింది.

“ అన్ని పర్యవసానాలూ తెలిసే నేను నీకు ఈ అసురసంధ్య వేళ జ్ఞానోపదేశానికి పూనుకొన్నాను. వేదాలమర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మ మర్మాన్ని, రాజ్యాల మర్మాన్ని నీకు తేటతెల్లం చేస్తాను. ముందుగా బ్రాహ్మణుడు కత్తిపట్టేదెప్పుడో స్వయంగా చూడు. యాజ్ఞవల్క్యుని నిజస్వరూపం చూడు ” అనే ఆమె మాట పూర్తవకుండానే ఆమె తల ఎగిరి చితిలో పడింది. రక్తసిక్తమైన కత్తి పట్టుకొని యాజ్ఞవల్క్యుడు నిల్చుని ఉండగా అతని వెనుక ధర్మాన్ని రక్షించటానికి కంకణబద్ధులైన సకల విప్రాళి సంతుష్టాంతరంగులై నిలుచుని ఉన్నారు. గార్గి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. “ యాజ్ఞవల్క్యా ! నువ్వు ఓడావు. అగ్రపూజకు నువ్వు అనర్హుడివి. బ్రాహ్మణులు కత్తి పట్టేది క్షత్రియులు ధర్మం తప్పినప్పుడు కాదు. చండాలురు జ్ఞానప్రకటన చేసినపుడు అని నువ్వే స్వయంగా నిరూపించావు ”అని చండాలిక తల తెగిపడిన చితిమంటలు వేయి నాలుకలు ఘోషించాయి. ఆ మంటలు ఆర్పటానికి ఋషులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఆ మంటల నుండి చండాలిక తిరిగి లేచి రాజ్యాధికారం చేపట్టేదాకా చితి ఆరదని సూతమహర్షి వివరించాడు. ఇదే చండాలికాష్టం. ఇక గార్గి విషయానికొస్తే గార్గి, మైత్రేయిలు ఎటు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు. కొంతకాలానికి యాజ్ఞవల్క్యుడు కాత్యాయినిని వివాహమాడాడు. ఆమె నిరక్షరాస్య.

.

***************